అనుకున్నదొకటి.. అయినది మరొకటి
posted on Apr 6, 2023 6:34AM
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. అంతకు ముందు కేంద్ర మంత్రి, బీజేపే ఏపీ వ్యవహారాల ఇంచార్జి మురళీధరన్ తోనూ సమావేశమయ్యారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ప్రధాని మోదీతో కూడా పవన్ కళ్యాణ్ సమావేశమవుతారని వార్తలు వచ్చినా, ఆయన రెండు రోజులు ఢిల్లీలో ఉన్నా, అలాంటిదేమీ జరగ లేదు. మురళీధరన్, నడ్డాతో సమావేశమై పవన్ కళ్యాణ్ రిటర్న్ ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ చేరుకున్నారు.
ఒక విధగా చూస్తే ఈ సమావేశానికి బీజేపీ నాయకత్వం పెద్దగా ఆసక్తి చూపినట్లు లేదు. ఓ మొక్కుబడి తంతుగానే ముచ్చట్లు ముగిశాయి.
రాష్ట్రంలో బీజేపీ నాయకులు ఎలాగైతే జన సేనతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తారో అదే విధంగా ఢిల్లీ నేతలు వ్యవహరించారు. బీజేపీ రాష్ట్ర నాయకులు తనను పట్టించుకోక పోయినా, ఢిల్లీ నాయకులు తనకు సముచిత గౌరవం ఇస్తారనే భ్రమల్లో ఉన్నపవన్ కళ్యాణ్ కు ఈ పర్యటనలో బీజేపే తత్త్వం బోధ పడేలా వారు ట్రీట్ చేశారని, చూసినవారికి అర్థమైంది. పిలవని పేరంటానికి వచ్చిన పెద్ద ముత్తయిదువును ట్రీట్ చేసిన విధంగానే, ఢిల్లీ పెద్దలు పవన్ కళ్యాణ్ తో వ్యవహరించారని మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది.
అదలా ఉంటే నడ్డాతో సమావేశం అనతరం పవన్ కళ్యాణ్ స్వయంగా పలికిన పలుకులలోని అస్పష్టతను గమనిస్తే ఆయన ఢిల్లీ వచ్చిన కార్యం నెరవేరలేదని స్పష్టమైందని అంటున్నారు. అలాగే మీడియాతో మాట్లాడే సమయంలో పవన్ కళ్యాణ్, ఆయన పక్కన నిలుచున్న నాదెండ్ల మనోహర్ బాడీ లాంగ్వేజ్ గమనిస్తే పవన్ కళ్యాణ్ నటించిఃన జల్సా సినిమాలోని కామెడీ సీన్ గుర్తుకొస్తోందని అంటున్నారు.
నిజానికి పవన్ ఢిల్లీ యాత్రపై జనసేన వర్గాల్లోనే కాదు, సామాన్య ప్రజలలో కూడా చాలానే అంచనాలున్నాయి. ముఖ్యంగా సంవత్సర కాలానికి పైగా ఎటూ తేలకుండా గాలిలో తేలుతున్న ఎన్నికల పొత్తులపై స్పష్టత వస్తుందని ఆశించారు.ఈ నేపధ్యంలోనే ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితులు రానున్న ఎన్నికల్లో పొత్తులపై అనుసరించాల్సిన వ్యూహంపై బీజేపీ అగ్రనేతలతో చర్చించేందుకే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లినట్టుగా ప్రచారం జరిగింది. నిజంగా కూడా పవన్ కళ్యాణ్ ఉద్దేశం అదే కావచ్చు. కానీ బీజేపీ పెద్దల ఆలోచన మరో విధంగా వుందో ఏమో కానీ పొత్తుల విషయం పక్కన పెట్టి కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం గురించి మాట్లాడి పంపించారు. అంటే బీజేపీ ఏపీ రాజకీయాలపై కనీసం ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకునేందుకు సిద్దంగా లేదనే విషయం స్పష్టమైందని అంటున్నారు.
ఇతర విషయాలు ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ కు రెండు విషయాల్లో క్లారిటీ వుంది. రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనను అంతమొందించవలసిన చారిత్రక అవశరాన్ని పవన్ కళ్యాణ్ గుర్తించారు. అలాగే వైసేపీ అరాచక పాలన అంతమొందించేందుకు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదనే విషయంలోను పవన్ కళ్యాణ్ కు ఫుల్ క్లారిటీ వుంది. కమిట్మెంట్ వుంది. అందుకే 2014 పొత్తులను పునరుద్ధరించి వైసీపీ అరాచక పాలన అంతమొందించాలనే ఆలోచనతో బీజేపీతో పొత్తును కొనసాగిస్తున్నారు.
అయితే, బీజేపీ లెక్కలు వేరుగా ఉన్నట్లున్నాయి .. అందుకే, పొత్తుల విషయం పక్కన పెట్టి కాలయాపన చేస్తోందని అంటున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా బీజేపీ ఉచ్చులోంచి బయటకు రావాలని పరిశీలకులు అంటున్నారు. ఇంకా జాప్యం చేస్తే మొదటికే మోసం వస్తుందని అంటున్నారు.