వలసల భారతం!
posted on Jan 13, 2023 @ 12:55PM
ఏటా లక్షలాది మంది భారతీయులు విదేశాలకు వలస వెళ్లిపోతుండటం అత్యంత ఆందోళన కలిగిస్తున్న అంశం. స్వదేశంలో కన్నా విదేశాల్లో స్థిరపడడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న భారతీయుల సంఖ్య ఏటా పెరిగిపోతుండటానికి కారణమేమిటన్న దానిపై ఇటీవల ఇండోర్ లో జరిగిన భారతీయ ప్రవాసీ దివస్ లో చర్చ జరిగింది. తాజా గణాంక వివరాల ప్రకారం, ప్రస్తుతం కోటీ 80 లక్షల మంది భారతీయులు విదేశాల్లో నివసిస్తున్నారు.
ఇంత పెద్ద సంఖ్యోలో విదేశాలకు వెళ్లిన జనాభా ఉన్న దేశం ప్రపంచంలో భారత్ మాత్రమే. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున వలసలు పోతున్నారన్న దానిపైనే భారతీయ ప్రవాసీ దివస్‌లో ఆందోళన వ్యక్తమైంది. భారతీయుల్లో అత్యధిక సంఖ్యా కులు విదేశాల్లో తమ భవితవ్యాన్ని, తమ అదృష్టాన్ని వెతుక్కోవడానికి దారి తీస్తున్న కారణాలపై కూడా చర్చ జరిగింది. భారత్ తర్వాత అంత పెద్ద సంఖ్యలో వలసలు పోతున్న జనాభా కలిగిన దేశం మెక్సికో మాత్రమే. అయితే అక్కడి వారు ఎక్కువగా వలస వేళ్లేది అమెరికాకు మాత్రమే. అదే ఇండియన్స్ విషయానికి వస్తే.. వీరు దేశం విడిచి వెళ్లడానికి డెస్టినేషన్ ఒక్క అమెరికా మాత్రమే కాదు.. ప్రపంచంలోని ఏ దేశానికైనా సరే వెళ్లడానికి ఇసుమంతైనా సందేహించకుండా వెళ్లిపోతున్నారు.
ఒక్క గల్ఫ్ దేశాలలోనే దాదాపు 80 లక్సల మంది భారతీయులు ఉద్యోగమో, వృత్తో, వ్యాపారమో చేసుకుంటగూ జీవనం గడుపుతున్నారు. అలాగూ అమెరికా, ఇంగ్లండ్ ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ దేశాలకు వలస వెళ్లిన వారి సంఖ్యా లక్షల్లోనే ఉంటుంది. వీరంతా స్వదేశీ పాస్ పోర్టు స్థానంలో వీరు నివసిస్తున్న దేశం పాస్ పోర్టు కోసం ప్రయత్నాలు చేసి సాధిస్తున్నారు. తూర్పు ఆఫ్రికా, కరిబ్బియన్, మలేషియా, ఫిజి దేశాల్లో కూడా భారతీయులు స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు. వీరంతా వలస పాలకుల కాలంలోనే భారతదేశం వదిలి ఇక్కడకు కార్మికులుగా చేరుకుని స్థిరపడ్డారు. విదేశాలకు వలస వెళ్లి స్థిరపడిన భారతీయుల్లో కార్మికులూ ఉన్నారు. అధికారులు ఉన్నారు. యజమానులు ఉన్నారు.
సంపన్నులూ, పేదవారూ కూడా ఉన్నారు. అయితే, వీళ్ల భవిష్యత్తు ఎలా ఉండబోతోందన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఆయా దేశాలలో సమస్యలు ఉత్పన్నమైనప్పుడు అక్కడి వారి దృష్టి పడేది ప్రధానంగా ప్రవాసులపైనే. విశేషమేమిటంటే, చాలా దేశాల్లో భారతీయులు ఘన విజయాలు సాధిస్తున్నారు. ఇక అమెరికాలో అయితే, ఇతర దేశాల సంతతికి చెందినవారిలో భారతీయులే సంపన్న వర్గంగా రికార్డులకెక్కింది. ఇంగ్లండ్ పోర్చుగల్, ఐర్లాండ మారిషస్ ప్రధాన మంత్రులు, గుయానా, సూరినామ్, ఇండొనీషియా అ ధ్యక్షులు భారతీయ సంతతికి చెందినవారే. మొత్తం మీద నాలుగు ఖండాల్లోని దేశాలలో భారతీయులే అగ్రస్థానంలో ఉన్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కూడా భారతీయ సంతతికి చెందిన వ్యక్తే. అనేక దేశాల్లో అత్యంత పట్టు, పలుకుబడి కలిగిన వర్గంగా రూపాంతరం చెందిన భారతీయులు భారత్‌కు, ఇతర దేశాలకు మధ్య భౌగోళికంగానే కాక, రాజ కీయంగా, ఆర్థికంగా కూడా ఓ బలమైన వారధిగా పనిచేయడం కద్దు. ఇలా ఎన్నిసానుకూలతలు ఉన్నా అందే ఆందోళన కర విషయాలు కూడా ఉన్నాయి.
ప్రతి ఏటా కనీసం లక్షమంది భారతీయులు తమ భారతీయ పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు. 2022లో మొదటి పది నెలల కాలంలోనే ఈ సంఖ్య లక్షా 83 వేలు దాటింది. హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే ప్రసిద్ధ కన్సల్టెన్సీ సంస్థ అందజేసిన వివరాల ప్రకారం, గత ఏడాది సుమారు 8,000 మంది భారతీయ కుబేరులు భారతదేశ పౌరస త్వానికి స్వస్తి పలికారు. అంతేకాదు, సంపన్న భారతీయుల్లో ఎక్కువ మంది విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం జరుగుతోంది. భారత దేశ ఆర్థిక వ్యవస్థ మీద విశ్వాసం సడలిపోవడమే ఇందుకు ముఖ్యంకారణంగా చెబుతున్నారు. దేశంలో రాజకీయ పరిస్థితులు, ఆర్ధిక విధానాలు కారణంగానే తాము దేశం విడిచి వెళ్లడానికి కారణమని కూడా అత్యధికులు చెబుతున్నారు.