ఎవరు ఎవరికి ద్రోహం చేశారు.. జగన్ కు కాంగ్రెస్సా, కాంగ్రెస్ కు జగనా?
posted on Jan 25, 2024 @ 1:31PM
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని మోసం చేశారా? లేక కాంగ్రెస్ పార్టీ జగన్ మోహన్ రెడ్డికి ద్రోహం చేసిందా? అసలు ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకు? ఎప్పుడో కాంగ్రెస్ పార్టీని వీడి జగన్ బయటకు వచ్చి సొంత కుంపటి పెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చారు కూడా? ఇంత కాలం తరువాత ఈ ప్రశ్న తెరపైకి ఎందుకు వచ్చింది? అంటే ఈ ప్రశ్న ఇప్పుడు తెరపైకి రావడానికి జగనే కారణం అని చెప్పక తప్పదు. ఇటీవలి కాలంలో అంటే సొంత చెల్లి కాంగ్రెస్ గూటికి చేరి ఆ పార్టీ ఏపీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ తనకు ద్రోహం చేసిందని వ్యాఖ్యానిస్తున్నారు. తన చెల్లి వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని ఆమెను తనకు శత్రువును చేసిందని, తన చెల్లిని అడ్డం పెట్టుకొని తనను దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని భాష్యం చెప్తున్నారు. దీంతో అసలు నిజంగానే కాంగ్రెస్ పార్టీ జగన్ మోహన్ రెడ్డికి ద్రోహం చేసిందా? అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. అదే సమయంలో జగన్ మోహన్ రెడ్డే కాంగ్రెస్ పార్టీని మోసం చేశారా అన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి.
వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే వైఎస్ అని అన్నట్లుగా పరిస్థితులు ఉండేవి. వైఎస్ రాజశేఖరరెడ్డి తన చివరి శ్వాస విడిచే వరకూ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. మధ్యలో ఒకసారి రెడ్డీ కాంగ్రెస్ అంటూ గడపదాటినా.. వెంటనే వెనక్కు వచ్చేశారు. కాంగ్రెస్తో వైఎస్ ఆ అనుబంధం ఆయన చివరి శ్వాస వరకూ కొనసాగింది. అంతే కాదు కాంగ్రెస్ పార్టీ కూడా వైఎస్ కుటుంబానికి చాలానే చేసింది. ఇంకా చెప్పాలంటే వైఎస్ కుటుంబం రాజకీయంగా, ఆర్ధికంగా ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీయే అనడంలో సందేహానికి తావు లేదు.
వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ పెద్దలకు వీర విధేయుడు. అందుకే జాతీయ పార్టీ అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కు అధిష్టానం పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. సీఎంగా వైఎస్ ఏ పథకం తెచ్చినా కేంద్రం అన్నిటికీ నిధులు సమకూర్చింది. ఇలా చూస్తే వైఎస్ బడుగు బలహీన వర్గాల ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీయే. వైఎస్ అడిగితే కాదనకుండా చేసేది అధిష్టానం. అంతగా ప్రోత్సహించారు. వైఎస్ తన విధేయతతోనే పార్టీ పెద్దలను అనుకూలంగా మార్చుకున్నారు. ప్రతి పథకాన్నీ పార్టీ పెద్దల పేర్లతోనే రూపకల్పన చేసే వైఎస్.. ప్రతి పథకంలో తన మార్క్ ఉండేలా చూసుకునేవారు. అలా కాంగ్రెస్ నుండి వైఎస్ రాజకీయంగా ఎంతగా ఎదగాలో అంతకి చేరుకున్నారు. అలాగే కుటుంబాన్ని కూడా రాజకీయంగా, ఆర్ధికంగా పరిపుష్టిగా మార్చుకున్నారు. తమ్ముడిని మంత్రిగా, కుమారుడిని ఎంపీగా చేసుకున్నారు. కుమారుడు జగన్ ఆర్ధిక సామ్రాజ్యాన్ని బలంగా నిర్మించుకొనేందుకు తండి వైఎస్ అండగా ఉంటూ వచ్చారు.
ఇక జగన్ విషయానికి వస్తే.. కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొనే రాజకీయాలలోకి వచ్చారు. కడప ఎంపీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ వలనే వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారు. జగన్ మీడియా సంస్థలు స్థాపించారంటే దానికి మూలం కాంగ్రెస్ పార్టీనే ఒక్కో నగరంలో ఒక్కో ప్యాలెస్ కట్టాగలిగారంటే అది కూడా కాంగ్రెస్ పార్టీ చలవే. అనధికారికంగా జగన్ ఇంతటి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారంటే దానికి మూలం ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీయే. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీ తనకు ద్రోహం చేసిందని జగన్ మోహన్ రెడ్డి చెప్పడం విడ్డూరంగానే ఉందని పరిశీలకులు అంటున్నారు. అసలు జగన్ ఇప్పుడు సీఎం అయ్యారంటే దానికి కారణం కూడా కాంగ్రెస్ పార్టీనే. తన తండ్రి పాలన, పథకాలను చూపించే జగన్ ఓట్లు అడిగారు. వైఎస్ పాలన, పథకాలు అన్నీ కాంగ్రెస్ సొంతం. కానీ జగన్ వాటికి లాక్కొని సీఎం అయ్యారు. అలాగే సీఎం అయ్యేందుకు కావాల్సిన ఆర్ధిక వనరులు కూడా వైఎస్ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉండగా సంపాదించుకున్నదే. కనుక ఏ విధంగా చూసినా కాంగ్రెస్ జగన్ కు మేలే చేసింది.
ఇక జగన్ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేశారా అన్న అనుమానాలకు సమాధానంగా అవును ద్రోహం చేశారనే పరిశీలకులు చెబుతున్నారు. ఎక్కడో అనామకులుగా ఉన్న వైఎస్ కుటుంబాన్ని అతి పెద్ద ఉమ్మడి రాష్ట్రానికి అధిపతిని చేసిన కాంగ్రెస్ ను జగన్ మోహన్ రెడ్డి విభజిత ఆంధ్రప్రదేశ్ లో నామరూపాల్లేకుండా చేశారు. కాంగ్రెస్ నేతలందరినీ తన వైపుకు తిప్పుకొని తన వైసీపీకి పునాదులు వేసుకున్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయిందంటే కారణం జగన్ మోహన్ రెడ్డే. తండ్రి మరణానంతరం అప్పటికప్పుడు తనను సీఎం చేయలేదన్న పంతంతోనే జగన్ కాంగ్రెస్ పార్టీని వీడారు. ఆ పార్టీని ముప్పతిప్పలు పెట్టారు. కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య లాంటి ఛరిష్మా లేని నేతలను జగన్ ముప్పతిప్పలు పెట్టి ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని ప్రయత్నించారు. చివరికి సొంత పార్టీ పెట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగారు. ఈ లెక్కన చూస్తే జగన్ ప్లాన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీకి నష్టం చేశారు. అయితే అదే కాంగ్రెస్ ఇప్పుడు కూడా జగన్ నమ్మించి గెంటేసిన చెల్లి షర్మిలను అక్కున చేర్చుకొని మళ్లీ వైఎస్ కుటుంబాన్ని చేరదీసింది. అంటే ఏ రకంగా చూసినా వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటే.. జగన్ మాత్రం కాంగ్రెస్ ను మోసం చేశారు. ఆ పార్టీకి ద్రోహం చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.