సలహాల్రావులు.. సర్వాధికారులు!
posted on Apr 5, 2023 @ 5:37PM
నూరు పూలు వికసించనీ.. వేయి ఆలోచనలు సంఘర్షించనీ అంటాడు మావో. అలాగే ప్రజా క్షేత్రంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు తమ ఆలోచనలూ, ఆచరణా మరింత మెరుగ్గా ప్రజా సేవకు, సంక్షేమానికి, అభివృద్ధికీ దోహదపడేందుకు సలహాదారులపై ఆధారపడటం కద్దు. ఆ విధంగానే ముఖ్యమంత్రులు కొందరు సలహాదారులను నియమించుకుని.. పాలన మరింత సమర్ధంగా సాగేందుకు వీలుగా వారి సహకారం తీసుకుంటారు.
తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో రాజకీయాలలో సంచలనం సృష్టించిన తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుకు కూడా ఒక సలహాదారుల బృందం ఉండేది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ, విపక్ష నేతగా ఉన్నప్పుడూ ఈ బృందం ఆయనకు చేదోడు వాదోడుగా నిలిచింది. ఆ సలహాదారుల బృందం రాజకీయ సర్కిల్స్ లో గండిపేట మేధావులుగా గుర్తింపు పొందింది.
వీరు కేవీ సత్యనారాయణ, అట్లూరి వెంకటేశ్వరరావు, మింటె పద్మనాభం, నందివాడ సాంబశివరావు, ప్రొఫెసర్ ఎఫ్ డీ వకీల్, ప్రొఫెసర్ ఆర్వీఆర్ చంద్రశేఖరరావు, తుమ్మల చౌదరి. ఎన్టీఆర్ పాలనలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులు, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల వెనుక వీరి సలహాలే ఉన్నాయని చెబుతారు. కానీ వీరెన్నడూ తెరదాటి ముందుకు రాలేదు.
అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డికి కూడా చంద్రమౌళిరెడ్డి అనే సలహాదారు ఉండేవారు. సీపీఐఎంఎల్ పీపుల్స్ వార్ (ఇప్పటి మావోయిస్టు పార్టీ)పై నిషేధం ఎత్తివేత, ప్రజాయుద్ధ నౌక గద్దర్ కు స్వేచ్ఛ వంటి మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వ నిర్ణయాల వెనుక ఉన్నది చంద్రమౌళిరెడ్డి సలహాలే అని చెబుతారు. ఆయన కూడా తెర వెనుకే ఉన్నారు తప్ప బయటకు వచ్చి అంతా తన ఘనతే అని చాటుకోలేదు.
అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి కేవీపీ సలహాదారుగా వ్యవహరించారు. పాలనాపరమైన, పార్టీ పరమైన అన్ని వ్యవహారాలలోనూ వైఎస్ రాజశేఖరరెడ్డికి కేవీపీ చేదోడు వాదోడుగా ఉండేవారు. కేవీపీ ఆమోదం లేకుండా వైఎస్ ఏ నిర్ణయం తీసుకునే వారు కాదని చెబుతారు. సలహాదారుగానే కాకుండా కేవీపీ వైఎస్ కు ఆత్మబంధువుగా కూడా చెబుతారు.
అయినా కూడా ఆయన వైఎస్ వెనుక కనిపించేవారే కానీ ఎన్నడూ ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలపై మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన దాఖలాలు లేవు. కేవీపీ ప్రత్యక్ష రాజకీయాలలో కూడా చురుకుగా ఉండేవారు కనుక ఆయన జనాలకు సుపరిచితులే. అయితే ఎన్నడూ సర్వం తానేనన్నట్లుగా మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వ నిర్ణయాలను ప్రకటించిన దాఖలాలు లేవు.
ఇక చంద్రబాబు సలహాదారు కుటుంబరావు అయితే విభజిత ఆంధ్రప్రదేశ్ లో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా పని చేశారు. ఆ హోదాలో ప్రభుత్వ ఆర్థిక విధానాలపై మీడియాతో మాట్లాడేవారే కానీ ఆ పరిధిని దాటలేదు.
ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఎందరో సలహాదారులు ఉండొచ్చు కానీ ప్రస్ఫుటంగా అందరికీ తెలిసిన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రభుత్వ, పార్టీ పరంగా అన్నిటా ఆయనే అన్నట్లుగా సజ్జల తీరు ఉంటుంది. సకల శాఖల మంత్రిగానే కాకుండా డిఫాక్టో సీఎంగా కూడా ఆయనే ప్రభుత్వ విధానాలు, పార్టీ నిర్ణయాలను మీడియాకు వెల్లడిస్తుంటారు. జగన్ కేబినెట్ లోని ఏ మంత్రీ కూడా తమ తమ శాఖలకు సంబంధించిన వివరాలు మీడియా సమావేశం పెట్టి వెళ్లడించే అవకాశం ఇవ్వకుండా సజ్జలే వెల్లడించేస్తారు. ఇక ప్రభుత్వ అభివృద్ధిపై సాధారణంగా ఆయా శాఖల బాధ్యతలు చూస్తే ఐఏఎస్ లు మీడియాకు వెళ్లడిస్తారు. కానీ ఆ విషయాలను మీడియా ముఖంగా చెప్పే పని కూడా సజ్జలే సొంతం చేసేసుకున్నారు. జగన్ సర్కార్ లో జగన్ ను మించి నిర్ణయాలు తీసుకునేదీ, అమలు చేసేదీ కూడా సజ్జలేనని వైసీపీ వర్గాలే చెబుతుంటాయి. సలహాదారుగా కంటే సజ్జల సర్వాధికారిగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అలాగే పార్టీ శ్రేణుల్లో కూడా సజ్జల తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతున్నది. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సలహాదారు కేవీపీకి ప్రస్తుత సీఎం సలహాదారు సజ్జలకు ఉన్న బేధాన్ని ఎత్తి చూపుతున్నారు.