ఐక్యంగా ఉంటే నిలుస్తాయి.. లేకుంటే అంతే సంగతులు?
posted on Mar 6, 2023 @ 10:44AM
జాతీయ స్థాయిలో బీజేపీకి దీటుగా నిలవాలంటే.. ఐక్యంగా ఉండట మొక్కటే ప్రతిపక్షాలకు ఉన్న ఏకైక ఆప్షన్ ఐక్యంగా 2024 ఎన్నికలను ఎదుర్కోవడమే. అలా కాకుండా ఐక్యత సాధించడంలో విపక్షాలు విఫలమైతే మాత్రం అంతే సంగతులు. ఈశాన్య రాష్ట్రాల ఫలితాలు తేల్చి చెప్పిన నిజమిదే. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ పై ప్రభుత్వ వ్యతిరేకత ఓ రేంజ్ లో ఉన్నా జాతీయ స్థాయిలో విపక్షాలు ఐక్యంగా లేకపోతే మాత్రం ప్రజా వ్యతిరేకత వల్ల బీజేపీకి ఇసుమంతైనా నష్టం లేకపోగా, మరింత బలపడటం ఖాయమని ఈ సాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిర్ద్వంద్వంగా తేల్చేశాయి.
ఈ ఫలితాలను బట్టి చూస్తే.. విపక్షాల అనైక్యత బీజేపీని నీటిలో మొసలిగా ఎవరూ ఢీ కొట్టలేని బలశాలిగా మార్చేసిందని విస్పష్టంగా తేల్చేసింది. ఆ ఫలితాలు విపక్షాలకు జ్ణానోదయం కలిగిస్తే.. వాటి ఐక్యతా యత్నాలు.. ఫలించే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా ఎవరికి వారేగా రంగంలోనికి దిగితే.. మరో సారి కేంద్రంలో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టడం నల్లేరు మీద బండి నడకే అవుతుందని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేస్తున్నారు. అదే జరిగితే 2024 ఎన్నికల తరువాత విపక్షం అనేదే ఉండని పరిస్థితి ఏర్పడినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. 2019 ఎన్నికలలో ప్రధాన విపక్ష హోదాను కాంగ్రెస్ అతికష్టం మీద నిలుపుకోగలిగింది. విపక్షాల ఐక్యత విషయంలో ఇదే పరిస్థితి కొనసాగితే.. 2024 సార్వత్రిక ఎన్నికల తరువాత ఏ పార్టీకీ కూడా విపక్ష హోదా దక్కే పరిస్థితి ఉండే అవకాశాలు కనిపించడం లేదని అంటున్నారు. నాగాలాండ్‌లో బీజేపీ విజయం నల్లేరు మీది బండి నడకే అయ్యిందంటే ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆ రాష్ట్రంలో విపక్షమనేదే లేదు. ఇక త్రిపుర విషానికి వస్తే అక్కడ విజయం కోసం బీజేపీ చెమటోడ్చింది.
అందుకు కారణం ఆ రాష్ట్రంలో కాంగ్రెస్, వామపక్షాల మధ్య పొత్తు ఉండటమే. పొత్తులు లేకుండా బీజేపీని నిలువరించడం అసాధ్యం అన్న విషయాన్ని ఇప్పటికే గుర్తించిన ఏకైక పార్టీ గ్రాండ్ ఓల్డ్ పార్టీ అయిన కాంగ్రెస్ మాత్రమే. పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్సే.. పొత్తులు లేకుండా బీజేపీని నిలువరించడం అసాధ్యమన్న నిర్ణయానికి వచ్చేసింది. అయితే ఆ పొత్తుల కోసం ఒక మెట్టు దిగడానికి ఆ పార్టీ ఇసుమంతైనా సిద్ధంగా లేదు. బీజేపీయేతర కూటమి తన నాయకత్వంలోనే ఏర్పాటు అవ్వాలన్న పట్టుదలతో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇందుకు తాజా తార్కానమే.. ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రాయ్ పూర్ వేదికగా జరిగిన ప్లీనరీలో చేసిన ప్రకటనే. అయితే కాంగ్రెస్ తో కలిసేందుకు ఇప్పటి వరకూ తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వంటి వారు సిద్ధంగా లేరు.
అసలు పొత్తులు, ఎత్తులు, వ్యూహాల విషయంలో విపక్షాలు వేటికవిగా వేర్వేరుగా అడుగులు వేయడం చూస్తుంటే... ఏ పార్టీకి ఆ పార్టీ తాము అధికారంలోకి రాకున్నా పర్వాలేదు కానీ.. మరో విపక్షానికి ఆ అవకాశం రాకూడదని అంటున్నారు. అందుకే 2024 సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గరపడుతున్నా విపక్షాల ఐక్యతా యత్నాలు ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కు అన్నట్లుగా సాగుతున్నాయి. స్వయంగా విపక్షాల ఐక్యతా యత్నాలను ముందుండి నడిపించాల్సిన కాంగ్రెస్ పార్టీయే ఆ ప్రయత్నాలకు విఘాతం కలిగేలా వ్యవహరిస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ పార్టీల ఐక్యతే లక్ష్యంగా జరుగుతున్న ప్రయత్నాలకు రాయ్ పూర్ లో జరిగిన పార్టీ ప్లీనరీ వేదికగా గండి కాంగ్రెస్ గండి కొట్టింది? విభేదాలను పక్కన పెట్టి బీజేపీ వ్యతిరేక పార్టీలన్నిటినీ కలుపుకు పోయే దిశగా అడుగులు వేయాల్సిన కాంగ్రెస్.. అతి విశ్వాసంతో కొన్ని పార్టీలను ఐక్యత విషయంలో తమతో కలిసి అడుగువేయాలన్న ఆలోచన కూడా చేయకుండా నిరోధించింది.
భారత్ జోడో యాత్రకు దేశ వ్యాప్తంగా వచ్చిన సానుకూల స్పందన.. పార్టీ కీలక నేత రాహుల్ గాంధీకి పెరిగిన జనాదరణ కారణంగా కాంగ్రెస్ మళ్లీ తన సహజ లక్ష్యమైన ఒంటెత్తు పోకడలకు శ్రీకారం చుట్టిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలో కూడా పలు మార్లు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలకు మద్దతు ఇచ్చినట్లే ఇచ్చి ఉప సంహరించుకున్న చరిత్ర కాంగ్రెస్ ఉంది. అయితే మన్మోహన్ సారథ్యంలో రెండు పర్యాయాలు అంటే పదేళ్ల పాటు కాంగ్రెస్ కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపింది. అయితే అప్పట్లో ఆ పార్టీ మిత్ర ధర్మాన్ని పాటించిందా అన్న విషయాన్ని పక్కన పెడితే.. ఇప్పుడు అంటే దాదాపు పదేళ్ల పాటు కేంద్రంలో ప్రధాన విపక్ష పాత్రను పోషిస్తున్న కాంగ్రెస్.. ఈ పదేళ్ల కాలంలోనూ ఉమ్మడి పోరాటాలకు నేతృత్వం వహించిన సందర్భాలు బహుస్వల్పం అనడంలో సందేహం లేదు. కాంగ్రెస్ వైఖరి కారణంగానే మమతా బెనర్జీ వంటి బలమైన నేతలు ఆ పార్టీతో కలిసేందుకు ముందుకు రావడం లేదు. మొత్తంగా పార్టీ అధ్యక్ష పదవి నుంచి 2019 ఎన్నికల తరువాత రాహుల్ గాంధీ వైదొలగిన తరువాత ఆ పార్టీలో నాయకత్వ లేమి కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇప్పటికీ కనిపిస్తోంది.
జాతీయ పార్టీగా శతాధిక వత్సరాల అనుభవం ఉన్న గ్రాండ్ ఓల్డ్ పొలిటికల్ పార్టీ విపక్ష పాత్రను పోషించడంలో సందేహాలకు అతీతంగా విఫలమైంది. అయితే జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యత విషయంలో ఇప్పటికీ కాంగ్రెస్ లేకుండా కూటమిని ఊహించడం అసాధ్యం. ఈ ఎనిమిదిన్నర సంవత్సరాల కాలంలో ఈ విషయం పలుమార్లు నిరూపితమైంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్సేతర, బీజేపీ యేతర ప్రత్యామ్నాయ కూటమి కోసం కేసీఆర్, మమత, నితీష్ వంటి నేతలు చేసిన ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్నట్లుగానే సాగాయి. అసలు విపక్ష ఐక్యతకు ప్రధాన అవరోధం కాంగ్రెస్సే అని చెప్పాలి. అదే సమయంలో తమ తమ రాష్ట్రాలలో కొద్ది పాటి బలం ఉన్న ప్రాంతీయ పార్టీలు.. ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్ బలోపేతం కాకుండా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని పొత్తుల విషయంలో తమ డిమాండ్లకు అనుగుణంగా తగ్గేలా చేయాలని భావిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ తో సహా విపక్షాలన్నీ తమ గోతిని తామే తవ్వుకుంటున్న చందంగా ఐక్యతను పక్కన పెట్టి ఆధిపత్యం కోసం పాకులాడుతున్నాయి. ఈ పరిస్థితి మారనంత వరకూ కేంద్రంలో తమ అధికారానికి వచ్చిన ఢోకా ఏం లేదన్న ధీమాతో బీజేపీ ఉంది.