దేశంలో మళ్ళీ కరోనా కలకలం
posted on Apr 6, 2023 @ 3:40PM
దేశంలో మరో మారు కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. రోజు రోజుకు కొత్త కేసుల సంఖ్య పెరగడంతో పాటుగా, మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడల చేసిన తాజా గణాంకాలే ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఒకే రోజులో ఇంచు మించుగా 50 శాతానికి పైగా హెచ్చు కేసులు నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తాజా గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు కరోనా కట్టడి చర్యలకు సంబందించి స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది.
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదలచేసిన తాజా గణాంకాల ప్రకారం బుధవారం(ఏప్రిల్ 5) ఒకే రోజు దేశవ్యాప్తంగా 5 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం యాక్టివ్ కేసులు పాతిక వేలు దాటాయి. 24 గంటల్లోనే 5 వేల 335 కేసులు నమోదు కావటంపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం అయ్యింది. 24 గంటల్లోనే కరోనాతో 15 మంది చనిపోయినట్లు ప్రకటించింది కేంద్రం. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేసింది. కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. దేశంలో రోజువారీ పాజిటివ్ రేటు 3.32 శాతానికి పెరగటం ఆందోళన కలిగిస్తున్నదని పేర్కొంది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. పాజిటివ్ రేటు వారాంతానికి తీసుకుంటే మాత్రం అది 2.79 శాతంగా ఉంది.
2023, ఏప్రిల్ ఒకటో తేదీన 2 వేల 994 కేసులు నమోదు కాగా.. ఏప్రిల్ 6వ తేదీ నాటికి అవి 5 వేలు దాటాయి. రోజువారీగా కొత్త కేసులు 500 పెరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. దేశంలో ప్రస్తుతం కరోనా రోజువారీ పాజిటివిటీ రేటు 3.38 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.79 శాతంగా నమోదైంది. ఇక దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది. దేశంలో ఇప్పటివరకు 220.66 కోట్ల డోసుల కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను అందించారు. మహారాష్ట్రలో ఒకే రోజులో కోవిడ్ కేసులు 186 శాతం పెరిగాయి. గత 24 గంటల్లో 711 తాజా ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,792కి చేరుకుంది.
మహారాష్ట్రతో పాటుగా తెలంగాణ సహా మొత్తం ఆరు రాష్త్రాలలో కేరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం నెల రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుతాలను హెచ్చరించింది. అందుకు కొనసాగింపుగా తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. నిజానికి గత కొన్ని నెలలుగా భారత్ లో కొరోనా కేసుల సంఖ్య చాలా తగ్గింది. కానీ గత నెలరోజులకు పైగా కొన్ని రాష్ట్రాల్లో మళ్లీ కొరోనా కేసుల సంఖ్యలో పెరుగుదల నమోదవుతున్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ గుర్తించింది. దాంతో, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచిస్తూ ఆయా రాష్ట్రాలకు లేఖ రాసింది సహా చాలా వరకు రాష్ట్రాలు కేంద్ర మార్గదర్శకాలను పట్టిచుకున్న దాఖలాలు కనిపించడం లేదు.