రికార్డింగ్ డ్యాన్స్ లో ఎమ్మెల్సీ చిందులు!
posted on Apr 6, 2023 @ 9:58AM
మనిసన్నాక కూసింత కళాపోషణ ఉండాలి.. లేకుంటే మడిసికీ గొడ్డుకూ తేడా ఏటుంటాది.. ముత్యాల ముగ్గు సినిమాలో కాంట్రాక్టర్ రావుగోపాలరావు చెప్పిన డైలాగొకటి భలేగా పేలింది. ఆ మాటలను అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని పలువురు ప్రజా ప్రతినిధులు కరెస్టుగా అంది పుచ్చుకున్నారని నెటిజనులు తెగ ట్రోల్ చేస్తున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయల్.. రికార్డింగ్ డ్యాన్స్‌లో అమ్మాయిలతో వేసిన చిందుల వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. దీనిపై నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు నడి రోడ్డుపై వేసిన డ్యాన్స్‌లు.. మరో మంత్రి ఆర్కే రోజా.. పలు సందర్బాల్లో వివిధ వేదికలపై వేసిన చిందులు.. జనం మరిచి పోకముందే.. అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్... ఇలా రికార్డింగ్ డ్యాన్స్ లో అమ్మాయిలతో కలిసి చిందులు వేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు.. హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన సంఘటనతో అధికార పార్టీ పరువు నడి బజార్లో పోయింది. అలాంటి వేళ.. అదే ఉమ్మడి జిల్లాలోని మరో ఎమ్మెల్సీ.. ఇలా అమ్మాయిలతో రికార్డింగ్ డ్యాన్సులు చేయడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
శాసన మండలి అంటే... రాష్ట్రాల్లోని పెద్దల సభ అని.. అలాంటి సభకు ఎమ్మెల్సీలు.. ప్రాతినిధ్యం వహించి.. సమాజంలోని వివిధ వర్గాల సమస్యలను ఈ సభ వేదికగా గళం విప్పి.. ప్రశ్నలు సంధిస్తారని వారు పేర్కొంటున్నారు. అంతటి ప్రాశస్త్యం ఉన్న శాసనమండలికి ఇలాంటి వాళ్లనా?.. అదీ ఎమ్మెల్యే కోటాలోనా?.. వైసీపీ పంపిందని నెటిజన్లు ముక్కున వేలేసుకొంటున్నారు.
అయినా అటు ఎమ్మెల్యేలు కానీ.. ఇటు ఎమ్మెల్సీలు కానీ హుందాగా ఉండాలి.. హుందాగా వ్యవహరించాలని.. అంతే కానీ..ఎక్కడి పడితే అక్కడ.. ఇలా స్థాయిని మరిచి డ్యాన్సులు వేయడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే వైసీపీఅధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ తొలి కేబినెట్‌లోని మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, అనిల్‌కుమార్ యాదవ్, కురసాల కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాసరావు.. అలాగే జగన్ మలి కేబినెట్‌లో మంత్రులు అంబటి రాంబాబు, ఆర్కే రోజా, జోగి రమేష్ తదితరులు ప్రెస్ మీట్ పెట్టి వాడే భాష సంగతి అందరికీ తెలిసిందేనని నెటిజన్లు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.