అన్నీ తెలిసీ మౌనమేల మోడీజీ!
posted on Apr 6, 2023 @ 2:52PM
ఏపీని పంజాబ్ తో పోలుస్తూ పరిస్థితులు అధ్వానంగా తయారయ్యాయని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు, ఏపీలోని అస్తవ్యస్థ పరిస్థితులకు అద్దం పట్టడమే కాకుండా కేంద్రంలోని ఆయన సర్కార్ నిష్క్రియాపరత్వాన్ని కూడా ఎత్తి చూపేలా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. ఔను మరి అప్పులు, అరాచకలతో ఏపీ నానాటికీ దిగజారిపోతోందని మోడీ అన్నారని తెలుగుదేశం ఎంపీ కనకమేడల చెప్పారు.
ఏపీలో పరిస్థితులపై వివరిస్తున్న సందర్భంగా మోడీ కల్పించుకుని తన వద్ద సమాచారం ఉందని అన్నారని కనకమేడల మీడియా సమావేశంలో చెప్పారు. ఆ విషయంలో మోడీ జోక్యాన్ని కోరామని ఆయన అన్నారు. ఏపీ అప్పులు, అస్తవ్యస్థ పరిస్థితులు, గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మారిన తీరు గురించిన సమాచారం మోడీ వద్ద ఉన్నప్పుడు చర్యలు తీసుకోవడానికి ఆయన ఎందుకు వెనుకాడుతున్నారని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
అన్నీ తెలిసినా పట్టనట్ల వ్యవహరించడంలో మోడీ స్థితప్రజ్ణత సాధించారు. సీబీఐ, ఐటీ, ఈడీ వంటి సంస్థల పని తీరు భేషుగ్గా ఉందని మెచ్చుకుంటూనే, ఎటువంటి ఒత్తిడులూ లేకుండా స్వేచ్ఛగా పని చేయాలని సలహా ఇస్తూనే.. విపక్షాలు వినా అధికార బీజేపీ నేతలపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు ఎందుకు చేయడం లేదని కేంద్ర దర్యాప్తు సంస్థలను ఆయన ప్రశ్నించిన పాపాన పోలేదు. అలాగే ఏపీ ముఖ్యమంత్రి జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తునకు అడుగడుగునా అడ్డు తగులుతున్న వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారని ప్రశ్నించలేదు. ఇప్పుడు ఆయన ఏపీలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయనీ, పంజాబ్ ను తలపిస్తున్నాయనీ చేసిన కామెంట్లు ఆయన స్వయంగా మీడియా ముందు చెప్పినవి కావు. ఏపీలో విపక్షానికి చెందిన ఎంపీ ఒకరు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేసిన సందర్భంగా చెప్పిన మాటలు. మోడీ ఆ మాటలు నిజంగా అని ఉండకపోయినా.. మీతో కనుక అన్నాను, ఈ మాటలు మీడియా ముందు వెల్లడించవద్దని ఆ ఎంపీకి సూచించినా ఆయన వాటిని బయటపెట్టే అవకాశం లేదు.
అంటే మోడీ తాను ఏ విషయాన్నీ పట్టించుకోరు.. అన్నీ తెలిసినా చర్యలు తీసుకోరు. ఏదైనా విషయం తన దృష్టికి తీసుకురావడానికి ఎవరైనా ప్రయత్నిస్తే మాత్రం ఆ సమాచారం అంతా తన వద్ద ఉందని చెప్పి వారి నోరు మూయిస్తారు. రాజకీయ లబ్ధి ఉందని భావిస్తే తప్ప ఆయన క్రియాశీలంగా వ్యవహరించరు. ఇప్పటి వరకూ మోడీ తీరుపై విపక్షాల నుంచి వస్తున్న విమర్శలివి. తాజాగా ఏపీ విషయంలో ఆయన చేసిన కామెంట్స్ చూస్తే విపక్షాల విమర్శలు అక్షర సత్యాలని అనిపించక మానవు.
ప్రధానమంత్రి మోదీ పంజాబ్‌తో ఏపీని పోల్చారు. పంజాబ్‌లో డ్రగ్స్, రౌడీ గ్యాంగులు చెలరేగిపోతున్నాయి. శాంతి భద్రతల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఖలిస్తాన్ ఉద్యమం మళ్లీ పెచ్చరిల్లుతోంది. మొత్తంగా ఆ రాష్ట్రంలో పరిస్థితులు దేశాన్నే దెబ్బతీసేవిగా ఉన్నాయి. అటువంటి పంజాబ్ తో ఏపీలో మోడీ పోల్చారంటే ఏపీలో పరిస్థితులు కూడా దేశ ప్రయోజనాలకు భంగం వాటిల్లేవిగా ఉన్నాయనే అర్ధం. పరిస్థితులు అంత తీవ్రంగా ఉన్నా మోడీ ఎందుకు పట్టించుకోవడం లేదు.. పట్టించుకోకపోవడం, పట్టించుకోవడం పక్కన పెడితే.. ఏపీలో అధ్వాన పరిస్థితులకు కారణమైన రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు రెండు చేతులా సహకారం అందిస్తున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా ఆ రాస్ట్రం చేస్తున్న అప్పులకు ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అంటే ఆయన నుంచి సమాధానం రాకపోవచ్చుకు కానీ రాజకీయ పరిశీలకుల నుంచి, సామాన్య మానవుడి వరకూ అందరికీ కారణం ఏమిటన్నది తెలుసు. అది రాజకీయ ప్రయోజనం. ఏపీలో వైసీపీ మూకలు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పై దాడి చేశాయి. పక్కా ప్రణాళికతో ఆ దాడి జరిగింది. ఆ దాడిని అడ్డుకోకుండా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. అయినా కూడా దాడి జరిగిన వారిపైనే కేసులు నమోదు చేశారు. అయినా మోడీ మౌనంగా ఉండిపోయారు. ఇదంతా చూస్తుంటే.. ఆయనకు సమస్యల పరిష్కారం కంటే.. తప్పులను చక్కదిద్దడం కంటే, అవినీతిని, అక్రమాలను అరికట్టడం కంటే రాజకీయ ప్రయోజనమే ముఖ్యమన్న విపక్షాల విమర్శలు వాస్తవమేనని అనిపించక మానదు.