ప్రతి ఆరుగురిలో ఒకరికి వంధత్వ సమస్య.. డబ్ల్యుహెచ్ఓ
posted on Apr 6, 2023 @ 12:03PM
ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకరు వంధ్యత్వ సమస్యతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ ఓ) వెల్లడించింది. మొత్తం జనాభాలో 17.15 శాతం మందిలో ఈ సమస్య ఉందని, దీనిని అధిగమించడానికి సంతాన సాఫల్య చికిత్సలు అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని ప్రపంచ దేశాలకు సూచించింది. వంధ్యత్వ సమస్యలో ప్రాంతాల బేధం పెద్దగా లేదని డబ్ల్యుహెచ్ ఓ పేర్కొంది. సంపన్న,అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలన్నిటికీ ఇదో పెద్ద సవాలుగా మారిందని సంస్థ విడుదల చేసిన తాజా నివేదికలో పేర్కొంది. సంపన్న దేశాల్లో 17.8 శాతం, అభివృద్ధి చెందుతున్న, పేదదేశాల్లో 16.5 శాతం మందిలో వంధ్యత్వ సమస్య ఉందని సదరు నివేదిక వివరించింది.
సంతానలేమి సమస్య అనేది ప్రతి ప్రాంతంలోనూ ఒకేలా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఇంత మంది ఎదుర్కొంటున్న ఈ సమస్యను అధిగమించడానికి సంతాన సాఫల్య సౌకర్యాలను విస్తరించాలని, అవి అందుబాటు ధరల్లో ఉండాలని, తక్కువ వ్యయం, భద్రతతో కూడిన విధానాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నది.
వరుసగా 12 నెలలు, అంతకంటే ఎక్కువ కాలం శృంగారంలో పాల్గొన్న దంపతులకు పిల్లలు కలగకపోతే దానిని వంధ్యత్వ సమస్యగా గుర్తిస్తారు. వంధ్యత్వ నివారణ, నిర్ధారణ, ఐవీఎఫ్ తదితర చికిత్సా విధానాలకు అతి తక్కువ నిధుల కేటాయింపు, పరిమితంగా చికిత్స అందుబాటులో ఉండటం ఇబ్బందిగా మారిందని పేర్కొంది.
ఐవీఎఫ్ కోసం భారీగా ఖర్చు చేస్తున్న కోట్ల మంది ప్రజలు పేదరికంలోకి జారిపోతున్నారని తెలిపింది. అత్యుత్తమ పాలసీలు, ప్రభుత్వ నిధుల కేటాయింపు ద్వారా ఈ సమస్య కారణంగా ప్రజలు పేదరికంలోకి జారకుండా కాపాడవచ్చని సూచించారు. ప్రపంచ జనాభా విపరీతంగా పెరుగిపోతందన్న ఆందోళన ఓ వైపు.. సంతాన లేమి పై ఆందోళన మరో వైపు ఒకే సమయంలో ఈ పరస్పర విరుద్ధ సమస్యలు మానవాళిని ఆందోళనలోకి నెట్టడం గమనార్హం.