తెలంగాణకు కర్నాటక లింకేమిటి?
posted on Apr 5, 2023 @ 2:51PM
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్న ఉత్కంఠ ఆ రాష్ట్రంలో కంటే తెలంగాణలో ఎక్కువగా కనిపిస్తోంది. పరిశీలకుల విశ్లేషణల మేరకు ఆ రాష్ట్రంలో ఫలితాలు కచ్చితంగా ఆ తరువాత జరగబోయే తెలంగాణ ఎన్నికలపై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. పొరుగు రాష్ట్రం కనుక ఆ ప్రభావం ఉంటుందని కాదు.. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో విజయం కోసం, విజయం సాధించి అధికారం చేపట్టడం కోసం బీజేపీ, కాంగ్రెస్ లు హోరాహోరీ పోరులో ఉన్నాయి.
ఇక్కడ తెలంగాణలో కూడా ఈ రెండు పార్టీలూ అధికారమే లక్ష్యంగా ఎత్తులు, పై ఎత్తులు, వ్యూహాలు, ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాయి. తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కూడా పోటీలో బలంగా ఉంది. అక్కడ కర్నాటకలో మాత్రం బీడీఎస్.. పోటీలో ఉన్నా.. ఆ పార్టీకి సొంతంగా అధికారంలోకి వచ్చే బలం లేదన్నది పరిశీలకుల మాట. అందుకే బీడీఎస్ కర్నాటకలో హంగ్ కోరుకుంటోంది. అలా హంగ్ వస్తే..కింగ్ మేకర్ రోల్ పోషించాలన్నది ఆ పార్టీ అభిమతం. ఇక్కడ తెలంగాణలో మూడు పార్టీలో హోరాహోరీ తలపడుతుండటంతో హంగ్ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. అయితే ఆ అంచనాలు, పరిశీలనలూ పక్కన పెడితే.. కర్నాటక ఎన్నికలలో బీజేపీపై కాంగ్రెస్ పై చేయి సాధిస్తే మాత్రం ఆ ప్రభావం తెలంగాణలో కచ్చితంగా ఉంటుందనీ, కాంగ్రెస్ అవకాశాలు మెరుగుపడతాయనీ చెబుతున్నారు.
ఎందుకంటే కర్నాటక ఫలితాల ప్రభావం రాష్ట్రంలో ఓటర్లను కాంగ్రెస్ వైపు మొగ్గు చేపేలా చేస్తుందని చెబుతున్నారు. అదీ కాక తెలంగాణలో గతంతో పోలిస్తే.. ఆ పార్టీ బాగా పుంజుకుందని సర్వేలే చెబుతున్నాయి. ఎనిమిదేళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సహజంగానే ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఇక దాదాపు అంతే కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కూడా యాంటీ ఇంకంబెన్సీని ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో ఓటర్లు బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపితే.. ఆ ప్రభావం నిస్సందేహంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపైనా పడుతుంది. ఇప్పటికే పుంజుకున్న బలం పొరుగురాష్ట్రంలో విజయంతో మరింతగా పెరిగే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.
అలా కాకుండా ఒక వేళ కర్నాటకలో హంగ్ ఏర్పడితే.. ఇక ఇప్పటికే తెలంగాణ సీనియర్ నేతలు చెబుతున్న జోస్యాలు, చేస్తున్న ప్రకటనలకు అనుగుణంగా బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ బీజేపీతో జట్టుకట్టక తప్పని పరిస్థితి ఎదురౌతుంది. అయితే టీపీసీసీ చీఫ్ రేవంత్ మాత్రం తెలంగాణలో, కర్నాటకలో అధికారం చే జిక్కించుకునేది కాంగ్రెస్సేనని ధీమాగా చెబుతున్నారు. కర్నాటకలో కాంగ్రెస్ విజయం కోసం తెలంగాణ నుంచి ఎటువంటి సహకారం అయినా చేయడానికి సిద్ధమని చెబుతున్నారు. పైగా కర్నాటక పీసీసీ చీఫ్ తో రేవంత్ కు తొలి నుంచీ మంచి సంబంధాలే ఉన్నాయి. ఇక బీజేపీ విషయానికి వస్తే దక్షిణాదిన ఆ పార్టీకి ఏమైనా స్టేక్ అంటూ ఉందంటే ఇప్పటి వరకూ కర్నాటకలోనే.. ఇటీవలి కాలంలోనే తెలంగాణలో ఒకింత పుంజుకున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణలో అధికారం దక్కించుకోవాలంటే కర్నాటకలో గెలవక తప్పని అనివార్య పరిస్థితి ఆ పార్టీది.
కానీ కర్నాటక ఆనవాయితీ ప్రకారం ఏ పార్టీకి ఆ రాష్ట్ర ప్రజలు వరుసగా రెండో సారి అధికారం ఇవ్వరు. ఇప్పుడు కూడా అదే పునరావృతమైతే.. తెలంగాణపై ఆశలు కూడా వదిలేసుకోవలసిందేనని ఆ పార్టీ అగ్రనాయకత్వం భావిస్తోంది. అందుకే ఎలాగైనా కర్నాటకలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. అలాగే కాంగ్రెస్ కూడా తమ పార్టీ అధ్యక్షుడి సొంత రాష్ట్రంలో ఎలాగైనా విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో ఉంది.