సైకిల్ తోనే పొత్తు.. 14న జనసేనాని క్లారిటీ?
posted on Mar 6, 2023 @ 2:16PM
మార్చి 14.. జనసేన ఆవిర్భావ దినోత్సవం. ఏపీలో పార్టీ పుట్టి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో ఏట అడుగు పెడుతోంది జనసేన.. ఈ సందర్భంగా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈసందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 14న బందరులో భారీ బహిరంగసభ నిర్వహించాలని జనసేన నిర్ణయించింది.
2014లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్ధాపించారు. అప్పట్లో వెంటనే ఎన్నికలు రావడం, జనంలోకి వెళ్లే సమయం లేకపోవడంతో టీడీపీ-బీజేపీ అభ్యర్దులకు పవన్ మద్దతు ప్రకటించారు. అనంతరం ఐదేళ్ల రాజకీయం తర్వాత 2019లో జనసేన పార్టీ ఒంటరిగానే పోటీలోకి దిగింది. అయితే జనసేన పోటీ చేసిన సీట్లలో కేవలం రాజోలులో మాత్రమే పార్టీ అభ్యర్ది రాపాక వరప్రసాద్ గెలిచారు. ఆ తరువాత ఆయనా వైసీపీ గూటికి చేరారనుకోండి అది వేరే సంగతి. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే పోటీ చేసిన రెండు సీట్లలోనూ ఓడిపోయారు. దీంతో ఈసారి పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. సీరియస్ పాలిటిక్స్ పై దృష్టిని కేంద్రీకరించారు. ఈ నేపథ్యంలో జనసేన పదో పుట్టిన రోజుపై అందరిలో ఆసక్తిని కనిపిస్తోంది.
జనసేన బందరు బహిరంగ సభలో పవన కళ్యాణ్ పొత్తుల విషయంలో ఏమి మాట్లాడతారు? ఎలాంటి ప్రకటన చేస్తారు? అనే విషయంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. నిజానికి గత సవత్సరం మంగళగిరిలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలోనే పవన్ కళ్యాణ్ తొలి సారిగా, పొత్తుల విషయాన్నిప్రస్తావించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసే బాధ్యత తాను తీసుకుంటానని ప్రకటించారు. ఇక అక్కడి నుంచి, పొత్తుల చర్చ మలుపుల మీద మలుపులు తిరిగి.. చివరకు బీజేపీ కలిసి వచ్చినా రాకున్నా టీడీపీ, జనసేన పొత్తు ఖాయమనే దిశగా అడుగులు పడుతున్నాయి.
అయితే ఇంతవరకూ ఇందుకు సంబంధించి తెలుగుదేశం నుంచి కానీ జనసేన నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ పొత్తు విషయంలో స్పష్టమైన సంకేతాలు అయితే పవన్ కళ్యాణ్ ఇస్తూనే ఉన్నారు. ఈ నేపధ్యంలోనే దాగుడు మూతలకు తెరదించుతూ బందరు సభలో పొత్తులపై స్పష్టత ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయానికి వచ్చారని జనసేన శ్రేణులే చెబుతున్నాయి.
నిజానికి బందరు సభలో పవన్ ఇటు పొత్తుల విషయంలో, అటు కాపు రిజర్వేషన్ విషయంలో క్లారిటీ ఇస్తారని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. అందుకే పార్టీ ఆవిర్భావ సభకు ముందుగానే కీలక అంశాల పైన పార్టీ నేతలతో చర్చలు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 11వ తేదీన పవన్ విజయవాడ చేరుకోనున్నారు. 12వ తేదీన మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య తో సహా అన్ని జిల్లాల కాపు నేతలతో పవన్ సమావేశం కానున్నారు. వారి నుంచి కాపు రిజర్వేషన్ల అంశం పైన అభిప్రాయాలు సేకరించి.. పార్టీ పరంగా ఎలా వ్యవహరించాలనే అంశం పైన ఒక నిర్ణయం తీసుకోనున్నారు.
అలాగే 13వ తేదీ పార్టీ ముఖ్య నేతలతో పవన్ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికలకు పార్టీని సిద్దం చేసే క్రమంలో అమలు చేసిన వ్యూహాలు.. నియోజవకర్గ సమీక్షలు.. వారాహి పై రాష్ట్ర వ్యాప్త పర్యటన గురించి ఈ భేటీలో నిర్ణయాలు తీసుకొనే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి బీజేపీతో పొత్తు కొనసాగుతున్నా రెండు పార్టీల మధ్య దూరం పెరిగింది. పెరుగుతోంది. నిజానికి బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలనే నిర్ణయం ఇప్పటికే జరిగిపోయిందని కూడా అంటున్నారు. ఇదే విషయాన్ని పవన్ పార్టీ నేతలతో పంచుకొనే అవకాశం ఉందని అంటున్నారు.
టీడీపీతో పొత్తు ఖాయమని జనసేన నేతలు కూడా భావిస్తున్నారు. ఈ అంశం పైన పార్టీ నేతల నుంచి పవన్ అభిప్రాయ సేకరణ చేసే అవకాశం ఉంది. బీజేపీ, టీడీపీ తో జనసేన భవిష్యత్ బంధం గురించి పార్టీ నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని పవన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సమావేశంలో పార్టీ పొత్తు నిర్ణయాధికారం అధ్యక్షుడికి అప్పగిస్తూ తీర్మానం చేయనున్నట్లు సమాచారం. ఆవిర్భావ సభా వేదిక నుంచే పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖారావం పూరించేందుకు సిద్దం అవుతున్నారు.
ఆ సభా వేదిక నుంచే బీజేపీ, టీడీపీతో తమ భవిష్యత్ సంబంధాల పైన క్లారిటీ ఇస్తారని సమాచారం. టీడీపీ - జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తున్న వేళ.. వైసీపీ సవాళ్ల నడుమ ఇక పొత్తుల అంశం పైన ఎక్కవ కాలం సాగదీయటం మంచిది కాదని పవన్ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పొత్తుల వ్యవహారంతో పాటుగా.. కాపు రిజర్వేషన్ల పైన జనసేన వైఖరి..కార్యాచరణ పవన్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. దీంతో..ఈ సారి జనసేన ఆవిర్భావ సభపై ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి కనిపిస్తోంది.