రేవంత్ పాదయాత్ర.. ఉంటుందా? ఉండదా?
posted on Jan 13, 2023 @ 9:35AM
తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతం కోసం.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తలపెట్టిన పాదయాత్రకు అడుగడుగునా అవాంతరాలు ఎదురౌతున్నాయా? ఆయన ముందుగా ప్రకటించినట్లు ఈ నెల చివరి నుంచి పాదయాత్రకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా రెడీ చేసుకున్నారు. ఎన్నికల ఏడాదిలో ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే పాదయాత్రతో ముందుకు సాగాల్సిందేనన్న కృత నిశ్చయంతో ఆయన ఉన్నా.. హై కమాండ్ నుంచి అనుమతి, రాష్ట్రంలో ఆయన వ్యతిరేకుల అడ్డంకులతో యాత్ర తేదీ మాత్రం ఇంకా ఖరారు కాలేదని చెబుతున్నారు.
పాదయాత్రతో ప్రజల్లోకి వెళితే.. కాంగ్రెస్ పార్టీ కేడర్ , ద్వితీయ శ్రేణి నాయకులు, వరుస ఓటములతో డీలా పడిన క్యాడర్ లో నూతనోత్సాహం నింపాలన్నది రేవంత్ లక్ష్యంగా చెబుతున్నారు. అలాగే మరోవైపు రాజకీయంగా దూకుడు మీద ఉన్న బీజేపీకి కూడా తన పాదయాత్రతో చెక్ పెట్టాలని రేవంత్ భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రాహుల్ గాంధీ కూడా పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్లడంతో... కాంగ్రెస్ హైకమాండ్ తన పాదయాత్రకు పెద్దగా అభ్యంతరం చెప్పకపోవచ్చని.. అనుమతి కూడా లభిస్తుందని రేవంత్ విశ్వాసంతో ఉన్నారు.
తన పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ ప్రచారం కూడా జరుగుతుందని, ప్రజల్లోకి కాంగ్రెస్ చేసిన పనులు, చేపట్టిన పథకాలు మరోసారి తీసుకెళ్ళొచ్చని రేవంత్ చెబుతున్నారు. అయితే రాష్ట్ర కాంగ్రెస్ లో పరిస్థితులను గమనిస్తే ఆయన పాదయాత్ర మొదలు పెట్టడం, కొనసాగించడం అంత తేలిక కాదన్న భావన రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నది. రాష్ట్ర కాంగ్రెస్ లో రేవంత్ వ్యతిరేకవర్గం రేవంత్ కు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడమే ధ్యేయంగా పావులు కదుపుతోంది. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ గా మాణిక్ ఠాక్రే బాధ్యతలు చేపట్టిన తరువాత సంక్షోభ నివారణ యత్నాలు మళ్లీ మొదటి నుంచీ ప్రారంభమయ్యాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
రాష్ట్ర కాంగ్రెస్ లో అసమ్మతి నేతలను బుజ్జగించడమే లక్ష్యంగా ఠాక్రే వ్యవహరిస్తున్నారన్న అనుమానాలూ వ్యక్తమౌతున్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను జిల్లా కమిటీలనూ, తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసులను ఇసుమంతైనా ఖాతరు చేయబోనని ఠాక్రేతో సమావేశం తరువాత ప్రకటించడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చర్జ్ ఠాక్రే వస్తూనే రాష్ట్ర పార్టీ నేతలతో వరుస సమావేశాలు జరుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్లు రేవంత్ రెడ్డి పాదయాత్ర అంశాన్ని కాంగ్రెస్ పార్టీ కొత్త ఇంఛార్జ్ ముందు ఇప్పటికే ప్రస్తావించి ఆయన ఒక్కరే పాదయాత్ర చేస్తే ఎలా.. ఆయనకు అనుమతి ఇవ్వడం ద్వారా కొత్త పంచాయతీ సృష్టించవద్దని చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు ఈ విషయాన్ని బహిరంగంగానే చెబుతున్నారు. దీంతో తెలంగాణలోని పలువురు సీనియర్లు, ముఖ్యంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్న నేతలంతా పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ దగ్గర ఇదే విషయాన్ని ప్రస్తావించారని అంటున్నారు.
రేవంత్ రెడ్డి పాదయాత్రకు కాంగ్రెస్ హైకమాండ్ అనుమతి ఇస్తే.. తాము కూడా పాదయాత్ర చేస్తామని.. తమకు కూడా అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తామొంటూ సీనియర్ నేతలు ఇప్పటికే తమ సన్నిహితుల వద్ద చెబుతున్నారు. రేవంత్ రెడ్డికి అనుమతి ఇచ్చి.. ఇతర నేతలకు ఇవ్వకపోతే కొత్త సమస్య వస్తుందని సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్ రావ్ దృష్టికి తీసుకెళ్లారని సమాచారం. అయితే తాను అనుకున్న విధంగానే పాదయాత్రతో ముందుకు సాగాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారని.. ఈ విషయంలో హైకమాండ్‌ను ఏదో రకంగా ఒప్పించాలని ఆయన అనుకుంటున్నట్టు సమాచారం. ఒక వేళ హై కమాండ్ అనుమతి లభించకుంటే.. అధిష్ఠానాన్ని ధిక్కరించైనా సరే పాదయాత్రతో ముందుకు సాగాలని రేవంత్ భావిస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి రేవంత్ రెడ్డి పాదయాత్ర వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త పంచాయతీకి కారణమయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.