ఎన్ఐఏ కోర్టుకు జగన్?.. ఎందుకంటే
posted on Jan 13, 2023 @ 2:21PM
జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్టుకు జగన్ హాజరు కావాల్సిందే. అయితే ఆయన ఇంత వరకూ కోర్టు మెట్లు నిందితుడిగా ఎక్కుతూ వస్తున్నారు. ఇప్పుడు ఎన్ఐఏ కోర్టుకు ఆయన బాధితుడిగా హాజరు అవ్వాల్సి వస్తోంది. ఔను బాధితుడిగానే. టెక్నికల్ ఈ బాధితుడిగా హాజరు కావాల్సి వచ్చినా వాస్తవానికి ఈ కేసు కారణంగా ఆయన గత ఎన్నికల్లో లబ్ధి పొందారు. ఔను కోడి కత్తి కేసును జాతీయ దర్యాప్తు సంస్థ టేకప్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ సందర్భంగా ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఈ కేసులో బాధితుడి స్టేట్ మెంట్ ఎందుకు రికార్డు చేయలేదని ప్రశ్నించింది. బాధితుడిని విచారించకుండా, స్టేట్ మెంట్ రికార్డు చేయకుండా సాక్షులను మాత్రం విచారించి ప్రయోజనం ఏమిటని ప్రశ్నించింది. ఈ కేసులో జగన్ స్టేట్ మెంట్ రికార్డు చేసినట్లుగా ఎన్ఐఏ తరఫున్యాయవాది కోర్టుకు తెలియజేశారు. అయితే చార్జిషీట్ లో ఆ స్టేట్ మెంట్ ఏదని కోర్టు ప్రశ్నించింది. ఈ కేసులో 56 మందిని విచారిస్తే.. మొదటి 12 మంది స్టేట్ మెంట్లూ చార్జిషీట్ లో లేకపోవడాన్ని కోర్టు తప్పుపట్టింది. ఈ కేసులో కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్ కు బెయిలు నిరాకరించిన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఈ నెల 31 నుంచి కేసు విచారణ చేపడతామని పేర్కొంది. ఈ కేసు విచారణకు బాధితుడితో సహా అందరూ హాజరు కావాల్సిందేనని ఆదేశించింది. దీంతో కోడి కత్తి కేసులో బాధితుడిగా ఉన్న జగన్ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరు కావాల్సి ఉంది. గత ఎన్నికలకు ముందు విశాఖ విమానాశ్రయంలో జగన్ పై కోడి కత్తితో దాడి జరిగిన సంగతి విదితమే. ఆ దాడి కారణంగా అప్పటి ఎన్నికలలో జగన్ పార్టీకి సానుభూతి లభించి లబ్ధి చేకూరిన సంగతి విదితమే.
నిందితుడిగా సీబీఐ కోర్టుకు హాజరైన సీఎం జగన్ త్వరలో బాధితుడిగా ఎన్ఐఏ కోర్టుకు హాజరు కావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జగన్‌పై విశాఖలో జరిగిన కోడికత్తి దాడి ఘటనలో నిందితుడు శ్రీనివాస్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ విచారణలో బెయిల్ పిటిషన్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు. నెలాఖరు నుంచి ఈ కేసులో విచారణ ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఎన్ఐఏ దాఖలు చేసిన చార్జిషీటును పరిశీలించారు.
ఈ కేసులో ఇంత వరకూ బాధితుడైన జగన్మోహన్ రెడ్డి దగ్గర స్టేట్ మెంట్ తీసుకోలేదని ఎన్ఐఏపై .. శ్రీనివాస్ తరపు లాయర్ ఫిర్యాదు చేశారు. అయితే తాము జగన్ స్టేట్ మెంట్ నమోదు చేశామని ఎన్ఐఏ లాయర్ కోర్టుకు తెలిపారు.. అయితే ఆ స్టేట్ మెంట్.. చార్జిషీటులో ఎందుకు లేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. బాధితుడి స్టేట్ మెంట్ నమోదు చేయకుండా ఇతర సాక్షులను విచారిస్తే ఏం ప్రయోజనమని న్యాయమూర్తి ప్రశ్నించారు. నెలాఖరు నుంచి రెగ్యులర్ విచారణను ప్రారంభిస్తున్నందున బాధితుడు కూడా కోర్టుకు హాజరు కావాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశించింది. దీంతో బాధితుడైన సీఎం జగన్ కూడా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది.