సెకండ్ చాన్స్ జనం ఎలాగూ ఇవ్వరని తెలిసి జగన్ ఓటమి మాట చెప్పారా?
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సెకండ్ ఛాన్స్ కోసం, స్కెచ్ సిద్దం చేసుకుంటున్నారు. అది కూడా అలాగా ఇలాక్కాదు.. 175 కు 175 అంటూ దూసుకు పోతున్నారు. మూడు నాలుగు నెలల కిందటి వరకూ ఏపీలో పరిస్థితి ఇదే. మరో చాన్స్ కోసం జగన్ ఎత్తులు వేస్తున్నారు. ఆయన తన జగన్మాయతో జనాలను మాయచేయగలరు? అంటూ కొందరు గట్టిగా ఎదురుగా బల్ల ఉంటే అది గుద్ది మరీ వాదించారు. అయితే, రాష్ట్ర ప్రజలు జగన్ రెడ్డికి మరో ఛాన్స్ ఇచ్చేందుకు సిద్దంగా లేరని పెద్దగా శ్రమ పడవలసిన అవసరం లేకుండానే అందరికీ అర్ధమైపోయింది. ఆ అందరిలో వైసీపీ నాయకులు కూడా ఉన్నారు. జగన్ కు జనం రెండో చాన్స్ ఇచ్చేందుకు సిద్ధంగా లేరని వైసీపీ నేతలు అంతర్గత సంభాషణల్లో ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నారు. గుసగుసలు పోతున్నారు.
అయితే ఇప్పుడు వాళ్లూ వీళ్లూ అనాల్సిన పని లేకుండా జగనే స్పష్టంగా చెప్పేశారు. తనకు మరో చాన్స్ లేదనీ, ఇచ్చిన ఒక్క చాన్స్ తోనే సంతృప్తి పడి హాయిగా ఓడిపోతే ఆనందంగా ఇంట్లో కూర్చుంటానని ఆయన చెప్పేసుకున్నారు. నవరత్నాల మీద పెట్టుకున్న ఆశలు ఆవిరైపోయాయి. అలాగే సంక్షేమం పేరిట క్రమం తప్పకుండా బటన్లు నొక్కుతూ ఖాతాలలో డబ్బులు వేస్తుంటే.. ఆ డబ్బులు తీసుకున్న వారు తనకు కాక ఇంకెవరికి ఓటేస్తారు అన్న ధీమా మాయమైపోయింది.
అయితే ఈ విషయం అర్ధం చేసుకోవడానికి జగన్ కు నాలుగున్నరేళ్ల పైచిలుకు సమయం పట్టింది కానీ, జగన్ అధికార పగ్గాలు అందుకున్న మూడేళ్లకే జగన్ కు మరో చాన్స్ ఇవ్వకూడదని జనం నిర్ణయం తీసేసుకున్నారు. క్షేత్ర స్థయిలో పరిస్థితి దగ్గరుండి పరిశీలిస్తున్న వైసీపీ నేతలకు కూడా అర్ధమైపోయింది. అప్పడు అర్ధం కాని వారికి జగన్ ఆదేశం మేరకు చేపట్టిన గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు వచ్చే ఎన్నికలలో పరాజయం తపప్దన్న వాస్తవం కళ్లకు కట్టింది. అందుకే ఎటూ ఓడిపోయేదానికి మళ్లీ గడపగడపకూ అంటూ జనం ఇళ్ల ముందుకు వెళ్లి పరాభవాన్ని ఎదుర్కోవడం ఎందుకు అన్నట్లుగా ఆ కార్యక్రమానికి ముఖం చాటేశారు. ప్రజలు ఇచ్చిందేదో పుచ్చుకుంటున్నారు, కానీ సంతృప్తి చెందిన దాఖలాలు కనిపించడం లేదని వైసీపీ జెండామోస్తున్న ఆ పార్టీ కార్యకర్తలు నాయకులకు అర్ధమైపోయింది. గత ప్రభుత్వంలో సంక్షేమంతో పాటు అభివృద్ధీ ఉండేదని, జగన్ సర్కార్ లో సంక్షేమమూ అరకొరగానే ఉంది, అభివృద్ధి ఆనవాలే కనపడకుండా పోయిందని జనం ముఖం మీదే చెబుతుండటంతో ఈ సారి ఎన్నికల్లో మరో ఛాన్స్ అని అడిగితే ప్రజలు నో .. ఛాన్స్ అనడం ఖాయమని పార్టీ నేతలే అంటున్నారు.
జగన్ రెడ్డి, మాట తప్పను, మడమ తిప్పను అంటే నిజమే అనుకుని అయన వెంట నడిచి, గత ఎన్నికలలో విజయాన్ని కట్టబెట్టిన ప్రజలే ఈనాడు జగన్ రెడ్డి మాట తప్పడం మడమ తిప్పడం మాత్రమే కాదు, మా విశ్వాసాన్ని సైతం పూర్తిగా కోల్పోయారని కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు.
రాష్ట్రంలో చిన్నా పెద్ద పనులు వేటికి టెండర్లు పిలిచినా, కాంట్రాక్టర్లు ఎవరూ, ముందుకు రావడం లేదు. ఒకసారి కాదు, రెండు మూడుసార్లు, టెండర్ ప్రకటనలు ఇచ్చినా టెండర్లు వేసేందుకు, కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదంటే ప్రభుత్వం మీద కాంట్రాక్టర్లకు విశ్వాసం లేదడానికి ఇంత కంటే నిదర్శనం కావాలా అని విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు చెల్లించవలసిన బకాయిలు, కొండలా పెరుకు పోయాయి. చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక కాంట్రాక్టర్లు ఆందోళనలు చేయడమే కాదు, ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయినా జగన్ సర్కార్ పట్టించుకోవడం లేదు. చివరకు అధికార పార్టీ మ్మెల్యేలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కాంట్రాక్టర్లు మాత్రమే కాదు, పార్టీ క్యాడర్’కు ఏదో మేలు చేసేందుకు కేటాయించే నామినేషన్ పనులు చేయడానికి కూడా క్షేత్ర స్థాయి నాయకులు, క్యాడర్ ముందుకు రావడం లేదు. మాకు పనులు వద్దు మహప్రభో.. ఇప్పటికే చేసిన పనులకు బిల్లులు ఇప్పించడం చాలని దండం పెట్టేస్తున్నారు. ఇది జగన్ పట్ల ప్రజలకే కాదు, సొంత పార్టీ నేతలు, క్యాడర్ కు కూడా నమ్మకం పోయిందనడానికి సంకేతంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
ఇక వైసీపీ గ్రామా సర్పంచ్ లు కూడా వదిలి పెట్టి పారి పోతున్నారు. గ్రామాల్లో చేసిన అభివృద్ది పనులకు బిల్లులు రాకపోవడంతో అప్పులు పాలైన సర్పంచ్‌లు మీరిఇచ్చిన పదవి కి ఒక దండం, ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి రెండు దండాలు అని చెప్పి, పొరుగు రాష్ట్రాలకు పోయి, కూలి పనులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు.
ఇక ప్రభుత్వం భూములు ప్లాట్స్ వేసి అమ్మి ఖజానాలోకి సొమ్ము జమచేద్దామనుకుంటే వాటిని కొనే నాదుడే కనిపించని పరిస్థితి కంటే ప్రభుత్వానికి అవమానం ఏముంటుంది. అది కూడా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి డ్రీమ్ కాపిటల్, వైజాగ్ మహానగరంలోనే, ప్రభుత్వ ప్లాట్లు కొనేందుకు ప్రజలు ముందుకు రాలేదు. వైజాగ్ నగరంలో జగన్ రెడ్డి ప్రభుత్వం, జగనన్నస్మార్ట్ టౌన్ షిప్’లో సుమారు 2000 ప్లాట్లను వేలం ద్వారా అమ్మకానికి పెట్టింది. ఆయినా, స్పందన లేదు. చివరకు చేసేది లేక దరఖాస్తు గదువును రెండు సార్లు పొడిగించింది, పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అయినా నో రెస్పాన్స్. నిజానికి ప్రభుత్వం నేరుగా అమ్ముతోందంటే దానికో క్రేజ్ ఉంటుంది. భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు రావు. క్లియర్ టైటిల్ ఉంటుంది. అదే సమయంలో ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది కాబట్టి మౌలిక సదుపాయాలు కల్పిస్తారని అనుకుంటారు. గత తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిలో హ్యాపీనెస్ట్ అనే ప్రాజెక్ట్ చేపడితే గంటల్లో బిజినెస్ క్లోజ్ అయింది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఏం చేసినా, ఎన్నిసార్లు గడువు పెంచినా కనీస స్పందన రాలేదు. అంటే.. జగన్ రెడ్డి మీద ప్రజలలో విశ్వాసం లేకపోవడమే కారణమని అంటున్నారు. ఇలా చెప్పుకుంటూ వెడితే ఒకరిద్దరని కాదు అన్ని వర్గాల ప్రజలు, చివరకు సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందుతున్న లబ్ధిదారులు కూడా జగన్ రెడ్డికి మరో చాన్స్ ఇచ్చేందుకు సుముఖంగా లేరు. మీటలు నొక్కి నోట్లు వేశాం.. ఓట్లేందుకు వేయరు’ అంటూ జగన్ రెతమ పేదరికాన్ని పరిహాసం చేస్తున్నారని వారు భావిస్తున్నారు.
ఆలా ప్రజలు, పార్టీ నాయకులు, క్యాడర్ అందరూ కూడా జగన్ రెడ్డికి మరో చాన్స్ లేదన్న నిర్ణయానికి ఎప్పుడో వచ్చేశారు. ఇంకా జగన్ రెడ్డి మీద నమ్మకం మిగిలి ఉన్న వారెవరైనా ఉంటే షర్మిల ఏపీ పాలిటిక్స్ లోకి అడుగుపెట్టిన తరువాత జరుగుతున్న పరిణామాలను చూసి సొంత చెల్లిపైనే కనీస మమకారం చూపలేని వ్యక్తి ఇక ప్రజల పట్ల ఏమాత్రం బాధ్యతగా ఉంటారంటూ నో చాన్స్ టు జగన్ రెడ్డి అనేస్తున్నారు. ఇక చివరిగా తనకు మరో చాన్స్ మీద ఆశలు పెట్టుకున్న జగన్ కు కూడా సరిగ్గా ఎన్నికల ముందు జ్ణానోదయం అయినట్లుంది.. అందుకే ఓడిపోయినా బాధపడను అంటూ చేతులెత్తేశారు. మరో చాన్స్ అంటూ అడిగి లేదనిపించుకోవడం కంటే ముందే వద్దని చెప్పేయడం మేలన్న నిర్ణయానికి జగన్ వచ్చేసినట్లు కనిపిస్తోందని పరిశీలకులు జగన్ మాటలను విశ్లేషిస్తున్నారు.