రాహుల్ యాత్రలో కొత్త రాగాలు
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగిస్తున్న భారత్ జోడో యాత్ర ఇంచుమించుగా ముగింపు దశకు చేరుకుంది. డిసెంబర్ 24న ఢిల్లీ చేరిన యాత్ర.. 9 రోజుల క్రిస్మస్, న్యూ ఇయర్ బ్రేక్ తర్వాత జనవరి 3న మళ్ళీ మొదలవుతుంది. కొత్త సంవత్సరంలో ఢిల్లీ, పంజాబ్ ల గుండా కశ్మీర్ లో ప్రవేశిస్తుంది. సెప్టెంబర్ 7 తమిళనాడులోని కన్యాకుమారిలో మొదలైన భారత్ జోడో యాత్ర 2023 జనవరి 20న శ్రీనగర్‌లో ముగుస్తుంది. ఇప్పటి వరకు 3 వేల కిలోమీటర్లు నడిచిన రాహుల్ మరో 548 కిలోమీటర్లు యాత్ర కొనసాగించనున్నారు.
చివరకు కశ్మీర్ లోని శ్రీనగర్ లో ముగుస్తుంది. ప్రారంభం నుంచి ఇంతవరకు రాహుల్ జోడో యాత్ర, పదికి పైగా రాష్ట్రాల గుండా సాగింది. అయితే, ఇతవరకు యాత్రకు ఎక్కడా ఎలాంటి అంతరాయం కలగలేదు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. శాంతి భద్రతల సమస్య తలెత్తలేదు. అలాగే, రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు తప్ప యాత్ర ఎక్కడా పెద్దగా వివాదస్పదం కాలేదు. ఉద్రిక్తతలు చోటు చేసుకోలేదు. శాంతి భద్రతల సమస్య తలెత్త లేదు.
కానీ, ఢిల్లీలో ఎంటర్ అయిన తర్వాత, యాత్రలో వేడి పెరుగుతోంది. భారత్ జోడో యాత్ర ఢిల్లీలో అడుగుపెట్టిన సమయంలో జనాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యంపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. భద్రతా వైఫల్యం పై కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు లేఖ రాసింది. రాహుల్ గాంధీకి, భారత్ యాత్రలో పాల్గొంటున్న వారికి, నేతలకు భద్రత కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది. ఢిల్లీ పోలీసులు నేరుగా హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తారు, అందుకే కాంగ్రెస్ పార్టీ నేరుగా కేంద్ర హోం మంత్రికి లేఖ రాసింది.
బదర్‌పూర్ సరిహద్దు నుంచి డిసెంబర్ 24న రాహుల్ గాంధీ వెంట వేలాది మంది మద్దతుదారులు పాదయాత్రలో పాల్గొన్నారు. ఎర్రకోట వైపు పాదయాత్ర సాగుతుండగా పలువురు రాహుల్ గాంధీతో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించడం, ఆయనకు అతి దగ్గరగా రావడంతో కలకలం రేగింది. తొక్కిసలాట తరహా పరిస్థితి తలెత్తింది. దీనిపై కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ కేంద్ర హోం మంత్రికి లేఖ రాశారు. భారత్ జోడో యాత్రలో తీవ్రమైన భద్రతా లోపాలు తలెత్తిన విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాను. 24వ తేదీన పాదయాత్ర ఢిల్లీలోకి అడుగుపెట్టిన సమయంలో అనేక సందర్భాల్లో భద్రతా లోపాలు చోటుచేసుకున్నాయి. జడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ ఉన్న రాహుల్‌కు అతి దగ్గరగా జనం గుమిగూడుతున్నప్పుడు వారిని అదుపు చేయడంలో ఢిల్లీ పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. కేవలం మౌన ప్రేక్షకులుగా చూస్తుండిపోయారు. యాత్రలో పాల్గొనకుండా పలువురు ప్రముఖులను వేధించారు. యాత్రలో పాల్గొన్న అనేక మందిని ఇంటెలిజెన్స్ బ్యూరో ఇంటరాగేట్ చేసింది. హర్యానా స్టేట్ ఇంటెలిజెన్స్‌కు చెందిన గుర్తుతెలియని దుండగులు భారత్ జోడీ యాత్రలో అక్రమంగా ప్రవేశించారని డిసెంబర్ 23న సోహ్నా సిటీ పోలీస్ స్టేషన్‌లో మేము ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు అని ఆ లేఖలో అమిత్‌షాకు వేణుగోపాల్ తెలియజేశారు.
కాంగ్రెస్ నేతల త్యాగాలను సైతం వేణుగోపాల్ ఆ లేఖలో గుర్తు చేశారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు ప్రధాన మంత్రులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ తమ ప్రాణాలను అర్పించారని, 2013 మే 25న జీరమ్ ఘాటిలో నక్సల్స్ దాడిలో ఛత్తీస్‌గఢ్ నాయకత్వం మొత్తం అశువులు బాసిందని అన్నారు. జనవరి 3 నుంచి అత్యంత సున్నితమైన పంజాబ్ , జమ్మూకశ్మీర్‌లో జోడో యాత్ర సాగాల్సి ఉంది.దీన్ని దృష్టిలో ఉంచుకుని జడ్ ప్లస్ క్యాటగిరీ భద్రతలో ఉన్న రాహుల్, భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న కార్తకర్తలు, ప్రజలు, నేతలకు తగిన భద్రత కల్పించాలి అని అమిత్‌షాను ఆ లేఖలో వేణుగోపాల్ కోరారు.
అలాగే, యాత్ర ఢిల్లీలో ప్రవేశించిన సమయంలోనే చైనా తదితర దేశాల్లో కరోనా ప్రకంపనలు ఉదృతమయ్యాయి. ఈ నేపధ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ, రాహుల గాంధీ సాగిస్తున్న భారత్ జోడో యాత్ర, తాత్కాలికంగా యాత్రకు బ్రేక్ ఇవ్వాలని లేదంటే కొవిడ్ ప్రోటోకాల్ (మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు) పాటించాలని కోరింది. అయితే, కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖ కొంత రాజకీయ దుమారం రేపింది. రాహుల్ భారత్ జోడో యాత్ర బీజేపీ గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తోందని, మల్లికార్జున ఖర్గే మొదలు దిగ్విజయ్ సింగ్ వరకు కాంగ్రెస్ నాయకులు ఒకరి తర్వాత ఒకరు, కవ్వింపు ప్రకటనలు చేశారు. అందుకు ప్రతిగా కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, స్మృతీ ఇరానీ తమదైన స్టైల్లో సమాధానమిచ్చారు.
అదొకటి అలా ఉంటే, ఈ రోజు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కాంగ్రెస్ 138వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో పాల్గొన్న రాహుల్ గాంధీ, మీడియా మధ్య, ‘చాయ్ పె చర్చ’ స్టైల్లో ‘టీ’ ..షర్టు పే’ ఆసక్తికర చర్చ జరిగింది. నిజానికి, యాత్రలో రాహుల్ విడవకుండా వేసుకుంటున్న టీ’ షర్టు పై హాట్ అండ్ కూల్ చర్చ జరిగింది. కాగా బుధవారం(డిసెంబర్ 28) పార్టీ ఆవిర్భావ దినోత్సవనికీ రాహుల్ గాంధీ అదే వైట్ టీ షర్ట్ లో హాజరయ్యారు. దీంతో కొందరు విలేకరులు అదే విషయాన్ని ఆయన వద్ద ప్రస్తావించారు. దీనిపై స్పందించిన రాహుల్... ప్రస్తుతం టీ షర్టు హవా నడుస్తోంది.. ఎప్పటి వరకు ఆ హవా ఉంటుందో, అప్పటి వరకు కొనసాగిస్తానని అన్నారు. టీషర్ట్ హీ చల్ రహి హై ఔర్ జబ్ తక్ చల్ రహి హై చలాయింగే" అని నవ్వుతూ రాహుల్ హిందీలో సమాధానం ఇచ్చారు. అయితే, ఇంతవరకు సాగిన యాత్ర ఒకెత్తు అయితే, పంజాబ్, కశ్మీర్’లలో సాగే యాత్ర ఒకెత్తు అన్నారు.