కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై చార్జ్ షీట్.. రేవంత్
టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి గాంధీ ఐడియాలజీ కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ శిక్షణా తరగతుల్లో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, సంపత్ కుమార్, చిన్నారెడ్డి, సీనియర్ నాయకులు మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, రామచంద్రారెడ్డి, సంభాని చంద్రశేఖర్, కోదండ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, మల్లు రవి, హర్కర వేణుగోపాల్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాములు నాయక్, నిరంజన్, పీఏసీ, పిఈసి సభ్యులు, సీనియర్ ఉపాధ్యక్షలు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల చైర్మన్ లు, పీసీసీ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ శిక్షణా తరగతుల్లో ధరణి, హాత్ సే హాత్ జోడో అభియాన్, ఎన్నికల నిబంధనలు, ఇన్సూరెన్స్, మీడియా, సోషల్ మీడియా వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన రేవంత్ రెడ్డి బీజేపీ, బీఆర్ఎస్ లపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భారత్ కు మంచి నాయకత్వాన్ని అందించింది కాంగ్రెస్ మాత్రమేనని చెప్పారు. కాంగ్రెస్ ఎప్పుడూ పదవుల కోసం, అధికారం కోసం పాకులాడలేదనీ, దేశ ప్రగతి, పేదల సంక్షేమమే ధ్యేయంగా పని చేసింన్నారు. అవకాశం వచ్చినా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రధాని పదవిని తృణ ప్రాయంగా తిరస్కరించారని రేవంత్ చెప్పారు. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ కృషి చేసిందని చెప్పారు. ఇక కాంగ్రెస్ కీలక నేత భారత్ జోడో యాత్ర దేశంలో వైషమ్యాలను రూపు మాపి ఐక్యత కోసం సాగుతోందని చెప్పారు.
ఎముకలు కొరికే చలిలో సైతం రాహుల్ గాంధీ బీజేపీ ప్రజలలో కలిగించిన ద్వేష భావనలను పోగొట్టి ఐక్యత కోసం ప్రాణాలకు తెగించి నడుస్తున్నారని రేవంత్ అన్నారు. రాహుల్ సందేశాన్ని ప్రతి గడపకూ చేరవేసేందుకు రాహుల్ భారత్ జోడో యాత్ర ముగిసిన తరువాత కాంగ్రెస్ జాతీయ నాయకత్వం హాత్ సే హాత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టనుందని అన్నారు. అయితే కేంద్రంలో మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం మాత్రం దేశ రక్షణను సైతం విస్మరించి సరిహద్దుల్లో దురాక్రమణలను సైతం పట్టించుకోకుండా అలాంటివేమీ లేవని బుకాయిస్తోందని విమర్శించారు. మీడియా చేతిలో ఉందని ఇష్టారీతిగా వ్యవహరిస్తే ఏం ఒరగదని పరోక్షంగా బీఆర్ఎస్ ను హెచ్చరించారు.
గతంలో మీడియా మొత్తం తెలుగుదేశంను, చంద్రబాబును సమర్దించినా వైఎస్ రాజశేఖరరెడ్డి విజయాన్ని సాధించారని అన్నారు. కేంద్రంలోని మోడీ సర్కార్, తెలంగాణలోని కేసీఆర్ సర్కార్ ల వైఫల్యాలపై చార్జిషీట్ విడుదల చేయనున్నామన్నారు. తెలంగాణలో నిరంకుశ పాలన కొనసాగుతోందనీ, దాని నుంచి తెలంగాణకు విముక్తి కలిగించేది కాంగ్రెస్ మాత్రమేనన్నారు. బండ్ల తోటి, గుండ్ల తోటీ జరిగేదేం లేదని రేవంత్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, అందుకు కాంగ్రెస్ శ్రేణులు ఐక్యంగా పని చేయాలన్నారు. ఓటరు జాబితాలో కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారన్న రేవంత్, అలా తొలగించిన ఓట్లను తిరిగి ఓటర్ల జాబితాలో చేర్పించాలని అన్నారు. ధరణితో లక్షలాది మంది సమస్యలు ఎదుర్కొంటు న్నారన్నారు.
అయితే రాష్ట్ర కాంగ్రెస్ లో విభేదాల పరిష్కారానికి అధిష్ఠానం ఎంత ప్రయత్నిస్తున్నా పూర్తిగా సఫలం కాలేకపోతున్నది. టీపీసీసీ ఆధ్వరంలో కాంగ్రెస్ శిక్షణ తరగతులుకు హాజరు కావాలన అధిష్ఠానం ఆదేశించినప్పటికీ పలువురు నేతలు డుమ్మా కొట్టారు. పార్టీ సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కి, వీహెచ్ హనుమంత రావు, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహ, మహేశ్వర్ రెడ్డి.. శిక్షణా కార్యక్రమానికి గైర్హాజరయ్యారు.