రాహుల్ పోటీ మెదక్ నుంచేనా ?

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ,2024 లోక్ సభ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? గత (2019) ఎన్నికల్లో ఓడిపోయిన అమేథి (యుపీ)  నుంచి మళ్ళీ బరిలో దిగుతారా?  అదే ఎన్నికల్లో ఆయన్ని గెలిపించి లోక్ సభకు పంపిన వయనాడ్ ( కేరళ) నుంచి పోటీ చేస్తారా? ఈ రెండు కాకుండా మరో నియోజకవర్గాన్ని ఎంచుకుంటారా? అంటే, అది ఇప్పుడే చెప్పే విషయం కాదు. అలాగే, కాంగ్రెస్ పార్టీ లేదా పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేనో మరొకరో నిర్ణయించే విషయం కూడా కాదు. రాహుల్ గాంధీ ఎక్కడినుంచి పోటీచేయాలో ఆయనే స్వయంగా నిర్ణయించుకుంటారని పార్టీ నాయకులు అంటున్నారు. 

అయితే, 2024 ఎన్నికలను జీవన్మరణ సమస్యగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే ఎన్నికల సన్నాహాలకు శ్రీకారం చుట్టింది. ముందుగా గత 2019 ఎన్నికల్లో పార్టీ ముఖ్య నేతలు ఓడి పోయిన నియోజక వర్గాలపై ప్రత్యేక దృష్టిని కేద్రేకరించింది. వీఐపీ నియోజక వర్గాల్లో తాజా పరిస్థితిని తెలుసుకునేందుకు అంతర్గత సర్వేలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. సహజంగానే  గత ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ ప్రముఖుల్లో రాహుల్ గాంధీ ఫస్ట్ ప్లేస్ లోనే ఉంటారు. కాబట్టి, ముందుగా అమేథీలో సర్వే నిర్వహించారు. నిజానికి 2019 ఓడిపోయిన తర్వాత రాహుల్ గాంధీ అ నియోజక వర్గం వైపు పెద్దగా కన్నెత్తి చూడలేదు. ఒకటి రెండు సందర్భాలలో ఎదో చుట్టపు చూపుగా వెళ్ళారే తప్పించి, సొంత ఇయోజక వర్గం అనే ప్రతేకతను చూపలేదు మరో వంక రాహుల్ గాంధీని ఓడించిన కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ కేంద్ర మంత్రి హోదాలో తరచూ నియోజక వర్గంలో పర్యటిస్తున్నారు.  

గత సంవత్సరం (2022) లో జరిగిన ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో, అమేథీ అసెంబ్లీ సహా అమేథీ లోక్ సభ నియోజక వర్గం పరిధిలోని ఐదు అసెంబ్లీ సెగ్మెంట్స్ లో ఎక్కడా కాంగ్రెస్ ఒక్క  సీటు అయినా గెలవలేదు.  (అసలు రాష్ట్రం మొత్తం మీద హస్తం పార్టీ గెలిచింది రెండే  రెండు  సీట్లు ) ఐదులో మూడు సీట్లు బీజేపీ, రెండు సీట్లు ఎస్పీ గెలుచుకున్నాయి.  కాంగ్రెస్ ఒక్క అసెంబ్లీ నియోజక వర్గంలో మాత్రమే సెకండ్ ప్లేస్  లో నిలిచింది. మిగిలిన అన్ని నియోజక వర్గాల్లో థర్డ్ ప్లేస్ కే పరిమితం అయింది. 

అయితే కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేలో మాత్రం 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ కంటే అమేథీలో కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని అంటున్నారు. 2019లో అమేథీ నుంచి ఓటమిని చవి చూసిన రాహుల్ గాంధీ ఈసారి అమేథీలో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. అయితే రాజకీయ పరిశీలకులు మాత్రం అమేథీలోనే కాదు, మొత్తం యుపీలోనే కాంగ్రెస్ పార్టీ ఖాయంగా గెలిచే లోక్ సభ సీటు ఒక్కటీ లేదని అంటున్నారు. చివరకు సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీలోను  ఈ సారి కాంగ్రెస్  గెలుపు కష్టమే అంటున్నారు.

అదీగాక, ఈ సారి సోనియా గాంధీ పోటీ చేయక పోవచ్చని, అలాగే రాహుల్ గాంధీ కూడా అమేథీ నుంచి పోటీచేయరని అంటున్నారు. అయితే అమేథీ నుంచి పోటీ చేయాలా వద్దా అనేది రాహుల్ గాంధీ నిర్ణయించుకోవాలని పార్టీ సీనియర్ నాయకుడు తారిఖ్ అన్వర్ అభిప్రాయపడ్డారు. అమేథీ నుంచి రాహుల్ పోటీ చేయకపోతే ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశం ఉందని , అలాగే రాయ్‌బరేలీ నుంచి సోనియా గాంధీ పోటీ చేయకపోతే నెహ్రూ కుటుంబ బంధువు షీలా కౌల్‌ అక్కడి నుంచి పోటీచేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఇదంతా గాంధీ కుటుంబం తీసుకునే తుది నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

మరో వంక భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ ఇమేజ్ ని బాగా పెంచిందని, ఈ నేపద్యంలో  ఆయన ఒకటి కంటే ఎక్కువ స్థానాల నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. రాహుల్ పోటీ చేసేందుకు పరిశీలనలో ఉన్న నియోజక వరగాల్లో మెదక్ నియోజక వర్గం కూడా ఉంది అంటున్నారు. 1980 లోక్ సభ ఎన్నికల్లో ఇదిరా గాంధీ ఇదే నియోజక్ వర్గం నుంచి పోటీచేసి రెండు లక్షల మెజార్టీతో గెలుపొందారు. అందుకే రాహుల్ గాంధీ కూడా మెదక్ నుంచి పోటీ చేసే ఆలోచనలో అన్నట్లు తెలుస్తోంది .

Teluguone gnews banner