అసంతృప్తిని చల్లార్చడమే జగన్ అసలు ఎజెండా?!

ఆంధ్ర ప్రదేశ్ లో ముందస్తు ఎన్నికల వ్యూహాగానాలు జోరందుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో ఓ వైపు అధికార వైసీపీలో అసమ్మతి సెగలు భగ్గుమంటున్నాయి. అసమ్మతి గళాలు గర్జిస్తున్నాయి. మరోవైపు, మాట తప్పను మడమ తిప్పను అంటూ బీరాలు పోయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి   ఒక్కొక్క నిరయాన్ని వెనక్కి తీసుకుంటున్నారు. నిన్న మొన్నటిదాకా మంత్రులు, ఎమ్మెల్యేలకు బెత్తం పట్టుకుని పాఠాలు చెప్పిన ముఖ్యమంత్రి  ఇప్పడు  వెనకడుగు వేశారు. మెల్ల మెల్లగా బుజ్జగింపుల దారిలోకి  మారుతున్నారు. వాస్తవానికి మూడు నాలుగు రోజుల కిందట ఢిల్లీ వెళ్ళక ముందు  ముఖ్యమంత్రి జగన్ రెడ్డి,  2024 ఎన్నికలకు రూట్ మ్యాప్ సిద్దం చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల గాయాలకు  మంత్రుల ఉద్వాసనతో చికిత్స చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఐదారుగు, మంత్రులకు ఉద్వాసన చెప్పే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారనీ,  త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని వార్తలొచ్చాయి. అయితే జగన్ రెడ్డి డిల్లీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన  టోన్ మారిందని, సీన్ రివర్సైందనీ అంటున్నారు. అందుకే మంత్రుల ఉద్వాసన, మంత్రివర్గ విస్తరణ అలోచనను ముఖ్యమంత్రి ప్రస్తుతానికి పక్కన పెట్టేశారని చెబుతున్నారు.  అలాగే  గడప గడపకు పరీక్షలో ఫెయిల్ అయిన 40 మందికి పైగా ఎమ్మెల్యేలకు ( అందులో కొందరు మంత్రులు కూడా ఉన్నారుట) తాఖీదులు ఇచ్చిన ముఖ్యమంత్రి  ఇప్పడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే  టిక్కెట్ విషయం కన్ఫర్మ్ చేసుకునేందుకు ముఖ్యమంత్రిని కలిసిన ఇద్దరు ఎమ్మెల్యేలకు ఆయన మళ్ళీ టికెట్ ఇచ్చేది లేదని ముఖం మీదనే  చెప్పడంతో ఆ ఇద్దరు  ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరమో.. ఆ ఇంటికి ఈ ఇల్లు అంటే దూరమని  ఆత్మ ప్రభోధం మేరకు ఓటు వేశారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ఇంత ఇన్స్టంట్ తిరుగుబాటును ఊహించలేదో ఏమో కానీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరో ఓటమి ఎదురుకాడంతో ముఖ్యమంత్రి కంగుతిన్నారని అంటున్నారు. అప్పటికే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడుకు మూడు స్థానాలను టీడీపీ ఎగరేసుకు పోవడంతో, జగన్ రెడ్డి  షాక్ కు గురయ్యారు. అదే సమయంలో ఢిల్లీ పెద్దలకు, ఇంటెల్జెన్సీ వర్గాల నుంచి ఎలాంటి నివేదికలు వచ్చాయో ఏమో కానీ, ముఖ్యమంత్రిని ఢిల్లీకి పిలిపించి పెట్టవలసిన నాలుగు పెట్టిపంపారని అంటున్నారు.  నిజానికి  కేవలం 15 రోజుల వ్యవధిలో రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి ఢిల్లీ ఎందుకు వెళ్ళారనే విషయంలో  అనేక వ్యుహాగానాలు వినిపించినా, నిజానికి ముఖ్యమంత్రి తనంతట తానుగా ఢిల్లీ వెళ్ళలేదని, ఢిల్లీ పెద్దల ‘ఆదేశం’  మేరకే ఆయన ఢిల్లీ వెళ్ళారని విశ్వసనీయ సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ఆధారంగా ఇంటెలిజెన్స్ వర్గాలు అందించిన సమాచారం మేరకే, ఢిల్లీ పెద్దలు జగన్ రెడ్డిని ఢిల్లీకి పిలిపింఛి పరిస్థితిని వివరించినట్లు తెలుస్తోంది. అందుకే విషయ తీవ్రతను దృష్టిలో ఉంచుకునే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా బాగా పొద్దుపోయిన తర్వాత, అర్థ రాత్రికి అరగంట ముందు జగన్ రెడ్డికి  అప్పాయింట్మెంట్ ఇచ్చారని అంటున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తన ధోరణి మార్చుకోకపోతే, చాలా పెద్ద సంఖ్యలో,  ఇంచు మించుగా హాఫ్ సెంచరీ వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలు గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారని, అమిత్ షా  జగన్ కు స్పష్టంగా వివరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అందుకే ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ధోరణిలో మార్పు కనిపిస్తోందని అంటున్నారు.  ఈ నేపథ్యంలో సోమవారం(ఏప్రిల్ 3) జరిగే ఎమ్మెల్యేలు, రీజినల్ కోఆర్డినేటర్ల సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేంలో  జగన్ రెడ్డి చెప్పే ఢిల్లీ ముచ్చట్లు ఏమిటనే విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, ముందుగా అనుకున్నట్ల్గు మంత్రి వర్గ విస్తరణ ప్రస్తావన ఉండక పోవచ్చని, అలాగే గడప గడప పరీక్ష ప్రస్తావన కూడా ఉండదని అంటున్నారు.     ముఖ్యంగా సమావేశంలో ముఖ్యమంత్రి ఏమి మాట్లాడినా ఈ సమావేశం ప్రధాన లక్ష్యం మాత్రం పార్టీలో రగులుతున్న అసంతృప్తిని చల్లార్చడమే అని వైసీపే ముఖ్య నేతలే చెబుతున్నారు.  అలాగే  ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమి తర్వాత ఎమ్మెల్యేల ఆలోచనలు ఎటుగా వెళుతున్నాయి. తట్టాబుట్టా సర్దుకుంటున్న ఎమ్మెల్యే ఎవరు? ఎంత మంది ? తెలుగు దేశం పార్టీతో టచ్ లో ఉన్నఎమ్మెల్యేలు ఎవరు? ఎంతమంది? అనే కోణంలో విచారణ జరిపేందుకే ముఖ్యమంత్రి ఈ సమావేశం ఏర్పాటు చేశారని అంటున్నారు. అదే నిజమైతే మాట తప్పని, మడమ తిప్పని ముఖ్యమంత్రి  మాట తప్పడం మడమ తిప్పడం మాత్రమే కాదు, స్వరం మార్చి బుజ్జగింపు ప్రసంగం చేసినా ఆశ్చర్య పోనవసరం లేదంటున్నారు. నిజానికి, ఈ సమావేశం ఢిల్లీ పెద్దల కనుసన్నల్లో జరుగతున్న సమావేశంగానూ అనుమానిస్తున్నారు. అయితే, వైసీపీ అంతర్గత వ్యవహారాల్లో బీజేపీ నాయకత్వం ఎందుకు జోక్యంచేసుకుంటోంది.  వైసీపీ బీజేపీ నాయకత్వాన్ని తమ పార్టీ సూపర్  హై కమాండ్ గా ఎందుకు అంగీకరిస్తోంది అనేది ఇప్పుడు చర్చనీయాంశం మారింది. తమిళనాడులో అన్నా డిఎంకేని ట్రీట్ చేస్తున్న విధంగా, ఏపీలో వైసీపీని బీజేపీ హై కమాండ్ ట్రీట్ చేస్తోందా? అనే ప్రశ్నలు వినవస్తున్నాయి.

ది బిగ్ ఫైట్ ఎప్పుడంటే?

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 29న ఎన్నికల షెడ్యూలు ప్రకటించింది. మే 10 న మొత్తం 224 నియోజక వర్గాల్లో ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 13న ఓట్ల లెక్కింపు, ఫలితాల విడుదల. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలోకి వచ్చింది.  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సంవత్సరం సార్వత్రిక ఎన్నికలకు ఆ మధ్యలో జరిగే ఆరేడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సిగ్నేచర్ ట్యూన్ గా  మేలు కొలుపు గీతంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కర్ణాటక, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 లోక్ సభ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తాయని   పేర్కొంటున్నారు.  అందుకే లోక్ సభ ఎన్నికలకు ముందు జరిగే అసెంబ్లీ ఎన్నికల క్రమంలో తొలి ఎన్నిక జరిగే కర్ణాటకలో బోణీ కొట్టేందుకు బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ పోరుకు సిద్ధమవుతున్నాయి.  లోక్ సభ ఎన్నికలకు ముందు ఎన్నికలు జగరనున్న రాష్ట్రాలలో తెలంగాణ, సిక్కిం, మిజోరాం మినహా మిగిలిన రాష్టాలలో ప్రధాన పోటీ  కేంద్రంలో అధికారం కోసం తలపడుతున్న రెండు ప్రధాన జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ల మధ్యనే ఉంటుంది.  ఒక్క కర్ణాటక మినహా మిగిలిన రాష్టాలలో అయితే  ఆప్, తృణమూల్ వంటి పార్టీలు పోటీ చేసినా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యనే ముఖాముఖీ పోరు ఉంటుందని అంటున్నారు. ఈ నాలుగు రాష్ట్రలో  కలిపి మొత్తం 92 (కర్ణాటక 28, ఛత్తీస్ ఘడ్ 11, మధ్య ప్రదేశ్ 29, రాజస్థాన్ 25) లోక్ సభ స్థానాలున్నాయి. ఈ నాలుగు రాష్ట్రలలో గత (2019) లోక్ సభ ఎన్నికల్లో  మెజారిటీ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఒక విధంగా క్లీన్ స్వీప్ చేసింది.  మొత్తం 92 స్థానలకు  గానూ, బీజేపీ 86 స్థానాలు గెలిచుకుంది. కాంగ్రెస్ కేవలం నాలుగు (4) స్థానాలకు పరిమితం అయింది  కర్ణాటక బీజేపే 25, కాంగ్రెస్ 1,  ఛత్తీస్ ఘడ్ బీజేపే 9, కాంగ్రెస్ 2, మధ్య ప్రదేశ్ బీజేపీ 28, కాంగ్రెస్ 1, రాజస్థాన్ బీజేపీ 24, కాంగ్రెస్  సున్నా. ఆ విధంగానూ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల భవిష్యత్తుతో పాటుగా  దేశ రాజకీయ భవిష్యత్ ను నిర్ధారించే టర్నింగ్ పాయింట్ గా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీలో 224 స్థానాలు ఉండగా, బీజేపీకి 119 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కు 75, జేడీఎస్‌కు 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.  అదలా ఉంటే  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ అగ్రనేతలు ఇద్దరికి పరీక్షగా నిలుస్తున్నాయని అంటున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు స్వరాష్ట్రంలో సొంత పార్టీని గెలిపించుకోవడం  సవాలుగా మారితే, భారత జోడో యాత్ర, అనర్హత వేటు నేపథ్యంలో ప్రధాని మోదీతో  ఢీ అంటే ఢీ  అంటున్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు,  రాహుల్ గాంధీ నాయకత్వానికి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు అతి పెద్ద పరీక్షగా పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో  ఏప్రిల్‌ 9న ఒకే రోజు  అటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఇటు రాహుల్‌ గాంధీ కర్నాటకలో  వేర్వేరు సభల్లో పాల్గొనడం ఆసక్తి రేకిస్తోంది.  2019లో కోలార్‌ ఎన్నికల ప్రచారంలో మోదీ ఇంటిపేరుపై రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇటీవల గుజరాత్‌ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలుశిక్ష విధించడం, ఆ తర్వాత ఆయనపై అనర్హత వేటు పడటం చకచకా జరిగిపోయాయి. ఈ పరిణామాల సమయంలోనే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ రావడంతో కాంగ్రెస్‌ పార్టీ ప్రచారం ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ రాష్ట్రంలో త్వరలో ప్రచారం చేపట్టనున్నారు. అయితే గతంలో ఎక్కడ అయితే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారో.. అదే కోలార్‌ నుంచి ఈసారి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నట్లు ఇటీవల పార్టీ వెల్లడించింది. ‘సత్యమేవ జయతే’ పేరుతో కోలార్‌లో ఈ ర్యాలీని ఏప్రిల్‌ 5న జరపాలని నిర్ణయించింది. అయితే ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు వాయిదా వేసి ఏప్రిల్‌ 9న నిర్వహించనున్నట్లు కాంగ్రెస్‌ ప్రకటించింది. అదే రోజున, మైసూరులో ప్రధాని మోదీ పర్యటించనున్నారు.‘ప్రాజెక్ట్‌ టైగర్‌’స్వర్ణోత్సవాలకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ అదే రోజు సత్యమేవ జయతే ర్యాలీ చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, ప్రధాని పర్యటన అధికారిక పర్యటన కాగా, రాహుల్ గాంధీ ఉద్దేశ పూర్వకంగానే, మోడీతో కర్ణాటక గడ్డ మీద ఢీ  అనేందుకే ఏప్రిల్ 9 ముహూర్తం నిర్ణయించుకున్నారని అంటున్నారు. ఏమైనా, అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ కు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు అగ్ని పరీక్ష అనడంలో సందేహం లేదు.

సన్ రైజర్స్ హైదరాబాద్ పై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాజయంతో మొదలెట్టింది. సొంత గడ్డపై రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ ఏకంగా 72 పరుగుల తేడాతో ఓటమి మూటగట్టుకుంది.  తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 203 పరుగులు చేసింది. రాజస్తాన్ జట్టుకు బట్లర్, జైస్వాల్   శుభారంభం అందించారు. ముఖ్యంగా బట్లర్ బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 20 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్ లో ఉన్న జైస్వాల్ కూడా బట్లర్ తో పోటీ పడి మరీ పరుగులు సాధించారు. దాంతో పవర్ ప్లేలోనే రాజస్తాన్ రాయల్స్  85 పరుగులు సాధించింది. బట్లర్ ఔటైన తరువాత క్రీజ్ లోకి వచ్చిన స్కిప్పర్  సంజూ సామ్సన్ కూడా ధాటిగా ఆడాడు. అయితే తరువాత హైదరాబాద్ బౌలర్లు పుంజుకోవడంతో ఒక దశలో రాజస్థాన్ స్కోరు 250 దాటుతుందేమో అనిపించినా చివరకు 203 పరుగులకు పరిమితమైంది. 204 భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఏ దశలోనూ లక్ష్య ఛేదన దిశగా సాగలేదు. తొలి ఓవర్ లోనే రెండు వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ ఆ తరువాత కూడా క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూనే వచ్చింది. చివరకు 20 ఓవర్లలో 8 వికెట్లకు 131  పరుగులు చేసి 72 పరుగుల తేడాతో పరాజయం పాలయ్యింది. 

అక్కడ ఆలింగనాలు.. ఇక్కడ దాడులు.. జగన్ ద్వంద్వ ప్రమాణాలు

అమరావతే రాజధాని. అందుకే కేంద్రం అభివృద్ధికి నిధులు ఇచ్చింది. అమరావతే రాజధాని అని,  అక్కడే ఇల్లు కట్టుకున్నట్లు చెప్పిన సీఎం జగన్ ఇప్పుడు అమరావతి రైతులకు మద్దతు ఇస్తే దాదులు చేస్తారా?' అంటూ ఏపి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీ రాజధాని అమరావతికే కట్టుబడి ఉందని ఆయన మరోసారి స్పష్టం చేశారు.  అమరావతి రైతుల ఉద్యమం 1200 రోజులకు చేరిన సందర్భంగా మద్దతు తెలిపి వస్తున్న తమ పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పై దాడి  పథకం ప్రకారమే జరిగిందన్నారు. ఇది  ప్రభుత్వ పిరికి పంద చర్యగా ఆయన అభివర్ణించారు. పోలీసుల సమక్షంలోనే దాడి జరిగినందున పాల్పడిన వారిపై హత్యాయత్నం, దాడి, కుట్ర కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.   చట్టాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే బీజేపీ సహించబోదన్నారు. అక్కడ పోటీ ఉద్యమం నిర్వహించడం రెచ్చగొట్టే చర్యలో భాగమేనని వీర్రాజు మండిపడ్డారు. జరిగిన ఘటనపై జాతీయ నాయకత్వానికి నివేదిక పంపామని, ఆ నివేదికలో సూత్రధారులు, పాత్రధారులు ఎవరనేది కూడా వివరించామని ఆయన తెలిపారు.  అమరావతే రాజధాని అన్నదే బీజేపీ ఏకైక నినాదమని, అందుకే రాజధాని ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టా మని తెలిపారు.  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి ఢిల్లీ వెళ్లి.. ప్రధాని మోడీ, అమిత్ షాలను అలింగనం చేసుకుంటూ.. వారికి ఫ్లవర్ బొకేలు, దేవతా విగ్రహాలు ఇచ్చి, రాష్ట్రానికి వచ్చీ రావడంతోనే.. బీజేపీ నాయకులపై దాడులకు పాల్పడటమేమిటని  అటు బీజేపీ శ్రేణులు..ఇటు జనం ఆశ్చర్యపోతున్నారు..జగన్ ద్వంద్వ ప్రమాణాలపై షాక్ కు గురవుతున్నారు. జగన్ తీరుపై   కేంద్రం రియాక్షన్ ఏమిటని జనం ఉత్కంఠంతో ఎదురు చూస్తున్నారు..

గురువులపై గౌరవం ఇదేనా?

వైసీపీ మంత్రులకు గౌరవం ఇవ్వడం అనే పదానికి అర్ధం తెలియదనడానికి ఆ పార్టీ రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. జగన్ తొలి కేబినెట్ లో కొందరు మంత్రులు విపక్ష నేతపై చేసిన వ్యాఖ్యలు, మరి కొందరు మంత్రులు మహిళల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇలా ఎన్నైనా ఉదాహరణలు చెప్పవచ్చు. తాజాగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ టీచర్ల పట్ల అగౌరవంగా వ్యవహరించారు. చదువునేర్పే గురువులకు ఇవ్వాల్సిన కనీస మర్యాద కూడా ఇవ్వకుండా వారిని నిలబెట్టి మాట్లాడారు. తనను కలిసేందుకు వచ్చిన ఉపాధ్యాయ సంఘాల నేతలను నిలబెట్టి.. తాను మాత్రం దర్జాగా కాలుమీద కాలు వేసుకుని కూర్చుని మాట్లాడారు. విద్య నేర్పే గురువులకు విద్యామంత్రి ఇచ్చిన గౌరవం ఇది.  ఇందుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది.     తమ సమస్యలకు సంబంధించి విద్యాశాఖ మంత్రితో చర్చించేందుకు ఆయన వద్దకు వెళ్లిన గురువులకు అవమానం, పరాభవమే ఎదురైంది. ఉన్నత విద్యావంతుడైన బొత్స సత్యనారాయణ గురువులకు దణ్నాలు పెట్టక్కర్లేదు, కనీసం కుర్చోబెట్టి మాట్లాడాలన్న ఇంగితాన్ని కూడా ప్రదర్శించలేదు.  దీనిపై నెటిజన్లు బొత్స సత్యానారాయణపై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తున్నారు. పేరుకే ఆయన విద్యామంత్రి కనీస సంస్కారం కూడా ఆయనలో కనిపించడం లేదు అని ట్రోల్ చేస్తున్నారు.  గురువు తెలియని వ్యక్తి విద్యాశాఖ మంత్రి కావడం ఆ శాఖ దురదృష్టం అని నెటిజన్లు బొత్స సత్యనారాయణ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. 

డేంజర్ బెల్స్.. తస్మాత్ జాగ్రత్త !

ఇది ఎండాకాల. ఎండలు మండే కాలం. మాములుగానే సమ్మర్  అనగానే  వామ్మో... అని హడలి పోతుంటాము. అలాంటిది, ఈ సంవత్సరం, సూర్య ప్రతాపం మరింత భయంకరంగా ఉంటుందని, ఎకంగా మూడు నెలల పాటు ఎండలు మండిపోతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ముందుగానే హెచ్చరించింది. దక్షిణ భారతం, ద్వీపకల్ప ప్రాంతాలు మినహా దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్య అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదుకానున్నట్టు ఐఎండీ ప్రకటించింది.  తూర్పు, మధ్య, వాయువ్య భారత్‌లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. ప్రధానంగా బిహార్‌, ఝార్ఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, పంజాబ్‌, హరియాణా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగి వేడిగాలులు వీస్తాయని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌(డీజీ) మృత్యుంజయ మహాపాత్ర పేర్కొన్నారు.   దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఇటీవల వర్షాలు కురిసినా.. మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు మండుతున్నాయి. రాత్రి సమయాల్లో వాతావరణం కాస్త చల్లగా ఉంటుండగా మధ్యాహ్న సమయాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ప్రకటన పిడుగు లాంటి వార్తే అని చెప్పొచ్చు. మధ్య, తూర్పు, వాయువ్య భారతదేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ వేడి గాలులు వీస్తాయని అంచనా వేసింది.  అదలా ఉంటే,మరో వంక దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. రెండు వారాలుగా రోజువారీ కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,823 మంది కొత్తగా వైరస్ బారినపడ్డారు.  ముందు రోజు (2,997 కేసులు) తో పోల్చితే ఇవి 27 శాతం అధికం. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకూ 1,33,153 నమూనాలను పరీక్షించగా..3,823 మందికి వైరస్ నిర్దారణ అయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.అలాగే, మరో 1,784 మంది మహమ్మారి నుంచి కోలుకోగా... ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య4,41,73,335గా ఉంది. రికవరీల రేటు 98.72 శాతం కాగా.. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 18,369కి చేరింది.  అలాగే, రోజువారీ పాజిటివిటీ రేటు దాదాపు 3 శాతానికి చేరువ కాగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 2.24 శాతంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ఏడు నెలల తర్వాత అత్యధిక కేసులు నమోదయ్యాయి. మొత్తం 416 మంది కొత్తగా వైరస్ బారినపడ్డారు. ముందు రోజు 195 కేసులతో పోల్చితే ఇది 40 శాతం అధికం.  మరోవంక గతంతో పోలిస్తే ఈ ఫిబ్రవరిలో దేశ విద్యుత్ వినియోగం 10% పెరిగింది. రాబోయే వారాల్లో రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లను వరుసగా రెండో ఏడాది పూర్తిస్థాయిలో నడపాలని కేంద్రం ఆదేశించింది. ఇది భారత్‌లో ఇప్పటికే ఆకాశాన్నంటుతున్న గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను  పెంచుతుందని విశ్లేషకులు అంటున్నారు.ఇలా ఒకదాని వెంట ఒకటిగా గొలుసు కట్టు కష్టాలు క్యూ కట్టాయి.. డేంజర్ బెల్స్ ..మోగుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త.

ఐక్య పోరాటం కోసం షర్మిల పిలుపు!

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల తెలంగాణలో సుదీర్ఘంగా పాదయాత్ర నిర్వహించారు. ఒకటి రెండు సార్లు ఆమె అరెస్టు సందర్భంగా వినా ఆమె పాదయాత్రను పట్టించుకున్న వారు లేరు. ఆమె విమర్శలకు స్పందిచిన వారూ లేరు. అసలు షర్మిల తన తండ్రి వైఎస్సార్ పేరుమీద వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టినప్పటి నుంచే ఆమె రాజకీయాలపై పలువురు అనేకానేక అనుమానాలు వ్యక్తం చేశారు.  పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో తన సొంత అన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, ఆమె ఆ  రాష్ట్రం వదిలి తెలంగాణ రాజకీయాల్లో  వేలు పెట్టడం ఏమిటి? అన్న ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఆ సందర్భంగానే జగనన్న వదిలిన బాణాన్ని అంటూ తన అన్న జైలులో ఉన్న సమయంలో ఏపీ అంతా కాలికి బలపం కట్టుకుని నడిచిన షర్మిల ఇప్పడు  ఎవరు వదిలిన బాణం? అంటూ సందేహాలు సైతం వెల్లువెత్తాయి.  అయితే ఆమె తెలంగాణ అంతా కాలినడకన చుట్టేసిన తరువాత ఇక ఆ ప్రశ్న ఇప్పుడు అప్రస్తుతం. ఇప్పుడు అందరిలోనే ఒకే సందేహం వ్యక్తమౌతోంది. అసలు ఆమె రాజకీయ లక్ష్యం ఏమిటి?  ఆమె వాస్తవంగా ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు తెలంగాణ ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పిస్తున్నారు?  ఆమె వెంట ఉన్నది ఎవరు? వాస్తవానికి తెలంగాణలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీలను మించి ఆమె కేసీఆర్ పైనా, ఆయన కుటుంబ సభ్యులపైనా చాలా చాలా ధైర్యంగా విమర్శలు చేశారు.    అయినా ఆమె పాదయాత్రను పట్టించుకున్న వారు కానీ, ఆమెను, ఆమె పార్టీని ఒక రాజకీయ శక్తిగా గుర్తించిన వారు కానీ ఎవరూ లేకుండా పోయారు. ఈ నేపథ్యంలోనే ఆమె బీఆర్ఎస్ యేతర పార్టీలతో కలిసి ఉమ్మడి పోరాటానికి సమాయత్తమౌతున్నారు. అందుకే కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ లకు ఫోన్ చేసి మరీ టీపీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఐక్య పోరాటానికి పిలుపు నిచ్చారు. ప్రభుత్వ అవినీతిని ప్రజలలో ఎండట్టేందుకు ఐక్య పోరాటానికి కలిసి రావలసిందిగా కోరారు. అయితే షర్మిల వినతిని, ఆహ్వానాన్ని, పిలుపును కాంగ్రెస్, బీజేపీలు ఎలా స్వీకరిస్తారు. అంశాల వారీగా అయినా కలిసి పని చేయడానికి ముందుకు వచ్చే పరిస్థితి ఉంటుందా? అంటే పరిశీలకులు మాత్రం అలాంటి అవకాశమే లేదని విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలు రెండూ వేటికవిగా వచ్చే ఎన్నికలలో తెలంగాణలో అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు కదులుతున్న పార్టీలు. ఆ రెండు పార్టీలూ కూడా దేనికదిగా అధికారం టార్గెట్ గా బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజాక్షేత్రంలో ఉద్యామాలు నిర్మించి ముందుకు సాగాలన్న వ్యూహాలతో అడుగులు వేస్తున్నాయి. తమ పోరాటాలలో ఎవరినీ భాగస్వాములను చేసుకునేందుకు అవి పెద్దగా సుముఖత వ్యక్తం చేసే అవకాశం లేదు. అన్నిటికీ మించి షర్మిల కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, కుమార్తె కవితపై ఎంత ఘాటు విమర్శలు చేసినా ఆమె రాజకీయ లక్ష్యాలపై కాంగ్రెస్, బీజేపీలలో పలు అనుమానాలు ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేందుకు కేసీఆర్ స్పాన్సర్డ్ పార్టీగా ఇప్పటికీ కాంగ్రెస్, బీఆర్ఎస్ లు నమ్ముతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీలు షర్మిల పిలుపు మేరకు ఐక్య పోరాటానికి కలిసి వస్తాయా అంటే అనుమానమేనని పరిశీలకులు అంటున్నారు. 

బీఆర్ఎస్ తో పొత్తు కోసం కాంగ్రెస్ సీనియర్ల తహతహ!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఇంచార్జిగా మాణిక్‌రావు గోవిందరావు ఠాక్రే వచ్చిన తర్వాత. గాంధీ భవన్ వాతావరణంలో మార్పు వచ్చింది. కొంత ప్రశాంత వాతావరణం ఏర్పడింది. నాయకుల మధ్య విభేదాలు అలాగే  ఉన్నా.. ఎవరి దారిన వారు పాద యాత్రలు, ఇతర కార్యక్రమాలలో బిజీ అయి పోయారు. అయితే  అధికారం రుచి తెలిసిన సీనియర్ నాయకులు ముఖ్యంగా మొదటి నుంచి గులాబీ బాస్ తో ‘స్నేహ’ సంబంధాలున్నజానారెడ్డి వంటి పెద్దలు బీఅరేస్ తో పొత్తుకు తహతహ లాడిపోతున్నారు. పొత్తు విషయంలో కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే  పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం పొత్తుకు ససేమిరా ఒప్పుకోకోవడం లేదు. కానీ సీనియర్ నాయకులు మాత్రం పట్టువదలని విక్రమార్కుల్లా  బీఆర్ఎస్ తో పొత్తు విషయాన్ని సందర్భం వచ్చి నప్పుడల్లా తెరమీదకు తెచ్చి చర్చకు తెరలేపుతున్నారు. కొద్ది రోజుల క్రితం పార్టీ సీనియర్ నాయకుడు, భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పొత్తు పొడిచే  అవకాశం ఉందని అన్నారు.  బీజేపీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీ బీఅరేస్ తో పొత్తు పెట్టుకోక తప్పదని  హస్తిన  వేదికగా సంచలన ప్రకటన చేసి  హస్తం పార్టీలో సునామీ సృష్టించారు. అయితే ఆ తర్వాత  రాష్ట్ర ఇన్ చార్జి ఠాక్రే జోక్యం చేసుకుని ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు.   ఇప్పడు మళ్ళీ అదే విషయాన్ని మరో  సీనియర్ నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం పెద్దలు అంటూ  గౌరవంగా సంభోదించే మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి లేవనెత్తి  తేనె తుట్టెను కదిల్చారు. చాల కాలం తర్వాత మీడియా ముందుకొచ్చినఈ పెద్దాయన జానారెడ్డి బీజేపీని ఓడించేందుకు అవసరం అయితే కాంగ్రెస్  బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటుందని బాంబు పేల్చారు.  అంతేకాదు రాహుల్ గాంధీ అనర్హత విషయంలో బీఆర్ఎస్  బహిరంగంగా బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిందని సో ... శత్రువు, శత్రువు మిత్రుడు, థియరీ ప్రకారం కాంగ్రెస్  బీఆర్ఎస్ చేతులు కలపవచ్చని   వివరణ కూడా ఇచ్చారు.    నిజానికి వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ తో జట్టు కట్టేందుకు సిద్దంగా ఉందనే సంకేతాలు దండిగానే అందుతున్నాయి. ఇటీవల అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్, మరో  ‘ముఖ్య’ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీకి,  రాహుల్ గాంధీకి సానుకూలంగా మాట్లాడుతున్నారు.  అలాగే, ఢిల్లీ  మద్యం కుంభకోణంలో అనుమానితులుగా ఈడీ విచారణ ఎదుర్కుంటున్న ముఖ్యమంత్రి కేసీఅర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత  వివిధ టీవీ చానల్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలలో  బీజేపీ ని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ అహంకారాన్ని, పెద్దన్న దర్పాన్ని వదిలించుకుని కలిసొస్తే కాదనే దేముందంటూ వ్యాఖ్యలు చేశారు. నిజానికి  కాంగ్రెస్  అవసరం బీఆర్ఎస్ కు ఉంది.  బీఆర్ఎస్ అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది. సో రెండింటికీ  చేతులు కలిసే అవసరం, అవకాశం రెండూ ఉన్నాయన్నది పరిశీలకుల విశ్లేషణ. అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్‌తో కలిసే ప్రసక్తే లేదని చెబుతున్నారు. ఒంటరిగానే అధికారంలోకి వస్తామని అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇతర సీనియర్లు మాత్రం కారుతో షికారు కోరుకుంటున్నారు.  ఇది కాంగ్రెస్‌లో కొత్త అలజడికి కారణం అవుతోంది. ఎదుర్కోవాల్సిన పార్టీతో పొత్తులని ప్రచారం చేసుకుంటే మొదటికే మోసం వస్తుందని పరిశీలకులు అంటున్నారు. అయితే చివరకు ఏమవుతుంది? ఏం జరుగుతుంది.. అన్న ప్రశ్నకు మాత్రం వేచి చూడాల్సిందే అన్న సమాధానమే వస్తోంది. 

గజ్వేల్ లో బీఆర్ఎస్ కు ఎదురీతేనా?

మంది ఎక్కువైతే మజ్జిగ పలచబడుతుందన్న సామెత బీఆర్ఎస్ కు సరిగ్గా అతికినట్లుగా సరిపోతుంది. రాష్ట్రంలో ఎనిమిదేళ్లకు పైగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇందుకు కారణం అధినేత కేసీఆర్ రాష్ట్రంలో ప్రత్యర్థులే ఉండకూడదన్నట్లుగా ఆపరేషన్ ఆకర్ష్ పేరిటి ఇతర పార్టీల నుంచి గెలిచిన ప్రజాప్రతినిథులు సహా, కనిపించిన వారిని కనిపించినట్లుగా పార్టీలో చేర్చుకోవడమే. దీంతో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా నిండిపోయింది. ఆ కారణంగానే నియోజకవర్గానికి ఇద్దరు ముగ్గురు చొప్పున ప్రతి పదవికీ ఆశావహులు తయారయ్యారు. ఈ పరిస్థితే రానున్న అసెంబ్లీ ఎన్నికలలో అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీ అధినేతకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. చాలా నియోజకవర్గాలలో ఇతర పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్ గూటికి చేరిన సిట్టింగ్ కు ప్రత్యర్థిగా బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి పరాజయం పాలైన అభ్యర్థే ఉన్న పరిస్థితి ఉంది. అందుకే సిట్టింగులకే టికెట్లు అని ప్రకటించిన కేసీఆర్ పదే పదే ఆ ప్రకటనకు సవరణలు చేయాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఆ నియోజకవర్గం.. ఈ నియోజకవర్గం అని ఎందుకు స్వయంగా కేసీఆర్ స్వంత నియోజకవర్గంలోనే బీఆర్ఎస్ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది.    నియోజకవర్గంలో బీఆర్ఎస్ కీలక నేతలే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కేసీఆర్ తమకు గౌరవం ఇవ్వడం లేదన్న భావనతో రగలిపోతున్నారు నియోజకవర్గ నేతలకు సైతం కేసీఆర్ అప్పాయింట్ మెంట్ గగనం అయిన పరిస్థితి ఉందని అంటున్నారు.   పిలిచినప్పుడు మాత్రమే ప్రగతి భవన్ కు పోవాలి. వాళ్లు చెప్పిందే వినాలి. అభిప్రాయం, సమస్యలు చెప్పుకునే అవకాశమే ఉండదు.  ఈ కారణంగానే గజ్వే ల్ లో బీఆర్ఎస్ బలహీనపడింది.  వాస్తవానికి ముఖ్యమంత్రి సొంత  నియోజకవర్గం కనుక గజ్వల్ లోనే బీఆర్ఎస్ బలంగా ఉండాలి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఇక్కడ వచ్చే ఎన్నికలలో కేసీఆర్ రంగంలోకి దిగితే ఆయన కూడా గడ్డు  పరిస్థితి ఎదుర్కొనక తప్పని పరిస్థితి ఉందని ఆ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నేతలే అంటున్నారు. అందుకు కారణాలను కూడా వారే వివరిస్తున్నారు. సొంత నియోజకవర్గంలో విపక్షం అనేదే ఉండరాదన్న ఉద్దేశంతో కేసీఆర్ బెదిరించే, బుజ్జగించే బతిమాలో బామాలో ఇతర పార్టీలలోని నాయకులందరినీ బీఆర్ఎస్ లోకి లాగేశారు. వారి స్థాయి, బలం ఇలా బేరీజు వేసుకుని కొందరిని నామినేటెడ్ పదవులలో నియమిస్తే.. మరి కొందరికి ఇతరత్రా లబ్ధి చేకూర్చారు. మొత్తానికి గజ్వేల్ లో గులాబీ జెండా తప్ప మరోజెండా మోసే నాయకుడనే వారు లేకుండా చేయడంలో కేసీఆర్ కృతకృత్యులయ్యారు.   ఇప్పుడు ఆదే ఆయనకు పెద్ద తలనొప్పిగా మారిందని అంటున్నారు. గతంలో కేసీఆర్ మాయాజాలానికి లొంగిపోయి బీఆర్ఎస్ (అప్పుడు తెరాస) పంచన చేరిన ఇతర పార్టీల నేతలూ, మొదటి నుంచీ పార్టీలోనే ఉన్న వారూ కూడా తమకు తగిన గౌరవం, ప్రాధాన్యతా దక్కడం లేదన్న అసంతృప్తిలో ఉన్నారు.  గజ్వేల్ రాష్ట్రంలోని మిగిలిన అన్ని నియోజకవర్గాల కంటే స్పెషల్. ఇది ముఖ్యమంత్రి నియోజకవర్గం కావడంతో పథకాలన్నీ బ్రహ్మాండంగా అమలు అవుతాయి. అభివృద్ధికీ ఢోకా లేని పరిస్థితి. అయితే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే స్వయంగా ముఖ్యమంత్రి కావడంతో  ఇక్కడ ఆయన ప్రతినిథులుగా పెత్తనం చెలాయించేవారి సంఖ్యా, చెలాయిద్దామనుకునే వారి సంఖ్యా లేక్కకు మించే ఉంటుంది.  ఈ పరిస్థితి ఏర్పడడానికి కారణం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ గజ్వేల్ నాయకులను పూర్తిగా పక్కన పెట్టేశారు. గజ్వేల్ లో చిన్న పని జరగాలన్నా, నియోజకవర్గానికి సంబంధించి ఏ పనిగురించి మాట్లాడాలన్నా ఎవరి దగ్గరకు వెళ్లాలన్నది ఎవరికీ తెలియని పరిస్థితి.  సీఎం సెక్రటేరియెట్ ను ఎలా మరిచిపోయారో.. అలాగే గజ్వేల్ ను కూడా అలాగే మరిచిపోయారని నియోజకవర్గ ప్రజలే సెటైర్లు వేస్తున్న పరిస్థితి. ఆయన హైదరాబాద్ లో కంటే ఎక్కువగా నియోజకవర్గ పరిథిలోని ఫామ్ హౌస్ లోనే ఎక్కువ సమయం ఉంటారు. అయినా నియోజకవర్గ ప్రజలకు కానీ, నాయకులకు కానీ ఆయన దర్శన భాగ్యం ఉండదు. సొంత పార్టీ నేతలకు అదీ గజ్వేల్ నియోజకవర్గ నేతలకు ఆయన అప్పాయింట్ మెంట్ దొరకడం దాదాపు దుర్లభమే అని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.    గజ్వేల్‌లో సుమారు రూ.3 కోట్లతో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు నిర్మించారు. అయినా ఇప్పటి వరకూ కేసీఆర్ ఆ క్యాంప్ ఆఫీసుకు వచ్చిన దాఖలాలు లేవు. ఎప్పుడో . 2018 అసెంబ్లీ ఎన్నికలకు ఒకటి రెండు సార్లు  కేసీఆర్ గజ్వేల్ క్యాంపు ఆఫీసుకు వచ్చి ఉంటారు. ఆ తరువాత అటువైపు కన్నెత్తి చూడలేదు. ఈ కారణంగానే గజ్వేల్ లో పార్టీ నాయకులు  పార్టీ వ్యవహారాలను పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి తమ నియోజకవర్గ ఎమ్మెల్యే అన్న విషయాన్ని జనం మరిచిపోయే పరిస్థితి ఉంది.

కేవీపీ ఓపెన్ అయిపోతున్నారా?

కేవీపీ రామచంద్రరావు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ బంధువు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన నేత. వైఎస్సార్ రాజకీయ ప్రస్థానంలో సలహాదారుడిగా, సహచరుడిగా, సన్నిహితుడుగా, స్నేహితుడిగా  ఆయన వెంట నడిచారు. ముఖ్యమంత్రిగా వైఎస్సార్ తీసుకున్న ప్రతి నిర్ణయంలోనూ  కేవీపీ పాత్ర ఉందని చెబుతారు. కాంగ్రెస్ పార్టీలోనూ ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పారు కేవీపీ. ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అటు ప్రభుత్వం, ఇటు పాలనలో నెంబర్ టు స్థానం కేవీపీదే.  వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన కేవీపీ..  వైఎస్సార్ మరణం తర్వాత తొలినాళ్లలో జగన్ కు మద్దతుగా నిలిచారు. అయితే అది కొద్ది రోజులే.  జగన్ స్థాపించినా  కేవీపీ మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగారు. ఇద్దరి మధ్య తీవ్రమైన విభేదాలు వచ్చాయనే ప్రచారం అప్పట్లో జరిగింది.  అయితే ఒక విషయం మాత్రం అంగీకరించి తీరాలి. జగన్ తో పాటు ఆయన వైసీపీలోకి రాలేదు. విభేదాలున్నాయన్న ప్రచారాన్నీ ఖండించలేదు. అయితే పై మాత్రం చిన్న పాటి విమర్శ కూడా చేయలేదు. ఆయన విభజిత ఆంధ్రప్రదేశ్ లో విపక్ష నేతగా ఉన్న సమయంలోనూ, అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా పాలన సాగిస్తున్న ఈ నాలుగేళ్లలోనూ కేవీపీ జగన్ పై విమర్శ చేసిన దాఖలాలు లేవు. స్నేహితుడి కుమారుడిగా జగన్ ను ఆయన అభిమానిస్తూనే వచ్చారు.  వైఎస్సార్ ఆత్మ బంధువుగా చిన్నప్పటి నుంచి జగన్ ను దగ్గరగా చూశారు కేవీపీ. అందుకే జగన్ వ్యవహార శైలీ, ఆయన నైజం గురించి కేవీపీకి తెలిసినంతగా మరొకరికి తెలియదంటారు.   అలాంటి కేవీపీ ఇటీవల జగన్ కు వ్యతిరేకంగా ఓపెన్ అవుతున్నారు. ఇటీవల కొంత కాలం కిందట జగన్ పాలన బాగాలేదని సుతిమెత్తగా చెప్పిన కేవీపీ.. తాజాగా జగన్ తో తన విభేదాల గురించి వివరంగా త్వరలో చెబుతానని అన్నారు. వాస్తవానికి జగన్ పట్ల తన అసంతృప్తి విషయంలో కేవీపీ గత ఏడాది డిసెంబర్ లోనే కొద్దిగా ఓపెన్ అయ్యారు. జగన్ విషయంలో కేవీపీ ఏం చెప్పినా దానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే జగన్ తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి కేవీపీ ఆత్మ బంధువు. వైఎస్ ఆత్మ కేవీపీ అంటారు. అంతగా వారి మధ్య సాన్నిహిత్యం ఉండేది. అటువంటి కేవీపీ జగన్ పాలన బాగాలేదని వ్యాఖ్యానించారు. అదీ జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మూడున్నరేళ్ల తరువాత గత ఏడాది డిసెంబర్ లో తొలి సారిగా కేవీపీ..  పోలవరం, విభజన హామీలు, ప్రత్యేక హోదా ఇలా ఏ విషయంలోనూ జగన్ సర్కార్ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం సంగతి అటుంచి కనీసం విజ్ణప్తి కూడా చేయకపోవడాన్ని  తప్పుపట్టారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు కేంద్రం సిద్ధపడుతున్న సమయంలో దానిని ఆపేందుకు సీఎం జగన్ ఒక్క ప్రయత్నం కూడా చేయడం లేదని కేవీపీ  విమర్శించారు. ఎప్పుడో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆ కార్యక్రమానికి హాజరైన కేవీపీ ఆ తరువాత ఎన్నడూ జగన్ ను కలిసింది లేదు. అలా అని జగన్ పాలనపై విమర్శించిందీ లేదు. కానీ దూరం మాత్రం మెయిన్ టైన్ చేశారు. ఒక్క కేవీపీ అనే కాదు...  అధికారం చేపట్టిన తరువాత ఒక్కరొక్కరుగా వైఎస్ సన్నిహితులు, చివరికి కుటుంబ సభ్యులు కూడా జగన్ కు దూరం అవుతూనే వచ్చారు. అందుకు కేవీపీ మినహాయింపు కాదు. జగన్ కు దూరం అయిన వారంతా ఆఖరికి సొంత చెల్లెలు షర్మిల సహా అందరూ ఆయపై విమర్శలు గుప్పించారు. కానీ కేవీపీ మాత్రం ఇప్పటి వరకూ పన్నెత్తు మాట అనలేదు. కానీ మూడున్నరేళ్ల తరువాత గత డిసెంబర్ లో ఆయన పాలన పట్ల తన అసంతృప్తిని సున్నితంగా వ్యక్తం చేశారు. ఆయన ఆ మాత్రం విమర్శ చేయడమే అప్పట్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.   అదలా ఉంటే తాజాగా  ఆయన త్వరలో ఓ ప్రెస్ మీట్ పెడతానని ప్రకటించారు. అంతే కాదు తాను జగన్ కు ఎందుకు దూరంగా ఉన్నానన్న సంగతిని వెల్లడించడానికే ఆ ప్రెస్ మీట్ అని కూడా కేవీపీ చెప్పారు.  గత ఏడాది డిసెంబర్ లో జగన్ పాలనా తీరును సున్నితంగా విమర్శించి, కేంద్రానికి తలొగ్గి ఏపీకి అన్యాయం చేయవద్దని సలహా ఇచ్చి ఊరుకున్న కేవీపీ ఇప్పుడు జగన్ గురించి చెప్పేందుకే ప్రత్యేకంగా మీడియా సమావేశం పెడతానని ప్రకటించడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన వెల్లడించబోయే విషయాలన్నీ జగన్ కు నష్టం చేకూర్చేవిగానే ఉంటాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మూడు నాలుగు నెలల కిందట జగన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసి ఊరుకున్న కేవీపీ ఇప్పుడు ఒక జగన్ పాలనా వైఫల్యాలూ, ఆర్థిక అవకతవకలపై గళం విప్పేఅవకాశం ఉందనిఅంటున్నారు. 

వైసీపీ బీజేపీ బంధం తెగిపోతుందా?

ఏపీలో బీజేపీ వైసీపీ సంబంధాలు ఇప్పటి వరకూ ఒక లెక్క ఇక ముందు ఒక లెక్క అన్నట్లుగా మారిపోబోతున్నాయా?  బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌పై వైసీపీ శ్రేణుల దాడిపై కమలం పార్టీ అధ్యక్షుడు నడ్డా తీవ్రంగా స్పందించడాన్ని బట్టి చూస్తే ఔననే సమాధానమే పరిశీలకుల నుంచి వస్తోంది. అమరావతి రైతులకు మద్దతు పలికిన బీజేపీ జాతీయ కార్యదర్శిపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడడాన్ని  బీజేపీ జాతీయ నాయకత్వం తీవ్రంగా పరిగణిస్తోందని ఆ పార్టీ జాతీయ నాయకత్వం స్పందించిన తీరు తేటతెల్లం చేస్తోందిఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అధ్యక్షుడు జెపి నడ్డా దాడికి గురైన జాతీయ కార్యదర్శి సత్యకు ఫోన్ చేసి, దాడి వివరాలు తెలుసుకున్నారు.. ఆ సందర్భంలో సత్యకుమార్ ఇచ్చిన వివరణ విన్న నడ్డా వైసీపీ అగ్రనాయకత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.   ఏ అమరావతి అంశంపై అయితే సత్యకుమార్‌పై దాడి జరిగిందో, అదే అమరావతి అంశంపై వెనక్కి తగ్గకుండా, ముందుకు వెళ్లాలని నడ్డా ఈ సందర్భంగా ఏపీ బీజేపీ నాయకత్వాన్ని ఆదేశించారని చెబుతున్నారు.  అలాగే రాష్ట్రంలో వైసీపీ పాలనా వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు ఏపీ బీజేపీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.   అమరావతి రైతుల పోరాటానికి  సంఘీభావం ప్రకటించి తిరిగి వస్తున్న బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌పై  వైసీపీ కార్యకర్తలు శుక్రవారం జరిపిన దాడిని బీజేపీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది.  బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అనుచరులు ఆయన కారును ధ్వంసం చేయడంతో పాటు,   బీజేపీ కి చెందిన దళిత, బీసీ నేతలపై దాడికి పాల్పడడానికి సంబంధించిన  వీడియోలను ఇక్కడి నేతలు ఢిల్లీ నాయకత్వానికి పంపించారు.   టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేనాని  పవన్ కల్యాణ్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ ఎంపీ సీఎం రమేష్, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు, కేంద్రమాజీ మంత్రి సుజనా చౌదరి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీడీపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట కార్యదర్శి నాగోతు రమేష్‌నాయుడు తదితరులు సత్యకుమార్‌పై వైసీపీ కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండించారు. ఆ వెంటనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రంగంలోకి దిగారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో ఉన్న సత్యకుమార్ కు స్వయంగా ఫోన్ చేసి దాడి వివరాలను తెలుసుకున్నారు.  పోలీసుల సమక్షంలోనే తమపై దాడి జరిగిందని, తమను ముందుకు వెళ్లకుండా నిలువరించిన పోలీసులు.. వైసీపీ కార్యకర్తలు తమపై దాడి చేస్తుంటే  ప్రేక్షకపాత్ర పోషించారని  ఆయన నడ్డాకు వివరించారు. తమతో పాటు ఉన్న కొందరికి గాయాలయ్యాయని చెప్పారు. ఇదంతా పథకం ప్రకారం జరిగిన దాడిగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.  వైసీపీ ఎంపీ అనుచరులే ఈ దాడికి పాల్పడ్డారని సత్యకుమార్ నడ్డాకు వివరించినట్లు పార్టీ శ్రేణులు చెప్పాయి.  దీంతో నడ్డా ఈ దాడిని తాము చాలా సీరియస్ గా తీసుకుంటామని, మీకు పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని సత్యకుమార్ కు చెప్పారు. ఎవరికీ భయపడాల్సిన పని లేదనీ,  పార్టీ నేతలను ఎలా కాపాడుకోవాలో తనకు తెలుసని నడ్డా వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు.  పార్టీ లైన్‌లో దూకుడుగా ముందుకు సాగాలని చెప్పారని, అమరావతి రైతులకు మద్దతునిచ్చిన క్రమంలోనే ఇదంతా జరిగినందున… అదే అమరావతి అంశంపై, ఇక నుంచి సీరియస్‌గా ముందుకు వెళ్లాలని ఆదేశించినట్లు పార్టీ శ్రేణుల సమాచారం. ఇక వైసీపీ ప్రభుత్వంపై పోరాటాన్ని సీరియస్‌గా ముందుకు తీసుకువెళ్లాలని నడ్డా ఆదేశించారు. ఆ తరువాత నడ్డా బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు కూడా ఫోన్ చేశారు.  దాడిపై పార్టీ రాష్ట్ర శాఖ   తీసుకుంటున్న చర్యలపై వివరణ కోరారు. దాడిని   ఖండించామని వీర్రాజు  ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందని ఆయన  శనివారం ( ఏప్రిల్1)  రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు.  దీంతో సోము వీర్రాజు ఆఘమేఘాల మీద పార్టీ జిల్లా నేతలతో   టెలీకాన్ఫరెన్స్ ఏర్పాటుచేసి శనివారం ( ఏప్రిల్ 1) రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. అదలా ఉండగా మరోవైపు జాతీయ కార్పొరేషన్ చైర్మన్ జయప్రకాష్ ఆధ్వర్యంలో.. బీజేపీ నేతలు గుంటూరు రేంజ్ ఐజీని కలిసి, జరిగిన దాడిపై నిరసన వ్యక్తం చేశారు. సత్యకుమార్ వాహనాన్ని ధ్వంసం చేసి, దాడి చేసిన వారిని శిక్షించడంతోపాటు, హత్యాయత్నం కేసు నమోదు చేయాలని జయప్రకాష్ డిమాండ్ చేశారు. ఇదంతా పథకం ప్రకారమే జరిగిందని ఆరోపిస్తూ వినతిపత్రం సమర్పించారు.

ఏపీలో వైసీపీ బీ టీమ్ బీజేపీ!

అబద్ధం చెప్పినా అతికినట్లు ఉండాలి.. కానీ, ఏపీ బీజేపీ నాయకులు నిజంగా నిజమే చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అందుకే, ఏపీలో బీజేపీ  ఎదుగు బొదుగు లేకుండా మిగిలి పోయింది. అందుకే బీజేపీ అంటే వైసీపే బీ టీమ్ అనే ముద్ర పడిపోయింది. ప్రత్యేక హోదా మొదలు ప్రతి విషయంలోనూ రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీ  ఇప్పుడు రాజకీయంగానూ రాష్ట్రంలో ప్రజాబీష్టానికి వ్యతిరేకంగా పనిచేస్తోంది. అరాచక పాలనతో రాష్ట్రాన్ని అప్పుల పలు చేసిన వైసీపీతో, చాటుమాటుగా చెట్టాపట్టాలు వేసుకుని నడిచేందుకు సిద్దమైపోయిందని సామాన్య ప్రజలు మొదలు మేథావుల వరకు అందరికీ స్పష్టమై పోయింది.  వైసీసీ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థతి అగమ్య గోచరంగా మారింది. అప్పులు తప్ప ఆస్తులు లేని పరిస్థితికి చేరిపోయింది. ఆ విషయం కేంద్రానికీ తెలుసు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా ఆ విషయం చెప్పారు. అయినా, చర్యలు లేవు.  అంతే కాదు  ఎవరో అన్నట్లుగా  కేంద్ర ప్రభుత్వం ఏపీ ముఖ్యమంత్రిని దత్త పుత్రుడిగా కాదు  ఏకంగా కన్నకొడుకుతో సమానంగా చూసుకుంటోంది. అందుకే బీజేపీ అంటే నైసీపీ బీ-టీమ్ అనే అభిప్రాయం బలపడిపోయింది.    మరోవంక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్రం చేతిలో కీలుబొమ్మ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని, సామాన్య ప్రజలకు కూడా అర్థమై పోయింది. అందుకే గడచిన నాలుగు సంవత్సరాలో ప్రధాని మోడీని, హోం మంత్రి అమిత్ షాను కాదు, కేంద్ర ప్రభుత్వంలో ఏ ఒక్కరినీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పల్లెత్తు మాట అనలేదు. అలాగని, పొరుగు రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ముఖ్య నేత కేటీఆర్ స్థాయిలో రోజూ కేంద్ర ప్రభుత్వాన్ని,అయిన దానికి కానీ దానికీ విమర్శించాలని కాదు. కానీ విభజన హామీలు, రాష్ట్రానికి రావలసిన నిధుల విషయంలో అయినా కేంద్రాన్ని ప్రశ్నించాలి కదా? కనీసం అడగాలి కదా? అని ప్రజలు జగన్ సర్కార్ ను నిలదీస్తున్నారు. అందుకే, ప్రజలు, వైసీపీ, బీజేపీ సంబంధాలను అనుమానిస్తున్నారు. అనుమానించడం..కాదు, నువ్వొకందుకు పోస్తే నేనోకందుకు తాగుతున్నాను అన్నట్ల్గు ఆ రెండు పార్టీల మధ్యా చీకటి ఒప్పందం కుదిరిందని అంటున్నారు. అందుకే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తరచూ ఢిల్లీ వెళ్లి, ఆ ఇద్దరితో చర్చలు జరుపుతున్నారని అంటున్నారు.  వైసీపీ  ప్రభుత్వ వ్యతిరేక ఓటును సాధ్యమైన మేరకు చీల్చి, పరోక్షంగా వైసీపీని గెలిపించేందుకు, ఢిల్లీ స్థాయిలో కుట్రలు జరుగుతున్నాయని పరిశీలకులు అంటున్నారు.  అయితే రాష్ట్ర బీజేపే నాయకులు మాత్ర్రం అబ్బే అదేం లేదు. వైసీపీతో బీజేపీ ఎలాంటి సంబంధాలు లేవని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. పక్షం రోజుల్లో ముఖ్యమంత్రి రెండు మార్లు ఢిల్లీ ఎందుకు వెళ్ళారో, ఎవరికీ తెలియదని అనుకున్నా, అందరికీ తెలిసి పోయింది. ఇంతవకు గుప్పెట్లో ఉన్న రహస్యం, ఇప్పడు బట్టబయలై పోయింది. అయినా  బీజేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి  ముఖ్యమంత్రి హోదాలో మాత్రమే జగన్‌కు ఢిల్లీలో అపాయింట్మెంట్‌లు లభిస్తున్నాయని నమ్మించే ప్రయత్నం చేశారు. జగన్‌తో కానీ, ఆయన పార్టీతో కానీ బీజేపీకి స్నేహ సంబంధాలు లేవన్నారు. బీజేపీ, వైఎస్సార్ పార్టీల మధ్య సంబంధాలు కేవలం కేంద్ర - రాష్ట్రాల మధ్య ఉన్న సంబంధాలు మాత్రమే అని చెప్పారు.అందుకోసం  ఆయన  ఏపీ పరిస్థితి చూస్తుంటే బాధగా ఉందని అన్నారు. ఒకప్పుడు రాష్ట్ర్రానికి దేశంలోనే అన్నపూర్ణగా మంచి పేరుందని, కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయన్నారు. ఏపీలో ఆర్ధిక ఎమెర్జెన్సీ వచ్చే అవకాశం ఉందన్నారు.  ఆది నిజమే అయినా  రాష్ట్రంలో ఇప్పడు కాదు, ఎప్పటి నుంచో ఆర్థిక ఎమర్జెన్సీ విధవలసిన పరిస్థితులు ఉన్నాయని, అయినా  కేంద్ర ప్రభుత్వం, అర్హతకు మించి అప్పులు చేసేందుకు రాష్ట్ర  ప్రభుత్వానికి అనుమతులు ఇచ్చి రాష్ట్రాన్ని ఈ స్థితికి దిగజార్చడంలో కేంద్రం పాత్ర కూడా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.నిజానికి, ఇంతకాలం ప్రత్యర్ధి పార్టీలుగా నటిస్తూ వచ్చిన వైసీపీ, బీజేపీ అసలు బంధం ఇప్పడు బయట పడిందని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి బీజేపీ మద్దతు ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుంది. అందుకు ప్రతిఫలంగా లోక సభ ఎన్నికల్లో బీజేపీకి వైసీపీ మద్దతిస్తుంది. ఇదే స్టొరీ . అన్నీ అనుకున్నట్లు జరిగితే, లోక్ సభ ఎన్నికల నాటికి వైసేపీ, బీజేపీ ప్రత్యక్ష పొత్తు పెట్టుకున్నా ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు.అందుకే, ముందస్తు అసెంబ్లీ ఎన్నికల ఆలోచన తెరమీదకు తెచ్చినట్లు తెలుస్తోంది. అక్టోబర్ నవంబర్ నెలలలో తెలంగాణ శాసన సభ ఎన్నికలతో పాటుగా  ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే విధంగా ఢిల్లీలో స్కెచ్ సిద్దమైందని  అంటున్నారు .

ముందస్తు మత్తులో నాడు బాబు.. నేడు జగన్

మరో సారి అధికారానికి ముందస్తు అడ్డదారిగా ఎంచుకుని భంగపాటుకు గురైన ముఖ్యమంత్రుల సంఖ్య తక్కువ ఏమీ కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాగే ముందస్తుకు వెళ్లి అధికారాన్ని నిర్దిష్ట గడువు కంటే ముందే చేజార్చుకున్నారు. ఇప్పుడు జగన్ కూడా అదే దారిలో ప్రయాణిస్తున్నారు. అప్పుడూ ఇప్పుడూ కూడా ఇద్దరూ తమ పాలనపై ప్రజా వ్యతిరేకతను పసిగట్టే అది మరింత పెరిగి మొదటికే మోసం రాకుండా జగ్రత్త పడే యోచనతోనూ ముందస్తుకు సిద్ధపడ్డారని చెప్పాలి.   ఏపీ ఆవిర్భావం నుంచి 1978 వరకు షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరిగాయి. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తరువాత అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం తొలిసారిగా ముందస్తుకు వెళ్లింది. షెడ్యూల్‌ ప్రకారం 1983 ఆగస్టులో ఎన్నికలు జరగాల్సి ఉన్నా 1982లో నిర్వహించారు. అప్పటి సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి హైకమాండ్‌ అనుమతితో ఎన్నికలను ముందుకు జరిపారు. తెలుగుదేశం పార్టీ ప్రభంజనం ముందు కాంగ్రెస్‌ చిత్తు చిత్తుగా ఓడిపోయింది.  202 స్థానాలు సాధించడంతో ఎన్టీఆర్‌ సీఎం అయ్యారు. ఇందిరాగాంధీ హత్యతో సానుభూతి వెల్లువెత్తుతుందని సందేహాలున్నా ఎన్టీఆర్ ముందస్తుకు వెళ్లి ఘన విజయం సాధించారు.   తర్వాత 1990 మార్చిలో అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ ఎన్టీఆర్‌ ఎన్నికలను నాలుగునెలల ముందుకు జరిపారు. అప్పుడు ఎన్టీఆర్ కు ఆ ముందస్తు కలిసి రాలేదు. ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది.  ఘన విజయం సాధించిన కాంగ్రెస్ మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో  ప్రభుత్వం ఏర్పాటైంది. 1994లో షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరిగాయి. తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. అయితే ఆగస్టు సంక్షోభంలో ఎన్టీఆర్ స్థానంలో చంద్రబాబు అధికార పగ్గాలు అందుకున్నారు. ఆ తరువాత 1999లో డిసెంబర్లో జరగాల్సిన ఎన్నికలు రెండు నెలల ముందు నిర్వహించడంతో తెలుగుదేశం విజయఢంగా మోగించింది. ఆ తరువాత 2004 వరకూ గడవు ఉన్నప్పటికీ చంద్రబాబు ముందస్తుకు మొగ్గు చూపారు. 2003 నవంబర్ లోనే అసెంబ్లీని రద్దు చేశారు. వరుస సంవత్సరాలు వర్షాభావంతో పంటలు పండక రైతులు ఇబ్బందులు పడటం, వరుసగా రెండు సార్లు అధికారంలో ఉండటం వంటి కారణాలతో  ప్రభుత్వ వ్యతిరేకత (యాంటీ ఇన్ కంబెన్సీ) పెరగడంతో అది పెరగకుండా ముందుగానే ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు బావించారు. అలాగే మావోయిస్టుల దాడి తరువాత వచ్చిన సానుభూతి ఆశలు కూడా ఎన్నికలలో లబ్ధి చేకూరుతుందన్నభావనతో అప్పట్లో చంద్రబాబు ముందస్తుకు మొగ్గు చూపారు.  అయితే ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది.  వైఎస్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ విజయం సాధించింది.  ఇప్పుడు వైసీసీ అధినేత, సీఎం జగన్ కూడా అధికారం చేజిక్కించుకున్న నాలుగేళ్లలోనే ప్రజా వ్యతిరేకత తీవ్రం అవ్వడాన్ని గమనించి.. తన ఫ్లాగ్ మార్క్ నగదు పందేరం పథకాలు కొనసాగుతున్న సమయంలోనే ముందస్తుకు వెళ్లి మంచి ఫలితం పొందాలన్న ఉద్దేశంతో ముందస్తుకు మొగ్గు చూపుతున్నారు. 2003లో చంద్రబాబు తన ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తుకు వెళ్లడానికి ముందు రాష్ట్ర వ్యాప్తంగా అప్పటి విపక్ష నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రతో ప్రజలలో ఆయన పట్ల, కాంగ్రెస్ పట్ల సానుకూలత వ్యక్తం అవ్వడం కూడా అప్పట్లో తెలుగుదేశం పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటిగా చెప్పొచ్చు. ఇప్పుడు జగన్ విషయంలో కూడా అవే పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వంపై వ్యక్తమౌతున్న తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు, తెలుగుదేశం యువనేత లోకేష్ పాదయాత్ర కూడా ప్రజలలో ప్రభంజనం సృష్టిస్తోంది. పాయదాత్రలో ఆయనకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. అంతటా సానుకూలత వ్యక్తమౌతోంది. ఈ నేపథ్యంలో జగన్ ముందస్తుకు వెడితే ముందస్తుగా అధికారం చేజారే అవకాశాలే మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

సర్కార్ వ్యతిరేక ఓటు చీలదుగాక చీలదు.. జనసేనాని పునరుద్ఘాటన

ఓ వంక  ఏపీలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు వినిపిస్తున్న వేళ.. అధికార వైసీపీని ఓటమి భయం వెంటాడుతోంది. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి కారణంగా అనివార్యంగా ముందస్తు ఎన్నికలకు సిద్దమవుతున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని  ఇప్పటికే  ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమి కుంగదీసింది. మరో వంక, తెలుగు దేశం,జనసేన పొత్తు భయపెడుతోంది. అందుకే, ఏదో విధంగా ఇంచుమించుగా ఖరారైన టీడీపీ, జనసేన పొత్తును తుంచేందుకు విశ్వ ప్రయత్నాలు సాగిస్తున్నారు. అందుకోసం  ఓ వంక ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్న జగన్ రెడ్డి, మరోవంక జనసేన, టీడీపీ క్యాడర్ ను కన్ఫ్యూజ్ చేసేందుకు,వదంతులు పుట్టిస్తున్నారు. అబద్ధాల హరిశ్చంద్రులు అనదగ్గ, మంత్రులు, మాజీ మంత్రులను వదిలి, టీడీపీ, జనసేన నాయకుల మధ్య విబేధాలు సృష్టించేందుకు విఫల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపద్యంలో  జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మరోమారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదని, స్పష్టం చేశారు. అలాగే వైసీపీ ట్రాప్‌లో పడొద్దని జనసైనికుల్ని అప్రమత్తం చేశారు. పొత్తుల విషయంలో జనసైనికులు డైవర్ట్ కావొద్దని.. సోషల్ మీడియాతో పాటూ బయట జరుగుతున్న అసత్య  ప్రచారాన్ని నమ్మొద్దని అన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే, జనసేన లక్షమని అందుకోసం  ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేలా పొత్తులు ఉంటాయని మరోమారు విస్పష్టంగా చెప్పారు. నిజానికి గతంలో పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలినవ్వం అని చెప్పారు. అందుకే వైఎస్సార్‌సీపీ మైండ్ గేమ్ ఆడుతోందన్నారు. సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా జనసేన పార్టీతో పాటు విపక్ష నేతల పేర్లతో తప్పుడు ప్రకటనలతో గందరగోళం మొదలైందని. ఇదంతా వైసీపీ పొలిటికల్ గేమ్ గా పరిశీలకులు భావిస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్  సోషల్ మీడియాలో వచ్చే దుష్ప్రచారాన్ని నమ్మొద్దని.. తప్పుడు ప్రకటనలు, సమాచారం విషయంలో జాగ్రత్తగా ఉండాలని జనసైనికులకు సూచించారని అంటున్నారు. కాగా, పవన్ కళ్యాణ్ రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే వచ్చే  ఎన్నికల్లో నిర్ణయాలు తీసుకుంటారని.. అందుకు తగ్గట్లే వ్యూహాలను రూపొందిస్తారని పార్టీ నాయకులు అంటున్నారు.   పొత్తులపై ఆయా రాజకీయ వేదికలపై చర్చించి నిర్ణయం ఉంటుంది అంటున్నారు. దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చేయాలని వైఎస్సార్‌సీపీ సవాల్ చేస్తోంది. జనసే పార్టీ కూడా అదే రేంజ్‌లో వారికి కౌంటర్ ఇస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా వైఎస్సార్‌సీపీ ఏం జరిగితే బాగుంటుందని కోరుకుంటున్నారో అది తనుకు తెలుసు అని వ్యాఖ్యానించారు. కానీ వారు వద్దనుకుంటున్నదే జరుగుతుందని,  వైసీపీ వ్యతిరేక ఓటు వృథా కానివ్వనీ ఇవటీవల జరిగిన ఆవిర్భావ సభలో మరోసారి తేల్చి చెప్పారు. రాష్ట్రం కోసం మంచి నిర్ణయం తీసుకుంటాననీ.. జనసైనికులు తనను నమ్మాలన్నారు. మచిలీపట్నం సభలోనే అన్ని అంశాలపై దాదాపు క్లారిటీ ఇచ్చారు. అయితే కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో జనసేన పేరుతో ఓ ప్రచారం జరుగుతోంది. టీడీపీ, జనసేనల మధ్య పొత్తుపై రెచ్చగొట్టేలా నాయకులు చేయని వ్యాఖ్యలు చేసినట్లుగా బాగా రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. రెండు పార్టీల మధ్య పొత్తు లేదని.. జనసేనకు ఇచ్చే సీట్లు ఇవేనంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. అచ్చెన్నాయుడు, నాగబాబు మధ్య వార్ నడుస్తోందని కొన్ని ఛానల్స్ పేరుతో హడావిడి చేస్తున్నారు. ఈ ప్రకటనలు నిజమని కొందరు జనసైనికులు భావిస్తున్నారు. దీంతో క్లారిటీ ఇవ్వాల్సి వచ్చిందని జనసేన పార్టీ స్పష్టం చేసింది

ఐపీఎల్ సీజన్ 16.. తొలి మ్యాచ్ లో చెన్నైపై గుజరాత్ విజయం

ఐపీఎల్ సీజన్ 16లో తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగింది. ఈ ఐపీఎల్ సీజన్ కు ఈ మ్యాచ్ సరైన ఆరంభాన్ని ఇచ్చింది. అత్యంత ఉత్కంఠభరితంగా చివరి ఓవర్ వరకూ సాగిన తొలి మ్యాచ్‌లో చెన్నైపై గుజరాత్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. చెన్నై బ్యాటర్లలో రుతురాజ్ గైక్వాడ్ ఆకాశమే హద్దుగా చెలరేగి 92 పరుగులు చేశారు. ఇక 179 పరుగుల విజయ లక్ష్యాన్ని గుజరాత్ మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఐదు వికెట్లు కోల్పోయి  ఛేదించి ఈ సీజన్ లో తొలి విజయాన్ని అందుకుంది.  గిల్  63  పరుగుల చేశాడు.  విజయ్ శంకర్  27 పరుగులతో రాణించాడు.   చివరి ఓవర్‌లో విజయానికి ఎనిమిది పరుగులు చేయాల్సి ఉండగా.. తైవాటియా వరుసగా సిక్స్, ఫోర్ బాది జట్టును గెలిపించాడు.  

హోదా కోసం కాలర్ పట్టుకుంటానని.. కేసుల కోసం కాళ్లు పట్టుకుంటున్నారు..రఘురామరాజు

అందితే జుట్టు అందకపోతే కాళ్లు అన్న సామెత సరిగ్గా అతికినట్లు సరిపోతుంది. త్యేక హోదా సాధన కోసం కేంద్ర ప్రభుత్వ కాలర్ పట్టుకుని నిలదీస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు కేసుల నుంచి బయటపడేయమంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాళ్లు పట్టుకుంటున్నారు. అర్థరాత్రి భేటీలలో చీకటి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఈ మాటలు ఎవరో కాదు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు సీఎం జగన్ను ఉద్దేశించి అన్నారు. శుక్రవారం (మార్చి 31) రచ్చబండలో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆయన జగన్ పై సెటైర్లు వేశారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉత్తరకుమారుడిగా అభివర్ణించిన జగన్ ఇప్పుడు తాను స్వయంగా  ఉత్త కుమారుడిగా మిగిలిపోయారని అన్నారు. ప్రత్యేక హోదా గురించి ఈ నాలుగేళ్లలో పార్లమెంట్లో తమ పార్టీ ఎంపీలు ఏనాడూ గళమెత్తలేదన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం , రైల్వే జోన్ సాధన కోసం ఏనాడు ఆందోళన నిర్వహించని వారు, తనని అనర్హుడిగా ప్రకటించాలని మాత్రం పార్లమెంట్లో ప్ల కార్డులు పట్టుకొని ప్రదర్శన నిర్వహించారని ఎద్దేవా చేశారు.  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో అర్ధరాత్రి చేసిన మంతనాలు రాష్ట్రం గురించే అంటే జనం నమ్మరన్నారు.   జగన్ అమిత్ షాతో భేటీ అయిన రోజే  సుప్రీం కోర్టు తీర్పు ద్వారా కాసింత వెసులుబాటు లభించింది. అయితే  15 రోజుల వ్యవధిలో అడిషనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నట్టు సిబిఐ పేర్కొంది. అడిషనల్ చార్జ్ షీట్ దాఖలు చేసేటప్పుడు, అడిషనల్ అరెస్టులు కూడా ఉంటాయి. ఆ అడిషనల్ అరెస్టులు ఏమిటో ఇప్పటికే సిబిఐ అధికారులు కోర్టుకు తెలియజేశారు. ఇప్పుడు ఆ పేర్ల గురించి చర్చ ఎందుకని రఘురామ నర్మగర్భంగా అన్నారు.  అంత హడావుడిగా పది హేను రోజుల వ్యవధిలో హస్తిన వెళ్లిన ప్రధాని ప్రధాని అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదన్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన సందర్భంగా 16వ తేదీన హైకోర్టులో తీర్పు వెలువడడం, మళ్లీ ఆయన ఢిల్లీ పర్యటన సందర్భంగానే సుప్రీంకోర్టులో విచారణ అధికారి రాంసింగ్ ను తొలగించాలని ఉత్తర్వులు వెలువడడం వంటి సంఘటనలను పరిశీలిస్తే , ప్రజలు అనుమానించినట్లుగానే జరుగుతోందేమోనని రఘురామకృష్ణం రాజు సందేహం వ్యక్తం చేశారు.   

బరితెగించిన వైసీపీ

వైసీపీ అరాచకత్వం అవధులు దాటిపోతోంది. వైసీపీ మూకలు బరితెగించేశాయి. రాష్ట్రంలో తమ పార్టీకి ఎదురు గాలి వీస్తోందని తేటతెల్లం కావడంతో వారిలో అసహనం రోజు రోజుకూ పెచ్చరిల్లుతోంది. ప్రశ్నించేవారిపై దాడులు, దౌర్జన్యాలతో విరుచుకుపడటం నిత్యకృత్యంగా మారిపోయింది.  ముఖ్యంగా గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో మూడుకు మూడు స్థానాలలోనూ పరాజయం పాలవ్వడం, ఆ తరువాత ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో అనూహ్యంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలే క్రాస్ వోటింగ్ కు పాల్పడి తెలుగుదేశం ఎమ్మెల్యే పంచుమర్తి అనూరాథను గెలిపించడంతో వైసీపీ శ్రేణులకూ రాష్ట్రంలో ట్రెండ్ ఏమిటన్నది సందేహాలకు అతీతంగా అవగతమైపోయింది. దీంతో విచక్షణా రహితంగా దాడులకు పాల్పడుతున్నాయి. ప్రశ్నిస్తే భౌతిక దాడులకు పాల్పడున్నాయి.  శుక్రవారం ( మార్చి 31) ఒకే రోజు రెండు వేర్వేరు చోట్ల వైసీపీ దాడులకు దిగింది. అమరావతి రైతులకు సంఘీభావం తెలిపిన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ సహా ఆ పార్టీ నేతలపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.  అమరావతి రైతుల ఉద్యమం 1200 రోజులకు చేరిన సందర్భంగా మందడంలో జరిగిన సభలో పాల్గొని తిరిగి విజయవాడ వెళ్తున్న సమయంలో భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ వాహనంపై ఉద్దండరాయుని పాలెం వద్ద వైసీపీ కార్యకర్తలు దాడి పాల్పడ్డారు. వాహనాలకు అడ్డంగా నిలబడ్డారు. పక్కకు తొలగానికి కోరిన బీజేపీ నేతలపై దాడులకు పాల్పడ్డారు. సత్యకుమార్ వాహనంపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఆయన వాహనం అద్దాలు పగిలిపోయాయి. ఇక మరో దాడి తెనాలి మునిసిపల్ కౌన్సిల్ లో జరిగింది. తెనాలి మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన కౌన్సిలర్ యుగంధర్ పై వైసీపీ కౌన్సిలర్లు విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. ఇంతకీ ఈ దాడికి కారణమేమిటంటే..  నవరత్నాలు పథకం పనుల్లో సింగిల్ టెండర్ ఆమోదంపై ఆయన అభ్యంతరం తెలపడమే. సింగిల్ టెండర్ల ఆమోదంపై ప్రశ్నిస్తున్న యుగంధర్ ను మాట్లాడకుండా కూర్చోవాలని వైసీపీ సభ్యులు గొడవ చేశారు. అయితే తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాల్సిందేనంటూ పట్టుబట్టిన యుగంధర్ పై వైసీపీ కౌన్సిలర్లు  దాడికి పాల్పడ్డారు.  దీంతో తెనాలి కౌన్సిల్ సమావేశం రణరంగాన్ని తలపించింది. వైసీపీ కౌన్సిలర్ అహ్మద్ సహా మరోముగ్గురు ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్లు కౌన్సిల్ హాల్ లో తరిమి తరిమి మరీ కొట్టారు. దీంతో  తెలుగుదేశం కౌన్సిలర్లు చైర్మన్ పోడియం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.  

మా నాయకుడే పార్టీ కొంప ముంచాడు.. రఘురామ కృష్ణం రాజు

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ కొంప ముంచింది సాక్షాత్తూ జగనేనని పేర్కొన్నారు. శనివారం రచ్చబండ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడిన ఆయన గ్రాడ్యుయేట్ ఎన్నికలలో వైసీపీ ఓటమికి కారణం కేవలం విద్యావంతులలో వచ్చిన మార్పుగానే తీసుకోవడానికి వీల్లేదనీ, యావత్ రాష్ట్ర ప్రజల స్పందనకు ఇది ప్రతిఫలమని అన్నారు. ప్రజలలో మార్పు మొదలైందని రఘురామ అన్నారు.   రకరకాల కాంబినేషన్ వల్ల, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులు పరాజయం పాలయ్యారని అన్నారు. ఏ విధంగా చూసుకున్నా ఇది యావదాంధ్ర ప్రజల స్పందన అని చెప్పారు.   ప్రజలు ఇలాగే డిసైడ్ అయిపోయారు. ఇదే విషయాన్ని తాను గత రెండున్నర సంవత్సరాలుగా చెబుతున్నానని, పద్ధతి మార్చుకోమని పార్టీ అధినేతను కోరుతున్నాననీ,  అక్రమ కేసులలో అరెస్టు చేసి చితకబాదినా నిజం చెబుతూనే ఉన్నానన్నారు.  ఏపీలో వైసీపీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది.   108 అసెంబ్లీ నియోజకవర్గాలలో కూడిన  ఎమ్మెల్సీ ఫలితాలు వెలువడిన తర్వాత, ఇప్పటి వరకు భయంతో భయపడిన ప్రజలు, ప్రతిపక్ష పార్టీల నాయకులు ధైర్యంగా బయటకు వచ్చారు.  ఈ ప్రభుత్వం పని అయిపోయిందని, ఇంకా మనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదన్న ధైర్యం వారిలో కనిపిస్తోందన్నారు. రోజు రోజుకి ఈ ధైర్యం ఎక్కువ అవుతుందనడంలో సందేహం లేదు. కడప, కర్నూల్, అనంతపూర్ పాత జిల్లాలకు చెందిన పశ్చిమ రాయలసీమ తెలుగుదేశం అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఏ ఒక్క ఓటర్ కు రూపాయి పంచలేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు  బూతుల వద్దే  ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారు.  టిడిపి అభ్యర్థులు  చిరంజీవి, శ్రీకాంత్ లు కూడా ఓటర్లకు ఒక్క రూపాయ పంచిన దాఖలాలు లేవు అదే వెన్నపూస రెడ్డి వెన్నపూస కరిగినట్లుగా ఎన్నికల్లో డబ్బులు ఖర్చు చేసినప్పటికీ, అధికారపక్షానికి ప్రజలు గుణపాఠం చెప్పారు. ఎన్నికల్లో డబ్బుల ప్రభావం కేవలం  కొద్దిగా మాత్రమే చూపిస్తుందని ఈ ఫలితాలు తేల్చాయన్నారు. మా పార్టీ నాయకులు  1000 నుంచి  5000 రూపాయల వరకు ఖర్చు చేసినప్పటికీ, గతంలో మా పార్టీకి వచ్చినట్లుగా  50% మెజార్టీ ఇప్పుడు టిడిపి అభ్యర్థులకు వచ్చిందన్నారు. ఎన్నికల్లో ధనం పనిచేయదని, మా పార్టీ నేతల సరదా తీర్చడానికి జనం డబ్బులు తీసుకుని తెలుగుదేశం పార్టీకి ఓటేశారని రఘురామ చెప్పారు.   ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళని దేవుడి హుండీ లో పైసలు వేసినట్లుగా, ప్రజలే దేవుళ్లను కొని డబ్బులు ఇస్తే స్వీకరించాలని రఘురామ కృష్ణంరాజు సూచించారు.  రానున్న ఎన్నికల్లో ధన ప్రభావం ఉండదని, ప్రతిపక్ష పార్టీలు ప్రజా సమస్యలపై పోరాడాలని రఘురామకృష్ణం రాజు సూచించారు. టిడిపి,  జనసేన తో పాటు వామపక్ష పార్టీలు ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తే, క్వాలిటీ నేతలు వెలుగులోకి వస్తారని అభిప్రాయపడ్డారు. జగనన్న విద్యా దీవెనలు భాగంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో  ఓటు హక్కు నమోదు చేసుకున్న రెండు,  మూడవ తరగతి చదివినవారు రెండు పక్కన ఒకటి వేయాలని చెబితే, ఒకటి పక్కన ఒకటి వేసినట్లు తెలిసిందన్నారు. వై నాట్ 175 పోయిందని, ప్రస్తుతం అన్ని ఊర్లు తిరుగుతానని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారని, అంటే రాష్ట్రవ్యాప్తంగా  వృక్షాలు కనపడకుండా చేస్తారేమోనని  వృక్ష ప్రేమికులు భయపడుతున్నారు, ఇప్పటి వరకూ  కొట్టేసిన వృక్షాలు చాలని, ఇకపై వృక్షాలను నరకవద్దని  జగన్మోహన్ రెడ్డిని వృక్ష ప్రేమికులు కోరుతున్నారని  రఘురామకృష్ణంరాజు తెలిపారు.   ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం కు వస్తానని చెబితే, స్థానిక ప్రజలు వద్దని  ఎమ్మెల్సీ అభ్యర్థి చిరంజీవిని  మెగాస్టార్ చిరంజీవిని చేసినంత పని చేశారని రఘురామకృష్ణం రాజు అన్నారు. మా పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న ఒక దరిద్రపు నిర్ణయం వల్ల పరిస్థితి తిరగబడింది అన్నారు. పార్టీ అధ్యక్షుడి హోదా లో అమరావతే రాష్ట్ర రాజధాని అని చెప్పి, ముఖ్యమంత్రి అయిన తర్వాత  విశాఖపట్టణానికి  రాజధానిని మారుస్తానని చెప్పడం, మంత్రులు వంది మాగధులమద్దతునివ్వడం వల్లే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయామని రఘురామకృష్ణంరాజు తెలిపా రు. అంటే వైసీపీ కొంప ముంచింది స్వయంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగనేనని ఆయన ఉద్ఘాటించారు.  ప్రధాన ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్  తమకు అండగా ఉంటా రని  ప్రజలు నమ్ముతున్నారు.   ప్రతిపక్షాల ఓట్లు చీలనివ్వకూడదని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్  భావిస్తున్నారు. వారిద్దరూ కలిసి ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని రఘురామకృష్ణం రాజు  తెలిపారు. తెలుగుదేశం పార్టీ 40 శాతం ఓటు బ్యాంకు ఉండగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి  ఎన్ని తప్పులు చేసినా 25% ఓటు బ్యాంకు  ఉంటుంది. మిగిలిన 35 శాతం ఓటు బ్యాంకును చీలకుండా జాగ్రత్తలు తీసుకోవలసిన  బాధ్యత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇతర ప్రతిపక్ష నేతలపై ఉన్నదని చెప్పారు.  ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో  మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ప్రభావం తీవ్రంగా కనిపించింది. తన వారిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విధానాలు చూస్తే, రానున్న ఎన్నికల్లో 10 స్థానాలకు పరిమితమైనా   ఆశ్చర్యపోవలసిన అవసరం లేదని  రఘురామ అభిప్రాయపడ్డారు.  విశాఖ రాజధాని కావాలని  ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకుంటున్నారని గతంలో పేర్కొన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు,  ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గి  ఇది ప్రజల అభిప్రాయమని గోబెల్స్ ప్రచారం చేయాలని చూశారు. ఎ  ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను చూసి  మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రావు లలో ఒకరు రాజీనామా చేస్తారా?, లేకపోతే ఇద్దరూ తమ పదవులకు రాజీనామా చేస్తారా?? అన్నది తేల్చుకోవాలని రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేశారు.

అమరావతి రైతుల చలో అరసవల్లి

అమరావతి రైతులు.. మళ్లీ అరసవల్లి యాత్రకు బయలుదేరనున్నారు.  శనివారం (ఏప్రిల్ 1 ప్రత్యేక బస్సుల్లో రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు శిబిరం నుంచి రైతులు, మహిళలు అరసవల్లికి బయలుదేరుతున్నారు.  ఆ క్రమంలో రైతులు అమరావతి నుంచి అరసవల్లి వరకు చేపట్టిన పాదయాత్రలో వెంట తీసుకు వెళ్లిన శ్రీవారి రథానికి  ప్రత్యేక పూజలు   నిర్వహించనున్నారు. ఈ యాత్రలో భాగంగా రాజధాని రైతులు సింహాచలం, అన్నవరం, శ్రీకూర్మం, చిన్న తిరుపతి ఆలయాలను కూడా దర్శించుకొని.. మొక్కులు చెల్లించుకోనున్నారు.   వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన తర్వాత మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించడం.. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు చేపట్టిన నిరసనలు, ఆందోళనలు.. రేపటికి1200వ రోజుకు చేరుకుంటాయి.  అమరావతి రైతులు.. గత ఏడాది సెప్టెంబర్ 13న అమరావతి నుంచి అరసవల్లి వరకు పాదయాత్ర చేపట్టారు. ఆ క్రమంలో అక్టోబరు 20వ తేదీ వరకు చెదురుమదురు ఘటనలు మినహా పాదయాత్ర సజావుగానే కొనసాగింది. కానీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం నియోజకవర్గం  పసలపూడి వద్ద రైతులు చేస్తున్న  పాదయాత్రను పోలీసులు అడ్డుకొని... గుర్తింపు కార్డులు ఉన్నవారు మాత్రమే ఈ యాత్రలో పాల్గొన్నాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం హైకోర్టులో తేల్చుకుంటామంటూ రాజధాని రైతులు ..  పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. దాంతో ఈ పాదయాత్రపై అటు ప్రభుత్వం, ఇటు అమరావతి రైతులు పిటిషన్లు దాఖలు చేశారు. అయితే రైతుల చేపట్టిన పాదయాత్రను నిలిపి వేసేందుకు హైకోర్టు నిరాకరించింది.  కానీ ఈ పాదయాత్రలో 600 మంది రైతులు మాత్రమే పాల్గొనాలని సూచించింది. గుర్తింపు కార్డులు కచ్చితంగా కలిగి ఉండాలని.. అలాగే రైతులు చేపట్టిన పాదయాత్రకు ఏ రూపంలోనైనా సంఘీభావం తెలపవచ్చని స్పష్టం చేసింది. అయితే ఈ షరతులను ఏ మాత్రం ఉల్లంఘించరాదంటూ రైతులకు సూచించింది. ఆ తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తామని రైతులు ప్రకటించినా... అది ఎందుకో కుదరలేదు.  అయితే ఈ ఏడాది జనవరిలో అమరావతి జేఏసీ నేత గద్దె తిరుపతిరావు.. ఈ పాదయాత్ర నిలిచిపోయిన రామచంద్రాపురం నియోజకవర్గంలోని పసలపూడి నుంచి తిరిగి పాదయాత్ర చేపట్టి.. అరసవల్లి చేరుకుని.. స్వామి వారిని దర్శించుకొని   పాదయాత్ర పూర్తి చేశారు.   మరోవైపు ఇదే రాజధాని రైతులు గతంలో న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అప్పుడు కూడా జగన్ ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తే.. రైతులు హైకోర్టుకు వెళ్లి..   అనుమతులు తెచ్చుకొన్నారు. పాదయాత్ర పూర్తి చేశారు. అనంతరం తిరుపతిలో భారీ బహిరంగ సభను  నిర్వహించారు. అయితే మూడు రాజధానులకు నిరసనగా అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన నిరసనలు, ఆందోళనలు, పాదయాత్రలకు అధికార వైసీపీ మినహా అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి.