కాంగ్రెస్ ను వీడను బాబోయ్ అంటున్నా ఎవరూ నమ్మరేం.. కోమటిరెడ్డి
posted on Apr 6, 2023 @ 3:13PM
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గుడ్ బై చెబుతున్నారనే వార్తలు కలకలం రేపాయి. కోమటిరెడ్డి రాజీనామాను అధికారికంగా ప్రకటించేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరిగింది. కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న వెంకట్ రెడ్డికి పార్టీ నుంచి సరైన సహకారం లేకపోవడంతో పార్టీని విడిచి పెట్టేందుకు సిద్దమయ్యారని ప్రచారం జరిగింది.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతారని ప్రచారం జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలో మునుగోడు ఎన్నికల సమయంలో కూడా ఇదే తరహా ప్రచారం జరిగింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కోమటిరెడ్డి, పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా బహిరంగంగానే విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో నాయకుల్ని చేర్చుకునే విషయంలో కూడా రేవంత్ రెడ్డితో కోమటిరెడ్డి విభేదించారు. చెరుకు సుధాకర్ ని చేర్చుకున్న సమయంలో అలిగి.. బీజేపీ అగ్రనేత అమిత్ షా తో సమావేశమై కలకలం రేపారు.
గతంలో పీసీసీ అధ్యక్ష, ఏఐసీసీ పదవులు ఆశించిన వెంకట్ రెడ్డి, ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ అగ్ర నాయకులు సర్ది చెప్పడంతో సర్దుకుపోయారు. ఆ తర్వాత కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అక్రోశం కోమటిరెడ్డిలో ఉంది. తనకు ఎలాంటి పదవులు రాకపోవడంతో వెంకట్ రెడ్డి మనస్తాపానికి గురయ్యారని అనుచరులు చెబుతున్నారు. కాంగ్రెస్ పెద్దలు ఎప్పటికప్పుడు సర్ధిచెప్పే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఎంపీ వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ పార్టీ వీడినప్పటి నుంచి కాంగ్రెస్ నేతలతో దూరం పెరిగింది. కాంగ్రెస్ అధిష్టానం ఊరడించడంతో వెంకటరెడ్డి తన నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారని అనుచరులు చెబుతున్నారు.
పార్టీ మార్పు వార్తలు దుమారం రేపడంతో ఎంపీ కోమటిరెడ్డి మీడియా ముఖంగా వాటిని ఖండించారు. ఉద్దేశ్య పూర్వకంగానే కొందరు తనను డ్యామేజ్ చేస్తున్నారని ఆరోపించారు. తనది కాంగ్రెస్ రక్తమని, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదు మొర్రో అని మొత్తుకుంటున్నా ఎవరూ ఎందుకు నమ్మడం లేదని ఆకోషం వ్యక్తం చేశారు. రాజీనామా చేయాలన్న నిర్ణయం తీసుకో లేదని చెప్పారు. రాహుల్ గాంధీ అనర్హతను నిరసిస్తూ గాంధీభవన్ లో చేసిన దీక్షలో పాల్గొన్నాననీ, భువనగిరి నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు పాల్గొంటున్నానని వివరణ ఇచ్చారు.
తన ముందు ఎలాంటి ఆప్షన్స్ లేవని తనది కాంగ్రెస్ రక్తమని చెప్పుకొచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంతలా చెబుతున్నా.. ఆయన పార్టీ మారతారన్న వదంతులు ఆగకుండా రావడానికి ఆయన వ్యవహార శైలే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చిన్న చిన్న సమస్యలపై ప్రధాని మోడీతోనూ, హోంమంత్రి అమిత్ షాతోనూ భేటీ కావడంపై కోమటిరెడ్డి గతంలో ఇచ్చిన వివరణలు నమ్మశక్యంగా లేవు. పార్టీ క్రమశిక్షణ సంఘం ఇచ్చిన నోటీసులను చెత్తబుట్టలో పారేశానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, ముందు ముందు కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కలుస్తాయంటూ చేసిన కామెంట్స్ ఇవన్నీ కూడా ఆయన కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పనున్నారన్న వార్తలకు బలం చేకూర్చేవిగా ఉండటమే.. ఆయన తనది కాంగ్రెస్ రక్తం అని చెబుతున్నా.. ఎవరూ నమ్మకపోవడానికి కారణమని పరిశీలకులు అంటున్నారు.