ముగింపు దశకు వివేకా హత్య కేసు.. అవినాష్ అరెస్ట్?
posted on Mar 6, 2023 @ 9:55AM
వైఎఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ కడప ఎంపీ వైఎస్ అవినాష్ కు మరో మారు నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే ఈ కేసులో రెండు సార్లు అవినాష్ రెడ్డిని విచారించిన సీబీఐ తాజాగా మరో సారి విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇవ్వడం ఈ కేసులో ఆయన అరెస్టు తప్పదన్న చర్చకు మరో మారు తెరతీసింది. రెండో సారి సీబీఐ విచారణకుహాజరైన అనంతరం వైఎస్ అవినాష్ రెడ్డిలో ఆందోళన కనిపించింది.
అయినా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ.. సీబీఐ విచారణ సవ్య దిశలో సాగటం లేదని విమర్శించారు. తనను మూడో సిరి విచారణకు రావాలని సీబీఐ చెప్పలేదనీ, సీబీఐ ప్రశ్నలన్నిటికీ తాను సమాధానాలు చెప్పానని అప్పట్లో స్పష్టం చేశారు. మరో సారి విచారణకు రావాల్సి ఉంటుందని సీబీఐ తనకు చెప్పలేదని అవినాష్ ప్రకటించినా.. ఇప్పుడు తాజాగా ముచ్చటగా మూడో సారి కూడా విచారణకు రావాల్సిందేనని స్పష్టం చేస్తూ సీబీఐ నోటీసు ఇచ్చింది. రెండో సారి విచారణ తరువాత మూడో సారి విచారణకు పిలవడానికి మధ్య సీబీఐ ఎక్కువ రోఝుల వ్యవధి కూడా అవినాష్ కు ఇవ్వలేదు. అయితే సీబీఐ మూడో సారి విచారణకు రావాల్సిందిగా ఇచ్చిన నోటీసుకు అవినాష్ రెడ్డి స్పందించిన తీరు, ఇచ్చిన సమాధానమే ఆయన అరెస్టు అనివార్యమన్నది తేటతెల్లం చేస్తున్నది.
సీబీఐ సోమవారం (మార్చి 6)విచారణకురావాల్సిందిగా ఇచ్చిన నోటీసుకు అవినాష్ రెడ్డి ఆ రోజు విచారణకు హాజరు కావడం వీలుపడదని సమాధానం ఇచ్చారు. తొలిసారి విచారణకు నోటీసు ఇచ్చిన సమయంలోనూ ఆయన ఇదే సమాధానం ఇచ్చిన సంగతి విదితమే. దీంతో పెద్దగా కారణాలు వివరించాల్సిన అవసరం లేకుండా విచారణకు సహకరించడం లేదన్న ఒకే ఒక్క కారణంతో సీబీఐ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశం ఉంది. అయినా కూడా అవినాష్ రెడ్డి విజ్ణప్తి మేరకు సీబీఐ అధికారులు ఈ నెల 10న హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి హాజరు కావాల్సింది ఆదేశిస్తూ ఆదివారం (మార్చి 5)న పులివెందులలోని ఆయన నివాసానికి వెళ్లి మరీ నోటీసు ఇచ్చి వచ్చారు. ఆ రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రావాల్సిందేనని సీబీఐ అధికారులు అల్టిమేటం ఇచ్చినట్లుగా కూడా చెబుతున్నారు. వరుస పరిణామాలను గమనిస్తే వివాక్ హత్య కేసులో సీబీఐ దర్యాప్తు తుదిదశకు చేరుకున్నట్లేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
ఇక వరుస అరెస్టులు ఉంటాయని కూడా అంచనా వేస్తున్నారు. పైగా వైఎస్ అవినాష్ రెడ్డి ఇప్పటి వరకూ రెండు సార్లు సీబీఐ ఎదుట విచారణకుహాజరయ్యారు. అలాగే సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి పీఏ నవీన్ ను కూడా మరోసారి విచారణకు పిలిచేందుకు సీబీఐ రంగం సిద్ధం చేసింది. అలాగే వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రిని కూడా సీబీఐ కడపలోనే విచారించనుంది. వీటన్నిటికీ మించి ఈ కేసులో నిందితుడు సునీల్ యావద్ బెయిల్ పిటిషన్ ను వ్యతిరేకిస్తూ సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొన్న అంశాలను గమనిస్తే.. ఆయనను అరెస్టు చేయడమే తరువాయి అన్నట్లుగా కనిపిస్తోందని పరిశీలకులువిశ్లేషిస్తున్నారు.