కమలంతో కలిస్తే సీన్ సితారే.. అత్మసాక్షి ఫస్ట్ రిపోర్ట్

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తిదాయకంగా మారుతున్నాయి. నిజానికి ఎన్నికలకు ఇంకా చాలా సమయముంది. ముందస్తు ఎన్నికల ఊహాగానాలు అయితే గట్టిగానే వినిపిస్తున్నాయి. కానీ  ముందస్తు ఎన్నికలకు వెళ్లి ముందుగా ఇంటికి వెళ్ళడం కంటే, అందాక ఆగి అయిన కాడికి నాలుగు రాళ్ళు వెనకేసుకోవడం ఉత్తమమనే అభిప్రాయం అధికార పార్టీ ఎమ్మెల్యేలలో వ్యక్తమౌతోంది.   అదలా ఉంటే  రాష్ట్ర రాజకీయ పరిస్థితిపై ‘ఆత్మ సాక్షి’ పొత్తుల ప్రాతిపదికన నిర్వహించిన ప్రాథమిక సర్వే ప్రకారం  టీడీపీ, జనసేన కలిసి పోటీచేస్తే  ఆ కూటమి తిరుగులేని మెజారిటీతో సింహాసనం ఎక్కేస్తుంది. అదే  టీడీపీ, జనసేన కూటమితో మూడో పార్టీ బీజేపీ జట్టు కడితే  మూడు పార్టీల కూటమి మళ్ళీ మరో ఐదేళ్ళు విపక్షంలో నిరీక్షించక తప్పదు.

నిజమే ఇది కొంచెం తప్పుడు లెక్కలా ఉన్నా ఆత్మ సాక్ష సర్వే ప్రకారం టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే  రెండు పార్టీల కూటమికి 105 నుంచి 112  వరకు అసెంబ్లీ సీట్లు ఖాయంగా వస్తాయి. అయితే  ఆ లెక్క నిజం కావాలంటే, టీడీపీ 36 నియోజక వర్గాలో ప్రస్తుతం ఉన్న ఇంచార్జ్ లని , అంటే అభ్యర్ధులను తీసీసి కొత్త వారికి టికెట్ ఇవ్వాలని ఆత్మ సాక్షి సర్వే చెబుతోంది.

అదలా ఉంటే టీడీపీ, జనసేన కూటమిలోకి కమలం వచ్చి చేరితే, మూడు పార్టీల కూటమి 75 నుంచి 78 సీట్లు మాత్రమే గెలుచుకుంటుంది.  వైసీపీకి 90 నుంచి 95 సీట్లు వస్తాయి. వైసీపీ సునాయాసంగా రెండవ సారి అధికారంలోకి వస్తుంది. ఇదేమిటి ఒకటి ప్లస్ ఒకటి రెండు, రెండు ప్లస్ ఒకటి మూడు కావాలి కానీ, రెండు కంటే తక్కువ ఎలా అవుతుంది, అంటే, అదంతే అంటోంది అత్మసాక్షి సర్వే.  

ఇక మూడో సినేరియోలో .. బీజేపీ, జనసేన ఒక జట్టుగా, వైసీపీ, టీడీపీ విడివిడిగా పోటీ చేసినా ముక్కోణపు పోటీలో కూడా వైసీపీనే మళ్ళీ విజయం సాధిస్తుంది.  వైసీపీకి 90 నుంచి 95, టీడీపీకి 68 నుంచి 70 సీట్లు, జనసేనకు 5 సీట్లు వస్తాయి. మరో 8 నుంచి పది సీట్లలో కీన్ కాంటెస్ట్ ఉంటుంది. 
అయితే, ఆత్మ సాక్షి లెక్క ప్రకారం ప్రతి పక్షాల ముందన్న మంచి ఆప్షన్ మరొకటి వుంది. ... టీడీపీ,జనసేన,సిపిఐ, సిపిఎం పార్టీలు జట్టు కడితే, వైసీపీ కేవలం 60 నుంచి 65 ఎమ్మెల్యే సీట్లకే పరిమితం అవుతుంది. టీడీపీ, జనసేన, వామపక్ష పార్టీల కూటమి భారీ మెజారిటీ సాధిస్తుంది.  ఆత్మ సాక్షి టీడీపీకి ఓ చిన్న సూచన కూడా చేసింది.

మొత్తం 175 నియోజక వర్గాలకు గాను, 42 అసెంబ్లీ స్థానల్లో మాత్రమే టీడీపీ కాసింత బలహీనంగా వుంది. ఈ 42 నియోజక వర్గాల్లో బలమైన అభ్యర్ధులను ఇంచార్జ్ లుగా నియమించడమో లేదంటే ఉన్న వారికి బూస్ట్ ఇచ్చి,  ఉత్సాహన్ని నింపి గట్టిగా పనిచేసేలా చేయడమో చేయాలని ఆత్మ సాక్షి సూచించింది. చివరగా,ఆ 42 మంది బలహీన ఇంచార్జ్ ను మార్చలేక పోతే టీడీపీ బలం 59, 65 మధ్యలోనే ఉంటుందని ఆత్మసాక్షి.. సర్వే సూచిస్తోంది. అయితే ఇది సర్వే ప్రైమరీ రిపోర్ట్ మాత్రమే .. పూర్తి స్థాయి  సర్వే నివేదికతో కానీ,  అసలు నిజాలు బయటకు రావు.

Teluguone gnews banner