ఎవరు ఎవరికి ద్రోహం చేశారు.. జగన్ కు కాంగ్రెస్సా, కాంగ్రెస్ కు జగనా?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని మోసం చేశారా? లేక కాంగ్రెస్ పార్టీ  జగన్ మోహన్ రెడ్డికి ద్రోహం చేసిందా?  అసలు ఇప్పుడు ఈ ప్రశ్న  ఎందుకు? ఎప్పుడో కాంగ్రెస్ పార్టీని వీడి జగన్ బయటకు వచ్చి సొంత కుంపటి పెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చారు కూడా? ఇంత కాలం తరువాత ఈ ప్రశ్న తెరపైకి ఎందుకు వచ్చింది?   అంటే ఈ ప్రశ్న ఇప్పుడు తెరపైకి రావడానికి జగనే కారణం అని చెప్పక తప్పదు. ఇటీవలి కాలంలో అంటే సొంత చెల్లి కాంగ్రెస్ గూటికి చేరి ఆ పార్టీ ఏపీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి  కాంగ్రెస్ పార్టీ తనకు ద్రోహం చేసిందని వ్యాఖ్యానిస్తున్నారు. తన చెల్లి వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని ఆమెను తనకు శత్రువును చేసిందని, తన చెల్లిని అడ్డం పెట్టుకొని తనను దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని భాష్యం చెప్తున్నారు. దీంతో అసలు నిజంగానే కాంగ్రెస్ పార్టీ జగన్ మోహన్ రెడ్డికి ద్రోహం చేసిందా? అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. అదే సమయంలో జగన్ మోహన్ రెడ్డే కాంగ్రెస్ పార్టీని మోసం చేశారా అన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో  వైఎస్ అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే వైఎస్ అని అన్నట్లుగా పరిస్థితులు ఉండేవి. వైఎస్ రాజశేఖరరెడ్డి తన చివరి శ్వాస విడిచే వరకూ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. మధ్యలో ఒకసారి రెడ్డీ కాంగ్రెస్ అంటూ గడపదాటినా.. వెంటనే వెనక్కు వచ్చేశారు.  కాంగ్రెస్తో వైఎస్   ఆ అనుబంధం ఆయన చివరి శ్వాస వరకూ కొనసాగింది.  అంతే కాదు కాంగ్రెస్ పార్టీ కూడా వైఎస్ కుటుంబానికి చాలానే చేసింది. ఇంకా చెప్పాలంటే వైఎస్ కుటుంబం రాజకీయంగా, ఆర్ధికంగా ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీయే అనడంలో సందేహానికి తావు లేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ పెద్దలకు వీర విధేయుడు. అందుకే జాతీయ పార్టీ అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కు అధిష్టానం పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. సీఎంగా వైఎస్ ఏ పథకం తెచ్చినా కేంద్రం అన్నిటికీ నిధులు సమకూర్చింది. ఇలా చూస్తే వైఎస్ బడుగు బలహీన వర్గాల ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీయే. వైఎస్ అడిగితే కాదనకుండా చేసేది అధిష్టానం. అంతగా ప్రోత్సహించారు.  వైఎస్ తన విధేయతతోనే పార్టీ పెద్దలను అనుకూలంగా మార్చుకున్నారు. ప్రతి పథకాన్నీ పార్టీ పెద్దల పేర్లతోనే రూపకల్పన చేసే వైఎస్.. ప్రతి పథకంలో తన మార్క్ ఉండేలా చూసుకునేవారు. అలా కాంగ్రెస్ నుండి వైఎస్ రాజకీయంగా ఎంతగా ఎదగాలో అంతకి చేరుకున్నారు. అలాగే కుటుంబాన్ని కూడా రాజకీయంగా, ఆర్ధికంగా పరిపుష్టిగా మార్చుకున్నారు. తమ్ముడిని మంత్రిగా, కుమారుడిని ఎంపీగా చేసుకున్నారు. కుమారుడు జగన్ ఆర్ధిక సామ్రాజ్యాన్ని బలంగా నిర్మించుకొనేందుకు తండి వైఎస్ అండగా ఉంటూ వచ్చారు. ఇక జగన్ విషయానికి వస్తే.. కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొనే రాజకీయాలలోకి వచ్చారు. కడప ఎంపీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ వలనే వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారు. జగన్ మీడియా సంస్థలు స్థాపించారంటే దానికి మూలం కాంగ్రెస్ పార్టీనే ఒక్కో నగరంలో ఒక్కో ప్యాలెస్   కట్టాగలిగారంటే అది కూడా కాంగ్రెస్ పార్టీ చలవే. అనధికారికంగా జగన్ ఇంతటి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారంటే దానికి మూలం ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీయే. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీ తనకు ద్రోహం చేసిందని జగన్ మోహన్ రెడ్డి చెప్పడం విడ్డూరంగానే ఉందని పరిశీలకులు అంటున్నారు. అసలు జగన్ ఇప్పుడు సీఎం అయ్యారంటే దానికి కారణం కూడా కాంగ్రెస్ పార్టీనే.  తన తండ్రి పాలన, పథకాలను చూపించే జగన్ ఓట్లు అడిగారు. వైఎస్ పాలన, పథకాలు అన్నీ కాంగ్రెస్ సొంతం. కానీ  జగన్ వాటికి లాక్కొని సీఎం అయ్యారు. అలాగే సీఎం అయ్యేందుకు కావాల్సిన ఆర్ధిక వనరులు కూడా వైఎస్ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉండగా సంపాదించుకున్నదే. కనుక ఏ విధంగా చూసినా కాంగ్రెస్ జగన్ కు మేలే చేసింది. ఇక జగన్ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేశారా  అన్న అనుమానాలకు సమాధానంగా అవును ద్రోహం చేశారనే పరిశీలకులు చెబుతున్నారు.  ఎక్కడో అనామకులుగా ఉన్న వైఎస్ కుటుంబాన్ని అతి పెద్ద ఉమ్మడి రాష్ట్రానికి అధిపతిని చేసిన కాంగ్రెస్ ను జగన్ మోహన్ రెడ్డి విభజిత ఆంధ్రప్రదేశ్ లో నామరూపాల్లేకుండా చేశారు. కాంగ్రెస్ నేతలందరినీ తన వైపుకు తిప్పుకొని  తన వైసీపీకి   పునాదులు వేసుకున్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయిందంటే కారణం జగన్ మోహన్ రెడ్డే. తండ్రి మరణానంతరం అప్పటికప్పుడు తనను సీఎం చేయలేదన్న పంతంతోనే జగన్ కాంగ్రెస్ పార్టీని వీడారు. ఆ పార్టీని ముప్పతిప్పలు పెట్టారు. కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య లాంటి ఛరిష్మా లేని నేతలను జగన్ ముప్పతిప్పలు పెట్టి ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని ప్రయత్నించారు. చివరికి సొంత పార్టీ పెట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ కు  ప్రత్యామ్నాయంగా ఎదిగారు. ఈ లెక్కన చూస్తే జగన్ ప్లాన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీకి నష్టం చేశారు.  అయితే అదే కాంగ్రెస్ ఇప్పుడు కూడా జగన్ నమ్మించి గెంటేసిన చెల్లి షర్మిలను అక్కున చేర్చుకొని మళ్లీ వైఎస్ కుటుంబాన్ని చేరదీసింది.  అంటే ఏ రకంగా చూసినా వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటే.. జగన్ మాత్రం కాంగ్రెస్ ను మోసం చేశారు. ఆ పార్టీకి ద్రోహం చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అరెస్ట్

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై  ఏసీబీ అధికారులు హెచ్ఎండీయే మాజీ రైరెక్టర్  శివబాలకృష్ణకు గురువారం (జనవరి 25)అరెస్టు చేశారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరు పరిచారు. కాగా  బుధవారం (జనవరి 24) ఏసీబీ అధికారులు హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇళ్లు, కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు చేసిన సంగతి తెలిసిందే.   ఏసీబీ అధికారులు ఏకకాలంలో 17 చోట్ల  జరిపిన  దాడుల్లో సంచలన ఏకంగా రూ.100 కోట్ల అక్రమ ఆస్తులను  గుర్తించారు. అయితే అవే కాకుండా మరో వంద కోట్లకు పైగా ఆస్తులు శివబాలకృష్ణ అక్రమంగా కూడబెట్టి ఉంటారని అనుమానిస్తున్న ఏసీబీ అధికారులు గురువారం కూడా సోదాలు కొనసాగిస్తున్నారు.  హైదరబాద్‌లో విల్లాలు, ప్లాట్లతో పాటు.. హైదరాబాద్ శివారులో భారీగా భూములను కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. హైదరాబాద్ చుట్టుపక్కల 100 ఎకరాల భూపత్రాలను అధికారులు సీజ్ చేశారు. ఇవి కాకుండా  ఖరీదైన వాచీలు,   ఐ ఫోన్లు, ఇంకా కల్వకుర్తిలో 26 ఎకరాలు, జనగామలో 24 ఎకరాలు, యాదాద్రిలో 23, కొడకండ్లలో 17 ఎకరాల పత్రాలను అధికారులు సీజ్ చేశారు.  

తెలంగాణలోనూ ఓటాన్ అక్కౌంట్ బడ్జెట్టే!

తెలంగాణలో 50 రోజుల కిందట కొలువుదీరిన రేవంత్ సర్కార్ ఈ సారి ఓటాన్ అక్కౌంట్ బడ్జెట్ నే ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన ఏదీ వెలువడనప్పటికీ ఆర్థిక శాఖ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మాత్రం   ఓటాన్ అకౌంట్‌ బడ్జెట్ అనే తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్  పెడుతున్న సంగతి తెలిసిందే. దీంతో కేంద్రం బాటలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా నడవాలని నిర్ణయించుకుంది. కేంద్ర పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టిన తరువాత  రాష్ట్రానికి గ్రాంట్లు, సంక్షేమ పథకాల కింద  వచ్చే కేటాయింపులను బట్టి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టాలని రేవంత్ సర్కార్ భావిస్తున్నది.  గత కొన్ని రోజులుగా వివిధ శాఖల కేటాయింపు ప్రతిపాదనలపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో ఆయా శాఖల మంత్రులు, అధికారులు చేస్తున్న సమీక్షలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. అలాగే సీఎం  రేవంత్‌రెడ్డి పర్యవేక్షిస్తున్న శాఖల బడ్జెట్ ప్రపోజల్స్‌పై ఇప్పటికింకా రివ్యూ కూడా జరగలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కే  మొగ్గు చూపుతున్నట్లుందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  ఇప్పటికిప్పుడు ఓటాన్ అక్కౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టినా జూలై  ఆగస్టులో  ప్రవేశపెట్టనున్న పూర్తిస్థాయి బడ్జెట్‌లో ఆరు గ్యారంటీల  మార్గదర్శకాలు, అర్హులైనవారి సంఖ్యకు అనుగుణంగా సవరించిన అంచనాలతో సమగ్రమైన కేటాయింపులు జరపాలన్నది ముఖ్యమంత్రి ఉద్దేశంగా చెబుతున్నారు.   

అమరావతి రైతుల ఉద్యమం@1500 డేస్!

అమరావతి రాజధాని ఉద్యమం దేశంలోనే అత్యంత  సుదీర్ఘ కాలంగా నిర్విరామంగా సాగిన, సాగుతున్న ఉద్యమంగా   చరిత్రపుటల్లో నిలిచిపోతుంది.  అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు, మహిళలు నిర్విరామంగా చేస్తున్న ఉద్యమం గురువారం (జనవరి 25) నాటికి 1500 రోజుల మైలురాయిని చేరింది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలంటూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు చేపట్టిన ఉద్యమం నిరంతరాయంగా సంవత్సరం నాలుగు నెలల రెండు రోజులు కొనసాగింది. అంటే 427 రోజులు కొనసాగిందన్నమాట. దేశంలో జరిగిన ఉద్యమాల్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కూడా ఒకటి. అయితే.. అమరావతి ఉద్యమం 1500 రోజులకు చేరుకోవడమే కాకుండా ఇంకా కొనసాగుతూ ఉంది. అడ్డగోలు విభజనతో అన్యాయానికి గురైన ఆంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రిగా   చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ప్రకటించి, దాని అభివృద్ధిని పరుగులు పెట్టించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అమరావతి రైతులు 33 వేలకు పైగా ఎకరాలను ప్రజా రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇచ్చారు. చంద్రబాబు పర్యవేక్షణలో సరికొత్త అమరావతి నగర నిర్మాణం వేగంగా జరుగుతుండగా,    2019లో జరిగిన ఎన్నికల్లో  విజయం సాధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దాంతో అమరావతి నగర నిర్మాణ నిలిచిపోయింది.  జగన్ అమరావతిని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా 2019 డిసెంబర్ లో  మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తెచ్చి అమరావతి కేవలం శానస రాజధాని మాత్రమేనని ప్రకటించారు.  దీంతో  చంద్రబాబు ఎంతో కష్టపడి పెంచిన  అమరావతి బ్రాండ్ ఇమేజ్ ఒక్కసారిగా తుడిచిపెట్టుకు పోయింది. కొన్ని లక్షల కోట్ల సంపద ఒక్కసారిగా ఆవిరైపోయింది.  సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం అమరావతి రైతుల ఆశల్ని చిదిమేసినట్లయింది. వేలాది ఎకరాల భూమిని ఇచ్చిన రైతుల్లో ఆందోళన నెలకొంది. అమరావతిని రాజధానిగా నిర్మించేందుకే తామంతా తమ భూములు ఇచ్చామని, రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ అమరావతి ప్రాంత రైతులు 2019 డిసెంబర్ 17న అమరావతి పరిరక్షణ ఉద్యమం ప్రారంభించారు. నిరాహార దీక్షలతో పాటు వివిధ రూపాల్లో రైతులు ఉద్యమాలు కొనసాగించారు. కొనసాగిస్తున్నారు.   రైతుల ఉద్యమానికి ప్రభుత్వం, పోలీసులు తొలుత అనుమతించకపోవడంతో కోర్టు నుంచి అనుమతి తెచ్చుని మరీ తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. అమరావతి రాజధాని రైతుల ఉద్యమంలో రైతులు, మహిళలు, కవులు రైతులు, చిన్నా పెద్దా తేడా లేకుండా వేలాది మంది పాల్గొంటున్నారు.  ఉద్యమంలో భాగంగా నిరాహార దీక్షలు చేశారు. సభలు నిర్వహించారు. దేవుళ్లు, దేవతలకు మొక్కులు కట్టారు. జలదీక్షలు చేశారు. న్యాయస్థానం టూ దేవస్థానం పేరిట అమరావతిలోని హైకోర్టు ప్రాంతం నుంచి తిరుపతి వెంకన్న ఆలయం వరకూ పాదయాత్ర  చేశారు. పోలీసుల లాఠీ దెబ్బలు రుచిచూశారు. అరెస్టులు అయ్యారు. అతీవ్ర నిర్బంధాలకు గురయ్యారు.  వైసీపీ మంత్రుల నిందారోపణలు భరించారు. ఆకలి దప్పులతో అలమటించి కూడా అన్నదాతలు తమ ఉద్యమాన్ని ఇసుమంతైనా సడలనీయకుండా నిరంతరాయంగా కొనసాగించారు. కొనసాగిస్తున్నారు.   ప్రధాని మోడీ స్వయంగా వచ్చి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసినా.. బీజేపీ జగన్ సర్కార్ మూడు రాజధానుల డ్రామాకు తెరదించడానికి ప్రయత్నించలేదు సరికదా.. పరోక్ష మద్దతు ఇచ్చింది. రాజధానులు ఎన్ని ఉండాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం ఇందులో మా ప్రమేయం ఏమీ ఉండదు. లేదు అంటూ కేంద్రం నంగనాచి కబుర్లు చెప్పింది.   రైతుల ఉద్యమానికి ప్రత్యక్షంగా మద్దతివ్వలేదు.  అయితే రాజధాని ఉద్యమానికి రోజు రోజుకూ పెరుగుతున్న మద్దతును గమనించిన తరువాత మాత్రమే బీజేపీ తాము అమరావతి రాజధానికి మాత్రమే కట్టుబడి ఉన్నామన్న ప్రకటన చేసింది. ఇక రైతులు న్యాయాలయం టూ దేవాలయం  పాదయాత్రకు ఉపక్రమించిన సందర్భంగా   కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిరుపతి పర్యటనకు వచ్చారు. ఆ సందర్భంగా రాష్ట్ర బీజేపీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతోనే  బీజేపీ ఏపీ నేతలు అమరావతి రైతుల ఉద్యమానికి ప్రత్యక్షంగా మద్దతు ప్రకటించారు.   ఇప్పుడు అమరావతి ఉద్యమం 1500 రోజుల మైలురాయికి చేరుకుంది.  దేశంలోనే అత్యంత సుదీర్ఘ ఉద్యమంగా రికార్డు సృష్టించింది. చంద్రబాబు చెప్పినట్లు  ఇంత సుదీర్ఘ ఉద్యమాలు అరుదు. ఇంత జరుగుతున్నా.. స్పందించని ప్రభుత్వం, ప్రభుత్వాధినేత కూడా అరుదే.  వేలాది మంది ఉద్యమకారులపై తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపడం, ఎస్సీ రైతులపైనే ఎస్సీఎస్టీ అట్రాసిటీస్ కేసులు నమోదు చేయడం, పాదయాత్రలో ఉన్న మహిళా రైతులకు కనీసం వాష్ రూమ్ లు కూడా అందుబాటులో లేకుండా చేయడం ద్వారా జగన్ సర్కార్ తన వికృతత్వాన్ని ప్రజల ముందు తానే నిస్సిగ్గుగా ఆవిష్కరించుకుంది. కోర్టులు కాదన్నా వినకుండా మొండిగా కోర్టు ధిక్కరణలకు సైతం పాల్పడి.. ముందుకు సాగుతోంది. అయితే రైతుల మొక్కవోని దీక్ష ముందు, సడలని సంకల్పం ముందు ప్రభుత్వం తలవంచక తప్పదు. వచ్చే ఎన్నికలలో అమరావతి రైతుల ఆగ్రహమే అగ్ని సునామీగా మారి జగన్ సర్కార్ ను తుడిచిపెట్టక మానదు అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి రైతుల ఉద్యమానికి లభిస్తున్న మద్దతునే ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. 

ధరణి రద్దు కాదు మార్పులే ?    

మేం అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలిపేస్తాం. భూమాత పేరుతో కొత్త పోర్టల్‌ను తీసుకొస్తాం ఎన్నికల ప్రచారంలో రేవంత్‌రెడ్డి సహా ముఖ్యనేతలంతా చేసిన ప్రచారం ఇది. వాస్తవానికి  అలా విసిరేయడం అసాధ్యమని తెలుస్తోంది.కాబట్టే, అవసరమైన మార్పుచేర్పులు చేసి పేరును భూమాత గా మార్చాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ధరణి పునర్నిర్మాణ కమిటీ పేరుతో ఇటీవల ఏర్పాటైన కమిటీ కూడా పోర్టల్‌లో అవసరమైన మార్పు చేర్పులు మాత్రమే సూచిస్తుందని సమాచారం. పోర్టల్‌ను పటిష్టతకు అధ్యయనం చేస్తున్నట్టు సోమవారం కమిటీ సభ్యులు ప్రకటించారు. ప్రభుత్వానికి త్వరలోనే మధ్యంతర నివేదిక సమర్పిస్తామని తెలిపారు.ప్రస్తుత డిజిటల్‌ యుగంలో అవసరాలకు అనుగుణంగా ధరణి పోర్టల్‌ను నిర్మించారని, దీనిని రద్దు చేసి మళ్లీ పాత పద్ధతికి వెళ్లలేమని నిపుణులు ప్రభుత్వానికి స్పష్టం చేసినట్టు సమాచారం. కొత్త పోర్టల్‌ కోసం సాఫ్ట్‌వేర్‌ తయారీ, డాటా అప్‌లోడ్‌, సర్వర్లు, నిర్వహణ.. ఇలా ఎంతో శ్రమతోపాటు ఖర్చు కూడా తడిసి మోపెడవుతుందని చెప్పినట్టు తెలిసింది. ఒకవేళ కొత్త పోర్టల్‌ తెచ్చినా కొత్త సీసాలో పాత సారా మా దిరిగా మళ్లీ ధరణి నుంచే డాటాను అనుసంధానం చేయాలని స్పష్టం చేసినట్టు సమాచారం. ఒకవేళ కొత్త డాటా కావాలంటే రికార్డుల ప్రక్షాళన తరహాలో రాష్ట్రమంతటా ప్రత్యేక కార్యక్ర మం నిర్వహించి, వచ్చిన సమాచారాన్ని మళ్లీ డాటా ఎంట్రీ చేయాల్సి వస్తుంది. అప్పుడే మాత్రమే కొత్త పోర్టల్‌ తయారవుతుందని పునర్నిర్మాణ కమిటీ అభిప్రాయపడుతోంది. కాబట్టి ఇదంతా అసాధ్యమని, ఉన్న పోర్టల్‌లోనే మార్పులు చేస్తే చాలని  కమిటీ సూచిస్తోంది ఆంధ్రప్రదేశ్‌ తరహాలో రాష్ట్రం మొత్తం సమగ్ర సర్వే చేసి, పక్కా రికార్డులు రూపొందించడం, లేదా కర్ణాటక మా దిరిగా లావాదేవీలు జరిగిన ప్రతిసారి సర్వేతో డిజిటలైజ్‌ చేసి రికార్డులను అప్‌డేట్‌ చేయడం వంటివి చేపట్టాలని అభిప్రాయపడ్డట్టు తెలిసింది. ధరణిలో క్రయవిక్రయాల విధానం అద్భుతంగా ఉన్నదని, క్షణాల్లోనే భూ హక్కుల మార్పిడి జరిగి, రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ జరగడం వంటివి  ఉన్నట్లు కమిటీ స్పష్టం చేసినట్టు సమాచారం.ప్రస్తుతం ధరణి పోర్టల్‌ను ఓపెన్‌ చేయగానే అగ్రికల్చర్‌ పేజీ కనిపిస్తుంది. దానిని క్లిక్‌ చేస్తే కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది. ఇందులో ఎడమవైపు ట్రాన్సాక్షన్‌ మాడ్యూల్స్‌ ఉంటాయి. ప్రస్తు తం 35 ఉన్నాయి. కుడివైపు 10 ఇన్ఫర్మేషన్‌ మాడ్యూల్స్‌ కనిపిస్తాయి. మాడ్యూల్స్‌లో మార్పు లు, చేర్పులు చేసే సమయంలోనే ఈ లేఔట్‌లో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. మొదటి పేజీలోనే మూడు లేదా నాలుగు బటన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.  సర్వీసెస్‌ పేరుతో క్రయవిక్రయాల మా డ్యూల్స్‌ అన్నీ ఒకే చోటికి చేర్చాలని, గ్రీవెన్స్‌ పేరుతో దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన మాడ్యూల్స్‌ను కలపాలని, ఇన్ఫర్మేషన్‌ పేరుతో ఇన్ఫర్మేషన్‌ మాడ్యూల్స్‌ అన్నీ ఒకే గొడుగు కిందికి తేవాలని, ఇతర మాడ్యూల్స్‌, ఆప్షన్లను అదర్స్‌ లో చేర్చాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఉన్న ఆకుపచ్చ రంగుకు బదులుగా కాంగ్రెస్‌ను గుర్తు చేసేలా రంగులు మార్చాలని, పేరును కూడా భూమాతగా మార్చి కొత్తగా లాంచ్‌ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది.   

జనసేన గూటికి థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ!

ఎంతలో ఎంత మార్పు. గత ఎన్నికల ప్రచారంలో వైసీపీ పక్షాన నిలబడి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై విమర్శల నిప్పులు చెరిగిన నటుడు, ధర్టీ ఇయర్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్ ఇప్పుడు ఆ జనసేనాని పవన్ కల్యాణ్ పంచన చేరారు. ఔను థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్ పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.  ఇదే పృధ్విరాజ్ గత ఎన్నికలకు ముందు సరిగ్గా ఇప్పుడు జనసేనలో చేరినట్లుగానే అప్పడు అంటే 2019 ఎన్నికలకు ముందు జగన్ నాయకత్వంలోని వైసీపీలో చేరారు.  అ ఎన్నికలలో  వైసీపీ విజయం కోసం చాలా చాలా కష్ట పడ్డారు. జగన్మోహన్ రెడ్డిని వేనోళ్ళ పొగుడుతూ  ఉరూరా తిరిగారు. పార్టీ ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆ ప్రచారంలో భాగంగా   తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్ ను లక్ష్యంగా చేసుకుని ఇష్టారీతిగా  విమర్శలు గుప్పించారు. తనకు నోరున్నదే వారిని విమర్శించడానికి అన్నట్లుగా రెచ్చిపోయారు.  ఆయన ప్రచారమో రాష్ట్ర ప్రజల దురదృష్టమో   ఆ ఎన్నికలో వైసీపీ విజయం సాధించింది. జగన్మోహన్  రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. సీఎం అయిన తరువాత ఆయన పృధ్వీ సేవలను మరచిపోలేదు. ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవిలో కూర్చోబెట్టారు. తన రాజకీయ ప్రత్యర్థులను ఇష్టారీతిగా విమర్శించడమే ఆ పదవి దక్కడానికి పృధ్వికి అర్హత అయ్యింది. ప్రతి పక్ష పార్టీల నాయకులను ఎంత పెద్దగాతిడితే, అంతగా ముఖ్యమంత్రి దృష్టిలో పడొచ్చని. మరో మెట్టు ఎక్కచ్చని అనుకున్నారో ఏమో కానీ  ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవిని అడ్డు పెట్టుకుని థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వి ప్రతిపక్షాలపై విమర్శలతో విరుచుకు పడ్డారు. చివరకు  అమరావతి రైతుల ఆందోళలోనూ వేలు పెట్టారు.  అమరావతి రైతుల ఉద్యమంపై థర్టీ  ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ చేసిన డర్టీ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైయ్యాయి.   ఆయన వివాదాల జర్నీ అక్కడితో ఆగలేదు. ఎస్వీబీసీలో పని చేసే ఒక మహిళా ఉద్యోగితో అసభ్యంగా మాట్లాడిన వాయిస్ రికార్డులు బయటకు రావటంతో  ఫృధ్వి ఎస్వీబీసీ చైర్మన్  వైభోగం మూన్నాళ్ల  ముచ్చటగా ముగిసిపోయింది. ఆ పదవి నుంచి జగన్ నిర్దాక్షిణ్యంగా తప్పించేశారు. అంతే ఇక ఆ తరువాత వైసీపీలో ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్విని పట్టించుకున్న వారే లేదు. అదే సమయంలో  నడమంత్రపు సిరి శాశ్వతం నుకుని రెచ్చి పోయి వెనకా ముందు చూసుకోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడిన పృధ్విని ఇండస్ట్రీ కూడా దాదాపు వదిలించేసుకుంది.  కొంచెం ఆలస్యంగానే అయినా, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి తత్త్వం బోధపడినట్లుంది. అప్పటికి కానీ పృధ్వికి తత్వం బోధపడలేదు. సొంత పార్టీ వాళ్లే   తనపై  కుట్రపన్నారని భోరు మన్నాడు.  ఇక వైసీపీ అంతు చూడడమే తన లక్ష్యమంటూ జనసేన వైపుకు అడుగులు వేశారు. ఏళ్ల తరబడి  వేచి చూసేలా చేసినా చివరికి జనసేనాని ఎట్టకేలకు పృధ్విని పార్టీలో చేర్చుకున్నారు. ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైన తరుణంలో  పవన్ కల్యాణ్ పృధ్వికి పార్టీ కండువా కప్పి జనసేనలో చేర్చుకున్నారు. ఆయనతో పాటు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా జనసేనలో  చేరారు.  బుధవారం (జనవరి 23) మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో  జానీ మాస్టర్‌, పృథ్విరాజ్‌లు జనసేనలో చేరారు. ఇప్పుడు పృధ్వి సేవలను జనసేనాని ఏ విధంగా ఉపయోగించుకుంటారో చూడాలి. సిని గ్లామర్ తో పాటు ఆయన నోటి దురుసు కూడా జనసేనకు ఉపయోగపడుతుందని పరిశీలకులు అంటున్నారు.  

ఇండియా కూటమిలో శ్రుతి తప్పిన ఐక్యతా రాగం!

సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో విపక్షాల ఐక్యతారాగం అపశ్రుతులు పలుకుతోంది.  కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా బీజేపీయేతర పార్టీల ఐక్యత ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతోంది. 2024 ఎన్నికలలో మోడీ సర్కార్ ను గద్దె దించాలంటే విభేదాలు మరచి బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిమీదకు రావడం ఒక్కటే మార్గమన్న విషయంలో ఎవరిలోనూ భిన్నాభిప్రాయాలు లేవు. ఆ కారణంగానే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను ఓడించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గద్దె దింపడమే ఏకైక అజెండాగా  ఐ డాట్ ఎన్ డాట్ డి డాట్ ఐ డాట్ ఎ… ఇండియా పేర బీజేపీయేతర పార్టీలన్నీ కూటమిగా ఏర్పడ్డాయి. ఆ చుక్కల కూటమి... నడక తడబడుతోంది. లక్ష్యం దిశగా అడుగులు పడుతున్నాయా అంటే పరిశీలకులు లేదంటూ విశ్లేషిస్తున్నారు.  కూటమి కలలకు శ్రీకారం చుట్టిన, జనతాదళ్ (యు) అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ముందుగా పక్కదారి పడుతున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కూటమికి నాయకత్వం వహించడం ద్వారా బీహార్ సీఎం పదవి నుంచి ఇండియా పీఎం పీఠానికి చేరాలన్న ఆయన ఆకాంక్ష సాకారమయ్యే అవకాశాలు లేవన్న గ్రహింపు వచ్చినప్పటి నుంచి ఆయన నడక, నడతలో మార్పు వచ్చింది. ముఖమాటానికో, రాజకీయ అవసరం కోసమో కూటమి కన్వీనర్ పదవిని సున్నితంగా తిరస్కరించి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకే ఆ పదవిని కట్టబెట్టినప్పటి నుంచీ కూడా ఆయన ఇండియా కూటమితో తెగతెంపులు చేసుకోవడానికి సమయం కోసం ఎదురు చూస్తున్నారన్నట్లుగానే ఆయన తీరు ఉంది.  తాజాగా ఆయన ఇంకెంతో కాలం కూటమిలో కొనసాగే అవకాశం లేదన్న సంకేతాలను ఇచ్చారు. అందుకు బీహార్ మాజీ ముఖ్యమంత్రి  దివంగత కర్పూరి ఠాకూర్‌ కు మోడీ సర్కార్  దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న  ప్రకటించడాన్ని అవకాశంగా తీసుకున్న నితీష్ కేంద్రంపై ప్రశంసల జల్లు కురిపించడం ద్వారా తాను ఇండియా కూటమికి దూరంగా అడుగులు వేస్తున్నట్లు తేటతెల్లం చేశారు.  నితీష్ కుమార్ కర్పూరి ఠాకూర్ కు భరాతరత్న ప్రకటించినందుకు ప్రధాని మోడీకి ధన్యవాదాలు చెప్పి ఊరుకోలేదు.  కర్పూరి ఠాకూర్‌ శతజయంతి వేళ కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా  మోడీ వెనకబడిన కులాలకు ఓ మంచి సందేశం ఇచ్చిందని ప్రస్తుతించారు.   కర్పూరి ఠాకూర్‌ను రాజకీయ గురువుగా భావించే నీతీశ్‌ కుమార్‌.. దివంగత సీఎం పుట్టి పెరిగిన గ్రామాన్ని ‘కర్పూరి గ్రామ్‌’గా మార్చారు. ఏటా ఆయన జయంతి వేళ నీతీశ్‌ ఆ గ్రామాన్ని సందర్శిస్తారు. కర్పూరీ ఠాకూర్ కు భారత రత్న ఇవ్వాలని తాను పలు మార్లు కేంద్రానికి లేఖలు రాశానని చెప్పుకున్న ఆయన  గత కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేని పనిని మోడీ సర్కార్ చేసిందంటూ చెప్పడం ద్వారా కాంగ్రెస్ కు దళితులు, వెనుకబడిన కులాల అభ్యున్నతి పట్ల చిత్తశుద్ధి లేదని పరోక్షంగా అన్నట్లు అయ్యింది. తద్వారా ఆయన మళ్లీ కమలం కు చేరువ కానున్నట్లు సంకేతాలు ఇచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇప్పటికే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ తో పొత్తు లేదని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ కుండబద్దలు కొట్టేశారు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా కూటమితో కలిసి నడుస్తున్నప్పటికీ ఆయన వ్యూహాలు ఆయనవే.  మొత్తం మీద సార్వత్రిక ఎన్నికల వేళ కూటమి భాగస్వామ్యపక్షాల వ్యవహార శైలి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా సాగుతోంది. కూటమి ఐక్యతాలోపమే బీజేపీకి వచ్చే ఎన్నికలలో బలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

నిన్న కేసీఆర్.. నేడు జగన్.. ఎన్నికలకు ముందే ఓటమి దర్శనం

రెండు మూడు నెలల కిందటి వరకూ వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ఇప్పుడు ఓటమి గ్యారంటీ అంటూ చేతులెత్తేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో తన పార్టీ ఓటమిని ఆయన ఇప్పుడే చూసేశారు. ఆ విషయాన్నే క్లియర్ కట్ గా చెప్పేశారు. అదే  సమయంలో తాను మళ్లీ అధికారంలోకి రాకపోతే  ఏపీ పరిస్థితి అధోగతేనని ప్రజలను హెచ్చరిస్తున్నారు.   తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి ఆ రాష్ట్ర  ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇలాగే ప్రజలను హెచ్చరించారు. తాను మరో సారి అధికారంలోకి రాకపోతే రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఉండదన్నారు. రైతు బంధు ఆగిపోతుందన్నారు. రైతులకు ఉచిత కరెంటు అందదన్నారు. తనను గెలిపించకపోతే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం ఆనవాలు కనిపించదని హెచ్చరించారు.  ఆ ఎన్నికలలో ప్రజలు హెచ్చరికలను, బెదరింపులను పట్టించుకోలేదు. ఫలితం బీఆర్ఎస్ ఓటమి పాలైంది. కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ఏపీలో జగన్ కూడా అదే విధంగా తన ఓటమి ఖాయం అని ఖరారు చేసుకున్న తరువాత బెదరింపులకు దిగుతున్నారు. ప్రజలను ఎమోషనల్గా బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్ని స్తున్నారు.  తాను క్రమం తప్పకుండా బటన్లు నొక్కి జనాలకు సొమ్ములు పంచుతున్నాననీ, తాను మరో సారి అధికారంలోకి రాకపోతే ప్రజలకు ఆ సొమ్ములు అందవని హెచ్చరిస్తున్నారు.    ఎందుకంటే గత నాలుగున్నరేళ్లుగా సంక్షేమం మాటను జరిగిన దోపిడీని జనం గుర్తించారు. ఆ విషయం జగన్ కు కూడా అర్ధమైంది. దీంతో ఆయన ఇక సెంటిమెంట్ ను రగిలించి.. మీ బిడ్డను, మీ కోసం కుటుంబానికి దూరం అయ్యాను అంటూ దీనాలాపనలకు దిగారు. సొంత చెల్లిని కూడా ప్రతిపక్ష నేతకు స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరిస్తోందంటూ నిందించారు.   ఇక ఇప్పుడు తాజాగా.. తిరుపతిలో ఇండియా టుడే నిర్వహించిన ఎడ్యుకేషన్ కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న సీఎం జగన్‌  ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏపీలో కాంగ్రెస్‌ డర్టీ పాలిటిక్స్‌ చేస్తోందని విమర్శించారు.  జకీయ లబ్ధి కోసం పదేళ్లనాడు రాష్ట్రాన్ని చీల్చిన కాంగ్రెస్ ఇప్పుడు అదే రాజకీయ లబ్ధి కోసం తన కుటుంబాన్ని చీల్చిందన్నారు.  అంతే కాదు.. వైనాట్ 175 ధీమా ఇప్పుడు తనలో ఇసుమంతైనా లేదని చెప్పకనే చెప్పేశారు. వచ్చే ఎన్నికలలో తాను పారజయం పాలై పదవి నుంచి దిగిపోయినా బాధపడనని పరోక్షంగా తాను గద్దె దిగిపోవడం ఖాయమైపోయిందని వెల్లడించేశారు. పదవి పోయినా కోట్లాది మంది జీవితాలలో వెలుగు నింపానన్న సంతోషంతో  ఉంటానని జగన్ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.  ఇప్పుడు ఒక సారి తెలంగాణ ఎన్నికలకు ముందు కేసీఆర్ మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటే ఆయన కూడా తాను ఓడిపోయినా ఫాం హౌస్ లో సంతోషంగా గడిపేస్తాననీ, అయితే తనను ఓడించినందుకు ప్రజలే బాధపడతారని అర్ధం వచ్చేలా మాట్లాడారు. రాష్ట్రాన్ని సాధించానన్నారు. అందుకోసం సావు నోట్లో తలపెట్టి వచ్చానని ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డారు. గతానికి భిన్నంగా కేసీఆర్ అలా మాట్లాడడానికి కారణం ఆయన తన ఓటమిని ముందే గుర్తించేయడం వల్లనేనని తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాత తెలిసింది. అయితే ఇప్పుడు జగన్ అదే బాటలో తాను ఓడిపోయినా సంతోషంగానే ఉంటాననీ, అయితే ఆ సంతోషం ప్రజలలో ఉండదనీ చెప్పడంతో జగన్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో తెలియడానికి ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చే వరకూ ఆగాల్సిన అవసరం లేదని, కేసీఆర్ అనుభవాన్ని బట్టి జగన్ కు వచ్చే ఎన్నికలలో ఎదురయ్యేది పరాజయం, పరాభవమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

బాలినేనివి ఉత్తుత్తి బెదరింపులేనా?

వైసీపీలో టికెట్ల వ్యవహారం రోజు రోజుకూ పీటముడి పడుతోంది. ఒక వైపు జగన్ తన ప్రభుత్వంపై ప్రజలలో అపారమైన విశ్వాసం ఉందన్ని నమ్మకంగా చెబుతూ.. ఎమ్మెల్యేలపైనా వ్యతిరేకత అంటూ వారిని మార్చేస్తున్నారు. కొందరికి పార్టీ టికెట్లు నిరాకరిస్తూ, మరి కొందరిని సిట్టింగ్ స్థానాల నుంచి మార్చేస్తున్నారు. అలా టికెట్లు దక్కవని కన్ ఫర్మ్ అయిన వారు, నియోజకవర్గ మార్పును జీర్ణించుకోలేని వారు తమ అసంతృప్తిని, వ్యతిరేకతనూ జగన్ కు తెలియజేస్తున్నారు. కొందరు తిరుగుబాటు చేస్తుంటే, కొందరు పార్టీ వదిలేస్తున్నారు. ఇంకొందరు మీడియా సమావేశాలు పెట్టి మరీ జగన్ నిర్ణయంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు మరింత గట్టిగా జగన్ ను సమర్ధిస్తూ ఆయన దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. అలా అయినా చివరి నిముషంలో అధినేత మనసు మార్చుకుని తమ స్థానం తమకు ఇస్తారన్న ఆశ వారిది. అయితే ప్రకాశం జిల్లా విషయంలో మాత్రం జగన్ కు కొరుకుడుపడని ఎమ్మెల్యేగా బాలినేని నిలుస్తున్నారు.   రెండేళ్ల కిందట బాలినేనిని జగన్ తన కేబినెట్ నుంచి తొలగించారు. అప్పటి నుంచీ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న బాలినేని అప్పటి నుంచీ వైసీపీ అధినేత జగన్ కు పంటికింద రాయిలా, చెవిలో జోరీగలా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. తెగించి బాలినేని పార్టీని వీడటం లేదు. అలాగని అణిగిమణిగి ఉండటం లేదు. రోజుకో విమర్శ, పూటకో డిమాండ్ తో జగన్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు.  చీటికీ మాటికీ జగన్ నిర్ణయాలను ప్రశ్నిస్తూ, విమర్శిస్తూ తన ధిక్కారాన్ని ప్రదర్శిస్తున్నారు.  రాజీనామా అంటూ బెదరింపులకు దిగుతున్నారు. అలా బాలినేని జగన్ ను ఇరుకున పెట్టడమే కాకుండా జిల్లాలో కూడా పార్టీపై, పార్టీ నిర్ణయాలపై అసంతృప్తిని రాజేస్తున్నారు. బాలినేని గట్టిగా గళమెత్తిన ప్రతి సందర్భంలోనూ ఆయనకు తాడేపల్లి నుంచి పిలుపు రావడం, బుజ్జగించడం షరామామూలుగా మారిపోయింది.  తాజాగా ప్రకాశం జిల్లాలో ఇన్ చార్జిల మార్పుపై బాలినేని తన అసంతృప్తిని మరో లెవెల్ కు తీసుకువెళ్లి వ్యక్తం చేశారు.  వైసీపీకి రాజీనామా చేయడం తనకు పెద్ద పనేం కాదనీ, చిటికెలో చేసేయగలనని వ్యాఖ్యానించారు.  అయినా జగన్ బాలినేనిపై చర్య తీసుకునే సాహసం చేయడం లేదు. ఎందుకంటే బాలినేని జగన్ కు బంధువు. ఇప్పటికే కుటుంబం మొత్తం జగన్ కు వ్యతిరేకంగా ఉంది. ఇప్పుడు బంధువును కూడా దూరం చేసుకుంటే ప్రతిష్ట మరింత మసకబారుతుంది. అందుకే బాలినేని విషయంలో జగన్ తన సహజ దూకుడును ప్రదర్శించకుండా, సంయమనం పాటిస్తున్నారు.  బాలినేనిని తాజాగా పిలిచి మాట్లాడిన జగన్ ఆయన పోటీ చేసే స్థానాన్ని ఆయన్నే నిర్ణయించుకోమంటూ రెండు ఆప్షన్లు ఇచ్చారు. గిద్దలూరు లేదా ఒంగోలు నియోజకవర్గాలలో  ఏ స్థానం నుంచి పోటీ చేయాలన్న నిర్ణయాన్ని బాలినేనికే వదిలేశారు. సహజంగానే బాలినేని తన సిట్టంగ్ స్థానాన్నే ఎంచుకున్నారు. అయితే అక్కడితో సరిపెట్టుకోని బాలినేని మాగుంట శ్రీనివాసులరెడ్డిని ఒంగోలు లోక్ సభ స్థానం నుంచే బరిలోకి దింపాలని పట్టుబడుతున్నారు. అందుకు జగన్ ససేమిరా అనడంతో మరోసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాజీనామా బెదరింపునకు దిగారు.   మరి ఈ సారి బెదరింపునకు జగన్ దిగి వచ్చి మాగుంటకు ఒంగోలు లోక్ సభ స్థానం కేటాయిస్తారా? లేదా అన్నది చూడాలి. మాగుంటను ఒక వేళ పక్కన పెట్టేస్తే బాలినేని తాను చెప్పినట్లు రాజీనామా చేస్తారా.. లేక తనవి ఉట్టుట్టి బెదిరింపులేనని మరో మారు రుజువు చేస్తూ తన సిట్టింగ్ స్థానం తనకు దక్కింది చాలని సరిపెట్టుకుంటారా? చేడాల్సి ఉంది. 

వైసీపీకి గుమ్మనూరు జయరాం రాంరాం!

సీనియర్లను పోటీ చేయమంటే వద్దు వద్దంటున్నారు. సిట్టింగుల సీటు మారిస్తే పార్టీకి గుడ్ బై అంటున్నారు. కోరుకున్న స్థానంలో అవకాశం లభించిన వారు కూడా వద్దు బాబోయ్ అంటూ పారిపోతున్నారు. సరిగ్గా ఎన్నికలకు నెలల ముందర ఏపీలో అధికార వైసీపీ పరిస్థితి ఇది. నిజమే తాజాగా మంత్రి గుమ్మలూరు కూడా  పార్టీ వీడేందుకు రెడీ అయిపోయారు. ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాదని ఆయను కర్నూలు లోక్ సభ స్థానానికి పోటీ చే యమని ఆదేశించారు. అందుకు నిరాకరించిన ఆయన పార్టీని వీడాలన్న నిర్ణయానికి వచ్చేశారు.  ఆలూరుకు కొత్త ఇంచార్జిని ప్రకటించి నతర్వాత గుమ్మనూరు జయరాం నియోజకవర్గానికి వచ్చి పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి మరీ ఆలూరును విడిచి వెళ్లేది లేదని కుండబద్దలు కొట్టేశారు. ఆ తరువాత ఆయన కొద్ది రోజుల పాటు పార్టీ వారికి ఎవరికీ అందుబాటులో లేకుండా బెంగళూరుకు వెళ్లి పోయారు. ఆ తరువాత తిరిగి ఆలూరు వచ్చినా వైసీపీ నేతలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు.   వైసీపీ ఆలూరు తాజా అభ్యర్థి విరుపాక్షి కలిసేందుకు ప్రయత్నించినా ఆయన అది పడనివ్వలేదు.  ఇక వైసీపీ ముఖ్యనేతలు వచ్చినా వారిని కలిసేందుకు ఆయన సుముఖత చూపలేదు.  గతంలో టీడీపీలో క్రియాశీలంగా పని చేసిన గుమ్మనూరు జయరాం తిరిగి రావడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని చెబుతున్నారు. ఆయనను చేర్చుకోవడానికి తెలుగుదేశం పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఆయన కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అంటున్నారు. కాంగ్రెస్ లో చేరే ప్రయత్నాలలో భాగంగానే ఆయన బెంగళూరు వెళ్లారని గుమ్మనూరు జయరాం సన్నిహితులు చెబుతున్నారు. ఆయన బెంగళూరులో కర్నాటక మంత్రి నాగేంద్ర ద్వారా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో భేటీ అయ్యారనీ, ఆ భేటీలో కాంగ్రెస్ లో చేరికకు రూట్ క్లియర్ చేసుకున్ారని చెబుతున్నారు.  కర్ణాటక మంత్రి నాగేంద్ర బంధువు కావడంతో డీకేతో భేటీకి మార్గం సుగమమైందనీ, త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని ఆలూరు నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.  

రేవంత్ సెక్యూరిటీ సమూల మార్పు.. కారణమేంటంటే..?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  సెక్యూరిటీ విషయంలో ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ సిబ్బందిని మొత్తం మార్చేసింది. ఆయనకు సంబంధించిన సమాచారం లీకౌతోందన్న సమాచారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద పని చేసిన ఏ ఒక్క అధికారినీ, పోలీసు సిబ్బందినీ సీఎం సెక్యూరిటీలో భాగం చేయవద్దని నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వం బుధవారం (జనవరి 24)న సీఎం రేవంత్ రెడ్డి భద్రతా సిబ్బందిని పూర్తిగా మార్చేస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా ఈ పరిణామం ఇంత హఠాత్తుగా చోటు చేసుకోవడం పై పలు కథనాలు వెలువడుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంగళవారం బీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు ఇచ్చిన సమాచారం మేరకే రేవంత్ సెక్యూరిటీ సిబ్బందిని మొత్తం మార్చి వేయాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చిందని అంటున్నారు.  వాస్తవానికి గత కొంత కాలంగా  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యక్తిగత, అధికారిక సమాచారం  లీకౌతున్నదన్న ఆరోపణలు వినవస్తూనే ఉన్నాయి. ప్రధానంగా రేవంత్ నిర్ణయాలు, ఆయన ఎవరెవరిని కలుస్తున్నారు, ఏయే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు అన్న సమాచారం మాజీ సీఎం కేసీఆర్ కు ముందుగానే చేరుతోందన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి భద్రత విషయంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఆయన భద్రతా సిబ్బందిని సమూలంగా మార్చివేసిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే సెక్యూరిటీ సిబ్బంది మార్పు నిర్ణయం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ తో భేటీ అయిన గంటల వ్యవధిలో వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయ వర్గాలలో ఇదో హాట్ టాపిక్ గా మారిపోయింది.  ప్రధానంగా రేవంత్ రెడ్డితో భేటీ అయిన నలుగురు ఎమ్మెల్యేలూ మెదక్ జిల్లాకు చెందిన వారే కావడం, ఆ నలుగురూ కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సన్నిహితులు కావడంతో వారు కాంగ్రెస్ తలుపు తడుతున్నారా? ఆ పార్టీకి చేరువకావడానికి ప్రయత్నిస్తున్నారా అన్న చర్చ మొదలైంది. తమపై నమ్మకం కలగడానికే రేవంత్ సెక్యూరిటీ నుంచే సమాచారం లీకౌతోందన్న విషయాన్ని రేవంత్ చెవిన వేశారా అన్న అనుమానాలు రాయకీయవర్గాలలో వ్యక్తం అవుతున్నాయి.  ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన క్షణం నుంచీ బీఆర్ఎస్ నుంచి పలువురు కాంగ్రెస్ గూటికి చేరేందుకు రెడీగా ఉన్నారన్న వార్తలు వినవస్తూనే ఉన్నాయి. సీనియర్ కాంగ్రెస్ నేతలు, మంత్రులు కూడా పలు సందర్భాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ ప్రకటనలు చేసిన సంగతి  తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రేవంత్ ను నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడంతో సహజంగానే వారు కారు దిగిపోనున్నారని అంతా భావించారు. తాము కేవలం మర్యాద పూర్వకంగానే రేవంత్ ను కలిశామనీ, నియోజకవర్గ సమస్యలు, ప్రొటోకాల్ వంటి అంశాలపై ఆయనతో చర్చించామనీ, అవసరమైతే మరో వంద సార్లు కలుస్తాం కానీ కారు దిగి చేయి అందుకునే ప్రశ్నే లేదనీ వారు స్పష్టం చేసినప్పటికీ రాజకీయవర్గాలలో మాత్రం సందేహాలు నివృత్తి కాలేదు.  రేవంత్ సెక్యూరిటీని సమూలంగా మార్చేయడం వెనుక వారిచ్చిన సమాచారమే ఉందన్న సందేహాలు బలంగా వ్యక్తం అవుతున్నాయి. 

వైసీపీలో గందరగోళం.. జగన్ లో కనిపించని చలనం!

ఎప్పుడైనా ఎన్నికల వేళకి అధికార పార్టీలో స్పష్టత ఉంటూ.. ప్రతిపక్ష పార్టీలో గందరగోళ పరిస్థితి ఉంటూ వస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికల నుండి తాజాగా తెలంగాణ ఎన్నికల వరకూ తెలుగు రాజకీయాలలో అదే చూశాం. కానీ, ఏపీలో మాత్రం ప్రతిపక్ష టీడీపీ జనసేనతో పొత్తులో ఉండి కూడా ధీమాగా కనిపిస్తుంటే.. అధికార వైసీపీలో తీవ్ర గందరగోళ పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరో.. ఎంపీ అభ్యర్థి ఎవరో.. ఎవరు ఏ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారో కూడా అర్ధంకాక క్యాడర్ తలలు పట్టుకుంటున్నారు. అసలు పార్టీలో ఉండేది ఎవరో.. వలస వెళ్లి పోయేది ఎవరో కూడా తెలియడం లేదు. చివరికి బీ ఫామ్ ఎవరికి దక్కుతుందో  కూడా ఎవరూ చెప్పలేని పరిస్థితి కనిపిస్తున్నది. కొందరు బెదిరింపులకు దిగుతుంటే.. మరికొందరు చాపకింద నీరులా పార్టీకి ముప్పు తెచ్చి పెడుతున్నారు. ఇప్పటికే కొందరు రాజీనామాల బాట పట్టగా.. మరికొందరు ఇతర పార్టీల నుంచి హామీల కోసం ఎదురుచూస్తున్నారు. ఇంత జరుగుతున్నా సీఎం జగన్ తనకేమీ పట్టదన్నట్లు నచ్చింది చేసుకుంటూ వెళ్తున్నారు. అసంతృప్తి, అసమ్మతుల విషయంలో చేతులెత్తేసి నేను తాంబూలాలిచ్చేశాను.. ఇక తన్నుకు చచ్చే పని మీదేనని పార్టీ నేతలు, క్యాడర్ కు చెప్పకనే చెబుతున్నారు.  . ఏపీలో ఎన్నిక‌ల  హీట్ ఆరు నెలల కిందటే పీక్స్ కు చేరింది. ఇక ఇప్పుడు నోటిఫికేషన్ విడుదల కావడానికి వారాల గడువు మాత్రమే ఉంది.   ఇప్పటి వరకూ దేశ‌వ్యాప్తంగా ఇత‌ర రాష్ట్రాల్లో గ‌త ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను ప‌రిశీలిస్తే ఏపీలో ఇంకో 20 రోజులలోనే  నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని అర్ధమౌతుంది.  ఇప్పకే  ఈసీ ఎన్నికల ఓట‌ర్ల తుదిజాబితా విడుద‌ల చేసింది. అంటే ఫిబ్రవరి రెండో వారంలో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ విష‌యాన్ని ప‌రోక్షంగా ఈసీ కూడా వెల్ల‌డించింది. దీంతో ఎవరు ఏం చేసినా.. ఎలాంటి ఎత్తులు వేసినా.. బుజ్జగించినా.. లాబీయిగ్ చేసినా ఈ 20 రోజుల్లోనే చేయాల్సి ఉంది.  ఒక్కసారి కోడ్ కుంపటి ముట్టించిన తరువాత  ప్రచారానికి తప్ప ఇంక దేనికీ సమయం ఉండదు. అధికారంలో ఉన్న పార్టీ కనుక  ఇప్పటికే ఎన్నికల డేట్ కూడా  జగన్ కు తెలిసే ఉంటుంది. మరి ఇన్ని తెలిసిన జగన్ ఎందుకిలా ఉంటున్నారు. ఒకవైపు పార్టీలో అసంతృప్తులు చెలరేగి పోతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు? సీట్ల మార్పులో ఇంత గందరగోళం నెలకొన్నా సరిదిద్దే ప్రయత్నం ఎందుకు చేయడం లేదు?  కేవలం సజ్జల రామకృష్ణా రెడ్డి, విజయసాయి రెడ్డి లాంటి వారే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను మ్యానేజ్ చేస్తారని భావిస్తున్నారా?  లేక పార్టీలో ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరిని నిలబెట్టినా తన మొహం చూసే ఓటేస్తారని ఇప్పటికీ నమ్ముతున్నారా?  లేక వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులే తనను గెలిపిస్తారన్న భ్రమల్లో ఊరేగుతున్నారా?   ఏ ధైర్యం చూసుకొని జగన్ ఎన్నికల ముంగిట ఇంత ధీమాగా ఉన్నారన్నది పార్టీ నేతలు, కార్యకర్తలకు కూడా అర్థం కాక తలలు కొట్టుకుంటున్నారు.  అయితే, జగన్ లో ఇప్పుడు ఎన్నికల పట్ల ఉన్నది ధీమా కాదని..  నిండా మునిగిపోయాం ఇక చలేమిటన్న భావనతో చేతులెత్తేశారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఎన్నో విడతలుగా స్వయంగా చేయించుకున్న సర్వేలలో   ఓటమి తప్పదని తేలిపోయింది. దళితులపై దాడులతో వారిలో నమ్మకం కోల్పోయారు. కాపు సామజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకొనేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఒక్కటీ కలిసి రాలేదు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు, తనను ప్రశ్నించిన వారిపై బనాయించిన అక్రమ కేసుల ప్రభావం జగన్ పైన, ఆయన పార్టీపైనా జనంలో నమ్మకాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసింది.  దీనికి తోడు రాష్ట్రంలో సకల వర్గాలలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ పరిస్థితిలో ఇక ఏం చేసినా లాభం లేదని తేలిపోయింది. ఈసారి ఓటమి ఖాయమైంది. కాకపోతే కనీసం పరువును కాపాడుకునేందుకే ఈ అభ్యర్థుల మార్పులు, అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలు, ఫ్యామిలీ సెంటిమెంట్ ఉపయోగించడం వంటివి చేస్తున్నారని పరిశీలకులు పేర్కొంటున్నారు. వైసీపీలో ఇప్పుడు నెలకొన్న అనిశ్చితి తొలగాలంటే కనీసం ఆరు నెలల సమయం కావాలి.  కానీ మూడు వారాల గడువులో ఏం చేసినా ప్రయోజనం ఉండదు. అందుకే జగన్ పూర్తిగా హ్యాండ్సప్ చెప్పేసినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

రెండుగా చీలిన వైఎస్ కుటుంబం.. ఆస్తులు వారసత్వం కోసం యుద్ధం!

ఎదుగింటి సందింటి  రాజశేఖరరెడ్డి (వైఎస్ఆర్)  కుటుంబం లో యుద్ధం మొదలయింది. ఆస్తుల తగాదా నుంచి అది వారసత్వ పోరు వరకూ వెళ్లిందన్నది ఆయన కుటుంబానికి సన్నిహితులైన వారు చెబుతున్న మాట. ఆస్తుల పోరు కాస్తా రాజకీయ వారసత్వ రణం వరకూ వెళ్లింది.  ఈ యుద్ధంలో అన్న జగన్ ఒక వైపు.. చెల్లి వైఎస్ షర్మిల మరో వైపు మోహరించారు. అమ్మ కుమార్తె షర్మిల వైపే నిలిచిందని అంటున్నారు. వాస్తవానికి రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణం తరువాత ఆయన కుటుంబం మొత్తం ఒక్కటై నిలిచింది. కష్ట కాలంలో ఒకరినొకరు ఓదార్చుకోవడంలో కానీ, తండ్రి రాజకీయ అండ చేజారిపోకుండా చూసుకోవడంలో కానీ, రాజకీయంగా కుటుంబం పెత్తనం సడలిపోకుండా కాపాడుకోవడంలో కానీ తల్లి, కుమారుడు, కుమార్తె, వీళ్లే కాకుండా వైఎస్ సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి, ఆయన కుటుంబం ఇలా మొత్తం ఎదుగింటి సందింటి కుటుంబం ఒక్కటిగా నిలిచింది. అప్పటికి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో తమ కుటుంబ పొలిటికల్ ప్లేస్, స్పేస్ ను కాపాడుకుంది. అయితే రాష్ట్ర విభజన తరువాత ఇక తెలంగాణయా, ఆంధ్రప్రదేశా ఏదో ఒకటే అని  తేల్చుకోవాల్సి వచ్చినప్పుడు సహజంగానే వైఎస్ కుటుంబం ఏపీకి అంటే విభజిత ఆంధ్రప్రదేశ్ కు పరిమితమైంది. తండ్రి స్థానంలో తనను కూర్చోపెట్టేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం నిరాకరించడంతో అలిగి, ఆగ్రహించిన జగన్ కాంగ్రెస్ కు కుటుంబంతో సహా గుడ్ బై చెప్పేశారు. సొంతంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి, ఆ పార్టీ అధినేతగా తన సొంత రాజకీయ ప్రయాణం ఆరంభించారు. 2014 ఎన్నికలలో విభజన ఎమోషన్స్ తో పాటు వైఎస్ కుమారుడు వైఎస్ జగన్ పై ఉన్న పలు కేసులు, ఆయన వ్యవహార శైలిపై ప్రజలలో ఉన్న సంశయాలు, అనుమానాల కారణంగా జగన్ పార్టీ అధికారం చేజిక్కించుకోలేకపోయింది. అయితే విపక్ష నేతగా నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన జగన్ అసెంబ్లీని బాయ్ కాట్ చేసి పాదయాత్ర, ఓదార్పు యాత్ర అంటూ నిత్యం జనంలోనే గడిపారు. ఆయన ఆక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లడంతో వచ్చిన సానుభూతి, తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై జనంలో ఉన్న అభిమానానికి తోడు, సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు జగన్ పై జరిగిన కోడి కత్తి దాడి, బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య వంటి సంఘటనలు జగన్ కు ప్లస్ అయ్యాయి. దాంతో ఆ ఎన్నికలలో జగన్ పార్టీ వైసీపీ అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. వైసీపీ విజయానికి పైన చెప్పిన అన్ని కారణాలతో పాటు వైఎస్ కుటుంబం మొత్తం జగన్ కు అండగా నిలబడటం కూడా ప్రధాన కారణంగా చెప్పుకోక తప్పదు. జగన్ జైల్లో ఉన్న సమయంలో జగనన్న వదిలిన బాణాన్ని అంటూ షర్మిల చేసిన ప్రచారం, ప్రసంగాలు, జగన్ తల్లి విజయమ్మ కుమారుడి కోసం రోడ్డుపై బైఠాయించి మరీ తెలిపిన నిరసనలు, బాబాయ్ వైఎస్ వివేకా, ఆయన కుమార్తె డాక్టర్ సునీత వెన్నంటి ఉండటం కూడా జగన్ కు కలిసి వచ్చాయి. వైసీపీ ఘన విజయం సాధించి జగన్ ఏపీ సీఎం అయ్యారు. ఇదేళ్లు గిర్రున తిరిగే సరికి నాడు అంటే 2019 ఎన్నికల సమయంలో వైఎస్ కు కలిసి వచ్చిన అంశాలే ఇప్పుడు ఆయనకు ప్రతికూలంగా మారాయి.  నాడు జగన్ వెనుక ఐక్యంగా నిలిచిన కుటుంబం ఇప్పుడు ఆయనకు అండగా లేదు. నాడు జగన్ కు అనుకూలంగా సానుభూతి వెల్లువెత్తడానికి కారణమైన వివేకా హత్య, కోడికత్తి దాడి కేసుల్లో ఇప్పుడు వెళ్లన్నీ ఆయనవైపే చూపిస్తున్నాయి. అలాగే నాడు జగన్ కు కొండంత అండగా నిలిచిన చెల్లి వైఎస్ షర్మిల ఇప్పుడు ఆయనకు ప్రత్యర్థిగా మారారు. నాడు జగనన్న వదిలిన బాణాన్ని అంటూ జనంలోకి వచ్చిన షర్మిల ఇప్పుడు తాను జగన్ కు గురిపెట్టిన బాణంగా మారిపోయింది.  జగన్ ను నియంత అని నిందిస్తోంది. ఇక వైఎస్ బ్రాండ్ ను జగన్ తనంత తాను స్వయంగా వదిలించేసుకున్నారు. వైఎస్ కు సన్నిహితంగా ఉన్న వారెవరూ ఇప్పుడు జగన్ తో లేరు. ముఖ్యంగా వైఎస్ కు ఆత్మ అని చెప్పుకునే కేవీపీ ఇప్పుడు షర్మిల పక్కన నిలబడ్డారు.  ఇక తన నాలుగున్నరేళ్ల పాలనలో  అన్ని విధాలుగా విఫల సీఎంగా జగన్ ప్రజల ముందు తనను తాను ఆవిష్కరించుకున్నారు. ప్రశ్నిస్తే వేధింపులు, కేసులు, జైళ్లు. సంక్షేమం పేరిట అరకొర విదిలింపులు, పన్నుల పేరిట అంతకు పదింతల వడ్డింపులతో జగన్ పాలనపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతున్న పరిస్థితి. ఇక పార్టీలోనూ తీవ్ర అసంతృప్తి. వాలంటీర్ల వ్యవస్థ అంటూ అన్ని అధికారాలనూ తన గుప్పిట పెట్టుకుని ఎమ్మెల్యేలను ఉత్సవ విగ్రహాలుగా మార్చేయడంతో వారిలోనూ వ్యతిరేకత.. ఇలా వచ్చే ఎన్నికలలో విజయానికి అన్ని దారులూ మూసుకుపోయిన పరిస్థితి. అన్నిటి కంటే ముఖ్యంగా  సొంత చెల్లి   సంధిస్తున్న విమర్శనాస్త్రాలు, చేస్తున్న సవాళ్లు తాడేపల్లి ప్యాలెస్ పునాదులను కదిలించేస్తున్నాయి. షర్మిల ఏపీ రాజకీయాలలోకి ఇచ్చిన రీ ఎంట్రీ జగన్ ఎగ్జిట్ ను కన్ ఫర్మ్ చేసేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    ఏపీలో నియంత రాజ్యం నడుస్తోంది. ఏపీలో ఎక్కడ చూసినా మైనింగ్, ఇసుక మాఫియానే. కిలో మీటరు రోడ్డేయలేదు.. మూడురాజధానులు కడతాడా?  జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలయింది.. అప్పుల రాష్ట్రంగా మారిపోయింది.  రాష్ట్రంలో అభివృద్ధిపై బహిరంగ చర్చకు రెడీ..  టైమ్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే.. డేట్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే  అంటూ చెల్లి షర్మిల విసురుతున్న సవాళ్లు జగన్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సొంత చెల్లీ, తల్లే తనకు ప్రత్యర్థులుగా ఎదురు నిలబడటంతో మీ రాజన్న బిడ్డను అంటూ జగన్ ప్రజల ముందు చెబుతున్న డైలాగులు మరీ నాటకీయంగా కనిపిస్తున్నాయి.  రాజకీయాల్లో చాలా కుటుంబాలు చీలిపోయాయి. సొంత అన్నదమ్ములే చెరో పార్టీలోనూ నిలబడి ప్రత్యర్థులుగా నిలబడిన ఉదంతాలు చాలా ఉన్నాయి.  గాంధీ నెహ్రూ కుటుంబంలో  ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ సతీమణి మేనకా గాంధీ కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు. రాజీవ్ గాంధీ సతీమణి సోనియా గాంధీ  కాంగ్రెస్‌ అధినేత్రి అయ్యారు. ఇప్పుడా పదవికి దూరంగా ఉన్నా పార్టీలో కీలక నేత ఆము. అలాగే కేసీఆర్ బీఆర్‌ఎస్ అధినేతగా ఉంటే..  ఆయన సొంత అన్న కూతురు కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. చివరికి తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా ఉన్నారు. కుటుంబ సభ్యులలో  రాజకీయ దారులు వేరు కావడం కొత్తేం కాదు. కొనసాగుతోంది. కానీ వైఎస్ రాజవేఖర్‌రెడ్డి కుటుంబం మాత్రం నిట్ట నిలువుగా చీలిపోవడమే కాదు.. అన్న జగన్, చెల్లి  షర్మిల ఉప్పు-నిప్పులా మారారు.  అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం నాటకం  అంటూ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. వ్యక్తిత్వ హననానికి కూడా వెనుకాడటం లేదు. షర్మిల ఇప్పటి వరకూ అన్నపై రాజకీయపరమైన విమర్శలే చేశారు కానీ జగన్ శిబిరం మాత్రం షర్మిలపై వ్యక్తిగత విమర్శలకు కూడా వెనుకాడటం లేదు. ఇందు కోసం ఆమె వ్యక్తత్వ హననానికీ పాల్పడుతోంది. ఆమె కులం, కులాంతర వివాహం, పెళ్లి, పెళ్లిళ్లు వంటి అంశాలను తెరపైకి తీసుకు వస్తున్నది.  దీనిపై షర్మిల రియాక్షన్ ఎలా ఉంటుందన్నది రానున్న రోజులలో తెలుస్తుంది. మొత్తం మీద అన్నా చెల్లెళ్ల వార్ కారణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే పరిస్థితి ఎటూ లేదు.. చీలేదల్లా వైసీపీ అనుకూల ఓటు మాత్రమేనని ఇది కాంగ్రెస్ కు పెద్దగా ప్రయోజనం చేకూర్చదు కానీ, జగన్ కు, జగన్ పార్టీకీ మాత్రం పూడ్చుకోవడానికి అవకాశం లేని నష్టం చేస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

గంటా సరే.. ఆర్కే సంగతేంటి?

మూడేళ్ల కిందట గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాపై ఎట్టకేలకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నారు. అది కూడా ఎలా అంటే నిబంధనల ఊసే లేకుండా రాజీనామా ఆమోదించేశారు. రాజీనామా ఆమోదించే ముందు ఆ రాజీనామా చేసిన సభ్యుడిని వివరణ అడగాలన్న కనీస ధర్మాన్ని కూడా పాటించలేదు. అసలు గంటా రాజీనామా చేశారన్న విషయాన్నే అందరూ మరిచిపోయారు. సరే ఇప్పుడు ఓ రెండు నెలలలోగా రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి. వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలలో అధికభాగం ఎటూ క్రాస్ ఓటింగ్ చేస్తారు. కనీసం విపక్ష ఎమ్మెల్యేల సంఖ్య ఏదో రకంగా తగ్గించేసైనా గట్టెక్కేయచ్చన్న జగన్ దూరాలోచనో, దురాలోచనో మొత్తం మీద స్పీకర్ సీతారం ను ప్రభావితం చేసింది. అంతే ఆయన ఇన్నేళ్లుగా పెండింగ్ లో పెట్టిన గంటా రాజీనామాకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసేసుకున్నారు. ఇప్పుడు ఆయన రాజీనామాను ఆమోదించడం వల్ల ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఎటూ లేదు. మహా అయితే రాజ్యసభ ఎన్నికలో ఆయనకు ఓటు వేసే అవకాశం ఉండదు అంతే. మరో ఎనమండుగురు ఎమ్మెల్యేలకు కూడా ఆయన ఏదో సామెత చెప్పినట్లు చాలా చాలా సమయం తీసుకుని మరీ ఇప్పుడే సరిగ్గా రాజ్యసభ ఎన్నికలకు ముందు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. వారిపై అనర్హత వేటు వేయడానికి రెడీ అయిపోయారు.   అయితే తమ్మినేని సీతారాం పేరుకే స్పీకర్ కానీ ఆయన ఎన్నడూ ఆ పదవిలో ఉన్ననన్న స్ఫృహతో వ్యవహరించిన దాఖలాలు లేవు. పార్టీ కార్యక్రమాలలో పాల్గొనకూడదన్న నిబంధనకు ఆయన విలువ ఇచ్చిన దాఖలా ఒక్కటీ కనిపించదు.  మూడేళ్ల కిందట రాజీనామా చేసిన గంటా శ్రీనివాసరావు రాజీనామా లేఖ .. ఎన్నికల షెడ్యూల్ వచ్చే ముందు ఆమోదించేయాలని ఆయన భావించారు.  ఆమోదించేశారు.  అదే సమయంలో స్పీకర్ గా ఒక రాజీనామా విషయంలో నిర్ణయం తీసుకునేముందు ఆ ఒక్క రాజీనామాయే కాకుండా తన ముందు పెండింగ్ లో ఉన్న అన్ని రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే  సీతారాం తీసుకునే నిర్ణయాలు స్పీకర్ గా నిష్పాక్షికంగా కాకుండా ఒక వైసీపీ అనుకూల వాదిగా మాత్రమే తీసుకుంటారు. అందుకే గంటా రాజీనామాకు ఓకే అనేశారు. తన వద్ద పెండింగ్ లో ఉన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే విషయాన్ని కన్వీనియెంట్ గా మరిచిపోయారు. అదీ తన పార్టీ బాస్ జగన్ ఆదేశం మేరకే అయి ఉంటుందని పరిశీలకులు విశ్లేషణలు చేస్తారనీ, అలాంటి విశ్లేషణల వల్ల తనకు  మేలు జరుగుతుందనీ జగన్ భావించడం వల్లేనని అంటారు. ఎందుకంటే ఆళ్ల స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేయడమే కాదు. ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకుని ఆ పార్టీ తీర్థం పుచ్చేసుకున్నారు. అయినా స్పీకర్ ఆ రాజీనామాను ఆమోదించకపోవడం ద్వారా పార్టీ మారినా ఆళ్ల వైసీపీ వాడేనని ఉద్దేశపూర్వకంగా చాటేందుకేనని, అలా చాటడం ఇప్పుడు కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు చేపట్టిన షర్మిల ఎటువైపు అన్న అనుమానం ఆమె రాకను స్వాగతిస్తూ ఆమె వెంట నడవడానికి రెడీ అయిన వైసీపీ అసంతృప్తుల్లో కలిగుతుందనీ జగన్ కు కావలసింది కూడా అదేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   

జగన్ లో భయానికి నిదర్శనం.. గంటా రాజీనామా ఆమోదం!

తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు రాజీనామాను ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు. అసలు గంటా శ్రీనివాసరావు రాజీనామా ఏమిటి? ఆ రాజీనామాను స్పీకర్ ఆమోదించడమేంటి? అన్న సందేహాలు ఒక్కసారిగా సర్వత్రా వ్యక్తమయ్యాయి. ఇంతకీ విషయమేమిటంటే.. ఎప్పుడో  మూడేళ్ళ కిందట గంటా శ్రీనివాసరావు తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ  2021, ఫిబ్రవరిలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. జగన్ సర్కార్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించడం లేదని అప్పట్లో ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.  తన రాజీనామాను కూడా స్పీకర్‌ ఫార్మాట్‌లోనే సమర్పించారు. అంతే కాదు అప్పట్లో స్వయంగా స్పీకర్‌ని కలిసి తన రాజీనామాని ఆమోదించాల్సిందిగా కోరారు. కానీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించలేదు.  రాజీనామాను ఆమోదించలేదు. కానీ ఇప్పుడు మూడేళ్ల తరువాత ఎందుకో ఆయనకు చురుకుపుట్టింది. వెంటనే రాజీనామాను ఆమోదించేశారు.  ఏమైంది స్పీకర్ కు మూడేళ్ల తరువత మెలకువ వచ్చిందా? అంటూ పరిశీలకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా ఎన్నికల ముంగిట గంటా రాజీనామాకు స్పీకర్ ఆమోదముద్ర వేయడం వల్ల ప్రయోజనమేమిటని ప్రశ్నిస్తున్నారు.   కొన్ని రోజుల కిందట తమ్మినేని సీతారాం తనకు కానీ తన కుటుంబానికి కానీ ముఖ్యమంత్రి జగన్ ఆముదాల వలస నుంచి పోటీకి అవకాశం లేదని తెగేసి చెప్పేశారు. దీనిపై సీతారాం తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు కూడా. విలువలకు తిలోదకాలిచ్చేసి, అత్యంత గౌరవప్రదమైన స్పీకర్ పదవిలో ఉండి కూడా కేవలం జగన్ ప్రాపకం కోసం   విలువలకు వలువలు ఒదిలేసి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును, ఆయన కుటుంబాన్ని విమర్శల పేర తిట్టడమే పనిగా పెట్టుకుని రాజ్యాంగబద్దమైన పదవి ఔన్నత్యాన్ని కూడా కించపరిచి స్పీకర్ హోదాలో  ఇష్టారీతిగా అనుచిత వ్యాఖ్యలు చేసిన తమ్మినేని సీతారాంకు  ఆముదాల వలస నియోజకవరం టికెట్ ను  బొడ్డేపల్లి పద్మజ కు ఇచ్చేశారు.  ఆ పరాభవాన్ని తట్టుకోలేక సీతారాం అస్వస్థతకు గురయ్యారు కూడా. కానీ రోజుల వ్యవధిలోనే ఏమైందో ఏమో.. సిట్టింగుల మార్పు విషయంలో జగన్ పునరాలోచనలో పడ్డారంటూ వస్తున్న వార్తలతో మళ్లీ తమ్మినేనిలో ఆశలు చిగురంచాయో ఏమో.. గంటా శ్రీనివాసరావు  ఎప్పుడో 2021లో చేసిన రాజీనామాను ఆఘమేఘాల మీద ఆమోదించేయడం ద్వారా జగన్ కు మేలు చేసేశానని అనుకుంటున్నారు. ఒక్క గంటా రాజీనామాను ఆమోదించడమే కాదు.. వైసీపీ నుంచి బహిష్కృతులై తెలుగుదేశం కు చేరువైన నలుగురు ఎమ్మెల్యేలు, పార్టీని వీడిన మరో నలుగురు ఎమ్మెల్యేలకూ షోకాజ్ నోటీసు జారీ చేశారు. మీ మీద అనర్హత వేటు ఎందుకు వేయకూడదో వారంలోగా వివరణ ఇవ్వాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. వారం తరువాత ఎలాగా వారిపై అనర్హత వేటు వేసేస్తారు.  ఇంత కాలం లేనిది ఇప్పుడింత ఇంత హఠాత్తుగా తమ్మినేని మేల్కొని హడావుడి నిర్ణయాలు తీసుకోవడానికి కారణం రాజ్యసభ ఎన్నికలేనని పరిశీలకులు చెబుతున్నారు.  ఏప్రిల్‌ నెలలో మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతాయి. వైసీపి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టిడిపి ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్, బీజేపీలో చేరిన టిడిపి ఎంపీ సిఎం రమేష్ ల పదవీకాలం ఏప్రిల్‌  2వ తేదీతో ముగుస్తుంది. ఒక్కో ఎంపీ అభ్యర్ధి గెలవాలంటే 44 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఆ లెక్కన మూడు సీట్లు వైసీపి దక్కించుకోవాలంటే మొత్తం 132 మంది ఎమ్మెల్యేలు అవసరం. వైసీపికి 151 మంది ఎమ్మెల్యేలున్నప్పటికీ వారిలో 8మంది బయటకు వెళ్ళిపోయారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్‌చార్జిల మార్పులు చేర్పుల కారణంగా మరికొంత మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడారు.మరి కొంత మంది ఆ బాటలోనే ఉన్నారు. అయినా  ఉన్న బలంతో వైసీపి ముగ్గురు ఎంపీ అభ్యర్ధులను గెలిపించుకోగలదు. కానీ వైసీపిని వీడినవారు, వీడబోతున్నవారు, తీవ్ర అసంతృప్తితో క్రాస్ ఓటింగ్ కు పాల్పడే వారి వల్ల మూడు రాజ్యసభ సీట్లనూ దక్కించుకోవడం కష్టమేమో అన్న భయం జగన్ ను వెంటాడుతోంది.  గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో   ఎదురైన పరాభవ భారం, భయం జగన్ ను వెంటాడుతూనే ఉందనడానికి గంటా రాజీనామా ఆమోదం, ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు నిదర్శనమని అంటున్నారు. అయితే తన రాజీనామా ఆమోదంపై స్పందించిన గంటా శ్రీనివాసరావు.. ఎప్పుడో  2021లో తాను చేసిన రాజీనామాను ఇప్పుడు ఆమోదించడమేమిటని ప్రశ్నిస్తున్నారు. సరిగ్గా ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు తన రాజీనామాను ఆమోదించడం రాజ్యసభ ఎన్నికలో తాను ఓటు వేయకుండా నిరోధించడానికేనని ఆరోపించారు. అయితే తాను న్యాయపరంగా అన్ని అంశాలనూ పరిశీలించి, ఓటు వేయడానికి ఏ మాత్రం అవకాశం ఉన్నా తెలుగుదేశం పార్టీకే ఓటేస్తానని కుండబద్దలు కొట్టేశారు.  

మంత్రి రోజా కలెక్షన్ క్వీన్!.. సొంత పార్టీ నుంచే ఆరోపణలు.. నగరి టికెట్ హుళ్లక్కేరా?

అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు.. ఆధారాలు లేని ఆరోపణలతో అందరిపై విరుచుకుపడే మంత్రి రోజా  ఇప్పుడు  సొంత పార్టీ నేతలే కలెక్షన్ క్వీన్ అంటూ చేస్తున్న ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇంత కాలం ఇష్టారీతిగా నోరేసుకుని విపక్షాలపై అడ్డగోలు విమర్శలు చేసిన రోజా రాజకీయ జీవితానికి ఇప్పుడుఎండ్ కార్డ్ పడే పరిస్థితి తీసుకువచ్చాయంటున్నారు.   అయితే రోజా  విపక్ష నేతలపై చేసిన  విధంగా సొంత  పార్టీ ప్రజా ప్రతినిథులు ఆమెపై నిరాధార ఆరోపణలు చేయడంలేదు. సాక్ష్యాధారాలతో మీడియా సమావేశాలు పెట్టి మరీ రోజా అవినీతిని కళ్లకు కడుతున్నారు.   తమ వ్యతిరేకులపై  ఆధారాలు లేని ఆరోపణలతో గొబెల్స్ ప్రచారం చేసి ప్రజలను మభ్య పెట్టడమనే టెక్నిన్ ను గత నాలుగున్నరేళ్లుగా వైసీపీ ఇష్టారీతిగా వాడేసింది. ఇప్పుడు సొంత పార్టీ నేత, మంత్రి రోజాపై  కూడా అదే టెక్నిక్ వాడుతోంది. అయితే  రోజా ఫైర్ బ్రాండ్ కదా, అందుకు ఆమె నోరెత్తే అవకాశం లేకుండా  కొన్ని ఆధారాలను కూడా చూపిస్తోంది.  తాజాగా మంత్రి రోజాపై ఆమె సొంత పార్టీకీ, సొంత నియోజకవర్గానికి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిథులు అవినీతి ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీని వెనుక పార్టీ అగ్రనాకత్వం హస్తం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇంత కాలం రోజా జనసేన అధినేత పవన్ ను ప్రాకేజీ స్టార్ అంటూ ఒక్క ఆధారం చూపకుండా విమర్శనాస్త్రాలు సంధిస్తూ జగన్ వద్ద మార్కులు కొట్టేసేందుకు శతధా ప్రయత్నించారు. ఆ ప్రయత్నం సఫలం కావడం వల్లే తనకు మంత్రి పదవి వచ్చిందని భావించి మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత రోజా మరింత రెచ్చిపోయారు. విరామం లేకుండా నోటికి పని చెప్పారు.  అయితే ఎంతగా విపక్ష నేతలపై విరుచుకుపడినా.. జగన్ మాత్రం ఆమెను దూరం పెట్టడానికే నిర్ణయించుకున్నారు.  అందుకే ఆమె వ్యతిరేకులకు స్వేచ్ఛ ఇచ్చేశారు. సరిగ్గా ఎన్నికల ముందు.. టికెట్ నిరాకరించినా ఆమె రచ్చకెక్కేఅవకాశం లేకుండా  సొంత పార్టీ నేతల చేత రోజా అవినీతికి పాల్పడ్డారు. కలెక్షన్ క్వీన్ గా మారిపోయారు అంటూ ఆరోపణలు చేయిస్తున్నారు.  ఒక మంత్రిపై మీడియా అధకార పార్టికి చెందిన స్థానిక ప్రజా ప్రతినిథి మీడియా సమావేశం పెట్టి మరీ అవినీతి ఆరోపణలు చేశారంటే అందుకు పార్టీ అధినాయకుడి అనుమతి ఉందనే భావించాల్సి ఉంటుంది. మంత్రి రోజా, ఆమె సోదరుడు కుమారస్వామి రెడ్డి పై సొంత పార్టీ కౌన్సిలర్ తీవ్ర ఆరోపణలు చేసారు. పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి ఇప్పిస్తానంటూ కుమారస్వామి తమ వద్ద నుండి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసారంటూ వైసీపీకి చెందిన  పుత్తూరు 17 వ వార్డు కౌన్సిలర్ భువనేశ్వరి ఆరోపించారు.   చైర్మన్ పదవి కోసం రోజా అన్నయ్యకు  దళిత మహిళనైన తాను  మూడు విడుతలలో 40 లక్షలు చెల్లించానని, అయితే  చైర్మన్ పదవి ఇవ్వకపోగా, ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి ఇవ్వడం లేదని ఆమె ఆరోపించారు.   రోజా చెప్పిన మీదటే తాను ఆమె అన్నను కలిసి సొమ్ములు ఇచ్చా మన్నారు. ఇప్పుడు తమకు సీఎం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.    ఈ ఆరోపణలపై నిజమేంటో నిగ్గు తేల్చాల్సింది సీఎం జగనే. అయినా మంత్రిగా రోజా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఆమె వసూల్ రాణిగా మారిపోయారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయన్న విషయాన్ని తెలుగువన్ 2022లోనే చెప్పింది.   రోజా  మంత్రి పదవి చేపట్టి న వంద రోజులకే ఆమె కాష్ కౌంటర్ ఓపెన్ చేశారు. కోట్లు సంపాదిస్తున్నారు అంటూ ఆమెపై ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.  అప్పట్లో ఆ ఆరోపణలను ఇసుమంతైనా పట్టించుకోని జగన్ ఇప్పుడు మాత్రం రోజాపై వస్తున్న ఆరోపణలను సీరియస్ గా తీసుకున్నారని అంటున్నారు. అయితే అందుకు కారణం రోజాపై అవినీతి ఆరోపణలు కావనీ, ఈ సారి నగరి టికెట్ రోజాకు ఇవ్వకుండా ఉండేందుకే పార్టీ అగ్రనాయకత్వమే ఈ ఆరోపణలను ప్రోత్సహిస్తున్నదనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అలా కాకపోతే దళితుడిని హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును చంకనెక్కించుకున్న జగన్.. ఒక కౌన్సిలర్  రోజాపై చేసిన ఆరోపణలను నిజంగా సీరియస్ గా తీసుకున్నారనీ,  తీసుకుంటారనీ ఎలా నమ్మగలమని అంటున్నారు. అయితే నగరి నియోజకవర్గం నుంచి రోజాకు టికెట్ నిరాకరించడానికి ఇప్పటికే డిసైడ్ అయిపోయినందుకే ఆమెపై మీడియా సమావేశాలలో అవినీతి ఆరోపణలు గుప్పించేలా ఆమె వ్యతిరేకులను ప్రోత్సహిస్తున్నారనీ అంటున్నారు.   రోజాకు ఈ సారి అసెంబ్లీ టికెట్ ఇచ్చేది లేదన్న నిర్ణయానికి ఇప్పటికే వచ్చేసిన జగన్ అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారనీ, టికెట్ ఇవ్వకపోయినా రోజా నోరెత్తడానికి అవకాశం లేకుండా ఇలా సొంత నియోజకవర్గం నుంచే ఆమెపై విమర్శలు, ఆరోపణలు వచ్చేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనీ వైసీపీ శ్రేణులే అంటున్నాయి. పుత్తూరు కౌన్సిలర్ ఆరోపణలు మాత్రమే కాదు, చిత్తూరు జడ్పీ సమావేశంలో నగరికి చెందిన జడ్పీటీసీలు కూడా రోజాపై ఆరోపణలు గుప్పించారు. ఆమెకు ఈ సారి నగరి నుంచి పార్టీ టికెట్ ఇస్తే తామంతా ఆమెకు వ్యతిరేకంగా పని చేసి ఓడిస్తామని అల్టిమేటమ్ ఇచ్చారు.  అయితే ఈ పరిస్థితులు ఎదురైనా రోజాకు మాత్రం ఏ వర్గం నుంచీ మద్దతు కానీ సానుభూతి కానీ లభించడం లేదు. పైగా తగిన శాస్తి జరిగిందన్న భావనే పార్టీలో వ్యక్తం అవుతోంది. ఇక విపక్షాల నుంచైతే రోజాపై విమర్శల దాడి పెరిగింది. ఆమెకు వైసీపీ టికెట్ ఇస్తుందా ఇవ్వదా అన్నది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం కానీ, ముందు తనపై సొంత పార్టీకి చెందిన స్థానిక ప్రజా ప్రతినిథులు చేసిన ఆరోపణలను ఆమె సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.  వాస్తవానికి నగరి నియోజకవర్గంలో రోజాపై తీవ్ర వ్యతిరేకత ఉంది. పార్టీ పదవుల కోసం ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఐప్యాక్ సహా ఇప్పటి వరకూ వచ్చిన సర్వేలన్నిటిలోనూ నగరిలో రోజాకు తీవ్ర వ్యతిరేకత ఉందనే వెల్లడించాయి. అన్నిటికీ మించి జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో రోజాకు సత్సంబంధాలు లేవు. వీటన్నిటినీ పరిగణనలోనికి తీసుకున్న జగన్ ఆమెకు టికెట్ ఇవ్వకూడదన్న నిర్ణయానికి వచ్చేశారనీ, అయితే టికెట్ నిరాకరించినందుకు రోజా బాహాటంగా తన అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం లేకుండా ఇప్పుడు ఆమెపై ఉన్న ఆరోపణల చిట్టాను బయటపెట్టి కట్టడి చేస్తున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ప్లేస్ మీరు చెబుతారా.. నన్ను చెప్పమంటారా? .. వైవీకి వైఎస్ షర్మిల సవాల్

ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ఇలా బాధ్యతలు చేపడుతూనే  అలా అన్న, సీఎం  జగన్మోహన్‌ రెడ్డి మీద,  వైసీపి ప్రభుత్వం మీద రాజకీయ యుద్ధం ప్రకటించేశారు. సూటిగా సుత్తి లేకుండా అంశాల వారీగా సహేతుక విమర్శలు సంధించేస్తున్నారు. ఒక్క క్షణం ఆలస్యం లేకుండా జిల్లాల యాత్రకు ఉపక్రమించారు. ఆ సందర్భంగా ఆమె ప్రజలతో మమేకమౌతున్నారు. అధికార పార్టీ పని తీరుపై ప్రశ్నలు వేసి జనం నుంచి సమాధానాలు రాబడుతున్నారు. ఆ సందర్భంగా ప్రజల సమాధానాలు ఆధారంగా మళ్లీ ఏపీ సర్కార్ పై విమర్శలు కురిపిస్తున్నారు.   మంగళవారం (జనవరి 23) శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా ఆమె పలాస నుంచి ఇచ్చాపురం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ప్రయాణికులను ఏపీలో జగన్‌ పాలన గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తమ కష్టాలను వివరిస్తే ఆ విషయాన్నే ప్రస్తావిస్తూ మీడియాతో  మాట్లాడుతూ, తనను తన భాష, జగన్ ను జగన్ రెడ్డిగారూ అని సంబోధించడం నచ్చలేదన్న వైవీ సుబ్బారెడ్డికి నేరుగా సవాల్ విసిరారు. తాను ఇక నుంచి జగన్ రెడ్డిగారూ అని కాకుండా అన్నగారూ అని సంబోధిస్తాననీ, కానీ  వైవీ సుబ్బారెడ్డి  ఏపీ చాలా అభివృద్ధి చెందిందని కావాలంటే చూపిస్తానని అన్నారు. ఆయన ఆ మాట నిలబెట్టుకోవాలి అన్నారు. అయితే రాష్ట్రంలో అభివృద్ధి తనకు కనిపించడం లేదనీ,  రాజధాని ఎక్కడుంది?మెట్రో రైలు ఎక్కడుంది? పోలవరం పూర్తయ్యిందా? ఇత్యాది విషయాలన్నీ తెలుసుకోవాలని తాను మాత్రమే కాదు, ప్రతిపక్షాలు, మీడియా ప్రతినిథులూ కూడా తహతహలాడుతున్నారన్నారు. కనుక వైవీ సుబ్బారెడ్డిగారి సవాల్ ను స్వీకరిస్తున్నాననీ, ఆయన ఎక్కడకి రమ్మంటే అక్కడికి వస్తాననీ చెప్పారు. అక్కడితో ఆగకుండా ప్లేస్ మీరు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే, టైమ్ మీరు చెప్పినా సరే నన్న చెప్పమన్నా సరే అంటూ బాలయ్య డైలాగ్ ను ఇమిటేట్ చేస్తూ సవాల్ విసిరారు.  

రామ్ లల్లా ఇకపై బాలక్ రామ్

ఇకపై రామ్ లల్లాను 'బాలక్ రామ్'గా పిలవనున్నట్టు ట్రస్ట్ పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు. ఆలయంలో కొలువుతీరిన శ్రీరాముడు ఐదేళ్ల పసిబాలుడని... అందుకే బాలక్ రామ్ పేరును నిర్ణయించామని చెప్పారు. ఇకపై ఆలయాన్ని బాలక్ రామ్ మందిర్ గా పిలుస్తామని తెలిపారు.  మరోవైపు, స్వామికి రోజుకు ఆరుసార్లు హారతిని ఇస్తామని ట్రస్ట్ కు చెందిన ఆచార్య మిథిలేశ్ నందిని తెలిపారు. మంగళ, శ్రింగార, భోగ, ఉతపన్, సంధ్యా, శయన హారతి ఇస్తామని చెప్పారు. పూరి, కూరతో పాటు పాలు, పండ్లు, రబ్ డీ ఖీర్, పాలతో చేసిన స్వీట్లను నైవేద్యంగా సమర్పిస్తామని తెలిపారు.  ఈరోజు నుంచి బాల రాముడి దర్శనానికి సామాన్య ప్రజలను అనుమతించారు. దీంతో, ఆలయం దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో కిటకిటలాడుతోంది.