గాంధీ పాఠం డిలీట్.. ఎన్సీఈఆర్టీ లీల!
posted on Apr 6, 2023 @ 10:21AM
పన్నెండవ తరగతి పొలిటికల్ సైన్స్ పాఠ్య పుస్తకం నుంచి మహాత్మా గాంధీకి సంబంధించిన అంశాలను ఎన్సీఈఆర్టీ తొలగించింది. ఎన్సీఈఆర్టీ వివాదస్పద నిర్ణయంపై విపక్షాలు, విద్యావేత్తలు భగ్గుమంటున్నాయి. చరిత్రను తమకు అనుగుణంగా మార్చుకునేందు కేంద్రంలోని బీజేపీ చేసే ప్రయత్నంలో భాగమే ఈ నిర్ణయమని విమర్శలు గుప్పిస్తున్నాయి.
కొత్తగా రూపొందించిన 12వ తరగతి పాఠ్య పుస్తకాల నుంచి గతంలో ఉన్న కొన్ని పాఠ్యాంశాలను ఎన్సీఈఆర్టీ ( నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ) తొలగించింది. ముఖ్యంగా రాజనీతి శాస్త్రం సబ్జెక్టులో నుంచి మహాత్మాగాంధీకి సంబంధించిన కీలక అంశాలను తొలగించింది. హిందూ, ముస్లిం ఐక్యత కోసం గాంధీజీ పరితపించడం, ఆ కారణంగా హిందూ అతివాదులు మహాత్మాగాంధీని ద్వేషించడం, గాంధీ హత్య అనంతరం ఆరెస్సెస్ పై నిషేధం విధించడం.. మొదలైన అంశాలను ఎన్సీఈఆర్టీ తొలగించింది. 12వ తరగతి రాజనీతి శాస్త్రం పాఠ్య పుస్తకంలోని స్వాతంత్య్రం తరువాత భారతదేశంలో రాజకీయాలు అనే చాప్టర్ నుంచి ఈ అంశాలను తొలగించింది. మహాత్మా గాంధీ త్యాగం అనే సబ్ టాపిక్ ను పూర్తిగా డిలీట్ చేసింది.
హిందూ ముస్లింల ఐక్యత కోసం గాంధీజీ కృషి చేయడం.. హిందూ అతివాదులకు నచ్చలేదు. వారు గాంధీజీ ముస్లింలకు, పాకిస్తాన్ కు అనుకూలంగా ఉన్నట్లు భావించారు. పాకిస్తాన్ ను ముస్లిం దేశంగా ప్రకటించినట్లుగా భారతదేశాన్ని కూడా హిందూ దేశంగా ప్రకటించాలని వారు ఆశించారు. అందుకు గాంధీజీ అడ్డుగా ఉన్నట్లు భావించారు. అందుకే ఆయనను హతమార్చడానికి పలుమార్లు ప్రయత్నించారని మహాత్మా గాంధీ త్యాగం అనే చాప్టర్ లోని ఒక పేరాగ్రాఫ్ లో ఉంది. ఆ పేరాగ్రాఫ్ ను పూర్తిగా తొలగించారు. గాంధీజీ హత్య అనంతరం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ను నిషేధించిన ప్రస్తావనను కూడా సిలబస్ నుంచి తొలగించారు. మత విద్వేషాన్ని ప్రచారం చేస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. వాటిపై నిషేధం విధించింది. దాంతో, కొంతవరకు మత రాజకీయాల ప్రభావం తగ్గిందని ఉన్న పేరాను కూడా ఎన్సీఈఆర్టీ తొలగించింది.
12వ తరగతి చరిత్ర పుస్తకంలోని థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ 3 లో గాంధీజీ హత్యకు సంబంధించిన ఒక పేరాగ్రాఫ్ లో కూడా మార్పులు చేసింది. గాంధీజీని 1948 జనవరి 30న హత్య చేసింది నాథూరాం గాడ్సే అని కొత్తగా ముద్రించిన పాఠ్య పుస్తకంలో ఒకే వ్యాక్యంలో తేల్చేశారు. గతంలో చెలామణిలో ఉన్న పాఠ్య పుస్తకాల్లో జనవరి 30 ప్రార్థనల అనంతరం గాంధీజీని పుణె కు చెందిన బ్రాహ్మణుడైన నాథూరాం గాడ్సే తుపాకీతో కాల్పులు జరిపి హత్య చేశాడు. నాథూరాం గాడ్సే ఒక హిందూ అతివాద పత్రికకు ఎడిటర్. గాంధీజీని ముస్లింల మద్దతుదారుగా ఇతడు గతంలో ప్రకటించాడని ఉంది. గత సంవత్సరం ఎన్సీఈఆర్టీ చేపట్టిన 30 శాతం సిలబస్ రేషనలైజేషన్ కు అదనంగా, ఇప్పుడు ఈ తొలగింపులను చేపట్టడం గమనార్హం. ఈ తొలగింపుల అనంతరం ముద్రించిన పాఠ్య పుస్తకాలు 2023 - 24 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి. పాఠ్యపుస్తకాలలో విషయాన్ని మార్చి ఎట్టకేలకు బీజేపీ తన అసలు రంగును, ఉద్దేశ్యాన్ని చూపిందని పలువురు ప్రతిపక్ష నేతలతో సహా అనేక మంది విద్యావేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.