వారణాసికి నిధుల వరద!
రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నది పాత సామెత ... మోడీ తలచుకుంటే డబ్బులకు కొదవా అన్నది నేటి సామెత. అవును, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజక వర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూస్తే ఎవరైనా ఇదే అంటారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్రంలో ముఖ్యంగా వారణాసిలో ఎన్ని వందల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు మోడీ శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారో లెక్క లేదు... అలాగే ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మోడీ స్వరాష్ట్రం గుజరాత్ కు ఇరుగు పొరుగు రాష్రాలు ఈర్ష్య పడేలా నిధుల వరద పారింది. దీనిపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు పలు సందర్భాలలో విమర్శలు చేశారు.
అదలా ఉంటే ఇప్పడు, ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచంలోనే అతి పొడవైన నదీ విహార యాత్ర రివర్ క్రూయిజ్ఎంవీ గంగా విలాస్ ను వారణాసి లోని టెంట్ సిటీలో ప్రారంభించారు. అంతే కాదు పనిలో పనిగా వెయ్యి కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన ఇతర అంతర జల మార్గాల ప్రాజెక్టులకు కూడా ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం జల మార్గాల్లో చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టుల వల్ల రవాణ, వాణిజ్య, పర్యాటకం పెరుగుతుందని అన్నారు.
ఈ ప్రాజెక్టు వల్ల తూర్పు ప్రాంతం దేశానికి వృద్ధి చోధకంగా దోహదపడుతుందని అన్నారు. దీనిని దేశంలో మౌలిక సదుపాయాల పరివర్తన దశాబ్దంగా పేర్కొన్నారు. గంగా విలాస్ యాత్ర తేలికైన యాత్ర కాదని మన దేశంలో అంతర జల మార్గాల అభివృద్ధికి ఒక ఉదాహారణ అని చెప్పారు. గతంలో అంతర్ జల మార్గాల రంగంలో అసాధారణ అభివృద్ధి గురించి నరేంద్రమోదీ మాట్లాడుతూ... 2014 లో దేశంలో కేవలం 5 అంతర్ జల మార్గాలు మాత్రమే ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 111 కు పెరిగిందరీ, జల మార్గాల రవాణా మూడు రెట్లు పెరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా గంగా విలాస్ లో విహార యాత్ర చేస్తున్న స్విట్జర్లాండ్ పర్యాటకులకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఎంవీ గంగా విలాస్ – ఈరోజు వారణాసి నుంచి బయలుదేరి 51 రోజుల్లో సుమారు 3 వేల 2 వందల కిలో మీటర్లు ప్రయాణించి, బంగ్లాదేశ్ మీదుగా అస్సాంలోని దిబ్రూఘర్ కు చేరుకుంటుంది. ఈ పడవలో విలాసవంతమైన 18 గదులున్నాయి. 36 మంది పర్యాటకులు విహారం చేయవచ్చు. నేషనల్ పార్కులు, నదీ ఘాట్లు, పాట్నా నగరం, జార్ఖండ్ లోని షాహిబ్ గంజ్, పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతా, బంగ్లాదేశ్ లోని ఢాకా, అస్సాంలోని గౌహతిలను ఈ పర్యాటకులు సందర్శించవచ్చు.
గంగా నది ఒడ్డున టెంట్ సిటికి కూడా ప్రధానమంత్రి ప్రారంభోత్సవం చేశారు. ప్రధానమంత్రి పశ్చిమ బెంగాల్ లోని పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేస్తారు.
కాగా, ఇంతవరకు దేశంలో ఇలాంటి ప్రయోగం జరగ లేదు, ఇదే తొలి ప్రయత్నం. కాగా, భారతదేశ మొట్ట మొదటి నదీ పర్యాటక నౌక, గంగా, బ్రహ్మపుత్ర నదుల మీదుగా 3,200 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ లగ్జరీ నౌకకు మరో ప్రత్యేకత కూడా వుంది. ప్రపంచంలోనే అతిపెద్ద నదీ పర్యటక నౌకగా కూడా ‘ఎంవీ గంగా విలాస్’ చరిత్ర సృష్టించింది. ఈ నౌకలో ప్రయాణికుల కోసం అత్యాధునిక సౌకర్యాలతో పాటు సూట్ గదులు, స్పా, జిమ్ సెంటర్లు, ఫ్రెంచ్ బాల్కనీలు, ఎల్ఈడీ టీవీలు, సేఫ్‌లు, స్మోక్ డిటెక్టర్లు, కన్వర్టిబుల్ బెడ్లు వంటివి కూడా ఉన్నాయి.
ఈ రోజే (జనవరి 13) 51 రోజుల తోలి పర్యటనను వారణాసి నుంచి ప్రారంభించనున్న ఎంవీ గంగా విలాస్ .. భారత్‌లోని ఐదు రాష్ట్రాలను, బంగ్లాలోని కొన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ మొత్తం 3,200 కి.మీ దూరం ప్రయాణించి దిబ్రూఘర్ చేరుకుంటుంది. అంతేకాక 27 నదీ వ్యవస్థల మీదుగా ఈ నౌక ప్రయాణించనుంది. ఇక ఈ నౌక తన మొదటి పర్యటనలో భాగంగా ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, జాతీయ ఉద్యానవనాలు, నదీ ఘాట్‌లు, బీహార్‌లోని పాట్నా, జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, బంగ్లాదేశ్‌లోని ఢాకా, అస్సాంలోని గువాహతి వంటి ప్రధాన నగరాలతో సహా 50 పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తుంది. ఎంవీ గంగా విలాస్ తన తొలి ప్రయాణంలో స్విట్జర్లాండ్‌కు చెందిన 32 మంది పర్యాటకులను తీసుకెళ్లనుంది. అయితే, ఈ నౌక అందరికీ అందుబాటులో ఉండదు ..ఎందుకంటే ..ఒక్కో ప్రయాణికుడికి రోజుకు దాదాపు రూ.25వేలు చార్జి అవుతుంది. అంటే ఈ యాత్ర మొత్తానికి ఒక్కొక్కరికీ రూ.12.75లక్షల ఖర్చవుతుంది.
అదలా ఉంటే సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ రివర్ క్రూయిజ్ ఏమ్వీ గంగా విలాస్, వల్ల సామాన్య ప్రజలకు మేలు జరగదని విమర్శించారు.నరేంద్ర మోడీ ప్రభుత్వ ఏకైక ఉద్దేశ్యం మతపరమైన ప్రదేశాలను పర్యాటక ప్రదేశాలుగా మార్చడం ద్వారా డబ్బు సంపాదించడం మాత్రమే అని యాదవ్ అన్నారు.
ప్రజలు తమ జీవితపు చివరి దశలో లేదా ఆధ్యాత్మికత కోసం వారణాసిని సందర్శిస్తారు మరియు జ్ఞానాన్ని పొందుతారు. పర్యాటకాన్ని ప్రోత్సహించడం ద్వారా డబ్బు సంపాదించడం కోసం బిజెపి ఈ ఏర్పాటు (అక్కడ) చేస్తోంది" అని యాదవ్ చెప్పినట్లు వార్తా సంస్థ పిటిఐ పేర్కొంది.