సజ్జల బాధ..ఓదార్పు ఏది?

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీలో జగన్ తరువాత ఆ స్థాయిలో పెత్తనం, పెత్తందారి తనం చేసేవారెవరైనా ఉన్నారంటే అది సకల శాఖల మంత్రిగా గుర్తింపు పొందిన ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే.  పార్టీలో కానీ, ప్రభుత్వంలో కానీ ఏ కీలక నిర్ణయాన్ని ప్రకటించాలన్నీ, ప్రధాన  విధానాలను వివరించాలన్నా, నియోజకవర్గ ఇన్ చార్జ్ లను ఉంచాలా, మార్చేయాలా? ఎవరికి టికెట్లు ఇవ్వాలి, ఎవరికి నిరాకరించాలి వంటి ప్రతి విషయంలోనూ, ప్రతి నిర్ణయంలోనూ కీలకంగా వ్యవహరించేది సజ్జల మాత్రమేనని అందరికీ తెలిసిందే.   అటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ షర్మిల కాంగ్రెస్ ఏపీ పగ్గాలు చేపట్టిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు తనను చాలా చాలా బాధపెట్టాయని దాదాపు కన్నీరు పెట్టుకున్నంత పని చేశారు. తననే కాదు.. సాక్షాత్తూ షర్మిల సోదరుడు జగన్ ను, పార్టీ నేతలు, కార్యకర్తలనూ కూడా షర్మిల వ్యాఖ్యలు బాధించాయని ఆయన చెబుతున్నారు. మీడియా ముందుకు వచ్చిన ప్రతి సారి ప్రతిపక్షాలను, ప్రతిపక్ష నేతలనూ తూర్పారపట్టడం, జగన్ సర్కార్ తప్పిదాలను సమర్ధించడం తప్ప మరో మాట మాట్లాడని సజ్జల తొలి సారిగా షర్మిల వ్యాఖ్యలు బాధించాయంటూ తెగబాధపడిపోయారు.   ఇంత కాలం వైసీపీ నేతలు వాడిన బాష, ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులపై చేసిన దూష ణలను ఒక్క సారి కూడా మీడియా ముందుకు వచ్చి ఖండిచని సజ్జల..  షర్మిల  వైఎస్ జగన్ సర్కార్ తప్పిదాలను, ఆర్థిక అరాచకత్వాన్ని, జగన్ హయాంలో రాష్ట్రంలో కనిపించని ప్రగతిని, సరిగ్గా పంపిణీ కాని సంక్షేమాన్ని ప్రశ్నించడం తనను తీవ్రంగా బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రషర్మిల వాడిన భాష సరికాదంటూ సూక్తులు చెప్పారు. ఆమె ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం, జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడం వైఎస్ కుటుంబానికి ద్రోహం చేయడంగా అభివర్ణించారు. అసలు ఆమె కాంగ్రెస్ గూటికి చేరడమే తప్పన్నారు. కాంగ్రెస్ పార్టీ   వైఎస్‌ కుటుంబానికి  ఎంతో ద్రోహం చేసిందని చెప్పారు.  అదే సమయంలో వైసీపీ విజయం కోసం, అన్న జగన్ ను ముఖ్యమంత్రి చేయడం కోసం ఒక చెల్లెలుగా షర్మిల పడిన శ్రమ, చేసిన త్యాగం గురించి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలాగే ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత.. తాను ఆ స్థానంలో కూర్చోవడానికి శ్రమపడి, చెమట చిందించి, కాళ్లు అరిగేలా నడిచి, గొంతు చిరిగేలా ప్రచారం చేసిన షర్మిలను రాష్ట్రం నుంచి తరిమేదాకా ఊరుకోని జగన్ ద్రోహం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.  అంతెందుకు షర్మిల తెలంగాణలో వైఎస్సార్టీపీ పేరిట సొంత రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సమయంలో ఆమె రాజకీయాలతో కానీ, ఆమె పార్టీతో కానీ వైసీపీకి కానీ జగన్ కు కానీ ఎటువంటి సంబంధం లేదని మీడియా సమావేశం పెట్టి మరీ వైఎస్ కుటుంబంలో ఆమె ఏకాకి అని తానే స్వయంగా చాటిన విషయం పాపం సజ్జలకు గుర్తు రాలేదు.   ఇక తెలంగాణలో పార్టీ నడపడానికి అవసరమైన ఆర్థిక వనరులు షర్మిలకు అందకుండా చేసిన విషయమూ గుర్తు రాలేదు. ఇప్పడు సొంత చెల్లి తన రాజకీయ భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని తన నిర్ణయం తాను తీసుకుంటే మాత్రం ఎక్కడలేని బాధా సజ్జలలో తన్నుకొచ్చేసోతోందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.  ఇక షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తరువాత చేసిన తొలి ప్రసంగంలో   జగన్ మణిపూర్ హింసాకండపై మౌనంగా ఉండటాన్నిప్రశ్నిస్తూ, ఆయన క్రైస్తవుడేనా అని ప్రశ్నించడాన్ని జగన్ పార్టీ తట్టుకోలేకపోతోందని అంటున్నారు.   ఇక షర్మిల ఇలా ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అందుకున్నారో లేదో అలా వైసీసీ సోషల్ మీడియా వింగ్ ఆమెను టార్గెట్ చేస్తూ దూషణల పర్వాన్ని ప్రారంభించేసింది. అంత దాకా ఎందుకు ఆమె ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించడానికి ముందే ఆమె కాన్వాయ్ ను అడ్డుకుని, దారి మల్లించి వైసీపీ సర్కార్  నిర్బంధకాండను ప్రారంభించేసింది.   జగన్ పాలనలో రాష్ట్రం అధోగతికి చేరుకుందని కాంగ్రెస్ ఏపీ అధినేత్రిగా షర్మిల విమర్శలు నేరుగా సూటిగా ఉండటమే కాకుండా.. ఎన్నికల ప్రచారంలో జగన్ చేసిన వాగ్దానాలను ఎత్తి చూపుతో, వాటిని నెరవేర్చడంలో ఎలా విఫలమయ్యారో పూసగుచ్చినట్లు వివరించడం సహజంగానే సజ్జలను బాధపెట్టింది.  షర్మిల జగన్ రెడ్డిని నేరుగా టార్గెట్ చేయడం ద్వారా జగన్ తీరుపై అసంతృప్తితో ఉన్న వైసీపీ నేతలకు పరోక్షంగానైనా ఆహ్వానం పలికారు. ఇది సజ్జలను అమితంగా బాధపెట్టింది. సిట్టింగుల మార్పు పేరున చేస్తున్న ప్రయోగం కారణంగా ఇప్పటికే పలువురు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇకా మరింత మంది తమ దారి తాము చూసుకోవడానికి దిక్కులు వెతుకుతున్నారు. అటువంటి వారందరికీ తన ప్రసంగం ద్వారా షర్మిల కాంగ్రెస్ గేట్లు తెరిచే ఉన్నాయని చాటారు. వారికి మార్గం చూపడానికా అన్నట్లు తాను ఇలా ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేరగానే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇలా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అలాగే ఒకప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత ఆప్తులుగా ఉన్న కేవీపీ, రఘువీరా వంటి నేతలు షర్మిల పక్కన నిలబడి వైఎస్ రాజకీయ వారసురాలు ఆమె మాత్రమేనని చాటేశారు. దీంతో పార్టీ నుంచి వలసలు వెల్లువెత్తడం ఖాయమన్న భయమే సజ్జలలో బాధకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంతో వైసీపీ నేతలూ, శ్రేణులే కాదు, అగ్రనాయకత్వం కూడా భయంతో వణికి పోతోందని సజ్జల బాధ లోకానికి చాటింది. 

ఆ సెంటిమెంట్ ప్రకారం జగన్ ఓటమి ఖాయమే!?

తాను ఎవరో వదిలిన బాణాన్ని కానని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెబుతున్నప్పటికీ, ఆమె పొలిటికల్ ఎంట్రీ మాత్రం జగనన్న వదిలిన బాణంగానే ఆరంభమైంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అలా జగనన్న వదిలిన బాణం.. చాలా దూరం ప్రయాణించింది. లక్ష్యాలను మార్చుకుంది. ఇప్పుడు ఎవరు వదిలారో వారే టార్గెట్ గా రెట్టించిన స్పీడ్ తో రివర్స్ అయ్యింది, జగనన్న తన చెల్లులు షర్మిల అనే బాణాన్ని  ఏ లక్ష్యంతో వదిలారో.. ఆ లక్ష్యం చేరుకుందో లేదో తెలియదు కానీ ఇప్పడు మాత్రం రివర్స్ అయ్యింది. నేరుగా జగనన్న అధికారాన్నే గురిపెట్టింది. ఔను షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తరువాత పార్టీ శ్రేణులను ఉద్దేశించి చేసిన తొలి ప్రసంగంలో ఆమె తన టార్గెట్ ఏమిటి? ఎవరి ఆశయాన్ని సాకారం చేయడం కోసం తాను ఏపీలో ఎంట్రీ ఇచ్చారు? అన్నది విస్పష్టంగా చెప్పేశారు.  రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్న తన తండ్రి ఆశయాన్ని సాధించేం దుకు ఏపీలో అధికారాన్ని కాంగ్రెస్ కు అందించేందుకు తాను రాష్ట్ర పార్టీ పగ్గాలు చేపట్టానని షర్మిల సందేహాలకు అతీతంగా.. నేరుగా జగన్ పార్టీని ఓడించడమే లక్ష్యమని కుండబద్దలు కొట్టేశారు. అంటే  జగనన్న వదిలిన బాణంగా తన ప్రయాణాన్ని ముగించి.. ఇప్పుడు తనను సంధించిన వారిపైకే రివర్స్ అయ్యిందని తేటతెల్లమైపోయింది.  సినిమా రంగం తరువాత సెంటిమెంట్ ఎక్కువగా వర్కౌట్ అయ్యే రంగమేదైనా ఉందంటే అది రాజకీయ రంగమే. ఒక విధంగా చెప్పాలంటే సినీ రంగం కంటే రాజకీయ రంగంలోనే సెంటిమెంట్ ఎక్కువ వర్కౌట్ అవుతుంది. ఔను సినిమాలలో సక్సెస్ కాంబినేషన్ నే దర్శకులు, నిర్మాతలూ రిపీట్ చేస్తుంటారు. తమ సినిమా కథాబలం మీద ఎంత నమ్మకం ఉంచుతారో సక్సెస్ కాంబినేషన్ అన్న సెంటిమెంటును అంత కంటే ఎక్కువగా నమ్ముతారు. అదే విధంగా రాజకీయాలలో కూడా సెంటిమెంట్ కు ఉన్న ప్రాధాన్యతే వేరు. ఇప్పుడు అదే సెంటిమెంట్ కారణంగా షర్మిల ఏపీ పాలిటిక్స్ లో సెంటరాఫ్ అట్రాక్షన్ గా మారిపోయారు.  ఇప్పుడు ఆ సెంటిమెంట్ ప్రకారం చూసుకుంటే షర్మిల ఎంట్రీ తో జగన్ ఎగ్జిట్  ఖాయమైపోయిందనే భావన పోలిటికల్ సర్కిల్స్ లో బలంగా వ్యక్తం అవుతోంది. ఆమె తొలి సారి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన సమయంలో  అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.  షర్మిల తన అన్న జగన్ కు మద్దతుగా విస్తృతంగా ప్రచారం చేశారు.  2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా పరాజయం పాలైంది. ఆ తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. 2019 ఎన్నికలలో షర్మిల అధికార తెలుగుదేశం పార్టీ పరాజయం కోసం అన్న జగన్ కు మద్దతుగా విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయాన్ని మూటగట్టుకుని ప్రతిపక్షానికి పరిమితమైంది.  ఆ తరువాత షర్మిల తెలంగాణలో తన రాజకీయ ప్రస్థానం ఆరంభించారు. నేరుగా బీఆర్ఎస్ ను టార్గెట్ చేశారు. సుదీర్ఘ పాదయాత్ర చేశారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఆమె పార్టీ పోటీలో లేదు. కాంగ్రెస్ కు మద్దతుగా పోటీ నుంచి వైదొలగింది. ఆ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలైంది.ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.  అంటే 2019 ఎన్నికలలో  ఏపీలో ఆమె ప్రచారం అధికార పక్షాన్ని గద్దె దించి ప్రతిపక్షాన్ని అధికారంలోకి తీసుకువచ్చింది. 2023 ఎన్నికలలో తెలంగాణలోనూ అదే రిపీట్ అయ్యింది. దీంతో షర్మిల అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా నిలబడి ప్రచారం చేస్తే అధికార పార్టీకి ఓటమి తప్పదన్న ఒక సెంటిమెంట్ బలంగా రాజకీయ వర్గాలలో ఏర్పడింది. ఆమె ఏ పార్టీ తరఫున నిలబడ్డారో ఆ పార్టీ ప్రతిపక్షంగా ఉంటే అధికారం చేజిక్కించుకుంటుంది.   అంటే షర్మిల ప్రచారం అధికార పార్టీని గద్దె దించి ప్రతిపక్షాన్ని అధికార పీఠం ఎక్కిస్తుందన్న సెంటిమెంట్ రాజకీయపార్టీలలోనే కాదు, ప్రజలలో కూడా కనిపిస్తోంది. ఆ లెక్కన చూస్తే ఏపీ ఎన్నికలలో షర్మిల కాంగ్రెస్ తరఫున నిలబడి ప్రచారం చేస్తుండటం అధికారంలో ఉన్న జగన్ పార్టీకి ఓటమిని ఖరారు చేయడమేనన్ననమ్మకం వైసీపీలో రోజు రోజుకూ బలపడుతోంది. అదే సమయంలో ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందన్న విశ్వాసం, నమ్మకం ప్రజలలో వ్యక్తం అవుతున్నాయి.    ఇక 2019  ఎన్నికలలో జగన్   ముఖ్యమంత్రి కావడానికి తన శక్తికి మించి కష్టపడిన షర్మిల ఇప్పుడు అదే జగన్ ను గద్దె దించడానికి అంత కంటే ఎక్కువగా కష్టపడేందుకు రెడీ అయిపోయారు.  సెంటిమెంటూ ఆమెకు అనుకూలంగానే ఉంది. సో వచ్చే ఎన్నికలలో జగన్ గద్దె దిగడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే సెంటిమెంటు ప్రకారం తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయమనీ అంటున్నారు. 

సందేహం లేదు.. షర్మిల టార్గెట్ జగనే!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి  అయిన తన సోదరుడు వైఎస్‌ జగన్‌ పట్ల కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిల  వైఖరి ఎలా ఉంటుందనే ప్రశ్న నిన్న మొన్నటి దాకా అందరిలోనూ మెదులుతూ ఉన్న ప్రశ్న. అయితే ఇలా ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టారో లేదో అలా అటువంటి అనుమానాలు, సందేహాలను నివృత్తి చేసేశారు షర్మిల. ఇక ఆమె వైఖరి ఎలా ఉంటుందనే ప్రశ్నే తలెత్తని విధంగా అన్నపై డైరెక్ట్ అటాకేనని ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా తన తొలి ప్రసంగంతోనే తేల్చి చెప్పాశారు.  ఆదివారం (జనవరి 21)న ఏపీ కాంగ్రెస్ పగ్గాలను చేపట్టిన షర్మిల  జగన్‌ పై డైరెక్ట్ అటాక్ కు సిద్ధ పడ్డారని, అన్నకు వ్యతిరేకంగా రాజకీయ పోరాటానికి శంఖారావం పూరించారని ఆమె తొలి ప్రసంగంతోనే చాటారు. తనంటే భయపడేవారే ఎక్కువగా తనపై విమర్శలు చేస్తారనీ, తనను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారని చెప్పడం ద్వారా షర్మిల జగన్ సర్కార్ తన ఎంట్రీతో భయపడుతోందని స్పష్టం చేశారు.   వైసిపి  హయాంలో రాష్ట్రం అప్పుల కుప్పలా మారిందని విమర్శించారు.  జగన్‌ రెడ్డి ఈ ఐదేళ్లలో  మూడు మూడు లక్షల కోట్లు అప్పులు చేశారని, జనం మీద మోయలేనంతగా పన్నుల భారం మోపారని విమర్శించారు. ఐదేళ్లలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి ఒక్కటంటే ఒక్కసారి కేంద్రాన్ని నిలదీసిన పాపాన పోలేదన్నారు.   రాష్ట్రానికి   పరిశ్రమలు   రాలేదు, పోలవరం నిర్మాణం ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు. రోడ్లు వేయడానికి డబ్బులు లేవని, ఉద్యోగులకు జీతాలు సమయానికి ఇవ్వడం లేదు. దళితులపై దాడులు పెచ్చరిల్లాయి.  ఇసుక, లిక్కర్‌, మైనింగ్‌ మాఫియాల దోపిడీ స్వైరవిహారం చేస్తోంది. ఇక ప్రశ్నించే వారిపై వేధింపులు, గొంతెత్తితే కేసులు అంటూ షర్మిల వైసీపీ సర్కార్, ఏపీ సీఎం జగన్ పై సూటిగా విమర్శలు గుప్పించారు.  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని దీక్షలు చేసిన జగన్  ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత ఒక్కసారి కూడా ఆ విషయం ఎత్తలేదని గుర్తు చేశారు.  స్వలాభం కోసం వైసిపి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని, మూడు రాజధానులన్న జగన్ రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారని విమర్శించారు.  .జగన్‌ రెడ్డి క్రైస్తవుడై ఉండి కూడా మణిపూర్‌ హింసాకాండ మీద మాట్లాడలేదని విమర్శించారు. 

జగన్ కు షర్మిల వార్నింగ్.. ఓటమికి రెడీ అయిపోవాలని పరోక్ష హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్‌ పిసీసీ  అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే షర్మిల తన సోదరుడు ఏపీ సీఎం జగన్ కు పరోక్షంగా గట్టి వార్నింగ్ ఇచ్చారు.   తెలంగాణలో కేసీఆర్‌ నాయకత్వంలోని బీఆర్‌ఎస్‌ ఓటమిని ప్రస్తావిస్తూ,  తెలంగాణలో ఒక నియంతను అధికారం నుంచి దించానని చెప్పుకున్నారు. రాజశేఖర రెడ్డి   బిడ్డ తెలంగాణలో ఒక నియంతను అధికారం నుంచి దింపిందని షర్మిల చెప్పడాన్ని బట్టి ఏపిలో కూడా వైఎస్‌ జగన్‌ను అధికారం నుంచి దింపుతానని, తన అజెండా అదేనని ఆమె పరోక్షంగా హెచ్చరించారు.   తెలంగాణ తన మెట్టినిల్లనీ, ఏపీ తన పుట్టిల్లనీ చెబుతూ తన లక్ష్యం, తన ధ్యేయం తెలుగు ప్రజలు బాగుండాలన్నదేనని చాటారు. అందుకే తాను కాంగ్రెస్ గూటికి చేరినట్లు క్లియర్ గా చెప్పడం ద్వారా  ఏపీలో జగన్ హయాంలో జనం ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రం అన్ని రంగాలలో వెనుకబడిపోయిందని చాటారు. ఆ పరిస్థితిని చక్కదిద్ది, రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికే తాను కాంగ్రెస్ లో చేరి రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు చేపట్టినట్లు షర్మిల చెప్పారు.  ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు తనకు ముఖ్యమని చెప్పడం ద్వారా సోదరుడు అన్న ఓటమే లక్ష్యమని చాటారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోకసభ స్థానాలకు పోటీ చేస్తుందని ప్రకటించారు, తాను ఈ నెల 23 నుంచి జిల్లాల్లో పర్యటిస్తానని, తొమ్మిది రోజుల పాటు రోజుకు మూడు జిల్లాల్లో చేరికలు ఉంటాయని చెప్పారు. 24 నుంచి పోటీ చేయాలనుకునే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని అన్నారు.  బిజెపిపై ఆమె తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మణిపూర్‌ సంఘటలను ప్రస్తావిస్తూ అటువంటి బిజెపి దేశానికి అవసరం లేదని చెప్పారు. పోలవరం, అమరావతి రాజధాని, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఇలా అన్ని విషయాల్లో బిజెపి ఏపీకి అన్యాయం చేసిందని ఆమె విమర్శించారు. వైసిపి, టిడిపి రెండు కూడా బిజెపితో కుమ్మక్కు అయ్యాయని ఆమె అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 25 మంది ఎంపీలు కూడా బిజేపి వాళ్లేనని ఆమె వ్యాఖ్యానించారు.  తాను ఎవరూ వదిలిన బాణం కాదని, మహిళ కదా అని తక్కువ చేసి మాట్లాడవద్దని షర్మిల అన్నారు.తన వల్ల ఏ పార్టీకి నష్టం జరుగుతుందో ప్రజలే చెబుతారని ఆమె అన్నారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వస్తే నియంతలే అవుతారని ఆమె అన్నారు. ఎవరికి ఎక్కువ భయం ఉంటే వారే తనను విమర్శిస్తారని వైఎస్‌ షర్మిల అన్నారు.

రేవంత్ మద్దతు దారులకు కీలక పోస్టింగులు

పాలనలో చంద్రబాబును, నమ్మకున్న వారికి న్యాయం చేయడంలో వైఎస్ ను తలపిస్తూ రేవంత్ ముఖ్యమంత్రిగా సత్తా చాటుకుంటున్నారు. నామినేటెడ్ పదవుల నియామకంలో రేవంత్ సర్కార్ స్పీడ్ పెంచింది. ముగ్గురు సలహాదారులను నియమించింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో క్రియాశీలంగా వ్యవహరించి పార్టీ విజయానికి తమ వంతు దోహదం చేసిన కీలక నేతలకు కేబినెట్ హోదాతో కూడిన సలహాదారు పదవులలో నియమించింది. ప్రభుత్వం తాజాగా చేపట్టిన నియామకాల ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలుపుకున్నట్లు అయ్యింది. మాట ఇస్తు తప్పనన్న నమ్మకాన్ని రేవంత్ పార్టీలో కలిగించగలిగారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సోదరుడు మల్లు రవిని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిథిగా నియమిస్తూ రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా సీఎం సలహాదారుగా మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డిని, ప్రభుత్వ సలహాదారులుగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ, సీనియర్ నేత వేణుగోపాల్ ను నియమించింది. మొత్తం ఈ నాలుగు నియామకాలతో కాంగ్రెస్ సర్కార్ నామినేటెడ్ పదవుల భర్తీపై దృష్టి పెట్టింది. షబ్బీర్ అలీ ఎస్సీఎస్టీ, బీసీ మైనారిటీ వ్యవహారాల సలహాదారుగా,  ప్రొటోకాల్‌, పబ్లిక్‌ రిలేషన్స్‌ సలహాదారుగా వేణుగోపాల్‌ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.ఇదే జోరులో రానున్న రోజులలో మరిన్ని నామినేటెడ్ పోస్టుల భర్తీకి రేవంత్ సర్కార్ సమాయత్తమౌతోంది.   ప్రభుత్వ సలహాదారుల నియామకం ద్వారా నలుగురు కీలక నేతలకు పోస్టింగులు ఇచ్చిన నలుగురూ కూడా సీఎం రేవంత్ కు అత్యంత సన్నిహితుల కావడం ఇక్కడ ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం ఉంది.  వేం నరేందర్ రెడ్డి రేవంత్ కు ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పటి నుంచే సన్నిహితుడు.  ఓటుకు నోటు కేసులో  వేం నరేందర్ రెడ్డి కూడా జైలుకు వెళ్లిన సంగతి విదితమే.  కాంగ్రెస్ లో చేరిన తరువాత కూడా వేం నరేందర్ రెడ్డి రేవంత్ కు అత్యంత సన్నిహితుడిగానే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో పోటీ కోసం టిక్కెట్ అంటూ ఒత్తిడి చేయలేదు. రేవంత్ పీసీసీ పగ్గాలు చేపట్టిన సమయంలో పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సమయంలో కూడా వే నరేందర్ రెడ్డి రేవంత్ కు గట్టి మద్దతుదారుగా నిలబడ్డారు.  ఇప్పుడు రేవంత్ ఆయనకు   కేబినెట్ హోదా ఇచ్చారు. ఇక  మల్లు రవి కూడా రేవంత్ కు నమ్మకమైన నేతగా, సన్నిహితుడిగా ఉన్నారు.   షబ్బీర్ అలీ కూడా రేవంత్ నే సమర్థిస్తున్నారు. అలా తనకు కష్టకాలంలో మద్దతుగా నిలిచిన వారందరికీ రేవంత్ పదవులు కట్టబెట్టారని చెప్పారు. ఇక త్వరలో ఆర్టీసీ ఛైర్మన్‌ సహా మరికొన్ని కీలక పదవుల నియామకానికి కూడా రేవంత్ సీరియస్ గా కసరత్తు చేస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక పార్టీలో తనకు గట్టి మద్దతు ఇచ్చిన అద్దంకి దయాకర్ కు కూడా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇచ్చే దిశగా రేవంత్ యోచిస్తున్నట్లు చెబుతున్నారు. 

చక్రం తిప్పింది కేవీపీయే.. షర్మిల ఎంట్రీతో జగన్ కు శంకరగిరి మాన్యాలే!

కేవీపీ రామచందర్‌ రావు  ను దివంగత నేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి  ఆత్మగా చెబుతుంటారు. వైఎస్‌ రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీని పెట్టినప్పటికీ కేవీపి కాంగ్రెస్‌లోనే ఉండిపోయారు. రాష్ట్ర విభజన తర్వాత గత పదేళ్లుగా  ఆయన కాంగ్రెస్‌లోనే ఉన్నారు. రాజకీయంగా ఆయన క్రియాశీలంగా వ్యవహరించడం లేదని ఇప్పటి వరకూ అందరూ అనుకుంటూ వచ్చారు. అయితే ఆయన కాంగ్రెస్ కు ఏపీలో పూర్వ వైభవం తీసుకురావడానికి తెరవెనుక చక్రం తిప్పుతూనే ఉన్నారని తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ లో చోటుచేసుకుంటున్న పరిణామాలను బట్టి అర్ధమౌతోంది.  ఇప్పటి వరకు కాంగ్రెస్‌ ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉండి, ఇటీవలే షర్మిలకు రూట్ క్లియర్ చేస్తూ రాజీనామా చేసిన  గిడుగు రుద్రరాజు  కేవీపి రామచందర్‌ రావుకు సన్నిహితుడు. అసలు గిడుగు రుద్రరాజు రాజకీయాలలోకి వచ్చిందే కేవీపీ రామచంద్రరావు ద్వారా. ఆయన ఆశీస్సులతోనే గిడుగు ఎమ్మెల్సీ అయ్యారు. ఆ తరువాత పీసీసీ చీఫ్ అయ్యారు.  ఇప్పుడు ఏపీ సీఎం   జగన్‌ సోదరి  షర్మిల   కాంగ్రెస్‌లో చేరి పిసిసి పగ్గాలు చేపట్టారు. షర్మిల ఏపీ సీఎం సోదరి మాత్రమే కాదు. వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ కూడా. ఆ షర్మిలకు మార్గం సుగమం చేయడానికే  పిసిసి పదవికి రుద్రరాజు రాజీనామా చేశారు. పిసిసి అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిల ఆదివారం (జనవరి 21) బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు శనివారం (జనవరి 20)   షర్మిల ఇడుపులపాయలో తన తండ్రి రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించారు. హైదరాబాద్‌ నుంచి ఇడుపులపాయ  కు వెళ్లిన ఆమెతో కేవీపి రామచందర్‌ రావు కూడా ఉన్నారు.   అంటే షర్మిల కాంగ్రెస్ లో చేరిక వెనుక, అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకోవడానికి అవసరమైన వ్యూహరచన అంతా కేవీపీదేనని అవగతమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే ఇక ముందు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ వ్యూహాలు, ఎన్నికల ప్రణాళికలు అన్నీ కేవీపీ చేతుల మీదుగానే జరుగుతాయని అంటున్నారు.   రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఈ స్థితిలో వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌కు తిరిగి ఊపిరిపోస్తారా, పార్టీకి రాష్ట్రంలో పూర్వ వైభవం తీసుకువస్తారా అన్నది పక్కన పెడితే..   పిసిసి అధ్యక్షురాలిగా పార్టీలో ఆమె వైఎస్ రాజశేఖరరెడ్డి లెగసీని కొనసాగిస్తారని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ నామమాత్రంగా మారిపోవడానికి ముఖ్యకారణం వైఎస్ జగన్. విభజన అనంతరం ఆయన కాంగ్రెస్ అధిష్ఠానంతో విభేదించి సొంత కుంపటి పెట్టుకోగానే..  పార్టీలోని వైఎస్ అనుచరులు అంతా ఆయన వెంట పార్టీని వీడారు. అంతకు ముందు అంటే వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉన్న సమయంలో, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర కాంగ్రెస్ మొత్తం ఆయన వెనుకనే నడిచేది. కొద్ది మంది ఆయనతో విభేదించినా, వారి గొంతు వినిపించే పరిస్థితి కూడా రాష్ట్ర కాంగ్రెస్ లో ఉండేది కాదు. పార్టీలోని తన వ్యతిరేకులందరినీ వైఎస్ రాజశేఖరరెడ్డి దాదాపు క్రియా రహితంగా చేసేశారు. ఆ కారణంగానే వైఎస్ జగన్ వైసీపీ అంటూ సొంత పార్టీ పెట్టుకోగానే ఆయన వెంట అప్పటి వరకూ కాంగ్రెస్ లో క్రియా శీలంగా ఉన్న నేతలంతా వెళ్లిపోయారు. దాంతో రాష్ట్ర కాంగ్రెస్ లో కొందరు మిగిలినా వారు రాజకీయంగా పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో రాష్ట్రంలో పార్టీ పరిస్థితి నామమాత్రంగా మారిపోయింది. మిగిలిపోయింది. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ గత పదేళ్లుగా నిర్వీర్యం అయిపోవడానికి రాష్ట్ర విభజన ఎంత కారణమో, వైఎస్ జగన్ కూడా అంతే కారణం అని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. అయితే జగన్ తన పాలనలో తనను నమ్మి వచ్చిన వారి విశ్వాసాన్ని కోల్పోయారు. అలాగే ప్రజాదరణనూ కోల్పోయారు. సరిగ్గా ఇదే సమయంలో రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఉనికి మాత్రంగా మారిపోవడానికి కారణమైన జగన్ పార్టీని దెబ్బ తీయడానికి కాంగ్రెస్ హైకమాండ్ వైఎస్ లెగసీనే నమ్ముకుంది. అందుకే షర్మిలకు పార్టీ పగ్గాలు అప్పగించింది. అయితే ఈ వ్యూహం ఇంత పక్కాగా, పకడ్బందీగా, సజావుగా అమలు కావడంలో తెరవెనుక చక్రం తిప్పింది వైఎస్ ఆత్మగా చెప్పుకునే కేవీపీయే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   సరే కేవీపీ వ్యూహం ఫలించి ఆమె ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అందుకున్నారు. అందుకున్నారు సరే.. సొంత అన్న జగన్ పార్టీని ఆమె ఏ మేరకు దెబ్బ తీస్తారు. వైసీపీలో ఉన్న పూర్వ కాంగ్రెస్ నేతలలో ఎంత మంది షర్మిల కారణంగా సొంత గూటికి చేరుకుంటారు. ఆమె ప్రభావం ఏపి రాజకీయాల్లో ఏ మేరకు ఉంటుంది అన్నది రానున్న రోజుల్లో స్పష్టంగా తెలుస్తుంది. అయతే విశ్లేషకులు మాత్రం షర్మిల ఎంట్రీతో రాష్ట్రంలో వైసీపీ ఫ్యాన్ తిరిగే అవకాశాలు దాదాపు మృగ్యం అనే అంటున్నారు.  షర్మిల ఎంట్రీతో రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకోవడం ఖాయమనే చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ షర్మిలకు ఏపీ పగ్గాలు అప్పగించడంతోనే వైఎస్ రాజకీయవారసురాలు షర్మిల మాత్రమేనన్నది తేటతెల్లమైపోయిందంటున్నారు. ఇక షర్మిల కారణంగా రానున్న ఎన్నికలపై ఇప్పటి వరకూ వచ్చిన సర్వేల మేరకు వైసీపీ గెలుస్తుందని భావిస్తున్న సీట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  సాధారణంగా ఎన్నికలలో త్రిముఖ పోటీ ఉంటే చీలిపోయేది ప్రభుత్వ వ్యతిరేక ఓటే. దాని వల్ల లబ్ధి పొందేది అధికార పార్టీయే. కానీ షర్మిల ఎంట్రీతో ఏపీలో మాత్రం ప్రభుత్వ అనుకూల ఓటులో భారీ చీలిక వచ్చే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంటే జగన్ పార్టీని ఓటమికి మరింత చేరువ చేసేందుకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు షర్మిల చేపట్టడం కారణమౌతుందని అంటున్నారు.  

కాంగ్రెస్ హామీలపై కేటీఆర్ ఆక్రోశం!

తొమ్మిదేళ్లకు పైగా అధికారంలో ఉన్న సమయంలో అసెంబ్లీలో కానీ, బయట కానీ తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క గొంతు వినిపించినా సహించలేదు. ఇచ్చిన వాగ్డానాలు ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించిన వారిపై తెలంగాణ ద్రోహులన్న ముద్ర వేశారు. అత్యంత ప్రతిష్ఠాత్మకం అంటూ ఘనంగా చాటుకున్న కాళేశ్వరం లోపాలను ఎత్తి చూపితే కొత్త ప్రాజెక్టులలో ఇవి సహజం అన్నారు. లక్షలాది నిరుద్యోగుల జీవితాలకు సంబంధించిన పరీక్షా పత్రాలు లీకైతే ఇప్పుడే ఇలా జరిగిందా అంటూ ఎదురు దాడికి దిగారు. అసలు అధికారంలో  ఉన్నంత కాలం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడానికే ప్రయత్నించిన బీఆర్ఎస్ సర్కార్.. ఇప్పుడు విపక్షంలోకి రాగానే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తున్నది.  ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సాధ్యమైనంత త్వరగా రేవంత్ సర్కార్ కు మంగళం పాడేసి అధికారం అందుకోవాలని తహతహలాడిపోతున్నారు. తొమ్మిదిన్నరేళ్ల తమ పాలనలో వాగ్దానాల అమలును తెలంగాణ ద్రోహులుగా ముద్రించేందుకు వెనుకాడని కేటీఆర్ ఇప్పడు అధికారంలోకి వచ్చి పట్టుమని రెండు నెలలు కూడా కాని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆరు గ్యారంటీలపై నిలదీస్తున్నారు. రాజకీయ పార్టీగా పట్టుమని 10 సంవత్సరాల చరిత్ర కూడా లేని బీఆర్ఎస్ వందేళ్ల రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతల అనుభవాన్ని ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రస్థానంలో రేవంత్ వంటి వారిని ఎందరినో చూశానంటున్నారు. తెలంగాణ ఆవిర్భావం అయిన వెంటనే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న హామీని దాదాపు తొమ్మిదేళ్లు అధికారంలో ఉండి కూడా పట్టించుకోని బీఆర్ఎస్.. ఇప్పుడు వంద రోజుల్లో హామీలు నెరవేర్చమని రేవంత్ సర్కార్ ను నిలదీస్తున్నది.  తమ ప్రభుత్వ హయాంలో రైతుల ఆత్మహత్యల గురించి కనీసం పట్టించుకోని కేటీఆర్ ఇప్పడుడు 50 రోజుల పాలనలో  రేవంత్ పాలనలో పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. అంతే తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరని ఊరికే అనలేదు మరి.

బౌద్ధ వారసత్వాన్ని కాపాడుకోవాలి.. డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి

భారతీయ సంస్కృతిని సుసంపన్నం చేసిన బౌద్ధ వారసత్వానికి కాపాడుకోవాలి పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి పిలుపునిచ్చారు. మహారాష్ట్ర పురావస్తు శాఖ, సావిత్రీ పులె విశ్వవిద్యాలయం(పుణె) సంయుక్తంగా నిర్వహించిన మహారాష్ట్ర బౌద్ధ వారసత్వం అన్న అంతర్జాతీయ సదస్సులో ఒక విభాగానికి అధ్యక్షత వహించిన డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి మహారాష్ట్రలో  బౌద్ధ గుహలు.. సాంకేతిక అంశాలు అన్న అంశంపై శనివారం (జనవరి 19) ప్రసంగించారు.  క్రిస్తుపూర్వం 2- క్రీస్తు శకం 7 శతాబ్దాల మధ్య పశ్చిమ మహారాష్ట్లో 1200 బౌద్ధగుహలున్నాయనీ, బౌద్ధ భిక్షువులు వారి నివాసం కోసం తొలచి, బౌద్ధ చిహ్నాలు, బుధ్ధ, బోధిసత్వ శిల్పాలు, చిత్రాలు తీర్చిదిద్దారని అన్నారు. కాగా సదస్సు నిర్వాహకులు డాక్టర్ శివనాగిరెడ్డిని సత్కరించారు. 

దేశం గూటికి వైసీపీ ఎమ్మెల్యే? 

పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి వైసీపీ  ఎమ్మెల్యే ఎలిజా టిడిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికలలో వైసీపీ తరపున ఎలిజా అత్యధిక మెజారిటీతో గెలుపొందారు.  వైసీపీలో ఇంఛార్జిల మార్పులు చేర్పులు ఆ పార్టీలో చిచ్చు రాజేస్తున్నాయి. మార్పుల పేరుతో సీఎం జగన్ పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించారు. కొందరికి స్థానచలనం చేశారు. మరికొందరిని ఎంపీలుగా బరిలోకి దింపుతున్నారు. ఈ పరిణామాలు పార్టీలో ప్రకంపనలు రేపుతున్నాయి. టికెట్ రాని నేతలు, ఎంపీగా పోటీ చేయడం ఇష్టం లేని వారు పక్క చూపులు చూస్తున్నారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు వైసీపీకి గుడ్ బై చెప్పారు. తాజాగా మరో ఎమ్మెల్యే అదే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఇటీవల వైసీపీ చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెత్తందారులకే జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన అన్నారు. తనకు సీటు ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు. తనకు ఏలూరు పార్లమెంటు సభ్యుడు కోటగిరి శ్రీధర్ లకు మధ్య విభేదాలున్నాయని, దానిని సాకుగా చూపి కొందరు తనపై అధినాయకత్వానికి తప్పుడు సమాచారాన్ని అందించారన్నారు. తనపై పెద్దయెత్తున కుట్ర జరిగిందని అన్నారు. సర్వే నివేదికలను.... సర్వే నివేదికలను కూడా పక్కన పెట్టి తప్పుడు నివేదికలు తయారుచేసి అధినాయకత్వానికి అందించారని ఎలీజా ఆరోపించారు. తాను ఐఆర్ఎస్ అధికారికా పనిచేస్తూ సర్వీసు మూడేళ్లున్నప్పటికీ దానిని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. అధినాయకత్వం ఈ కుట్రలను గమనించాలని ఎలీజా కోరారు. లేకపోతే పార్టీఇక్కడ ఇబ్బందుల్లో పడుతుందని ఆయన హెచ్చరించారు.ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే టిడిపి ముఖ్య నేతలతో సమావేశమైనట్లు తెలుస్తోంది. చర్చలు ఫలిస్తే టిడిపి తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని సమాచారం. 

పాపం కేశినేని నాని.. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది!

విజయవాడ ఎంపి కేశినేని నాని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. వ్యక్తిత్వం ఉన్న కొద్దిమందిలో ఆయన ఒక నాయకుడన్న భావన, మొన్న మొన్నటి వరకూ ఉండేది. తనకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరుకునే నేత అన్న భావన ఉండేది. కానీ తెలుగుదేశం నుంచి వైసీపీలోకి మారిన తర్వాత  ఆయన పట్ల అప్పటి వరకూ ఉన్న ఆ భావన అందరిలోనూ మటుమాయం అయ్యింది.  అవధులు లేని అహంభావం, పొగరుబోతుతనం తప్ప ఆయనలో ఆలోచన లేదని వైపీపీలో చేరిన తరువాత ఆయన అత్యంత అప్రాధాన్యంగా ఆ పార్టీలో మెలుగుతున్న తీరుతో అందరికీ అవగతమైంది.  కేశినేని నాని టీడీపీలో ఉన్నప్పుడు, స్వతంత్రంగా వ్యవహరించేవారు. సీఎంఓ నుంచి ఫోన్‌ చేసి మాట్లాడినా, తాను నేరుగా చంద్రబాబుతోనే మాట్లాడతానని చెప్పగలిగే స్వేచ్ఛ ఉండేది.  అంతే కాదు ఆయన పార్టీలో సీనియర్లను కూడా పెద్దగా ఖాతరు చేసే వారు కాదు. తనకు తాను చంద్రబాబుతో సమాన స్థాయి ఉన్న నేతగా భావించుకునే వారు.  ఆ కారణంగానే పార్టీలో సీనియర్లు చాలా మంది ఆయనకు దూరంగా మెలిగే వారు.  అయితే అదంతా కేశినేని బిల్డప్ మాత్రమేనని నాని వైసీపీ గూటికి చేరిన రోజుల వ్యవధిలోనే బట్ట బయలైపోయింది. విజయవాడ ఎంపీగా తనతోపాటు.. మరో ఐదుగురు నేతలకు, అసెంబ్లీ సీటు ఇవ్వాలని ఆయన వైసీపీ అధినేతకు సిఫార్సు చేశారట. కానీ ఆయన సిఫారసు చేసిన వాటిలో తిరువూరు వినా  మరో సీటు ఇచ్చేందుకు ససేమిరా అన్న సర్దుకు పోయారు. ఇక ఇటీవల బెజవాడలో జరిగిన పలు వైసీపీ కార్యక్రమాలకు కేశినేని నాని హాజరయ్యారు. మామూలుగా అయితే అక్కడ ఆయన పరిస్థితి గుంపులో గోవింద మాదిరిగానే ఉంది.   తెలుగుదేంలో ఉన్నప్పుడు విజయవాడలో పార్టీ పరంగా ఏ కార్యక్రమం జరిగినా ఎంపీ హోదాలో ఉన్న నానికి సముచిత ప్రాధాన్యత లభించేది. వేదికపై ఎన్టీఆర్ పక్కనే స్థానం కూడా లభించేది. అయితే ఇప్పుడు  నానికి  వైసీపీలో ఎలాంటి ప్రాధాన్యతా లభించడం లేదు. విజయసాయిరెడ్డి ముందు వరసలో ఉండి, మీడియాతో మాట్లాడితే… స్వతంత్ర భావాలుండి, ఎక్కువ ప్రాధాన్యం కోరుకునే కేశినేని నాని మాత్రం.. ఎమ్మెల్యే మల్లాది విష్ణు వెనుక నిలబడి ఉన్న ఫొటో ఒకటి ఇప్పుడు మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  కేశినేని నానికి కూడా ఆ విషయం ఇప్పటికే స్పష్టంగా అర్ధమై ఉంటుంది. అయితే కోరి కొనుక్కున్న కొరివి కనుక మండినా బయటపడే అవకాశం లేదు. లోలోన మాత్రం ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అన్న పాట పాడుకుంటూ ఉండే ఉంటారు. ఆ అవమానాలే అలా ఉంటే తాజాగా విజయవాడలో గురువారం జరిగిన అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎంపీగా ఇవ్వాల్సి ప్రోటోకాల్ కూడా ఇవ్వకుండా వైసీపీ నానిని మరింత ఘోరంగా అవమానించింది. దీంతో ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది అంటూ విషాద గీతాలు పాడుకుంటూ, వైసీపీ రాజ్యాంగానికి అనుగుణంగా అణిగిమణిగి ఒదిగి ఒదిగి ఉండేందుకు కేశినేని నాని మానసికంగా సిద్ధమైపోతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

అరకులో దారితప్పిన చంద్రబాబు హెలికాప్టర్ 

చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ దారి తప్పింది. నక్సలైట్ల ప్రాబల్యం ఉన్న అరకు నియోజకవర్గంలో రా కదలిరా బహిరంగసభకు  హాజరయ్యేందుకు  చంద్రబాబు విశాఖ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో బయలుదేరారు. అయితే హెలికాఫ్టర్ పైలట్ రూట్ విషయంలో కన్‌ఫ్యూజ్ అయ్యారు. ఏటీసీ సూచనలు అర్థం చేసుకోలేకపోవడంతో సమస్య ఏర్పడింది. రాంగ్ రూట్‌లో వెళ్తున్నట్లుగా గుర్తించిన ఏటీసీ వెంటనే పైలట్‌ను అప్రమత్తం చేశారు. దీంతో పైలట్ కరెక్ట్ రూట్‌లో అరుకులో ల్యాండ్ చేయగలిగారు. దీంతో కాసేపు ఉత్కంఠ ఏర్పడింది. రా కదలిరా సభలో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్నారు చంద్రబాబు. అక్కడ నుంచి అరకు వెళ్లేందుకు హెలికాఫ్టర్ రెడీ చేసుకున్నారు. సాధారణంగా వాయుమార్గంలో ప్రయాణించాలంటే సమీపంలోని విమానాశ్రయ ఏటీసీ క్లియరెన్స్ తప్పనిసరి. వారు రూట్ మ్యాప్ ఇస్తారు. ఆ ప్రకారం అరకు వెళ్లేందుకు హెికాఫ్టర్ కు కూడా రూట్ ఖరారు చేశారు. అయితే పైలట్ గందరగోళానికి గురి కావడంతో  నిర్దేశిత మార్గం లో కాకుండా వేరే మార్గం లో చంద్రబాబు హెలికాప్టర్ ప్రయాణించింది.  విశాఖపట్నం నుంచి అరకు వెళ్లే మార్గం లో రాంగ్ డైరెక్షన్ లోకి వెళ్లిన హెలికాప్టర్ వెళ్లింది. ఈ విషయాన్ని ఏటీసీ వెంటనే గుర్తించింది.  ఏటీసీ హెచ్చరించడం తో అప్రమత్తం అయిన పైలట్ సరైన రూట్‌లో తీసుకెళ్లారు. అరకు తో పాటు మన్యం మొత్తం నక్సలైట్ల ప్రాబల్యం ఉన్న నియోజకవర్గం కావడం , చంద్రబాబు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న నేత కావడంతో  హెలికాఫ్టర్ దారి ప్పిందని తెలియడంతో అధికారులు కంగారు పడ్డారు. అయితే కాసేపటికే మళ్లీ సరైన దారిలోకి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

సానియాకు విడాకులు.. షోయెబ్ మాలిక్ రెండో వివాహం

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త షోయెబ్ మాలిక్ రెండో వివాహం చేసుకున్నారు. ఈ పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. పాకిస్థాన్ సినీ నటి సనా జావేద్ తో తన వివాహం జరిగిందంటూ అందుకు సంబంధించిన ఫొటోలను  ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. గత కొన్నేళ్లుగా షోయెబ్ మాలిక్, సానియా మీర్జా విడాకులు తీసుకోనున్నారంటూ వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ ఆ వార్తలపై  అటు సానియామీర్జా కానీ, ఇటు షోయెబ్ మాలిక్ కానీ స్పందించలేదు. ఇప్పుడు తన రెండో వివాహం గురించి షోయెబ్ మాలిక్ స్వయంగా వెల్లడించడంతో వారిరువురి విడాకులు వాస్తవమన్న విషయం తేటతెల్లమైంది.  కాగా సానియా మీర్జా కూడా షోయెబ్, తాను విడిపోతున్నామన్న సంకేతం ఇచ్చేలా రెండు రోజుల కిందట సామాజిక మాధ్యమంలో ఒక పోస్టు పెట్టారు. ఆ పోస్టులో సానియా వివాహం, విడాకులు రెండూ కఠినమైనవేనని పేర్కొన్నారు. షాయెబ్, సానియా మీర్జా పెళ్లి తరువాత దుబాయ్ లో నివాసం ఉన్నారు. సానియామీర్జా టెన్నిస్ లో భారత్ కు, షోయెబ్ క్రికెట్ లో పాకిస్థాన్ కు ప్రాతినిథ్యం వహించారు. వారికి ఒక కుమారుడు ఉన్నారు. కొద్ది రోజుల కిందట సానియా మీర్జా టెన్నిస్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. అలాగే షోయెబ్ కూడా క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం షోయెబ్ మాలిక్ రెండో పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.  

షర్మిల పొలిటికల్ కెరీర్ కు పరిక్షా సమయం!

పోరాడితే పోయేదేం లేదు బానిస సంకెళ్లు తప్ప అన్నది నినాదం. అయితే ఇప్పుడు ఇది వైసీపీలోని క్యాప్టివ్ నేతలు, అసంతృప్త ఎమ్మెల్యేలు, ఎంపీలకు సరిగ్గా వర్తిస్తుంది. ఛీ అన్నా, తూ అన్నా జగన్ పార్టీ చూరుపట్టుకు వేళాడక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటున్న పలువురికి ఇప్పుడు కాంగ్రెస్ పర్ ఫెక్ట్ డెస్టినేషన్ లా కనిపిస్తోంది.  జగన్ వ్యూహాత్మకంగా గత నాలుగున్నరేళ్లలోనూ పార్టీలో గుర్తింపు, ప్రాముఖ్యత ఉండాలంటే విపక్షాలను మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ అగ్ర నేతలను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాల్సిందే అన్న పరిస్థితి కల్పించారు. దీంతో జగన్ ప్రాపకం సంపాదించడానికో, పదవుల కోసమో పలువురు వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు విపక్షాలపై మరీ ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్, జనసేనాని పవన్ కల్యాణ్ పై అనుచితంగా నోరు పారేసుకున్నారు. సభ్య సమాజం అంగీకరించని భాషలో విమర్శలు గుప్పించారు. వ్యక్తిగత, కుటుంబ విషయాలను సైతం లేవనెత్తి దుర్భాషలాడారు.అలాంటి వారిలో అత్యధికులకు ఇప్పుడు జగన్ వచ్చే ఎన్నికలలో పోటీకి పార్టీ టికెట్లు నిరాకరించారు, లేదా నియోజకవర్గం మార్చేశారు. ఇలాంటి వారి సంఖ్య ఇప్పటికే 58 దాటింది. రానున్న రోజులలో ఆ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు. దీంతో జగన్ ను నమ్ముకుని విపక్షాలపై ఇష్టారీతిగా నోరు పారేసుకున్న వారు ఇప్పుడు లబోదిబో మంటున్నారు. వైసీపీలో ఉండలేక, పార్టీ మరదామంటే చేర్చుకునే వారు లేక రోడ్డున పడ్డట్లుగా మిగిలిపోయారు.  పోనీ పోటీకే దూరంగా ఉందామా అంటే రాజకీయ జీవితానికి  చేజేతులా చరమగీతం లిఖించుకున్నట్లు అవుతుందన్న భయం. అందుకే ఇష్టం లేకపోయినా జగన్ చెప్పినట్లు నియోజకవర్గం మారి ఓటమి తథ్యమని తెలిసీ పోటీకి రెడీ అవుతున్నారు. టికెట్ దక్కని వారు ఇంత కాలం నమ్మి మోసపోయాం, మరో సారి మోసపోదాం అన్నట్లుగా మౌనంగా ఉంటున్నారు. అదే సమయంలో విపక్షాలపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా అంశాల వారీ విమర్శలకు మాత్రమే పరిమితమైన వారు మాత్రం జగన్ ఆదేశాలను ధిక్కరించి బయటకు వచ్చేశారు. వచ్చేస్తున్నారు. అలా ఇప్పటికే బయటక వచ్చేసిన వారిని మినహాయిస్తే.. ఉండలేక, బయటకు రాలేక ఊగిసలాడుతున్న వారికి షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంతో కొత్త ఆశలు చిగురించినట్లైంది. ఇప్పుడు వారి చూపు కాంగ్రెస్ వైపు ఉంది. ఆదివారం ఆమె పార్టీ రాష్ట్ర సారథిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత వైసీపీ నుంచి వలసలు వెల్లువెత్తుతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇక కాంగ్రెస్ అటువంటి వారికి తలుపులు బార్లా తెరుస్తుందా? అన్న సంశయాలు ఎవరి నుంచీ వ్యక్తం కావడం లేదు. ఇందుకు కారణం ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ గత ఎన్నికలలో ఏపీలో  పోటీ చేసిన అన్ని స్థానాలలోనూ కూడా నోటాతో పోటీ పడింది. అంతే కాదు వరుసగా రెండు ఎన్నికలలో రాష్ట్రంలో జీరో స్థానాలతో అట్టడుగున నిలిచింది. అంటే ఆ పార్టీకి ఏపీలో ఇక పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. ఇంత కంటే పతనమయ్యే చాన్సూ లేదు.  కానీ షర్మిల పరిస్థితి అలా కాదు. కాంగ్రెస్ రాష్ట్ర పగ్గాలు చేతపట్టి ఆ పార్టీ పుంజుకునేలా చేయడంపైనే ఆమె రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంది.   ఇప్పటికే తెలంగాణలో షర్మిల సొంతంగా రాజకీయ పార్టీ పెట్టి విఫలమయ్యారు. సుదీర్ఘ  పాదయాత్ర చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. అయితే సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమె అక్కడ పోటీ నుంచి తన పార్టీని దూరంగా ఉంచి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఒక వేళ ఆ ఎన్నికలలో షర్మిల పార్టీ పోటీ చేసి విఫలమై ఉంటే.. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ లో  చేరి ఏపీలో సారథ్య బాధ్యతలు చేపట్టినా ప్రయోజనం ఉండేది కాదు.  తెలంగాణలో పోటీ నుంచి విరమించుకోవడం ద్వారా ఆమె తన రాజకీయ భవిష్యత్ ను కాపాడుకున్నారు. ఇక నుంచి ఆమె రాజకీయ పురోగతి అంతా ఏపీలో కాంగ్రెస్ ను ఆమె ఎలా నడిపించారు అన్నదానిపైనే ఆధారపడి ఉంటుంది.  కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం ఇలా షర్మిల పార్టీలో చేరగానే అలా ఏపీ సారథ్యం అప్పగించడం ద్వారా అమెపై అపారమైన విశ్వాసాన్ని ఉంచింది. ఆ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి షర్మిల చాలా శ్రమించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏపీలో  ఆమె ఎదుర్కోవలసింది, పోరాడాల్సింది తోడబుట్టిన జగన్ మోహనరెడ్డితో, ఆయన పార్టీ వైసీపీతో.  ఇందు కోసం షర్మిల కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి రావొచ్చని చెబుతున్నారు. అందులో మొదటిది తాను స్వయంగా కడప పార్లమెంట్ లేదా పులివెందుల అసెంబ్లీకి పోటీ చేయడం. షర్మిల ముందున్న టాస్క్ఆషామాషీది ఏమీ కాదు. అతి స్వల్ప సమయం అంటే మహాఅయితే రెండు మూడు నెలలలో ఆమె ఏపీలో తన మార్క్ చూపాల్సి ఉంటుంది. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ ను రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురాలేకపోయినా.. కొన్ని స్థానాలలో గెలిపించుకోవలసి ఉంటుంది. ఇందు కోసం ఆమె తీసుకునే ప్రతి నిర్ణయానికీ అధిష్ఠానం నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందనడంలో సందేహం లేదు.   పార్టీలోకి ఎవరిని తీసుకోవాలి, ఎవరికి టికెట్లు కేటాయించాలి వంటి అంశాలలో షర్మిలకు కాంగ్రెస్ హై కమాండ్ పూర్తి స్వేచ్ఛను ఇస్తుందనడంలో సందేహం లేదు. సో వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందన్నది పూర్తిగా ఆమె తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే షర్మిల కాంగ్రెస్ ఏపీ సారథిగా ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఏ మేరకు కాంగ్రెస్ పుంజుకుంటుంది అన్నదానిపైనే షర్మిల రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. అందుకే వచ్చే ఎన్నికలు షర్మిలకు నిజమైన పరీక్షగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.  

కమలాపురంలో బాబు సభకు జన ప్రభంజనం

ఉమ్మడి కడప జిల్లా కమలాపురంలో చంద్రబాబు నిర్వహించిన రా కదలిరా కార్యక్రమానికి జనం ప్రభంజనంలా తరలి వచ్చారు. ఆ సందర్భంగా చంద్రబాబు తన ప్రసంగంలో జగన్ పాలనపై నిప్పులు చెరిగారు. రా కదలిరా అని తాను పిలుపునిస్తే కమలాపురం జనం వెల్లువలా కదిలారని చెప్పారు. ఇక కడపలో అయితే గడపగడపా జగన్పై యుద్ధానికి రెడీ అంటోందని చెప్పారు. రాష్ట్రంలో యువత, యువత, రైతులు, మహిళలు సహా అన్ని వర్గాల వారి సంతోషం, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ప్రజా సహకారంతో పని చేస్తానని హామీ ఇచ్చారు. గత ఎన్నికలలో కడప జిల్లాలలోని అన్ని స్థానాలలోనూ గెలిచిన వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కడపను కడనే ఉంచేసింది. ప్రజల జీవన ప్రమాణాలు పెరగలేదు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మృగ్యమయ్యాయి. తాగునీరు, సాగునీరు ఊసే లేదు. రైతుల జీవితాలు దుర్భరంగా మారాయి. జగన్ అధకారంలోకి వచ్చిన తరువాత సొంత జిల్లాలో జగన్ కు తప్ప మరెవరికీ సంతోషం లేదు. జిల్లాలో బాగుపడిన వారెవరైనా ఉన్నారంటే అది జగన్ రెడ్డి, ఆయనతో పాటు మరో ఇద్దరు ముగ్గురు మాత్రమే కనిపిస్తారు.   జగన్ రెడ్డి మాటలు కోటలు దాటాయిగానీ, చేతలు గడప  దాటలేదు.  సొంత నియోజకవర్గం పులివెందులలోనే పరదాలు, సెక్యూరిటీ లేకుండా కాలు కదపలేని పరిస్థితిలో జగన్ ఉన్నారు. వచ్చే ఎన్నికలలో పులివెందుల నుంచి జగన్ గెలిచే పరిస్థితి కూడా లేదు.  తీవ్ర వర్షాభావ పరిస్థితులతో జనం, రైతులు అల్లాడుతుంటే జగన్ రెడ్డి కనీసం ఒక్కటంటే ఒక్క మండలాన్ని కూడా కరవు మండలంగా ప్రకటించలేదు సరి కదా కరువు మండలాల ప్రకటన గురించి అధికారులు ప్రస్తావిస్తే నా సొంత జిల్లాలో కరువా అంటూ కసురుకున్నారు.  ఒక్క చాన్స్ ఇచ్చి తప్పు చేశామని ఇప్పడు జనం పశ్చాత్తాపపడుతున్నారు.  అంటూ చంద్రబాబు చెప్పిన ప్రతి మాటకూ జనం చ ప్పట్లతో మద్దతు తెలిపారు. చంద్రబాబు తన ప్రసంగంలో హు కిల్డ్ బాబాయ్ అని ప్రశ్నిస్తే జనం నుంచి జగన్ జగన్ అంటూ బదులొచ్చింది.   వివేకా హత్య కేసులో మలుపులు టాలీవుడ్,  బాలీవుడ్ సినిమాల్ని కూడా మరిపించేలా ఉన్నాయి.  వివేకా హత్యపై గుండెపోటు అంటూ, రక్తపు వాంతులు అంటూ  ప్రచారం చేశారు. పోస్టుమార్టంలో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.  సరే గత ఎన్నికల ప్రచారంలో  తండ్రి లేడు, బాబాయి లేడు అంటూ  సానుభూతి సంపాదించి గెలిచిన  జగన్ రెడ్డికి ఇప్పుడు  వివేకా హత్యపై సమాధానం చెప్పే ధైర్యం ఉందా? నాడు సీబీఐ దర్యాప్తు కావాలని కోర్టుకి వెళ్లిందెవరు,  అధికారంలోకి వచ్చాక సీబీఐ విచారణ వద్దన్నదెవరు జగన్ కదా అని చంద్రబాబు అన్నారు.  అసలు వివేకా హత్యపై మాట్లొద్దంటూ గ్యాగ్ ఆర్దర్ తెచ్చారు. వివేకాకు రెండో భార్య వ్యవహారం, బెంగుళూరు ఆస్తులు వల్లే హత్య అంటూ చెప్పారు. తర్వాత కూతురు సునీత, ఆమె భర్తపై తప్పుడు ప్రచారం చేశారు. ఏ తప్పు చేయని కోడికత్తి శ్రీను జైల్లో ఉన్నాడు బాబాయిని చంపిన అవినాష్ రెడ్డి మాత్రం బయట తిరుగుతున్నాడు. దోషులు అరెస్ట్ కాకుండా నిర్దోషులు అరెస్ట్ అవుతున్నారు. ఇప్పుడు కడప గడ్డపై నిలబడి అడుగుతున్నా…హు కిల్డ్ బాబాయి దీనికి జగన్ సమాధానం చెప్పాలి? అని చంద్రబాబు డిమాండ్ చేశారు.   జగన్ హయంలో నిత్యావసర ధరలన్నీ పెరిగాయి. అదే తెలుగుదేశం పాలనలో  సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ కానుకలు ఇచ్చాం. తెలుగుదేశం హయాంలో ఉన్న పెళ్లికానుక, విదేశీ విద్య వంటి సంక్షేమ ఇప్పుడు ఏమయ్యాయి. తెలుగుదేశం హయాంలో  రేషన్ షాపుల్లో 18 రకాల వస్తువులు ఇచ్చాం. ఇప్పుడు ఇస్తున్నారా?  అంటూ చంద్రబాబు ప్రశ్నిస్తే జనం లేదు లేదు అంటూ ఎలుగెత్తారు.  జగన్ రెడ్డిది బటన్ నొక్కుడు కాదు, బటన్ బొక్కుడు అంటూ చంద్రబాబు విమర్శిస్తే జనం తప్పట్లతో ఔనన్నారు.    మద్యపాన నిషేదం అని చెప్పి మద్యంపై వచ్చే ఆదాయం తాకట్టు పెట్టి రూ. 36 వేల కోట్లు అప్పు తెచ్చారు. నాసిరకం మద్యం అధిక ధరలకు విక్రయిస్తూ సొంత బొక్కసం నింపుకుంటున్నారు. పెట్రోల్, డీజీల్, ఆర్టీసీ ఇలా అన్నిటి రేట్లు  పెంచేయడంతో పాటు ఆస్తిపన్ను, నీటి పన్ను చివరకు చెత్తపై కూడా పన్ను వేసి ప్రజలను వేధించుకు తింటున్నారు. కరెంట్ చార్జీలు 9 సార్లు పెంచారంటూ జగన్ పై చంద్రబాబు విమర్శలు కురిపించారు.    సీమకు జగన్ చేసిందేమీ లేదనీ,  కడప స్టీల్ ఫాక్టరీకి రెండు సార్లు రిబ్బన్ కట్ రిబ్బన్ కట్ చేయడం రంగులు వేసుకోవటం తప్ప అని ఎద్దేవా చేశారు.  రాయలసీమకు మొదటిసారిగా నీళ్లిచ్చిన ఘనత ఎన్టీఆర్ దే. గండికోట రిజర్వాయర్, తెలుగు గంగను తవ్విన వ్యక్తి ఎన్టీఆర్. 2014- 19 లో రూ. 12,500 కోట్లు ఒక్క కడప జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసి ప్రాజెక్టులను పరిగెత్తించాం. గండికోట ద్వారా పులివెందులకు నీళ్లిచ్చిన ఘనత టీడీపీదే. మేం ఖర్చు చేసిన దానిలో కనీసం 20 శాతమైనా జగన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో ఖర్చు చేశారా అని బాబు నిలదీశారు. తెలుగుదేశం హయాంలో పట్టిసీమ ద్వారా 120 టీఎంసీలు రాయలసీమకు ఇచ్చాం. దాని వల్ల అన్ని కాలువల్లో నీళ్లొచ్చాయి. కానీ ఇప్పుడు రైతుల కళ్లలో నీళ్లు పారుతున్నాయంటూ చంద్రబాబు జగన్ పాలనను దుయ్యబట్టారు.    

రాహుల్ గాంధీకి థాణే కోర్టు జరిమానా 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మహారాష్ట్రలోని థానే కోర్టు జరిమానా విధించింది. వివరాల్లోకి వెళ్తే... 2017లో జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య జరిగింది. ఆమె హత్యతో ఆరెస్సెస్ కు సంబంధం ఉందని రాహుల్ అన్నారంటూ సంఘ్ కార్యకర్త వివేక్... రాహుల్ పై పరువునష్టం దావా వేశారు. అయితే, కోర్టుకు తన సంజాయిషీ ను రాహుల్ ఇంతవరకు ఇవ్వలేదు. దీంతో, 881 రోజుల ఆలస్యానికి గాను కోర్టు ఆయనకు రూ. 500 జరిమానా విధించింది. ఈ సందర్భంగా రాహుల్ తరపు న్యాయవాది నారాయణ్ అయ్యర్ కోర్టులో తన వాదనలు వినిపించారు.  తన క్లయింట్ ఢిల్లీలో ఉంటారని, ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఆయన ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారని చెప్పారు. ఈ కారణంగానే సంజాయిషీ  ఇవ్వడంలో ఆలస్యమయిందని కోర్టుకు విన్నవించారు. ఆయన వాదనలతో ఏకీభవించిన కోర్టు రాహుల్ కు రూ. 500 జరిమానా విధించింది. ఫిబ్రవరి 15న మరోసారి కేసును విచారిస్తామని తెలిపింది. ఈలోగా రాతపూర్వక స్టేట్మెంట్ ను ఇవ్వాలని ఆదేశించింది.  సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం పరువునష్టం అభియోగాలను ఎదుర్కొంటున్న వ్యక్తి ముందుగా కోర్టుకు తన సంజాయిషీను సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత సాక్షులను ప్రశ్నించడం, క్రాస్ క్వశ్చన్ చేయడం వంటివి ప్రారంభమవుతాయి.

కెసిఆర్ కు రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ ఆహ్వానం 

ఈ నెల 22న కోట్లాది మంది హిందువుల దశాబ్దాల కల నెరవేరబోతోంది. అయోధ్య రామ మందిరంలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. తాజాగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అయోధ్య కార్యక్రమానికి ఆహ్వానం అందింది. అయోధ్య వేడుకకు హాజరు కావాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కేసీఆర్ ను ఆహ్వానించింది.  అయితే, ఇటీవల కేసీఆర్ కు తుంటి ఎముక ఆపరేషన్ జరిగింది. ఇప్పుడిప్పుడే ఆయన చేతికర్రతో నడవడం ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఆయన అయోధ్యకు వెళ్లడం దాదాపు అసంభవమనే చెప్పాలి.   కెసిఆర్ అయోధ్యకు వెళ్లే పరిస్థితి లేదని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు కూడా ఇప్పటికే ఆహ్వానాలు అందాయి.   ఇప్పటికే దేశం మొత్తం శ్రీరామ నామస్మరణలో మునిగి తేలుతోంది. ఈ కార్యక్రమాన్ని టీవీ లైవ్ ద్వారా లేదా ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఇప్పటికే పలు రాష్ట్రాలు 22న సెలవు ప్రకటించాయి. శిల్పి యోగ్ రాజ్ చెక్కిన బాలరాముడి విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్ఠించనున్నారు. ఇప్పటికే విగ్రహం ఆలయంలోని గర్భ గుడిలో కొలువుతీరింది. విగ్రహ ప్రాణప్రతిష్ఠకు అవసరమైన క్రతువులు కొనసాగుతున్నాయి.

జనవరిలోనే అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ.. బీజేపీ రాజకీయ లబ్థి కోసమేనా?

బీజేపీ ఈరోజున జాతీయ స్థాయిలో అత్యంత శక్తివంతమైన రాజకీయ శక్తిగా ఎదిగింది. అందులో అనుమానం లేదు. వరసగా రెండు సార్లు అంటే 2014, 2019  సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించింది.  ఎన్డీయే కూటమికి నేతృత్వం వహిస్తూ, కేంద్రంలో ఆ కూటమి సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్నప్పటికీ  బీజేపీకి స్వయంగా సంపూర్ణ మెజారిటీ  ఉంది. ఆ రకంగా చెప్పాలంటే దేశంలో  మూడు దశాబ్దాలకు పైగా నడుస్తున్న సంకీర్ణ రాజకీయ చరిత్రను బీజేపీ తిరగరాసింది.  కేంద్రంలోనే కాకుండా దేశంలోని  సగానికి పైగా రాష్ట్రాలలో అధికారంలో వుంది. ఇవన్నీ వాస్తవాలే.. అయితే ఈ విజయం వెనుక విపక్షాల బలహీనత, అనైక్యత ఎంత కారణమో అంత కంటే ఎక్కువగా అయోధ్య రామమందిరం పేరిట ఆ పార్టీ దేశ ప్రజలలో ఎగదోసిన భావోద్వేగం కారణం అనడానికి సందేహం అవసరం లేదు.   1990వ దశకంలో దేశాన్ని కదిలించిన  రామజన్మ భూమి ఆందోళన..అద్వానీ రథ యాత్ర. దేశంలో బీజేపీ బలోపేతం కావడానికి పునాదులు వేశాయి. అవును నిజం.  1990 లో  అప్పటి ప్రధాని వీపీ సింగ్ ప్రభుత్వం  మండల్ కమిషన్ చేసిన సిఫార్సుల ఆధారంగా వెనక బడిన కులాలకు 27 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును తెచ్చింది. వీపీ సింగ్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా అగ్రవర్ణాల ప్రజలు ఆందోళనకు దిగారు. అదే సమయంలో వీపీ సింగ్ ప్రభుత్వ రాజకీయ ఎత్తుగడకు జవాబుగా బీజేపీ  అప్పటికే విశ్వ హిందూ పరిషత్ ఇతర సంఘ పరివార్ సంస్థలు సాగిస్తున్న రామ జన్మభూమి ఆందోళనకు మద్దతు ప్రకటించింది. ప్రకటించి ఊరుకోకుండా,  బీజేపీ  అప్పటిఅధ్యక్షుడు ఎల్కే అద్వానీ 1990లో రథ యాత్ర  చేపట్టారు.ఇక ఆ తర్వాత 1992 డిసెంబర్ 6న అయోధ్యలోని వివాదాస్పద కట్టడం, (బాబ్రీ మసీదు) కూల్చివేత వరకూ సాంస్కృతిక జాతీయవాదం పేరిట బీజేపీ సాగించిన ప్రయాణమే  బీజేపీ ఎదుగుదలకు బీజం వేసింది. కారణమైంది.   ఇక అప్పటి నుంచి బీజేపీ, ప్రతి ఎన్నికలలోనూ తమ పార్టీ అధికారంలోకి వస్తే  రామజన్మభూమి అయోధ్యలో  రామ మందిరం నిర్మిస్తామని వాగ్దానం చేస్తూనే వుంది.  అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సుప్రీం కోర్టు 2019 నవంబర్ లో అనుమతి ఇచ్చింది.  ప్రధాని నరేంద్ర మోడీ, 2020 ఆగష్టులో శంకుస్థాపన చేశారు.   2024 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ ఇదే రామమందిర నిర్మాణం నినాదంతో ఎన్నికలకు వెడుతోంది.  రామమందిర నిర్మాణం పూర్తి చేశామని చెప్పుకుని ప్రచారం చేయడానికి హడావుడి పడుతోంది. ఇందు కోసం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం..  దేశంలో పుంజుకుంటున్న కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. సరిగ్గా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడానికి రోజులు లేదా వారాల ముందుగా   అంటే సోమవారం (జనవరి 22) రామమందిర ప్రాణ ప్రతిష్ఠకు ముహూర్తం ఖరారు చేసింది. ఏకపక్షంగా ఎన్నికల సమయం చూసుకుని మరీ రాజకీయలబ్ధి కోసం మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదన్న విమర్శలు సహజంగానే వెల్లువెత్తాయి. అన్నిటికీ మించి రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని బీజేపీ సొంత కార్యక్రమంలో నిర్వహిస్తుండటం కూడా విపక్షాలు తప్పుపడుతున్నాయి. ఆ కారణంగానే కాంగ్రెస్ ఈ కార్యక్రమానికి హాజరు కాబోవడం లేదని ప్రకటించింది. అంటే బీజేపీ పన్నిన వ్యూహంలో కాంగ్రెస్ చిక్కుకున్నట్లే అయ్యింది. రామ మందిర నిర్మాణానికి కాంగ్రెస్ వ్యతిరేకమని, అయోధ్యలో రామమందిర నిర్మాణం విషయంలో తొలి నుంచీ కాంగ్రెస్ అలాగే వామపక్ష పార్టీలూ అడ్డుకుంటూ వస్తున్నాయనీ బీజేపీ అగ్రనాయకత్వం విమర్శలు గుప్పిస్తూ, అసలు రామమందిర నిర్మాణం ఇంత కాలం జాప్యం కావడానికి కాంగ్రెస్, లెఫ్ట్ ఇతన లౌకికవాద పార్టీలే కారణమంటూ నిందిస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ ను హిందూ వ్యతిరేక పార్టీగా చిత్రీకరించి ఎన్నికల లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నది.   అయితే బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం హిందుత్వ కార్డ్ ను అడ్డగోలుగా వాడేస్తున్నదనీ, ఇందు కోసం ధర్మశాస్త్రాన్నీ, ఆగమ శాస్త్రాన్నీ కూడా పక్కన పెట్టేసి సొంత రాజకీయ శాస్త్రాన్ని అనుసరిస్తోందనీ దేశంలోని ప్రతిష్ఠాత్మక పీఠాల అధిపతులు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.  ఆధ్యాత్మిక వ్యాప్తి కోసం ఆదిశంకరాచార్యుడు దేశంలోని నాలుగు ప్రాంతాలలో ధర్మం నాలుగు పాదాలా నడవాలన్న ఉద్దేశానికి సంకేతంగా నెలకొల్పిన ఉత్తరాఖండ్ లోని జ్యోతిష్యపీఠం, గుజరాత్ లోని ద్వారకా పీఠం, ఒడిశాలోని పూరీ పీఠం, కర్నాటకలోని శృంగేరీ పీఠాల ప్రస్తుత అధిపతులు అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట ముహూర్తాన్ని తప్పు పట్టారు. ఆగమశాస్త్ర విరుద్ధంగా  ఆలయ నిర్మాణం పూర్తికాకుండానే ప్రాణప్రతిష్ట చేయడం ధర్మ విరుద్ధమని చాటారు.  అంతే కాకుండా  శుభప్రదమైన నెల కాదని ఈ నెలలో ఆలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమం సమంజసం కాదనీ, శుభకరం కాదనీ పీఠాధిపతులు అంటున్నారు.  ఈ నేపథ్యంలోనే రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని అన్ని అభ్యంతరాలూ తోసి పుచ్చి సరిగ్గా ఎన్నికల వేళ ముహూర్తాన్ని నిర్ణయించడం రాజకీయ లబ్ధి కోసమేనన్న విమర్శలకు బలం చేకూరుతోంది.  

రాజారెడ్డి ఎంగేజ్మెంట్.. జగన్ షర్మిల విభేదాలపై మరో సారి రచ్చరచ్చ!

వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, ఏపీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కుమారుడు రాజారెడ్డి, అట్లూరి ప్రియ నిశ్చితార్ధ వేడుక హైదరాబాద్‌ శివారు గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌ లో గురువారం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు షర్మిల సోదరుడు, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సహా ఎందరో అతిధులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే, ఎంతమంది వచ్చినా.. ఒక్క సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ నిశ్చతార్ద వేడుకకు హాజరవడం మాత్రం హాట్ టాపిక్ అయింది. అందరిలాగానే జగన్ కూడా సతీమణి వైఎస్‌ భారతితో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు. తల్లి విజయమ్మ, సోదరి షర్మిలను ఆలింగనం చేసుకొని జగన్ చిరునవ్వులు చిందించారు. అలాగే ఈ సందర్భంగా కాబోయే జంటకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అంతా బాగానే ఉంది కాదా మరి రెండు రోజులుగా ఈ వేడుకకు జగన్ వెళ్లడం ఎందుకు ఇంతలా రచ్చ అవుతుందన్నది కూడా అందరికీ తెలిసిందే. సోదరి షర్మిలతో జగన్ విబేధాలు, అగాధాలు అన్నీ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలిసిందే కాగా.. ఈ నిశ్చతార్ధ వేడుకలో జగన్ ప్రతి కదలిక ఆసక్తికరంగానే సాగింది. జగన్ ఒక్కగానొక్క సొంత మేనల్లుడి నిశ్చతార్ద వేడుకలో పట్టుమని మూడు నిముషాలు కూడా ఉండలేకపోయారు. జగన్ కారు దిగి వేదికపైకి వెళ్లడం.. తల్లి, సోదరిని ఆలింగనం చేసుకోవడం, కాబోయే వధూవరులను పలకరించి పుష్ప గుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు చెప్పడం, ఒక ఫోటోకి ఫోజివ్వడం.. కారు ఎక్కేసి అక్కడ నుండి వెళ్లిపోవడం ఇదే జరిగింది. దీంతో జగన్ పై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. తన పార్టీకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ తమ్ముడి పెళ్లికి ఐదు గంటలు కేటాయించిన జగన్.. సొంత మేనల్లుడు పెళ్లికి ఐదు నిముషాలు కేటాయించలేకపోవడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అలాగే జగన్ ను మొక్కుబడిగా పలకరించిన షర్మిల, కనీసం ఆ ఆలింగనం ఫోటోలకు కూడా దొరకని విధంగా కవర్ చేసుకున్నారు. ఆ తర్వాత కూడా జగన్ తనకు గుర్తుగా కాబోయే వధూవరులతో కుటుంబం అందరూ కలిసి ఫొటో దిగేందుకు ప్రయత్నించగా షర్మిల అందుకు ఇష్టపడలేదు. జగన్ ఫోటో విషయం చెప్పినా షర్మిల పట్టించుకోనట్లు ఉన్నారు. అయితే, చివరిగా తల్లి విజయమ్మ ప్రయత్నంతో షర్మిల ఫోటోకి ముందుకొచ్చినా.. అయిష్టంగానే జగన్ కు దూరంగా ఎక్కడో నిలుచున్నారు. ఈ నిశ్చతార్ద వేడుక ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. అన్నా చెల్లెళ్ళ మధ్య ఇప్పుడు వార్ పీక్స్ లో ఉంది. ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. అందుకే షర్మిల కాంగ్రెస్ లో చేరి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించగా.. రానున్న ఎన్నికలలో జగన్ ఓటమికి పనిచేయడం ఒక్కటే ఇక మిగిలి ఉంది. మరి అన్నా చెల్లెమ్మల మధ్య ఇంత వైరం ఉన్నప్పుడు అసలు వైఎస్ షర్మిల జగన్ ను ఆహ్వానించడం ఎందుకు?.. పోనీ షర్మిల ఆహ్వానించినా చుట్టపు చూపుగా జగన్ రావడం ఎందుకు అన్నదే ఇప్పుడు అందరి ప్రశ్న. ఈ వేడుకకు వచ్చేందుకు జగన్ తన షర్ట్ ధరించిన సమయం కూడా ఈ వేడుకలో లేరు. మరి అలాంటపుడు అంత మొహమాటంగా రావడం ఎందుకు జగన్ అంటూ నెటిజన్లు సూటిగా ప్రశ్నిస్తున్నారు. పోనీ వచ్చినందుకు కనీసం అర్ధగంట సమయం కేటాయించి బంధువులు, మిత్రులను పలకరించి కాస్త సందడి చేసి ఉంటే అది ఎంతో గౌరవంగా ఉండేది. సోదరుడిపై షర్మిల ఎంతో ఆగ్రహంతో ఉన్నారు. జగన్ తనను నమ్మించి మోసగించాడని షర్మిల బలంగా నమ్ముతున్నారు. అందుకే అన్నపై సూటిగా బాణం ఎక్కుపెట్టారు. మరి అలాంటపుడు ఇంటికి వెళ్లి మరీ సోదరుడిని నిశ్చతార్ధ వేడుకకు ఆహ్వానించడం ఎందుకు? పోనీ ఆహ్వానించారు.. సోదరుడు కూడా వేడుకకు వచ్చారు. కానీ, తీరా వేదికపై ఎడమొహం పెడమొహం. మరి ఈ తప్పు ఎవరిది? నేచురాలిటీకి దగ్గరగా ఉండే తమిళ సినిమాలో కూడా ఈ వేడుక వేదిక మీద మనుషుల నటన చూసి ఉండరు. ఒకవేళ సినిమాలలోనే కాదు ఇలాంటి వేడుకలలో మనుషుల నటనకి కూడా అవార్డులు వస్తాయంటే.. రాజారెడ్డి-ప్రియాల నిశ్చతార్ద వేడుకలలో వైఎస్ ఫ్యామిలీ సభ్యుల నటనకి ఆస్కారుల పంట పండడం ఖాయం. ఆ స్థాయిలో నటించారు ఒక్కొక్కరు. మొత్తంగా ఈ నిశ్చతార్ద వేడుక వైఎస్ ఫ్యామిలీని మరోసారి సోషల్ మీడియాలో మోత పుట్టించేస్తుంది.