కర్ణాటకలో మళ్ళీ హంగ్? సీఎం కుమారస్వామేనా?
posted on Apr 5, 2023 @ 2:02PM
కర్ణాటక శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. సహజం ఎన్నికల సమయంలో ప్రధాన రాజకీయ పార్టీలలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏ పార్టీ అధికార పగ్గాలు చేపడుతుంది? అనే చర్చ జరుగుతుంది. కానీ, కర్ణాటకలో మాత్రం, పొలిటికల్ ఫోకస్ మొత్తం మూడో పార్టీ పైనే వుంది. అవును.. అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉంటుంది. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. అయితే కర్ణాటకలో మరో మారు హంగ్ తప్పదనే వ్యూహాగానాలు బలంగా వినిపిస్తున్న నేపధ్యంలో, రేసులో ఉన్న మూడో పార్టీ జేడీఎస్ ఎటు మొగ్గు చూపుతుంది అనేది ఇప్పడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
నిజానికి కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ, సంకీర్ణ ప్రభుత్వాలు కొత్త కాదు. అలాగే అలాంటి పరిస్థితి వచ్చిన ప్రతిసారీ జేడీఎస్ కింగ్ ఆర్ కింగ్ మేకర్ గా కీలకంగా మారుతోంది. 2018 ఎన్నికల తర్వాత కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. 224 మంది సభ్యులున్న సభలో బీజేపీ 106 స్థానాల్లో విజయం సాధించి, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కానీ మేజిక్ ఫిగర్ (113) చేరుకోలేక పోయింది. దీంతో 78 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కేవలం 37 సీట్లు మాత్రమే గెలిచిన జేడీఎస్ ముఖ్యమంత్రి కుర్చీ ఎగరేసుకుపోయింది. హెచ్ డీ కుమార స్వామి ముఖ్యమంత్రిగా జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కొలువు తీరింది. ఆ తర్వాత ఏం జరిగిందనేది చరిత్ర. సంకీర్ణంలో చిచ్చు రేగింది. సర్కార్ కూలి పోయింది. ఈ లోగా 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీలో చేరి ఉప ఎన్నికల్లో గెలిచారు. ఆ విధంగా ఏడాది తిరగక ముందే యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా బీజేపీ పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది,
ఆ తర్వాత యడ్యూద్యూరప్ప స్థానంలో బసవరాజు బొమ్మై ముఖ్యమంత్రిగా వచ్చారు. సరే ఆ చరిత్రను అలా ఉంచితే, రానున్న అసెంబ్లీ ఎన్నికలలోనూ కర్నాటకలో అదే హంగ్ స్థితి పునరావృతం అయితే .. ఏం జరుగుతుంది? కింగ్ మేకర్ జేడీఎస్ ఏమి చేస్తుంది అనే విషయంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాన మంత్రి దేవేగౌడ .. హంగ్ వచ్చినా తమ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని స్పష్తం చేశారు. తన కుమారుడు హెచ్‌డీ కుమారస్వామి ఎవరితోనూ పొత్తులు పెట్టుకోరాదని నిర్ణయించారని దేవెగౌడ వెల్లడించారు.
ఎన్నికల ముందు కానీ, తర్వాత కానీ పొత్తులు వద్దనుకున్నామన్నారు. రెండు జాతీయ పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. సొంతంగా అధికారంలోకి రావడంపైనే దృష్టి సారించామని దేవెగౌడ చెప్పారు. సొంతంగా అధికారంలోకి వస్తేనే మ్యానిఫెస్టోలో ప్రకటించే అన్ని కార్యక్రమాలనూ దిగ్విజయంగా అమలు చేయగలుగుతామన్నారు. అయితే జేడీఎస్ ఒంటరిగా అధికారంలోకి రావడం అయ్యే పనికాదని, హంగ్ అంటూ వస్తే, కాంగ్రెస్ లేదా బీజేపీ మద్దతుతో కుమార స్వామి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేందుకు ప్రయత్నిస్తారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాగా, మే 10న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 115 నుంచి 127 స్థానాలు గెలుచుకోవచ్చని ఏబీపీ ఒపీనియన్ పోల్ సర్వే తెలిపింది. ఇదే జరిగితే జేడీఎస్ అవసరం కాంగ్రెస్‌కు ఉండదు. అయితే పీపుల్స్ పల్స్’ తదితర సంస్థలు కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చినా, మేజిక్ ఫిగర్ కు డజను సీట్ల దూరంలో ఉండి పోతుందని, సో .. జేడీఎస్ కింగ్ మేకర్ గా కంటిన్యూ అవుతుందని అంటున్నారు.
మరో వంక బీజేపే నాయకులు 150 సీట్లు గెలుస్తామనే ధీమాతో ఉన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మిషన్ 150 వ్యూహరచన చేశారనీ అంటున్నారు. అలాగే కాంగ్రెస్ కూడా సింగిల్ గానే అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉంది. అయితే బీజేపీ, కాంగ్రెస్ మ్యాజిక్ నెంబర్ చేరుకోకపోతే గత అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే జేడీఎస్ కింగ్‌మేకర్ పాత్రలోకి వెళ్తుంది. కాగా పస్తుతం 224మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీలో బీజేపీకి 119 మంది, కాంగ్రెస్‌కు 75 మంది, జేడీఎస్‌కు 28మంది సభ్యులుండగా 2సీట్లు ఖాళీగా ఉన్నాయి. కర్ణాటక లో మే 10న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు మే 13న జరుగుతుంది.