తెలుగుదేశం,జనసేన ఉమ్మడి సమరం.. ఇక వైసీపీ హ్యాండ్సప్పే!
ఏపీలో ఎన్నికల వేడి ఇప్పుడేమిటి? చాలా కాలం కిందటే మొదలైంది. వాస్తవానికి ఈ నెల 30న పోలింగ్ జరగనున్న తెలంగాణలో కంటే మరో ఐదు నెలల తరువాత ఎన్నికలకు వెళ్లే ఏపీలోనే ఎలక్షన్ హీట్ పీక్స్ లో ఉందని చెప్పాలి. ఏపీలోఅధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం, ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేన ఎవరికి వారు నిర్దిష్ట ప్రణాళికలతో గెలుపు వేట ఆరంభించేశాయి. అయితే, ఇప్పటికే ప్రజా నాడి, ముందస్తు సర్వేల ఫలితాలతో విపక్షాలు గెలుపు ధీమాతో ప్రజల మధ్యకు వెళ్తుంటే.. అధికార పార్టీ మాత్రం ప్రజలలో తమ సర్కార్ పట్ల నెలకొన్న తీవ్ర అసంతృప్తిని ఎలా ఎదుర్కోవాలో అర్ధం కాక జనం ముందుకు వెళ్లడానికి జంకుతోంది. తెలుగుదేశంతో జనసేన జతకట్టడం, ఇప్పటికే రెండు పార్టీలు సమన్వయ కమిటీలను కూడా నియమించుకొని సమష్టిగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. కొన్ని రోజుల కిందట ఉమ్మడి మేనిఫెస్టోలపై సమావేశాలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నారు.
తెలుగుదేశం, జనసేన ఉమ్మడి కార్యాచరణ పేరిట సమన్వయంతో ప్రణాళికా బద్ధంగా ఉమ్మడిగా ఎన్నికల సమరానికి సిద్ధపడటంతో వైసీపీకి దిక్కుతోచడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం, జనసేన కూటమి ఇప్పటికే 100 రోజుల ప్రణాళిక, ఓటరు జాబితా అవకతవకలతో పాటు ప్రజా సమస్యల వారీగా ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించాయి. ఇరు పార్టీలు క్షేత్రస్థాయిలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు రెడీ చేసుకున్నాయి. ఇందులో రహదారుల నిర్మాణం, రోడ్లపై గుంతలు, వాటి ద్వారా ఏర్పడిన ప్రమాదాలు, పోయిన ప్రాణాలు వంటి కీలక అంశాలపై ఉమ్మడి నిరసనలు, ధర్నాలకు పిలుపునిచ్చాయి. ఉమ్మడి కార్యాచరణలో ఇది తొలి ఘట్టమేనని చెబుతున్నాయి.
రోడ్ల నిర్మాణం, రోడ్లపై గోతులు, ఏర్పడిన ప్రమాదాలు, పోయిన ప్రాణాలతో మొదలయ్యే తెలుగుదేశం, జనసేనల ఉమ్మడి సమరం.. మరో రెండు నెలల పాటు పూర్తిగా ప్రజా సమస్యలపైనే కొనసాగనుంది. రాష్ట్రంలో ఇసుక కష్టాలు, పెరిగిన విద్యుత్ చార్జీలు, నిత్యావసర ధరలు, పన్నుల బాదుడు, రైతుల కష్టాలు, ఏ రంగానికి లేని ప్రోత్సాహకాలు, భారీగా పెరిగిన నిరుద్యోగం, వలసలు, మద్యం బాదుడు, ఊరు పేరు లేని నాసిరకం మద్యం, నాసిరకం మద్యం తాగి పోయిన ప్రాణాలు, రోగమొచ్చినా ఆరోగ్యశ్రీ, ప్రభుత్వ ఆసుపత్రులలో అందని వైద్య పరీక్షలు, అందుబాటులో లేని మందులు, విద్యార్థులకు అందని ఫీజు రీఎంబర్స్ మెంట్, పెరిగిన అప్పులు ఇలా క్షేత్ర స్థాయిలో నాలుగున్నరేళ్లగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో ఎండగట్టడమే ఇప్పుడు తెలుగుదేశం, జనసేన ఉమ్మడి కార్యాచరణ. దీంతో ఇది వైసీపీ ప్రభుత్వంపై మరింతగా ప్రజావ్యతిరేకతను పెంచుతుందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఒక్కసారి తెలుగుదేవం,జనసేన పార్టీలు ఉమ్మడిగా ఇరు పార్టీల జెండాలతో ప్రజల మధ్యకి వెళ్తే ఇక అధికారపక్షానికి చుక్కలు కనిపించడం ఖాయమని అంటున్నారు.
ప్రజలలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తున్నదనడంలో సందేహం లేదు. అందుకే ఎక్కడిక్కడ వైసీపీ నేతలకు నిరసన సెగలు తగులుతున్నాయి. వివిధ కార్యక్రమాల పేరుతో మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజల మధ్యకి పంపినా ప్రజలు నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. ప్రతి కుటుంబానికి సంక్షేమం అందించామని ప్రభుత్వ పెద్దలు ఊదరగొడుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ప్రజా వ్యతిరేకత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. దానికి తోడు చంద్రబాబు అక్రమ అరెస్ట్ వ్యవహారం కూడా జగన్ కు వ్యతిరేకంగా మారింది. చంద్రబాబుపై వరస కేసులు బనాయించి ఆయనని బయటకి రాకుండా చేయాలని చూసిన తీరు.. ప్రతిపక్షం గొంతు నొక్కేందుకేనని ప్రజలు నిర్ధారించుకున్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే ప్రభుత్వ వేధింపులు రోజు రోజుకూ ఎక్కువవుతున్నాయి. ఈ తరుణంలో ప్రతిపక్షాలు ప్రజా సమస్యలపై పోరాటం మొదలు పెడితే వైసీపీ ఉక్కిరి బిక్కిరి కావడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.