అర్ధరాత్రి సాగర్ వద్ద హైడ్రామా.. ఎన్నికల వేళ ఎందుకిలా?

రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. బుధవారం అర్ధరాత్రి సమయంలో సాగర్‌ వద్ద రెండు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు, వందల మంది పోలీసులు చేరుకోవడంతో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఒక రాష్ట్రం పోలీసులు గేటు వేసి అడ్డుకుంటే.. మరో రాష్ట్రం పోలీసులు ఫెన్సింగ్ వేసి అడ్డుకున్నారు. ఈ ఉద్రిక్తతతలు ఘర్షణకు దారి తీయడంతో  డ్యామ్ సిబ్బందికి గాయాలయ్యాయి. వారి మొబైల్ ఫోన్లతోపాటు అక్కడి సీసీటీవీ కెమెరాలు కూడా ధ్వంసం అయ్యాయి. ఒకవైపు తెల్లవారితే తెలంగాణలో ఎన్నికలు, అలాంటి వేళ సరిగ్గా అర్ధరాత్రి వేళ హైడ్రామా నెలకొనడంతో అసలేం జరుగుతోందన్న అయోమయం ఏర్పడింది.  ఇరు రాష్ట్రాలను కలిపే జాతీయ రహదారి కావడంతో వందల మంది పోలీసులు మోహరించడంతో  ఆ దారిలో వెళ్లాల్సిన వాహనాలు ఆగిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఎన్నికలలో లబ్ది కోసమే కేసీఆర్ అర్ధరాత్రి సమయంలో హైడ్రామాకి తెర తీసారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ కూడా అదే ఆరోపణ చేస్తోంది. ఆ ఆరోపణలు అలా ఉంచితే ఇంతకూ అసలేం జరిగిందంటే. తెలంగాణ, ఏపీ మధ్య నీటి విషయంలో వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన సమయంలో నాగార్జున సాగర్ నిర్వహణను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించింది. ప్రాజెక్టుకు ఉన్న 26 గేట్లలో సగభాగమైన 13వ గేట్ వరకు ఏపీ పరిధిలో ఉండగా మిగతా సగభాగం తెలంగాణలో ఉంది. కాగా  ఈ ఏడాది కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల్లో తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడింది. ఇదే సమయంలో డ్యామ్‌ ఆపరేషన్ బాధ్యత మొత్తం తెలంగాణ ప్రభుత్వ అధీనంలో ఉండటంతో సాగు, తాగు నీటికి కృష్ణా డెల్టాలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. పల్నాడు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో సాగు, తాగు నీరు అందడం లేదని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. తాగు, సాగు నీరు అందక గుంటూరు, పల్నాడు రైతాంగం కొద్ది రోజులుగా ఆందోళన   చేస్తోంది. అసలు రెండు రాష్ట్రాలకు వాటాలు ఉన్న ప్రాజెక్టును ఒకే రాష్ట్రానికి యాజమాన్య బాధ్యతలను అప్పగించడంపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే నీటి విడుదలపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చర్చలు జరిగినా అవి కొలిక్కి రాలేదు. దీంతో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఏపీ అధికారులు భారీ ఎత్తున పోలీసులను వెంటపెట్టుకొని నాగార్జునసాగర్ డ్యామ్‌ వద్దకు చేరుకొని ముళ్లకంచె ఏర్పాటు చేశారు. ప్రాజెక్టుకు ఉన్న 26 గేట్లలో సగభాగమైన 13వ గేట్ వరకు తమ పరిధిలోకి వస్తుందని, అక్కడ వరకు కంచె వేశారు. ఏపీ అధికారులు పోలీసులను డ్యామ్ సిబ్బంది గేట్ వేసి అడ్డుకోగా.. డ్యామ్ సిబ్బందిపై దాడిచేసినట్లు తెలంగాణ పోలీసులు ఆరోపిస్తున్నారు. మొత్తంగా డ్యామ్ సిబ్బంది మొబైల్ ఫోన్లతోపాటు అక్కడి సీసీటీవీ కెమెరాలు ధ్వంసం అయ్యాయి. ప్రాజెక్టు వద్దకు చేరుకున్న మిర్యాలగూడ డీఎస్పీ ఏపీ పోలీసులతో మాట్లాడే ప్రయత్నం చేసినా వినలేదు. డ్యామ్ నిర్వహణ విషయం నీటిపారుదల అధికారులకు సంబంధించిన విషయమని, ముళ్లకంచెను తీసేయాలని కోరారు. ఏపీ పోలీసుల నుండి స్పందన లేకపోవడంతో తెలంగాణ పోలీసులు వెనుదిరిగి వెళ్లిపోయారు. ఘటనా స్థలంలో మీడియా కవరేజీకి ప్రయత్నించగా పల్నాడు ఎస్పీ రవిశంకర్‌ ఆగ్రహం వ్యక్తం చేసి మీడియా ప్రతినిధుల ఫోన్లను కూడా లాక్కున్నారు.  అయితే, అర్ధరాత్రి వేళ ఏపీ పోలీసులు దౌర్జన్యంగా చొరబడ్డారన్నది స్పష్టంగా కనిపిస్తుంది. ముందే ప్రక్కా ప్రణాళికతో 600 నుండి 700 మంది పోలీసులు ప్రాజెక్టుపైకి వెళ్లారు. నిజానికి ఈ ప్రాజెక్టు, అందులో నీటి వాటాలు, ప్రాజెక్టు నిర్వహణ ఇవన్నీ కేంద్ర పరిధిలోని అంశాలు. మహా అయితే రెండు రాష్ట్రాల అధికారులు కూర్చొని మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చి కేంద్రంపై ఒత్తిడి చేయాల్సిన అంశాలు. కానీ, వందల మంది పోలీసులతో వెళ్లి ప్రాజెక్టు వద్ద బీభత్సం సృష్టించడం వలన ఒరిగేది ఏమీ లేదు. పైగా సిబ్బందిపై దాడి, సీసీ కెమెరాల ధ్వంసం వంటి చర్యలతో ప్రజల సొమ్మే నష్టపోయింది. మీడియా ప్రతినిధులపై కూడా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడం చూస్తే.. ఇది కావాలని పక్కా ప్రణాళికతో చేసిన చర్యగానే కనిపిస్తుంది. దౌర్జన్యకాండతో ఫలితం లేదని తెలిసినా.. పోలీసులే పనిగట్టుకొని వెళ్లి అల్లర్లు జరిగేలా ప్రేరేపించడం వెనక  పొరుగు రాష్ట్రంలో అంటే తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలను ప్రభావం చేయాలన్న దురుద్దేశమేదో ఉందన్న అనుమానాలు పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఇంత కాలం ఊరుకుని సరిగ్గా తెలంగాణ ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వం ఈ రకమైన దూకుడు ప్రదర్శించడం పొరుగు రాష్ట్రంలో తన మిత్రుడికి రాజకీయ లబ్ధి చేకూర్చడానికేనని అంటున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లుగా ఏపీ సర్కార్ చేసిన ఈ చర్య వల్ల ఇటు ఏపీలో జగన్ సర్కార్ రైతాంగం సమస్యల పట్ల పొరుగు రాష్ట్రంతో గొడవకు సైతం వెనుకాడటం లేదన్న  భావన ప్రజలలో కలిగేలా చేయడంతో పాటు.. పొరుగు రాష్ట్రంలో  సెంటిమెంట్ ను రగిల్చి అక్కడి తన మిత్రుడికి లబ్ధి చేకూర్చాలన్న కుట్ర కూడా దాగి ఉందని విశ్లేషకులు అంటున్నారు. మొత్తం మీద ఎన్నికల వేళ సాగర్ వద్ద ఉద్రిక్తతలు ఏర్పడేలా జగన్ సర్కార్ వ్యవహరించిన తీరు రాజకీయ కుట్రేనని అంటున్నారు. 

క్వాష్ పిటిషన్ పై సుప్రీం తీర్పు ఎప్పుడంటే?

ఫైబర్ నెట్ కేసులు తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్ గురువారం (నవంబర్ 30) సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ అనిరుద్దబోస్ ధర్మాసనం ముందు ఈ పిటిషన్ పై విచారణ జరగనుంది. అయితే గతంలో ఇదే ధర్మాసనం చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది. ఆ సందర్భంగా క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువరించిన అనంతరం ఫైబర్ నెట్ కేసులో బాబు ముందస్తు బెయిలు పిటిషన్ ను విచారిస్తామని పేర్కొంది. అయితే సుప్రీం కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ గురువారం (నవంబర్ 30)  లిస్ట్ కాలేదు. కానీ ఫెబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిలు పిటిషన్  లిస్ట్ అయ్యింది. దీంతో క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువరించక ముందే సుప్రీం ధర్మాసనం ఫెబర్ నెట్ కేసులో బాబు ముందస్తు పిటిషన్ పై విచారణ జరపనున్నదని భావించాల్సి  ఉంటుంది.  అయితే గతంలో ఫైబర్ నెట్  కేసు విచారణ ధర్మాసనం ముందుకు వచ్చిన ప్రతిసారీ న్యాయమూర్తులు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ అనిరుద్దబోస్ లు చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువరించిన అనంతరమే ఈ పిటిషన్ విచారణ చేపడతామని చెబుతూ వచ్చారు. అలాగే క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువడే వరకూ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుపై ఎటువంటి చర్యలూ తీసుకోవద్దని ఏపీ సీఐీని ఆదేశించారు.   అయితే క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువడకుండానే ఫైబర్ నెట్ కేసులో బాబు ముందస్తు బెయిలు పిటిషన్ విచారణకు రావడంతో.. ఇప్పుడు కూడా ఈ కేసు విచారణకు సుప్రీం వాయిదే వేసే అవకాశాలే అధికంగా ఉన్నాయని న్యాయనిపుణుులు అంటున్నారు. క్వాష్ పై తీర్పు వెలువడకుండా ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిలుపై నిర్ణయం వెలువడే అవకాశం లేదని అంటున్నారు.  ఇదిలా ఉంటే చంద్రబాబుపై జగన్ సర్కార్ బనాయించిన అన్ని కేసుల విచారణ కూడా క్వాష్ పిటిషన్ తీర్పు కోసమే వాయిదాలు పడుతూ వస్తున్న సంగతి విదితమే.   చివరాఖరికి ఏపీ సర్కార్   దాఖలు చేసిన చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణ కూడా ఈ కారణంతోనే వాయిదా పడిన సంగతి విదితమే.  17ఏ చంద్రబాబుకు వర్తించకపోతే ఆయనను ఎన్నికల్లో కట్టడి చేయడానికి ఎన్ని కేసులైనా పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం రెడీగా ఉంది. అదే చంద్రబాబుకు 17ఏ చంద్రబాబుకు వర్తిస్తే జగన్ సర్కర్ పెట్టిన కూసులన్నీ దూది పింజెలుగా ఎగిరిపోవడం తథ్యం. 

ఓటు వేయండి.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయండి.. ప్రధాని, ప్రియాంక పిలుపు

తెలంగాణ ఎన్నికల పోలింగ్  జరుగుతున్న వేళ ప్రధాని నరేంద్రమోడీ, కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ, ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ వేర్వేరుగా x వేదికగా రాష్ట్ర ప్రజలకు సందేశం పంపారు.   తెలంగాణ ప్రజలు పెద్ద సంఖ్యలో పోలింగ్ బూత్ లకు వచ్చి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.    ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.   యువత,  ముఖ్యంగా తొలి సారి  ఓటు వేస్తున్నవారు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని మోడీ ప్రత్యేకంగా కోరారు. అలాగే ప్రియాంక గాంధీ కూడా ఓటు హక్కును వినియోగించుకుని తెలంగాణ ప్రజల కలలను సాకారం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ అయితే బంగారు తెలంగాణ కలలను సాకారం చేసుకునేందుకు తప్పని సరిగా ఓటేయాలని కోరారు.  

నాగార్జున సాగర్ గొడవపై నేతలు మాట్లాడొద్దు.. సీఈవో వికాస్ రాజ్

నాగార్జున సాగర్ వద్ద గోడవపై రాజకీయ నేతలెవరూ మాట్లాడొద్దని తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధానాధికారి వికాస్ రాజ్ అన్నారు. ఆ విషయం పూర్తిగా పోలీసులు చూసుకుంటారనీ, ఆ విషయంపై రాజకీయ నేతల ప్రకటనలు కోడ్ ఉల్లంఘన కిందకే వస్తాయనీ హెచ్చరించారు. ఇలా ఉండగా ఆయన ఎస్ఆర్ నగర్ పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ సారి తెలంగాణలో ఓటింగ్ శాతం పెరుగుతుందన్న ధీమా వ్యక్తం చేశారు. గ్రామాలలో ఉదయం నుంచే ప్రజలు ఉత్సాహంగా ఓటు వేయడానికి పోలింగ్ బూత్ ల వద్ద క్యూ కట్టారనీ, పట్టణ ప్రాంతాలలో మాత్రం మందకొడిగా పోలింగ్ జరుగుతోందనీ చెప్పారు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందన్నారు.   రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని తెలంగాణ ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ తెలిపారు. ఉదయం పది గంటల ప్రాంతంలో కుటుంబంతో కలిసి ఆయన ఓటేయడానికి ఎస్ ఆర్ నగర్ పోలింగ్ బూత్ వద్దకు వచ్చారు. ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ బూత్ ల వద్ద జనం క్యూ కట్టారని చెప్పారు. ఈసారి పెద్ద సంఖ్యలో ఓటింగ్ నమోదవుతుందని వివరించారు. 

విజయవాడ, హైదరాబాద్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్

విజయవాడ, హైదరాబాద్ నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో స్వస్థలాలకు వెళ్లే, వచ్చే ప్రయాణీకులతో జాతీయ రహదారి రద్దీగా మారింది. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.  అదలా ఉంటే నాగర్ కర్నూల్ మన్ననూరు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం తోపులాటకు దారి తీయడంతో పోలీసులు ఇరు వర్గాలనూ చెదరగొట్టారు. గద్వాల జిల్లా ఐజ పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నా పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది.   అదే విధంగా జనగామలో కూడా ఓ పోలీసు స్టేషన్ వద్ద ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. కాంగ్రెస్, సీపీఐ కార్యకర్తలతో బీఆర్ఎస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఇరు వర్గాల మధ్యా తోపులాట జరగడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలనూ చెదరగొట్టారు.  భద్రాద్రి జిల్లా నల్లబండపోడులో గ్రామస్తులు ఓటింగ్ ను బహిష్కరించారు. తమ గ్రామానికి తారు రోడ్డు లేదని వారు ఓటు వేయడానికి నిరాకరించారు.  

బంగారు తెలంగాణ కోసం ఓటేయండి.. రాహుల్

సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ పోలింగ్ జరుగుతున్ సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలనుద్దేసించి  x వేదిక ద్వారా ఓ సందేశం ఇచ్చారు.  నా తెలంగాణ సోదర సోదరీమణులారా అధిక సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొనండి. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఓటేయ్యండి అంటూ ఆ సందేశంలో పేర్కొన్నారు. ఇలా ఉండగా ఉదయం 7  గంటల నుంచి ఇప్పటి వరకూ తెలంగాణ వ్యాప్తంగా 7.78 శాతం పోలింగ్ జరిగింది. చలి ఎక్కువగా ఉండటంతో ఉదయం పోలింగ్ మందకొడిగా  సాగుతోందని, క్రమంగా పుంజుకుంటుందని అధికారులు చెబుతున్నారు. ఇలా ఉండగా కాసిపేట మండలం వరిపేట గ్రామానికి చెందిన ఓటర్లు పోలింగ్‌ను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ గ్రామంలోని పోలింగ్ కేంద్రం వెలవెలబోతున్నది. ఉదయం ఏడు గంటల నుంచి ఇప్పటి వరకూ కేవలం 12 మంది మాత్రమే ఈ పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  ఇలా ఉండగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.  ఇక  ఇబ్రహీంపట్నం ఖానాపూర్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాల మధ్యా మొదలైన వాగ్వాదం ఘర్షణకు దారి తీయడంతో పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీచార్జ్ చేసి ఇరువర్గాలనూ చెదరగొట్టారు.  

ముషీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి కుమారుడి అరెస్టు

ముషీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. ముషీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి ముఠాగోపాల్ కుమారుడు జయసింహ ఓటర్లకు డబ్బులు పంచుతుండగా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే పటాన్ చెరు ఎమ్మెల్యే కుమారుడిపై కేసు నమోదైంది. ఆయన తనపై దాడి చేశారంటూ ప్రవీణ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇలా ఉండగా చెదురుమదురు సంఘటనలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని ఎన్నికల సంఘం పేర్కొంది. ఉదయం 9 గంటల వరకూ రాష్ట్రవ్యాప్తంగా 7.78శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. 

కల్వకుంట్ల కవితపై ఈసీకి కాంగ్రెైస్ ఫిర్యాదు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీకల్వకుంట్ల కవితపై కాంగ్రెైస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఆమె ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారనీ, ప్రజలకు పోలింగ్ బూత్ వద్ద తమ పార్టీకే ఓటేయాల్సిందిగా విజ్ణప్తి చేశారనీ ఆ ఫిర్యాదులో పేర్కొంది. కాంగ్రెస్ రాష్ట్ర  ఎన్నికల కమిటీ చైర్మన్ నిరంజన్ ఈ విషయాన్ని వెల్లడించారు. బీఆర్ఎస్‌కు ఓటు వేయాలని కవిత ఓటర్లకు విజ్ణప్తి చేయడం కచ్చితంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనేనని ఆయన అన్నారు. అందుకే ఈసీకి ఫిర్యాదు చేశామని తెలిపారు.  ఇదిలా ఉండగా తెలంగాణ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది.  పలు చోట్ల ఈవీఎంలు మెరాయించాయి.   సిద్దిపేటలోని అంబి టస్ స్కూల్లో మోడల్ పోలింగ్ బూత్ నెం.118 లో ఈవీఎం మొరాయించింది. మాక్ పోలింగ్ సజావుగా సాగినా, పోలింగ్ ప్రారంభమయ్యాక సమస్య తలెత్తిందని చెబుతున్నారు. అలాగే నిజామాబాద్ లోని నందిపేట మండల కేంద్రంలో, సూర్యాపేట విద్యానగర్ లో,  నాగార్జునసాగర్  లో ఈవీఎంల మొరాయింపు కారణంగా పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.  

ప్రశాంతంగా పోలింగ్.. సీఈవో వికాస్ రాజ్

తెలంగాణ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో  కలిసి వచ్చి సనత్ నగర్ లోని నారాయణ కాలేజీ పోలింగ్ బూత్ లో  ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోందని చెప్పారు. అక్కడక్కడా ఈవీఎంల సమస్య తలెత్తినా వెంటనే సరిచేస్తున్నామన్నారు. యువత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన ఈ సందర్భంగా పిలుపు నిచ్చారు. ఎవరైనా సరే తాము ఓటు వేయాల్సిన పోలింగ్ బూత్ ను యాప్ లొకేషన్ ద్వారా తెలుసుకోవచ్చని చెప్పారు. ఇక ఈ సారి ఓటింగ్ శాతం పెరుగుతుందన్న విశ్వాసాన్ని వికాస్ రాజ్ వ్యక్తం చేశారు.  

ఓటేసిన సినీ రాజకీయ, సినీ ప్రముఖులు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ మొదలైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలు ముందు బారులు తీరారు. ఓటు వేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 35 వేల 655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుండగా.. మావోయిస్టు ప్రభావితమైన 13 నియోజకవర్గాలలో సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే జరగనుంది. గతంలో కంటే ఈ సారి ఎక్కువ ఓటింగ్ జరిగేలా ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కాగా, పోలింగ్ మొదలైన తొలి గంటలోనే రాజకీయ, సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా పోలింగ్ బూత్‌లకు తరలి వచ్చి ఓటు వేశారు.  తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన స్వగ్రామమైన చింతమడకలో ఓటేశారు. మెగాస్టార్ చిరంజీవి తన భార్యతో కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సినీ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌తోపాటు భార్య ప్రణతి, తల్లి షాలిని ఓటు  క్యూలైన్‌లో నిలబడి ఓటేశారు. ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్ లో ఎన్టీఆర్ కుటుంబం ఓటు హక్కు వినియోగించుకున్నది. మరోవైపు ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌తోపాటు సుమంత్ కూడా ఓటు వేశారు. సంగీత దర్శకుడు కీరవాణి కూడా ఓటేశారు.  ఎమ్మెల్సీ కవిత కూడా బంజారాహిల్స్ నందినగర్ లో ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఇక అంబర్ పేటలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకోగా.. వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ఖమ్మంలో కాంగ్రెస్ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి మంచిర్యాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంత్రి, నిర్మల్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ నియోజకవర్గంలోని తన స్వగ్రామమైన ఎల్లపెల్లిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్టీ కండువాతో ఇంద్రకరణ్ రెడ్డి పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఎన్నికల కోడ్ ఉల్లఘించినట్లు తెలుస్తుంది.

ఎన్నికల వేళ తెలంగాణలో రెండు వేల కోట్ల రూపాయల మద్యం విక్రయాలు!

తెలంగాణా ఎన్నికల నేప‌థ్యంలో  మద్యం విక్రయాలు ఏ రేంజ్ లో పెరిగాయో తెలుసా ?  న‌వంబ‌ర్ నెల మొద‌టి 20 రోజుల్లో 1470 కోట్ల రూపాయల మ‌ద్యం అమ్ముడు పోయింది,  మిగిలిన ప‌ది రోజుల లెక్క కూడా వ‌స్తే... ఒక్క న‌వంబ‌ర్ నెల మ‌ద్యం అమ్మ‌కాలు 2 వేల కోట్ల రూపాయ‌లు దాటుతుందన్నది ఒక  అంచ‌నా. ఎన్నిక‌ల నేప‌థ్యంలో కేవ‌లం   నెల‌లోనే రెండు వేల కోట్ల రూపాయ‌ల మ‌ద్యం అమ్మకాలు జరిగాయంటే.. మద్యం ఏ స్థాయిలో ఏరులై పారిందో అవగతమౌతుంది.   గ‌త ఏడాది అంటే 2022 నవంబర్ నెల‌లో లిక్కర్ విక్రయాలు  1260 కోట్ల రూపాయలు మాత్రమే.   అప్పట్లో అంత మొత్తం అమ్ముడుపోవటమే చాలా పెద్ద విషయంగా ఎక్సైజ్ వర్గాలు చెప్పుకున్నాయి. అలాంటిది ఇపుడు మొదటి 20 రోజుల్లో అమ్మకాలు రు. 1470 కోట్ల రూపాయల మద్యం అమ్ముడైందంటే ఇది కచ్చితంగా కొత్త రికార్డుగానే చెప్పాలి.   మొదటి 20 రోజుల్లో అమ్ముడుపోయిన లిక్కర్ ఒక ఎత్తయితే  మిగిలిన పదిరోజులు అంటే 20-30వ తేదీ వరకు అమ్ముడవ్వబోయే లిక్కర్ మరో ఎత్తుగా మారబోతోందని అంటున్నారు. మొత్తంమీద లిక్కర్ అమ్మకాల్లో నవంబర్ మాసం అన్నీ రికార్డులను తిరగరాయటం ఖాయమని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.  ఇక గ‌త ఏడాది నవంబర్ మొదటి 20 రోజుల్లో 12.5 లక్షల కార్టన్ల బీర్లు అమ్ముడుపోతే..   ఈ ఏడాది న‌వంబ‌ర్‌ మొదటి 20 రోజుల్లో 22 కోట్ల కార్టన్ల బీర్లు అమ్ముడు పోవటమే ఆశ్చర్యంగా ఉంది. దీంతోనే లిక్కర్ అమ్మకాల జోష్ ఏ స్ధాయిలో ఉందో అర్ధమైపోతోంది. ఎన్నికల ప్రచారమంటే, ఆ మాత్రం లేక‌పోతే ఎలా అంటున్నారు?  ఏది ఏమైనా  తెలంగాణాలో లిక్కర్ అమ్మకాలు మాత్రం విపరీతంగా పెరిగిపోయాయ‌ట‌. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారు అన్నదాంతో సంబంధం లేకుండా ప్రభుత్వానికి ఎక్సైజ్ ఆదాయం మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. విచిత్రం ఏమిటంటే లిక్కర్ అమ్మకాలు ఒకవైపు ఆకాశమంత ఎత్తున పెరిగిపోతుంటే మరోవైపు దాడుల్లో, సోదాల్లో పోలీసులు వందల కోట్ల రూపాయలు విలువైన మద్యాన్ని పట్టుకుంటున్నారు.  తెలంగాణా వ్యాప్తంగా ఎన్నికల నోటిఫికేషన్ రిలీజైన దగ్గర నుండి పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేస్తున్నారు. ఇందులో డబ్బు, బంగారం, వెండితో పాటు అనేక విలువైన వస్తువులను పట్టుకుంటున్నారు. ఇందులో బాగంగానే వందల కోట్ల రూపాయలు విలువ చేసే లిక్కర్ ను కూడా పట్టుబడటం విశేషం.  105 కోట్ల రూపాయ‌ల విలువైన లిక్కర్ పట్టుబడిందంటేనే తరలిపోయిన లిక్కర్ ఇంకెంత ఉంటుందో అంచనా వేయచ్చు. కేంద్ర ఎన్నికల కమీషన్ ఆదేశాల ప్ర‌కారం  ఈనెల 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు అంటే మూడు రోజులు లిక్కర్ షాపులు, బార్లను మూసేశారు. దాంతో అభ్యర్ధులు ముందుజాగ్రత్తగా ఎవరికి వాళ్ళు వందల కోట్ల రూపాయల విలువైన లిక్కర్ ను కొనేసి ఎక్కడెక్కడో  స్టాక్ చేసుకున్నారు.  

తెలంగాణ ఎన్నికలు.. బెట్టింగుల జోరు!

తెలంగాణ పాలిటిక్స్ పై, క్రికెట్ మ్యాచ్‌కు మించిన ఉత్కంఠ.. క‌నిపిస్తోంది.  తెలంగాణ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్‌ల జోరు మొద‌లైంది. బిజినెస్ పెంచుకోవ‌డం కోస‌మే రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ ను ప్రోత్స‌హిస్తోంది ఇల్లీగ‌ల్ బెట్టింగ్ మాఫియా...  బెట్టింగ్ మాఫియా తెలంగాణా ఎన్నిక‌ల ఫ‌లితాల్ని సొమ్ము చేసుకోవ‌డంపై దృష్టి పెట్టింది.  వెనుకుండి క‌థ న‌డుపుతోంది.   ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఇండియాలోని 14 కోట్ల మంది బెట్టింగ్, గ్యాంబ్లింగ్ కార్యకలాపాలలో రెగ్యులర్ గా భాగం పంచుకుంటున్నారని అంచనా.  ఐపీఎల్ సీజన్లో ఈ సంఖ్య 37 కోట్ల దాకా పెరుగుతోందని  థింక్ ఛేంజ్ ఫోరమ్ (టీసీఎఫ్) నివేదిక  పేర్కొంది.   టీసీఎఫ్ నివేదిక ప్రకారం  బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ను ప్రోత్సహించే 75 వెబ్ సైట్లు పనిచేస్తున్నాయి. ఈ వెబ్ సైట్లన్నీ ఇండియా యూజర్లనే టార్గెట్ చేసుకుంటున్నాయి.  పాపులర్ బాలీవుడ్ యాక్టర్లు, స్పోర్ట్స్ పర్సనాలిటీలను వాడుకుని మరీ దేశంలోని యూజర్లకు దగ్గరయ్యే ప్రయత్నాలను ఆ ఆపరేటర్లు చేస్తున్నారు.   హవాలా, క్రిప్టో కరెన్సీ, ఇతర అక్రమ మార్గాలలో డబ్బు చేతులు మారుతోంది. క్రికెట్ వరల్డ్ కప్  నేప‌థ్యంలో ప్రారంభ‌మైన‌ ఇల్లీగల్ బెట్టింగ్ దేశంలో ఊపందుకుందనేది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. ఏ చిన్న అవ‌కాశాన్ని కూడా వ‌దులుకోకుండా రకరకాల మార్గాలలో కోట్లాది రూపాయలతో పందెం రాయుళ్లు  బెట్టింగ్ చేస్తున్నారట‌.  ఇండియాలో ఏటా సాగుతున్న ఇల్లీగల్ స్పోర్ట్స్ బెట్టింగ్ కార్యకలాపాల విలువ  8 ల‌క్ష‌ల 20 వేల కోట్ల (100 బిలియన్ డాలర్లు)  దాకా ఉంటుందని  థింక్ ఛేంజ్ ఫోరమ్ (టీసీఎఫ్) ఇటీవల విడుదల చేసిన నివేదిక పేర్కొంది.  ఇటీవ‌లే క్రికెట్ పండ‌గ అయిపోయింది. ఇల్లీగల్ బెట్టింగ్ ద్వారా  8 ల‌క్ష‌ల 20 వేల కోట్ల రూపాయ‌లు చేతులు మారాయన్నది టీసీఎఫ్ అంచనా. ప్ర‌స్తుతం.... ఇల్లీగల్ బెట్టింగ్ మాఫియా తెలంగాణా ఎన్నిక‌ల ఫ‌లితాల్ని సొమ్ము చేసుకోవ‌డంపై దృష్టి పెట్టింది.  వెనుకుండి క‌థ న‌డుపుతోంది.  తెలంగాణ పాలిటిక్స్ పై, క్రికెట్ మ్యాచ్‌కు మించిన ఉత్కంఠ.. క‌నిపిస్తోంది.  తెలంగాణ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్‌ల జోరు మొద‌లైంది. బిజినెస్ పెంచుకోవ‌డం కోస‌మే రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ ను ప్రోత్స‌హిస్తోంది ఇల్లీగ‌ల్ బెట్టింగ్ మాఫియా.    గెలిచేది ఎవరు.. కేసీఆర్ సీఎం అవుతారా?  కాంగ్రెస్ గెలుస్తుందా.. రేవంత్ ముఖ్యమంత్రి అవుతారా అన్న చర్చే ఇప్పుడు ఎక్కడ చూసినా జోరుగా సాగుతోంది.  ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీ తలపడుతుండటం.  గత ఎన్నికలకు భిన్నంగా పొత్తు ఈక్వేషన్స్ ఉండటంతో.. మరింత ఆసక్తి రేపుతోంది.   ఈ బెట్టింగ్ గొడ‌వ అంతా తెలంగాణాలో కొన‌సాగుతున్నదంటే పెద్ద విష‌యం ఏమీ కాదు కానీ ఈసారి పొలిటికల్ బెట్టింగ్స్.. ఏపీలోనూ జోరుగా సాగటం విశేషం.  గత ఎన్నికల కంటే ఈసారి తెలంగాణ పాలిటిక్స్ పై  ఏపీలో బెట్టింగ్స్ జోరుగా సాగుతున్నాయి.  అందుకు కారణం లేకపోలేదు.  కాంగ్రెస్ పార్టీకి,.... టీడీపీ శ్రేణులు మద్దతుగా నిలవడం ఒక కారణమైతే..  రేవంత్ రెడ్డిని టీడీపీ అనుకూల వర్గం ఓన్ చేసుకోవటం మరో కారణం.  ఏపీ తెలుగుదేశం అభిమానులు మొత్తం కాంగ్రెస్ వైపు బెట్టింగ్స్ ఎక్కువ కాస్తున్నారు.  తెలంగాణ ఎన్నికల వేళ ఏపీలోనూ బెట్టింగ్ జోరు మొదలయ్యింది.. బెట్టింగ్ రాయుళ్లు.. కేవలం హైదరాబాద్ లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో తెలంగాణ ఎన్నికల ఫలితాలపై హోరాహోరీ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి ఎవరు వస్తారు..? అనే దానిపై ఏపీ లో కూడా విపరీతంగా బెట్టింగ్స్ పెడుతున్నారు..  పోలింగ్ సమయం సమీపిస్తున్న వేళ బెట్టింగ్ రాయుళ్ల జోష్ పెరుగుతోంది.  ఈ బెట్టింగ్ బిజినెస్‌ సుమారుగా 3 వేల కోట్ల రూపాయ‌ల నుండి 5 వేల కోట్ల రూపాయల వరకు  ఉండే అవకాశం ఉందని సమాచారం.. బెట్టింగ్‌లలో  తెలంగాణలో ఏ పార్టీ గెలుస్తుంది?  నెక్స్ట్ సీఎం ఎవరు..? నియోజకవర్గ స్థాయిలో ఎవరు గెలుస్తారు..?  వివిధ రకాలుగా బెట్టింగులు పెడుతున్నారు నిర్వాహకులi. క్రికెట్ లో బాల్ బాల్ కు బెట్టింగ్ జరిగినట్లు..  తెలంగాణ పొలిటికల్ ఫీవర్.... ఇప్పుడు బెట్టింగ్స్ లోనూ మంట పుట్టిస్తున్నది. ఎన్నికల ఫలితాలపై పందేలు కొన‌సాగుతున్నాయి..  విచ్చ‌ల‌విడిగా కోట్ల రూపాయలు ఇప్పటికే చేతులు మారుతున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ లోని ఎక్కువ ఓట్లు ఉన్న శేరిలింగంపల్లి నియోజకవర్గం పై కూడా బెట్టింగ్ రాయుళ్లు పందాలు పెడుతున్నారు…అరికపూడి గాంధీ గెలుస్తారా? ఒడిపోతారా?.. అని ఎక్కువ స్థాయి లో డబ్బులు పెడుతున్నట్టుగా సమాచారం..  ఇక అనుకూలంగా ఉన్న వ్యక్తులు గెలుస్తారంటూ ఎవరికివారు పందాలకు దిగుతున్నారు. ఈ విధంగా నాయ‌కుల పై కాసుల వర్షం కురిపిస్తున్నారు… మరోవైపు, గ్రేటర్ హైదరాబాద్ లో కీలకంగా ఉన్న నియోజకవర్గాలు శేరిలింగంపల్లి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, ఉప్పల్ నియోజకవర్గాలపై ఎక్కువ బెట్టింగ్ లు నిర్వహిస్తున్నారు.  ఇక జిల్లాల వారిగా కొడంగల్, దుబ్బాక, కామారెడ్డి…ప్రాంతాలపై మరింత బెట్టింగ్ పెట్టేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పందెం రాయుళ్లు. దీంతో తెలంగాణ పోలింగ్ సమయం దగ్గర పడడంతో కేవలం తెలంగాణా రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లోనూ బెట్టింగుల జోరు ఊపందుకుంటోంది.   బెట్టింగ్ వ్యాపారం బుకింగ్ జోరుగానే సాగుతోంది.   మొత్తం స్టేట్ లెవెల్‌లో చూస్తే కాంగ్రెస్ వైపు రూపాయి పెడితే, రూపాయి 40 పైసలు నడుస్తోంది. బీఆర్ఎస్ వైపు మాత్రం రూపాయికి,  కేవ‌లం 60 పైసలు నడుస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీల మధ్య బెట్టింగ్ హోరాహోరీగా సాగుతుంది.  ప్ర‌త్యేకించి ఒక్కో నియోజ‌క‌వ‌ర్గం గురించి అయితే ..... ఒకటికి ఒకటి అన్నట్లు బెట్ కాస్తున్నారు.  ఇదే సమయంలో బీజేపీ ఎన్ని సీట్లు గెలుస్తుంది అనేది ఇంట్రస్టింగ్ పాయింట్ అయ్యింది.  బీజేపీ గెలిచే సీట్ల సంఖ్యపైనా బెట్టింగ్స్ జరగటం ఆసక్తి రేపుతోంది.   ఇదే సమయంలో సీఎం కేసీఆర్ రెండు చోట్ల నుంచి బరిలోకి దిగారు.. ఒకటి గజ్వేల్, ఒకటి కామారెడ్డి.. కేసీఆర్ రెండు చోట్ల గెలుస్తారా లేక ఒక చోట గెలుస్తారా?. ఒకే స్థానంలో విజయం సాధిస్తే అది గజ్వేలా? కామారెడ్డా? ఓడిపోయే సీటు ఏది?  అన్న అంశంపైనా   బెట్టింగ్స్ జరుగుతున్నాయి.  హైదరాబాద్ తోపాటు ఏపీలోని ఈస్ట్, వెస్ట్, గుంటూరు, విజయవాడ కేంద్రాలుగా బెట్టింగ్స్ బాగా జరుగుతున్నాయి.   పోలింగ్ ముగిసే వరకు మాత్రమే ప్రస్తుతం ఈ రేటుపై బెట్టింగ్స్ జరుగుతుంద‌ట‌. పోలింగ్ ముగిసి  ఎగ్జిట్ పోల్స్ విడుదలైన తరువాత  ఇంకెంత బెట్టింగ్ జరుగుతుందో చూడాలి. ఎ  నవంబర్ 30 న ఎన్నికలు జరుగుతుండటం,  డిసెంబర్ 3 న అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఉండటం తో బెట్టింగ్ రాయుళ్లు తీరిక లేకుండా గడుపుతున్నారు. 

జేడీ సంచలన నిర్ణయం..!

నూతన విధి, విధానాలతో కొత్త పార్టీని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని సీబీఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. బుధవారం (నవంబర్ 29) విశాఖపట్నం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. రాజకీయాలు భవిష్యత్తు నిర్ణయిస్తున్నప్పుడు.. భవిష్యత్తు రాజకీయాలను యువత నిర్ణయిస్తే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. రాజకీయాల్లోకి యువత రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కొత్త విధి, విధానాలు తీసుకు రావడం ముఖ్యమని.. వాటిని వచ్చే ఎన్నికల వేళ.. ప్రజల ముందుకు తీసుకు రావాలని.. అయితే పార్టీలు గెలవడం ముఖ్యం కాదని.. ప్రజలు గెలవడం ముఖ్యమని  స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలో బోగస్ ఓట్ల ఏరివేత ఖచ్చితంగా జరగాలన్నారు. డూప్లికేట్ ఓట్లను తొలగించాల్సిందేనని స్పష్టం చేశారు. నిజమైన ఓట్ల తొలగింపుపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని ఈ సందర్బంగా ఆయన డిమాండ్ చేశారు. డిసెంబర్ 2వ తేదీ జేడీ ఫౌండేషన్, నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ జాబ్ ఫేయిర్‌కు 50కి పైగా కంపెనీలు పాల్గొంటాయని.. అర్హత గల యువతకు అక్కడే కంపెనీలు ఆఫర్ లెటర్  అందజేస్తాయని లక్ష్మీనారాయణ చెప్పారు. పదో తరగతి ఆపై విద్యార్హత ఉన్న వారు ఎవరైనా ఈ జాబ్ ఫెయిర్‌కు హాజరు కావచ్చని చెప్పారు.  కొంచె వెనుకబడిన అభ్యర్థులకు స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కూడా నిర్వహిస్తామని జేడీ లక్ష్మీనారాయణ అన్నారు.  మరోవైపు ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి పోటీ చేస్తానని ఆయన పలు వేదికల మీద.. వివిధ సందర్బాల్లో ప్రకటిస్తూ వస్తున్నారు. కానీ ఏ పార్టీ నుంచి అనే అంశంపై మాత్రం ఇప్పటి వరకూ క్లారిటీ   ఇవ్వ  లేదు. అలాంటి వేళ..   కొత్త పార్టీ స్థాపించి.. ఆ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని  జేడీ ఈ ప్రెస్ మీట్‌‌ ద్వారా చెప్పారని పరిశీలకులు భావిస్తున్నారు.   గత ఎన్నికల్లో విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి జనసేన  అభ్యర్థిగా బరిలో దిగి.. వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ చేతిలో ఓటమి పాలయ్యారు. కానీ ఆ ఎన్నికల్లో ఓట్ల పరంగా ఆయన రెండో స్థానంలో నిలవడం గమనార్హం. ఆ తర్వాత పలు కారణాలతో ఆయన  జనసేనకు గుడ్ బై చెప్పారు. కానీ ఆయన తనదైన శైలిలో సమాజ సేవ చేస్తూ.. వివిధ సందర్భాల్లో యువతకు స్పూర్తిదాయకంగా నిలుస్తూ.. ఉత్తేజకర ప్రసంగాలు చేస్తూ వస్తున్నారు. ఇంకోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన బర్రెలక్కెను కలిసి.. ఆమెకు మద్దతు తెలపడమే కాకుండా.. యువత రాజకీయాల్లోకి రావాలని  ఆకాంక్షించారు.  1990 ఐపీఎస్ బ్యాచ్, మహారాష్ట్ర కేడర్ అధికారి అయిన వివి లక్ష్మీనారాయణ.. 2018 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఉద్యోగానికి రాజీనామా చేసి.. విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.  జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా వివి లక్ష్మీనారాయణ దర్యాప్తు చేసిన సంగతి తెలిసిందే.  ఆ క్రమంలో ఆయన పేరు.. జేడీ లక్ష్మీ నారాయణగా స్థిరపడిపోయింది.

టెన్షన్.. టెన్షన్..

తెలంగాణలో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం మంగళవారం (నవంబర్ 28) సాయంత్రం 5 గంటలతో ముగిసింది. గురువారం (నవంబర్ 30) జరగనున్న పోలింగ్‌కు ఎన్నికల సంఘం (ఈసీ) సర్వం సిద్దం చేసింది. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో 2,290 మంది అభ్యర్థులు బరిలో దిగారు. ఈ ఎన్నికల్లో 3.26 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అందుకోసం 35,655 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. అలాగే వృద్దులు, దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకొనేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టింది.    గురువారం ఉదయం 7.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు జరిగే ఈ పోలింగ్ కోసం.. 375 ఆర్మ్‌డ్ సెంట్రల ఫోర్స్ కంపెనీ సిబ్బందితోపాటు 50 వేల మంది పోలీసులను భద్రత కోసం వినియోగించనున్నారు. తీవ్రవాద ప్రభావం ఉన్న ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలను నవంబర్ 28వ తేదీ సాయంత్రం నుంచి పోలింగ్ జరిగే నవంబర్ 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మూసి ఉంచుతున్నారు. అదే విధంగా ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో నవంబర్ 29, 30 తేదీల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.  అయితే ఈ ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు స్థానాలు... గజ్వేలు, కామారెడ్డి నుంచి బరిలో దిగగా.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం కోడంగల్, కామారెడ్డి నుంచి బరిలోకి దిగారు. ఇక బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సైతం హుజూరాబాద్, గజ్వేల్ నుంచి బరిలో నిలిచారు. మొత్తంగా గులాబీ బాస్ కేసీఆర్‌ను ఓడించేందుకు అటు హస్తం పార్టీ అధ్యక్షుడు, ఇటు బీజేపీ ఎమ్మెల్యే ఈటల కంకణం కట్టుకున్నారనే  ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో ఉపందుకొంది.  మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగలేదు. గత ఎన్నికల్లో అంబర్ పేట నుంచి బరిలో దిగిన ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొంది.. మోదీ కేబినెట్‌లో మంత్రిగా చోటు సంపాదించారు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు.. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ను తప్పించి.. ఆ స్థానంలో కిషన్ రెడ్డిని నియమించడంతో..  అసంతృప్తి వ్యక్తం చేసిన రాములమ్మ..   కాషాయం పెద్దల నిర్ణయాన్ని  వ్యతిరేకిస్తూ.. ఆ పార్టీకి రాం రాం చెప్పి.. హస్తం పార్టీకి స్నేహ హస్తం అందించారు. ఇక కరీంనగర్ ప్రస్తుత లోక్‌సభ సభ్యుడు బండి సంజయ్.. అదే కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలవడం గమనార్హం.     అలాగే గత అసెంబ్లీ ఎన్నికల్లో కోడంగల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిన రేవంత్ రెడ్డి.. ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత టీపీసీసీ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టి ఆ పార్టీకి అన్నీ తానై ముందుకు నడిపిస్తున్నారు. ఆయన సైతం ఈ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేస్తుండడం గమనార్హం.   ఇక టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సస్పెన్షన్ వేటు వేయడంతో బీజేపీలో చేరిన ఈటల రాజేందర్.. ఆ క్రమంలో జరిగిన ఉప ఎన్నికల్లో హుజూరాబాద్‌ నుంచి ఆయన గెలుపొందారు. మళ్లీ ఆయన అదే స్థానంతోపాటు కేసీఆర్ బరిలో దిగిన గజ్వేల్ నుంచి కూడా పోటీ చేస్తున్నారు.  అలాగే ఐపీఎస్ అధికారి.. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్.. తన ఉద్యోగానికి రాజీనామా చేసి. సిర్పూర్ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.  అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ముచ్చటగా మూడోసారి జరుగుతున్న ఈ ఎన్నికల్లో అధికార పీఠాన్ని ఎవరు కైవసం చేసుకొంటారనే ఓ విధమైన టెన్షన్.. ఆ యా పార్టీల అధినేతల్లోనే కాదు.. ఇటు ప్రజల్లో సైతం టెన్షన్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకోవైపు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15 అసెంబ్లీ స్థానాల్లో స్వతంత్ర్య అభ్యర్థులు, రెబల్స్ బెడద అన్ని రాజకీయ పార్టీలను  ఇబ్బంది పెడుతోంది. వీరితో ఓట్లు భారీగా చీలి.. ఓటమి పాలవుతామనే ఓ విధమైన బెంగ.. వివిధ రాజకీయ పార్టీల నేతల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.  మరోవైపు... తెలంగాణలో వరుసగా రెండు సార్లు అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలు.. ముచ్చటగా మూడోసారి కూడా కారు పార్టీకే ప్రజలు పట్టం కడతారా? లేకుంటే... కాంగ్రెస్ పార్టీకి ప్రజలు చేతులెత్తి జై కొడతారా? అదీ ఇది కాదు.. కాషాయం పార్టీని ఆదరిస్తారా? అంటే.. అందుకు జవాబు మాత్రం డిసెంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ద్వారా ప్రజా నాడి బహిర్గతం కానుంది.

సైలెన్స్ తెలంగాణ!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ప్రచార ఘట్టం మంగళవారం (నవంబర్28) సాయంత్రంలో ముగిసింది.  ఇలా ప్రచార గడువు ముగియడంతోనే రాష్ట్రంలో  144 సెక్షన్‌ అమలులోకి వచ్చింది.  ప్రచార గడువు ముగిసింది కనుక స్థానికేతరులు నియోజకవర్గాలు విడిచి వెళ్లాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.   పోలింగ్ ఈ నెల 30న జరగనున్న సంగతి విదితమే. దీంతో ఎన్నికల సంఘం నిబంధనల్లో భాగంగా 24 గంటల ముందే ప్రచారం ముగిసింది.  ఎన్నికల షెడ్యూల్ విడుదలైన అక్టోబర్ 9వ తేదీ నుండి దాదాపు రెండు నెలల పాటు రాష్ట్రంలో రాజకీయ నేతలు ప్రచారం హోరెత్తించారు. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల అగ్రనేతలు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేశారు. హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్  నెల రోజులలో సగటున రోజుకు మూడు చొప్పున దాదాపు 95 బహిరంగ సభల్లో పాల్గొనగా.. గులాబీ పార్టీ స్టార్ క్యాంపెయినర్లు మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహించారు. మరో పక్కా బీఆర్ఎస్‌ను గద్దె దింపడమే టార్గెట్‌గా పెట్టుకున్న కాంగ్రెస్ సైతం ప్రచారం హోరెత్తించింది. కర్నాటక ఎన్నికల ఫలితాల  తరువాత   గ్రాఫ్ అమాంతం పెరగడంతో.. తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణులు నూతనోత్సహంతో ప్రచారం నిర్వహించాయి. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక, ఖర్గే, డీకే, సిద్ధారామయ్య వంటి నేతలు తెలంగాణలో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా జోరుగా ప్రచారం చేశారు. మరో పక్క బీజేపీ సైతం   పెద్ద ఎత్తున ప్రచారం చేసింది.   ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డా, యోగి సహా పలువురు బీజేపీ అగ్రనేతలు కీలక నేతలు తెలంగాణను చుట్టేశారు. మూడు పార్టీల నేతల ప్రచారంతో  హోరెత్తిన తెలంగాణ.మంగళవారం (నవంబర్ 28) సాయంత్రం నుండి మూగబోయింది. గురువారం (నవంబర్ 30) న పోలింగ్ జరగనుండగా.. ఆదివారం (డిసెంబర్ 3) ఓట్ల లెక్కింపు జరిగగి ఫలితాలు వెలువడనున్నాయి. తెలంగాణ తీర్పు ఏ పార్టీకి అనుకూలం అన్నది ఆ రోజు తేలిపోనున్నది.