బండి అరెస్టుపై బీజేపీ హై కమాండ్ సీరియస్!
posted on Apr 6, 2023 6:06AM
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ వ్యవహారం రాష్ట్రంలోనే కాదు, దేశంలోనూ సంచలనంగా మారింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు మూడు రోజుల ముందు చోటు చేసుకున్న ఈ పరిణామాన్ని, బీజేపీ జాతీయ నాయకత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. బండి సంజయ్ అరెస్ట్ పై స్పందించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అరెస్ట్ ను బీజేపీ హైకమాండ్ తీవ్రంగా పరిగణిస్తోందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యనేతలతో నడ్డా ఫోన్‌లో మాట్టాడారు. న్యాయపరమైన అవకాశాలను పరిశీలించాల్సిందిగా సూచించారు.
అంతకు ముందు, దేశంలోని రాజకీయ పరిణామాలు, పార్లమెంట్ సమావేశాలపై చర్చించేందుకు బీజేపీ హై కమాండ్ సమావేశమైంది. ఈ సమావేశం ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడుజేపీ నడ్డా ప్రత్యేకంగా సమావేశమై బండి అరెస్ట్ విషయాన్ని చర్చించారు. ఈ సందర్భంగా బండి అరెస్ట్ సందర్భంగా జరిగిన పరిణామాలను ప్రధాని మోడీ అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో మోడీ పర్యటనకు ముందు ఇలా జరగటంపై చర్చించారు. బండి సంజయ్ అరెస్టుకు కారణాలు ఏంటీ.. ఏయే సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు.. అరెస్ట్ చేసిన తీరును ప్రధాని మోడీకి వివరించారు నడ్డా, అమిత్ షా.మరో రెడ్నురోజుల్లో 8వ తేదీన ప్రధాని రాష్ట్రంలో పర్యటించాల్సిన ఉన్న క్రమంలో.. ఏర్పాట్లు చేస్తున్న సమయంలోనే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్ట్ చేయటం.. చేసిన తీరును ప్రధాని మోడీకి నడ్డా, అమిత్ షా వివరించారు.
ఈ క్రమంలోనే ప్రధాని మోడీ సైతం స్పందించినట్లు తెలుస్తుంది. న్యాయపరమైన అన్ని అంశాలను పరిశీలించాలని.. బండి సంజయ్ కు పార్టీ శ్రేణులు అండగా ఉండాలని స్పష్టం చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర నేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ.. పరిస్థితులను తెలుసుకోవాలని మోడీ సూచించారు.
మరోవంక బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల బాధ్యులు, తరుణ్ చుగ్ బండి అక్రమ అరెస్ట్ ను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ఒక ప్రకటన్ విడుదల చేశారు. ఈ సంధర్భంగా ఆయన బండి సంజయ్ అక్రమ అరెస్ట్ ను బీజేపీ జాతీయ నాయకత్వం చాలా సీరియస్ గా తీసుకుందని, ఇందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదని అన్నారు.
కాగా, స్వార్థ రాజకీయాల కోసం బీజేపీ నాయకులు విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆయన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘పిచ్చోడి చేతిలో రాయి ఉంటే వచ్చి పోయేటోళ్లకే ప్రమాదం.. అదే పిచ్చోడి చేతిలో ఒక పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం. స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నపత్రాలు లీక్ చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు’’ అని కేటీఆర్ మండిపడ్డారు.