తెలంగాణ సీఎంకు ఏపీ పై ఎందుకంత ప్రేమ ?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనగానే, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన అలుపెరగని పోరాటం గుర్తుకొస్తుంది. ఆయన లేకుంటే తెలంగాణ ఉద్యమం లేదు, అసలు తెలంగాణ లేదు. తెలంగాణ అస్తిత్వ వాదాన్ని ఆయుధంగా చేసుకుని, చావు నోట్లో తల పెట్టి, పోరాడి తెలంగాణ సాధించారు కేసీఆర్. పుష్కర కాలంపైగా సాగిన తెలంగాణ మలిదశ ఆందోళనకు కర్త, కర్మ, క్రియా అన్నీ ఆయనే.(అవును ఆయనే లేకుంటే 1200 మంది యువకుల బలిదానాలు ఉండేవి కాదు, ఆ 1200 బలిదానాలు లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు, తెలంగాణ రాకుంటే లిక్కర్ స్కాములు, వందల వేల కోట్లకు పడగలెత్తిన కుటుంబాలు ఉండేవి కాదని, కొందరు చేస్తున్న వాదనలో నిజం ఉంటే ఉండొచ్చు కానీ అది వేరే విషయం) 

అయితే ఇప్పుడు అదే కేసేఆర్, తెలంగాణ పేరు చెప్పుకుని  జాతీయ స్థాయిలో రాజకీయం చేసేందుకు  బాటలు వేసుకుంటున్నారు. ఆ క్రమంలో అప్పట్లో ఆంధ్ర ప్రాంత ప్రజలను ఆంధ్ర ప్రాంత పాలకులను అనేక విధాల దూషించిన ఆయన ఈరోజు తెలంగాణ కంటే ఏపీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. చివరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకంలోనూ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ కుల సమీకరణలు పనిచేశాయని అంటున్నారు. నిజానికి, మూడు రోజుల క్రితం  శాంతికుమారిని  సీఎస్‌గా నియమించిన వెంటనే ఏపీ బీఆర్‌ఎస్‌ నేతలు ప్రగతిభవన్ కు వెళ్లి అభినందించారు.  కేసీఆర్‌తో పాటు కొత్త సీఎస్‌, ఏపీ బీఆర్‌ఎస్‌ నేతలు ఉన్న ఫొటోలను సీఎంవోనే రిలీజ్‌ చేసింది. అప్పటి వరకు తెలంగాణకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు కొత్త సీఎస్‌ను కలువనే లేదు. కానీ ఏపీ నేతలు మాత్రం ఫోటోలు దిగారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

అంతే కాదు  ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లుగా తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలకే  డైరెక్ట్ ఎంట్రీ లేని ప్రగతి భవన్ లోకి బీఆర్ఎస్ ఆంధ్రా నేతలకు మాత్రం ఎప్పుడంటే అప్పడు వచ్చి పోయే విధంగా బ్లాంకెట్ పర్మిషన్ ఇచ్చారని అంటున్నారు. ఆంధ్రా నాయకులకు ఎప్పుడు అనుకుంటే అప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ దొరుకుతుందని అంటున్నారు. నిజానికి  ప్రగతి భవన్ గేట్లు తెరుచుకునేందుకు, ‘ఏపీ బీఆర్ఎస్’ పాస్ వర్డ్ గా  మారిందని అంటున్నారు.  

నిజానికి  జాతీయ ఆలోచనలు మొగ్గతొడిగిన నాటి నుంచి కేసీఆర్  కు ప్రాధాన్యతలు మారి పోయాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గడచిన ఎనిమిదేళ్ళలో  ఇంచుమించుగా మూడు వేలకు మందికి పైగా తెలంగాణ రైతులు  అందులో అధిక శాతం కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆయినా అందులో సగం కుటుంబాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం  ఉదారంగా కాదు చట్టపరంగా ఇవ్వవలసిన నష్ట పరిహారం కూడా ఇవ్వలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.  అయినా, ముఖ్యమంత్రి కేసేఅర్ పంజాబ్, బీహార్, జార్ఖండ్  రాష్ట్రాలలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు ఉదారంగా ఆర్థిక సహాయం అందించి వచ్చారు.  అంత కంటే మరింత ఉదారంగా భాషా భేదం,  ప్రాంతీయ భేదం లేకుండా దేశంలోని జాతీయ, ప్రాంతీయ పత్రికలు అన్నింటిలో  పెద్ద ఎత్తున ప్రకటనలు (అడ్వర్ టైజ్ మెంట్లు) ఇచ్చి ప్రచారం చేసుకున్నారు.  అలాగే  దేశంలో రైతు నాయకులుగా చలామణి అవుతున్న కొందరు రైతు నాయకులను చర్చల పేరిట హైదరాబాద్ కు పిలిచి సన్మానాలు చేసి పంపించారు. కానీ, ఆ చర్చలలో రాష్ట్రానికి చెందిన రైతు నాయకులకు మాత్రం స్థానం కల్పించలేదు.

అందుకే ముఖ్యమంత్రి కొత్త అడుగుల విషయంలో పలు అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. ముఖ్యంగా ఏపీ విషయంలో ముఖ్యమంత్రి చూపుతున్న ప్రత్యేక ప్రేమ విషయంలో రకరకాల అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. అలాగే, ముఖ్యమంత్రి అడుగుల వెనక దీర్ఘకాలిక వ్యూహం  ఉందని  అంటున్నారు.

Teluguone gnews banner