తెలుగువన్ పాతికేళ్ల ప్రస్థానం.. కోటి మంది సబ్ స్క్రైబర్లతో అగ్రస్థానం!

తెలుగువారి వారధి, సారధి, నేటి డిజిటల్ యుగానికి నాంది 'తెలుగువన్'. దేశవిదేశీ ప్రజలకు ఇంటర్నెట్ ద్వారా తెలుగు సినిమాను చూపించవచ్చని.. ఖండాంతరాలకు చూపించి చరిత్ర సృష్టించిన భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ ప్లాట్ ఫామ్ 'తెలుగువన్'. 24 ఏళ్ళ క్రితం.. డిజిటల్ మీడియా శక్తి గురించి గానీ, అసలు యూట్యూబ్ అనే ఫ్లాట్ ఫామ్ ఉంది అని గానీ ఎవ్వరికీ అవగాహన లేనప్పుడే భారతదేశం నుండి యూట్యూబ్ తో టైఅప్ చేసుకున్న ఏకైక డిజిటల్ మీడియా ఫ్లాట్ ఫామ్ 'తెలుగువన్'. స్వయంగా సాంకేతికనిపుణులైన కంఠంనేని రవిశంకర్ భవిష్యత్ లో డిజిటల్ మీడియాదే రాజ్యమని ముందుగానే ఊహించగలిగారు. అందుకు తగ్గట్టుగానే ప్రణాళికలు రూపొందించి, వాటిని అమలు చేసి, నూటికి నూరుశాతం విజయం సాధించి తెలుగువన్ ని అత్యున్నత శిఖరాన ఉంచగలిగారు. యూట్యూబ్ లో అంచలంచలుగా ఎదుగుతూ మహావృక్షంలా ఎదిగిన 'తెలుగువన్' తాజాగా 10 మిలియన్ సబ్ స్క్రైబర్లను సొంతం చేసుకుంది. తెలుగువన్ కి 300 కి పైగా అనుబంధ ఛానల్స్ ఉన్నాయి. మొత్తంగా 80 మిలియన్ కి పైగా సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో.. తెలుగువన్ గానీ, అనుబంధ ఛానల్స్ గానీ ఎప్పుడూ తాము గీసుకున్న లక్ష్మణరేఖను దాటలేదు. విలువలు, నీతి, మర్యాదలే అలంకారాలుగా 'తెలుగువన్' సగర్వంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. న్యూస్, కరెంట్ అఫైర్స్, భక్తి, వ్యవసాయం, కిడ్స్ కంటెంట్, సినిమాలు, వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్‌లు, స్టాండప్ కామెడీ, మెడికల్ అండ్ హెల్త్ ఇలా ఎన్నో విభాగాల్లో.. నాణ్యత, ప్రమాణాలతో కూడిన మంచి కంటెంట్ ను అందిస్తోంది. యువ ప్రతిభావంతులైన రచయితలు, దర్శకులు, నటీనటులు, సంగీత దర్శకులు, గాయకులు మరియు గీత రచయితలు.. ఇలా ఎందరికో తమ ప్రతిభను నిరూపించుకోవడానికి సహాయపడిన మొదటి డిజిటల్ ప్లాట్‌ఫామ్ తెలుగువన్ నెట్‌వర్క్. తెలుగువన్ ని వేదికగా చేసుకొని ఎందరో వర్ధమాన నటీనటులు, రచయితలు, గాయకులు, దర్శకులు తమ ప్రతిభను నిరూపించుకొని తెలుగు సినీ పరిశ్రమ నుంచి అవకాశాలు పొందారు. ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్స్ గా వెలుగొందుతోన్న ఎందరో నటులు, దర్శకులు ఒకప్పుడు తెలుగువన్ నుంచి వచ్చినవారే. నాణ్యమైన, అర్థవంతమైన కంటెంట్ ను అందిస్తున్న తెలుగువన్ ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారు. తెలుగువన్ ని ఆదరిస్తున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. తాజాగా సింగిల్ యూట్యూబ్ ఛానల్ లో 10 మిలియన్ సబ్ స్క్రైబర్లను సొంతం చేసుకొని తెలుగువన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. సౌత్ ఇండియాలోనే మొదటి యూట్యూబ్ ఛానల్ గా ప్రయాణం మొదలుపెట్టి, నేటితో కోటి మంది సబ్ స్క్రైబర్లను సంపాదించుకున్న సందర్భంగా మా విజయంలో భాగమైన వారందరికీ తెలుగువన్ తరపున కృతఙ్ఞతలు.

ప్రజాస్వామ్యం.. నుంచి నియంతృత్వంలోకి.. మోడీ మళ్లీ గెలిస్తే అదేనా?

కేంద్రంలో మళ్ళీ మరోమారు బీజేపీ అధికారంలోకి వస్తే ... దేశంలో ప్రజాస్వామ్యం మటుమాయమైపోతుందన్న భయాలు రాజకీయ పార్టీల్లో వ్యక్తం అవుతున్నాయి. చైనా అధ్యక్షుడు జన్ పింగ్ తరహాలో రాజ్యాంగాన్ని మార్చేసి జీవిత కాల ప్రధానిగా తనను తాను ఆయన ప్రకటించేసుకున్నా ఆశ్చర్యం లేదని విపక్ష నేతలు అంటున్నారు. వ్యవస్థలపై విశ్వాసం, రాజ్యాంగం పై గౌరవం లేదా అన్న విధంగా మోడీ తీరు ఉందన్నది పరిశీలకుల విశ్లేషణ.   2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే, శాశ్వతంగా అధికారంలో  ఉండేలా, రాజ్యంగాని మార్చి రాజరిక వ్యవస్థను ప్రవేశ పెట్టేందుకు ఆయన వెనుకాడరని ఆమ్ ఆద్మీ పార్టీ అంటోంది.  దేశంలో ప్రజా స్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు, నియంతృత్వం కబంధ హస్తాల్లోకి దేశం వెళ్లిపోకుండా కాపాడుకునేందుకు  విపక్ష పార్టీలు అన్నీఐక్యం కావాలన్నవిషయంలో బీజేపీయేతర పార్టీలన్నీ కూడా ఏకాభిప్రాయంతోనే ఉన్నాయి., 2024 ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ ను అడ్డుకోవాలంటే విభేదాలు విస్మరించి కలిసి నడవాల్సిన అవసారన్ని కూడా విపక్షాలు గుర్తించాయి. అయితే అలాంటి కలయిక ద్వారా ఏర్పడే కూటమికి నేతృత్వం వహించే పార్టీ, కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరు అన్న అంశం వద్దే ఈ ఐక్యత పీటముడులు పడుతున్నది. ఎవరికి వారు నాయకత్వం ఒక సమస్య కాదని చెబుతున్నప్పటికీ ఆచరణ, కార్యాచరణ విషయానికి వచ్చే సరికి అదే అంశంపై పట్టుబడుతున్న పరిస్థితి.   నిజానికి, 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలు ఏకం కావలసిన అవసరాన్నిఒక్క బీజేపీయేతర పార్టీలే కాదు, జనం కూడా గుర్తించారు. అంతెందుకు ఇప్పటికీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న పార్టీలు కూడా గుర్తించాయి.  2024 ఎన్నికల్లో ప్రధాని మోదీని ఓడించాలంటే.. విపక్షాలన్నీ ఐక్యంగా పోటీ చేయాలని... కాంగ్రెస్ మొదలు కమ్యూనిస్టుల వరకు తృణమూల్ మొదలు, డీఎంకే వరకూ అన్ని జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలూ కూడా గుర్తించాయి. అయితే  అయితే కలిసికట్టుగా ముందడుగు వేసే విషయంలో మాత్రం వాటి అడుగులు తడబడుతున్నాయి.   అదలా ఉంటె విపక్షాలను ఐక్యం చేసేందుకు బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్ తీవ్ర ప్రయత్నాలు చేశారు, చేస్తున్నారు కూడా. అలా బీజేపీయేతర పార్టీల అన్నిటి కృషి ఫలితంగా విపక్షాల ఐక్యత దిశగా ఒక అడుగు పడింది. ఇండియా కూటమి ఆవిర్భవించింది.  అయితే ఆ కూటమి బీజేపీ ప్రత్యామ్నాయంగా దూర దృష్టి కలిగిన, జాతీయవాద కూటమిగా ఎదిగిందా, ఆ దిశగా అడుగులు వేస్తున్నదా అంటే సంతృప్తికరమైన సమాధానం మాత్రం రావడం లేదు.   అయితే ఇందుకు కారణాలు సుస్పష్టం. బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ ఒకింత ప్రజాస్వామ్యయుత పార్టీయే అయినప్పటికీ భాగస్వామ్య పక్షాల పట్ల, మరీ ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల పట్ల పెద్దన్న పాత్ర పోషిస్తూ వాటి ఎదుగుదలకు అడుగడుగునా అడ్డంకులు పడుతుందన్న భయం కూటమి పార్టీలలో పూర్తిగా తొలగిపోకపోవడమే. ప్రస్తుత పరిస్థితుల్లో పేరుకు జాతీయ పార్టీ అయినప్పటికీ కాంగ్రెస్ బలం కూడా ఒక ప్రాంతీయ పార్టీతో సమానంగా పడిపోయిందనడంలో సందేహం లేదు. అందుకే కాంగ్రెస్సేతర, బీజేపీయేతర కూటమి కోసం ప్రాతీయ పార్టీలు గతంలో ఒక ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఇక ఇప్పుడు అనివార్యంగా మోడీ అనే పెద్ద గీతను చిన్నది చేయడానికి అవి కాంగ్రెస్ తో చేతులు కలపక తప్పని అనివార్య పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. అయితే కాంగ్రెస్ తో చేతులు కలిపినప్పటికీ కూటమికి నాయకత్వం విషయంలో వాటిలో ఇంకా అనుమానాలు పూర్తిగా నివృత్తి కాలేదు. దాంతో ఇండియా కూటమి అడుగులు తడబడుతున్నాయి. ఒక అడుగు ముందుకు పడింది అనుకునేలోగానే రెండడుగులు వెనుకకు పడుతున్నాయి. తాజాగా కూటమి కన్వీనర్ గా మల్లిఖార్జున్ ఖర్గేను ఎన్నుకోవడం ద్వారా ఒక అడుగు ముందుకు వేసినట్లు కనిపించినా.. ఆ భేటీకి తృణమూల్, సమాజ్ వాదీ వంటి పార్టీల గైర్హాజరీ కారణంగా అది ఏకాభిప్రాయంతో జరిగిన ఎంపికేనా అన్న అనుమానాలు రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తం అవుతున్నాయి.   ఏది ఏమైనా ప్రస్తుతం విపక్ష పార్టీలన్నిటి లక్ష్యం మోడీ సర్కార్ హ్యాట్రిక్ సాధించకుండా అడ్డుకోవడమే కానుక.. నాయకత్వం ఎవరిది అన్న విషయాన్ని పక్కన పెట్టి ఐక్యంగా సాధ్యమైనన్ని ఎక్కువ లోక్ సభ స్థానాలను సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాల్సి ఉంటుది. 

ఎల్లుండి  విగ్రహప్రతిష్టోత్సవ కార్యక్రమానికి బయలు దేరనున్న చంద్రబాబు 

ప్రస్తుతం అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టోత్సవం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలకు  ఆహ్వానం అందలేదు. కానీ కాంగ్రెస్ హైకమాండ్ కు ఆహ్వానం అందినప్పటికీ ఈ కార్యక్రమానికి హాజరుకాకూడదని నిర్ణయించింది. కానీ  ;ఎన్ డి ఎ  భాగస్వామిగా లేని టిడిపికి ఆహ్వానం అందింది. . గతంలో టిడిపి  ఎన్ డి ఏ భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే..    రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు వెళుతున్నారు. ఈ నెల 21వ తేదీ సాయంత్రం ఆయన అయోధ్యకు బయల్దేరుతున్నారు. 22న జరిగే విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. కార్యక్రమానికి రావాలని కోరుతూ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు రెండు రోజుల క్రితం చంద్రబాబును ఆహ్వానించారు.  జనవరి 22 మధ్యాహ్నం 12.20 గంటలకు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. నిన్ననే గర్భ గుడిలోకి రాముడి విగ్రహాన్ని చేర్చారు. విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి 8 వేల మంది వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి. సమయం దగ్గర పడుతుండటంతో ఆహ్వానాలను అందించే ప్రక్రియను నిర్వాహకులు వేగవంతం చేశారు. దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుండి ప్రత్యేక బస్సులు, ప్రత్యెక రైళ్ళు కూడా ఏర్పాటు చేసి భక్తులను అయోధ్యకు చేర్చనున్నారు. అయోధ్యలో రామయ్యకు జరిగే పట్టాభిషేకాన్ని చూడాలని ఆ మహత్కార్యాన్ని కళ్ళారా చూసి తరించాలని ప్రతి ఒక్కరు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం దశాబ్దాలుగా నిరీక్షిస్తున్న వారందరి కోరిక తీరుతున్న సమయంలో రామయ్య తాను పుట్టిన నేలమీద తిరిగి నడయాడబోతున్నాడు.ఇదే సమయంలో దేశ, విదేశాలలోని ప్రముఖులకు రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వానాలను పంపిస్తున్నారు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వాహకులు, విశ్వహిందూ పరిషత్ నిర్వాహకులు. ఇప్పటికే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం,  శ్రీరామ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు ఏపీ నేతలకు ఆహ్వానం అందింది. సినీ నటులు చిరంజీవికి, మోహన్ బాబు తదితరులకు కూడా ఆహ్వానాలు అందాయి.  విగ్రహ ప్రతిష్టాపనకు నిన్నటి నుండి సాంప్రదాయబద్ధమైన ముందస్తు క్రతువులు ప్రారంభమయ్యాయి. 22వ తేదీన జరగనున్న ఈ చారిత్రాత్మక ఘట్టానికి 150 దేశాల నుంచి నాలుగు వేల మంది ప్రముఖులు అతిథులుగా హాజరుకానున్నారు.  అక్కడకు వెళ్ళే అతిధుల కోసం కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. టెంట్ హౌస్ లను నిర్మించి వారికి కావాల్సిన వసతి సౌకర్యం కల్పించే పనిలో ఉన్నారు.

సుప్రీంలో జగన్ కు ఝలక్.. బెయిలు రద్దు పిటిషన్ డిస్మిస్ కు నో

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు దేశ అత్యున్నత న్యాయస్థానంలో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. గత పదేళ్లుగా బెయిలు మీద ఉన్న జగన్ బెయిలు రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టి వేయాలంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు తోసి పుచ్చింది. ఈ సందర్భంగా జగన్ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలను సుప్రీం పక్కకు పెట్టేసింది. రఘురామకృష్ణం రాజుపై అనర్హత పిటిషన్ వేసినందునే ఆయన జగన్ బెయిలు రద్దు చేయాలన్న పటిషన్ వేశారంటూ ముకుల్ రోహత్గి చేసిన వాదనను తోసిపుచ్చిన సర్వోన్నత న్యాయస్థానం, ఈ కేసు విషయంలో తాము రాజకీయాల జోలికి పోవడం లేదనీ, కేవలం న్యాయపరమైన అంశాలనే పరిశీలిస్తామని స్పష్టం చేసింది. జగన్ బెయిలు రద్దు పిటిషన్ విచారణను ఏప్రిల్ కు వాయిదా వేసింది. ఈ సందర్భంగా జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో జాప్యంపై సీబీఐని నిలదీసింది. విచారణ జాప్యానికి బాధ్యులెవరని ప్రశ్నించింది. దీనికి సీబీఐ తరఫు న్యాయవాది విచారణలో జాప్యం, వాయిదాలతో తమకు సంబంధం లేదని చెప్పారు. దీనిపై సీరియస్ అయిన సుప్రీం అయితే ఎవరికి సంబంధం ఉంటుందని సూటిగా ప్రశ్నించారు. ఆ సమయంలో జోక్యం చేసుకున్న రఘురామకృష్ణం రాజు తరఫు న్యాయవాది సీబీఐ, జగన్ కుమ్మక్కై కేసు విచారణను జాప్యం చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో హై ప్రొఫైల్ కేసుల విచారణను త్వరిత గతిన పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టు గత ఏడాది డిసెంబర్ 15వ తేదీన ఆదేశాలు ఇచ్చిన అంశాన్ని జగన్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టులో ప్రస్తావించారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో జగన్ కేసుల విచారణ ఎంత త్వరగా తేలుతుందో చూద్దామని సుప్రీం ధర్మాసనం సెటైరికల్ గా వ్యాఖ్యానించింది. కాగా ఏపీ సీఎం జగన్ బెయిల్‌ను రద్దు చేయడంతో పాటు జగన్ అక్రమాస్తుల కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ ఎంపీ రఘురామరాజు సుప్రీం కోర్టులో రెండు పిటిషన్లను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు పిటిషన్లపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం (జనవరి 19) విచారణ జరిపింది. జగన్ బెయిల్ రద్దు, ట్రాన్స్ ఫర్ పిటిషన్లపై సీబీఐకి గతంలోనే సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసిన సంగతి విదితమే.  

బాలినేనిదీ ఆర్కే దారేనా?

ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. జగన్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకతకు తోడు.. ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న సిట్టింగుల మార్పు పేరుతో చేస్తున్న ప్రయోగం  ఆ పార్టీలోని ప్రజా ప్రతినిధుల్లో  ఆందోళన, ఆవేదన, ఆగ్రహం నింపుతోంది. దీంతో రోజు రోజుకూ  చాప కింద నీరులాగా పార్టీ నేతల్లో అసంతృప్తి విస్తరిస్తోంది.  పార్టీ వదిలి వెళ్లేందుకు రెడీ అవుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అలా పార్టీ మారే యోచన చేస్తున్న వారి జాబితాలోకి తాజాగా జగన్ సమీప బంధువు, మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే  బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు కూడా చేరింది.  జగన్ తీరు కారణంగా చాలా కాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న బాలినేని.. ఇక ఇప్పుడు జగన్ కు బైబై చెప్పేయడానికే నిర్ణయించుకున్నారు. సిట్టింగుల మార్పు అంటూ జగన్ తన సీటు మార్చడానికి నిర్ణయించుకోవడం బాలినేనిలో ఇహ పార్టీలో ఉండి, జగన్ వెంట నడిచి లాభం లేదన్న నిర్ణయానికి వచ్చేలా చేసింది. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే జగన్ తీరుతో విసిగి పార్టీని వీడి షర్మల వెంట అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్కే అంటే జగన్ కు అనుంగు శిష్యుడు, సన్నిహితుడిగా పేరు ఉంది. అలాంటి ఆర్కే పార్టీని వీడి జగన్ కు వ్యతిరేకంగా షర్మిల వెంట కాంగ్రెస్ గూటికి చేరేందుకు రెడీ అయిపోయారు. ఇప్పుడు జగన్ సమీప బంధువు బాలినేని కూడా ఆర్కే బాటలోనే అడుగులు వేయడానికి రెడీ అయిపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   సోమవారం (జనవరి 21) కాంగ్రెస్ రాష్ట్ర సారథిగా  షర్మిల బాధ్యతలు చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఆమె అలా బాధ్యతలు చేపట్టగానే ఇలా  బాలినేని ఆమెతో భేటీ రెడీ అవుతున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. బాలినేనికి వైయస్ కుటుంబంతో బంధుత్వం ఉన్న సంగతి తెలిసిందే.  ఆ కారణంతోనే తెలంగాణలో వైయస్ షర్మిల పార్టీ పెట్టి పాదయాత్ర ప్రారంభించగానే.. అప్పటికి ఏపీ మంత్రిగా ఉన్న బాలినేనిబాలినేని వెళ్లి.. ఆమెకు అభినందనలు చెప్పడమే కాకుండా  టేక్ కేర్ అంటూ జాగ్రత్తలు  చెప్పి వచ్చారు. ఆ తర్వాత ఇదే కారణంతో   సీఎం  జగన్‌కు  బాలినేనిని తాడేపల్లి ప్యాలెస్‌కు దూరం పెట్టడమే కాకుండా   ఆయనను కేబినెట్ నుంచి కూడా తొలగించేశారని అప్పట్లో పార్టీ వర్గాలలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.  అలాగే  తన కుమార్తె షర్మిల రాజకీయ భవిష్యత్తుపై ఆరా తీసేందుకు వైఎస్ విజయమ్మ ఇటీవల  ఒంగోలు వెళ్లి ఓ సిద్దాంతిని కలిశారు, ఆ తరువాత ఆమె   బాలినేని నివాసానికి ఆమె వెళ్లారు. దీంతో జగన్ కు బాలినేనిపై మరింత ఆగ్రహం పెరిగిందనీ, అందుకే వచ్చే ఎన్నికలలో బాలినేనికి ఒంగోలు టికెట్ నిరాకరిస్తున్నారన్న చర్చ ఇప్పుడు పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.  అదలా ఉంచితే ఆంధ్రప్రదేశ్‌లో హస్తం పార్టీ పగ్గాలు వైయస్ షర్మిల చేపట్టడంతో.. వైసీపీలోని అసంతృప్తులందరూ దాదాపుగా ఆమె వెంటే  నడవనున్నారనే ఓ ప్రచారం  పోలిటికల్ సర్కిల్‌లో  జోరుగా ఉంది.  ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆ బాటలోనే నడుస్తున్నారు. నేడో రేపో  బాలినేని సైతం నేను సైతం  షర్మిల వెంటే అంటూ ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే పార్టీ ఏదన్నది కాదు, తాను మాత్రం ఒంగోలు నుంచే బరిలోకి ఉంటానని బాలినేని చేసిన ప్రకటనను ఉదహరిస్తున్నారు.  గత కొన్ని రోజులుగాజగన్‌ను కలిసేందుకు బాలినేని చేసిన  ప్రయత్నాలు పలించకపోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేయడం, జగన్ ను ఇక కలిసేదేలేదని శపథం చేసి మరీ హైదరాబాద్ వెళ్లిపోవడం తెలిసిందే. అయితే  సంక్రాంతి పండగ వేళ..  జగన్  పిలుపునందుకుని బాలినేని  విజయసాయిరెడ్డితో కలిసి  జగన్‌తో భేటీ  అయ్యారు. అయితే ఈ భేటీలో ఒంగోలు ఎంపీగా  మాగుంట శ్రీనివాసులు రెడ్డికి టికెట్ కేటాయింపుపై బాలినేని జగన్ ను నిలదీస్తే... ఆయన సంగతి పక్కన పెట్టి మీ పోటీ ఒంగోలు నుంచా, గిద్దలూరు నుంచా అన్నది తేలాల్సి ఉందని చెప్పడంతో కంగుతిన్న బాలినేని భేటీ ముగిసిన తరువాత మీడియాతో కూడా మాట్లాడకుండా వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే ఆయన జగన్ తో తెగతెంపులు చేసేసుకున్నట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ పరిస్థితుల్లో జగన్ కు సరైన రిటార్డ్ ఇవ్వాలంటే షర్మిల కాంగ్రెస్  సారథ్య బాధ్యతలు చేపట్టిన తరువాత కాంగ్రెస్ లో చేరి ఆమెకు అండగా నిలవడమే సరైన నిర్ణయంగా బాలినేని భావిస్తున్నట్లు చెబుతున్నారు. 

బాలశౌరి పవన్ తో భేటీ...ఎప్పుడంటే?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి శుక్రవారం సాయంత్రం భేటీ కానున్నారు.  హైదరాబాద్ లోని పవన్ నివాసానికి  వెళ్లనున్నట్లు సమాచారం.  2019లో వైసీపీ తరపున బాలశౌరి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. పార్టీలో తనకు సరైన గుర్తింపు లభించడం లేదనే అసంతృప్తితో ఆయన ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన రోజే తాను జనసేనలో చేరబోతున్నట్టు   సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. వైసీపీ నేతలు పేర్ని నాని, జోగి రమేశ్ లతో బాలశౌరికి విభేదాలు ఉన్నాయి. ఈ భేటీలో తాను  జనసేనలో చేరిక, ఇతర రాజకీయ అంశాలపై  బాలశౌరి  పవన్ తో చర్చించనున్నారు.ప్రస్తుతం మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గానికి  బాలశౌరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటున్న వల్లభనేని బాలశౌరి  ప్రస్తుతం ఏ పార్టీలో లేరు. వైసీపీకి రాజీనామా చేయడంతో  ఆయన జన సేనలో చేరనున్నట్లు రాజకీయ పరిశీలకులు  ముందుగానే ఊహించారు.   కాపు సామాజిక వర్గానికి చెందిన బాలశౌరి అదే సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీలో  చేరితే పొలిటికల్ మైలేజి వస్తుందని వారు విశ్లేషిస్తున్నారు.   అతను గతంలో  తెనాలి నియోజకవర్గానికి  కాంగ్రెస్ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించారు. బాలశౌరి  2004 లోక్‌సభ ఎన్నికలలో తెనాలి నియోజకవర్గం నుండి రెండోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి  ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుపై 78,556 మెజారిటీతో  గెలుపొందారు . 2008లో నియోజకవర్గాన్ని రద్దు చేసి గుంటూరు నియోజకవర్గంలో విలీనం చేసే వరకు ఎంపీగా కొనసాగారు. .తరువాత అతను 2019 లోక్‌సభ ఎన్నికలలో మచిలీపట్నం నియోజకవర్గం నుండి వైఎస్ఆర్  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి  తెలుగుదేశం పార్టీకి అభ్యర్థి  కొనకళ్ల నారాయణరావుపై 60,141 మెజారిటీతో గెలుపొందారు . అయితే వల్లభనేని బాలశౌరి మచిలీపట్నం లేదా గుంటూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు మరో వాదన వినిపిస్తుంది. వల్లభనేని  బాల శౌరికి సినీరంగంలో కూడా ప్రవేశం ఉంది.  ప్రముఖ దర్శకుడు ఎస్వీ  కృష్ణా రెడ్డి దర్శకత్వం వహించిన లేత మనసులు చిత్రాన్ని నిర్మించారు . బాక్సాఫీసు రికార్డులను చూసి కలత చెందారు. లేత మనసులు చిత్రం .అనుకున్నంత  సక్సెస్ కాకపోవడంతో  పవన్ కళ్యాణ్ తో మరో  సినిమా చేద్దామనుకున్నారు. అయితే  బాలశౌరి తర్వాత చిత్రరంగానికి దూరమయ్యారు. పవన్ కళ్యాణ్ తో  బాలశౌరి చిత్రం  కలగా మిగిలిపోయింది. ఎపి రాజకీయాలలోకీలక పాత్ర పోషిస్తున్న పవన్ కళ్యాణ్ తో బాలశౌరి ఈ ఎన్నిక ద్వారా  దగ్గర అవుతారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

జగన్ మామ కౌగిలిలో అల్లుడు.. టైం 2 నిముషాల ఒక సెకన్!

వైఎస్ జగన్మోహనరెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. రాష్ట్రంలోని ఆడబిడ్డలందరికీ జగనన్న అని చెప్పుకుంటారు. అవ్వాతాతలకు మనవడినని చాటుకుంటారు. ఇక పిల్లలకు దేవుడిచ్చిన మేనమానని ఘనంగా ప్రకటించుకుంటారు. అయితే సొంత తల్లి, చెల్లి, మేనల్లుడికి మాత్రం ఆయన ఏమీ కారు.    అందుకే సొంత మేనల్లుడి నిశ్చితార్ధం కార్యక్రమానికి మాత్రం ఆయన మొక్కుబడిగా హాజరై, హడావుడిగా ఆశీర్వదించేసి అంతకంటే హడావుడిగా అక్కడ నుంచి జారుకున్నారు. ఆయన అక్కడ గడిపిన అతి స్వల్ప సమయంలో కూడా  ఎవరూ ఆయన వచ్చినందుకు ఆనందం వ్యక్తం చేయలేదు సరికదా.. ఎందుకు వచ్చారురా భగవంతుడా అన్నట్లు మొక్కుపడి పలకరింపులు, షేక్ హ్యాండ్ లతో సరిపెట్టేశారు. చివరికి సొంత చెల్లి కూడా సాధ్యమైనంత వరకూ అన్నకూ దూరం దూరంగా మెసిలింది. సతీసమేతంగా వచ్చిన జగన్ కు అక్కడ జరిగిన మర్యాద అది. ఇక జగన్ సతీమణి  భారతికి అయితే ఆ మాత్రం పలకరింపులు కూడా దక్కలేదు.  ఆ కార్యక్రమానికి హాజరైన మాత్రమే తెలిసిన ఈ తతంగాన్ని సీఎం జగన్ కార్యాలయం అదే ఏపీ సీఎంవో ఓ వీడియో ద్వారా  అందరికీ తెలియజేసింది. ఆ వీడియో  చూసిన నెటిజనులు తమ పని తాము చేసుకుపోతున్నారు.   ఏపీలో పిల్లలందరికీ  దేవుడిచ్చిన మేనమామ అయిన జగన్ సొంత మేనల్లుడి నిశ్చితార్ధంలో ముచ్చటగా మూడు నిమిషాలు కూడా ఉండలేదని.. అలా ఉండలేని విధంగా ఆయనంతట ఆయనే కుటుంబాన్ని దూరం చేసుకున్నారని వ్యాఖ్యానిస్తే పోస్టులు పెడుతున్నారు. కోట్లాదిమంది అక్కాచెల్లెమ్మలకు దేవుడిచ్చినఅన్నయ్య అయిన జగన్.. సొంత చెల్లి ఇంట్లో జరిగిన తొలి శుభకార్యానికి అలా అనుకోని అతిథిలా వచ్చి వెళ్లిపోవడమేమిటని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.  అంతే కాదు సెటైర్లు కూడా పేలుస్తున్నారు.   కుటుంబాల్లో కలహాలు..   గొడవలు కామనే. అయితే శుభకార్యాల సందర్భాల్లో వాటిని పక్కనపెట్టి, కనీసం అప్పటివరకైనా కలసి ఉండేందుకు ప్రయత్నిస్తారు. కనీసం కలసి ఉన్నట్లు నటిస్తారు. ఇది ఎక్కడైనా జరిగేదే. చూసేదే!   కానీ మేనల్లుడి నిశ్చితార్ధ వేడుకలో  మాత్రం జగన లో ఆ కలివిడి తనం భూతద్దం వేసి వెతికినా కనిపించలేదు. అలాగే అన్న వచ్చాడన్న ఆనందం షర్మిల దంపతుల ముఖంలోనూ కనిపించలేదు. అదే ఇప్పుడు  హాట్‌టాపిక్‌గా మారింది. జగన్‌కు,  షర్మిల దంపతులకు మధ్య గొడవలు-ఆస్తి విబేధాలున్నాయన్న వార్త ..చాలాకాలం నుంచి ప్రచారంలో ఉంది.  అయితే చెల్లి కుటుంబంలోజరిగే తొలి శుభకార్యం కాబట్టి.. జగన్ మేనమామ పాత్ర పోషించి, తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని చెప్పేందుకు ప్రయత్నిస్తారని చాలామంది భావించారు. పైగా ఏపీ రాజకీయాలలో షర్మిల ఎంట్రీ తరువాత, షర్మిలతో తనకు ఉన్నవి రాజకీయ విభేదాలే తప్ప మరేమీ కాదని ప్రజలకు తెలిసేలా వ్యవహరించడం జగన్ కు అవసరం.   జగన్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించి.. తమ మధ్య ఉన్నవి కేవలం రాజకీయ విభేదాలే కావనీ, అంతకు మించి అని చెప్పకనే చెప్పేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.   జగన్ అలా నేరుగా వేదిక వద్దకు రావడం.. మేనల్లుడిని కౌగిలించుకుని, కోడలిని ఆశీర్వదించడం… షర్మిల వియ్యంకుడు-వియ్యపురాలికి నమస్కరించడం… భార్య భారతిని దగ్గరకు పిలిచి ఫొటోలు దిగడం… ఆ సమయంలో చెల్లి షర్మిల-బావ బ్రదర్ అనిల్‌ను దగ్గరకు పిలిచినా రాకుండా, వారిద్దరూ దూరంగానే ఉండి ఫొటోలు దిగడం.. వెళ్లేముందు అమ్మ విజయలక్ష్మితో కొన్ని సెకన్లుమాట్లాడటం..వెంటనే అందరికీ నమస్కరిస్తూ భార్య భారతితో, అక్కడి నుంచి నిష్క్రమించడం జరిగిపోయింది. ఇదంతా కేవలం రెండు నిమిషాల ఒక్క సెకన్ మాత్రమేనంటూ నెటిజనులు లెక్కగట్టి మరీ చెబుతున్నారు.   అంతే కాదు నిశ్చితార్థ వేదికపై కుటుంబ సభ్యుల మధ్య సెక్యూరిటీ తో జగన్ కనిపించడంపై కూడా నెటిజనులు ప్రశ్రిస్తున్నారు.  జగన్ బయటకు వెళితే జనం ఎక్కడ నిరసనలు తెలుపుతారో, నిలదీస్తారో అన్న భయంతో రక్షణ, తాను ఎవరికీ కనిపించకుండా రోడ్డుకు ఇరువైపులా పరదాలు కట్టడం వరకూ ఓకే.  కానీ సొంత చెల్లి ఇంట్లో జరిగే శుభకార్యంలోనూ, సెక్యూరిటీ హడావిడి ఏంటి? ఎందుకు? అంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు.   మొత్తంగా షర్మిల కుమారుడి నిశ్చితార్ధ వేడుక జగన్ కు వ్యక్తిగతంగానే కాకుండా, రాజకీయంగా కూడా ఇబ్బంది కలిగించిందని, ఇరుకున పెట్టిందని చెప్పాల్సి ఉంటుంది. 

మేనల్లుడి నిశ్చితార్థ వేడుకలో జగన్ కు పరాభవం!

సొంత మేనల్లుడి వివాహ వేడుకలో ఏపీ సీఎం జగన్ కు పరాభవం ఎదురైందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఆయనతో మాట్లాడేందుకు కానీ, ఫొటో దిగేందుకు కానీ సొంత సోదరి షర్మిల ముందువెనుకలాడిన వీడియోను చూసిన వారంతా. జగన్ ఎంతగా ఇబ్బంది పెట్టి ఉండకపోతే.. అన్నను దూరం పెట్టాలని షర్మిల ఎందుకు భావించి ఉంటుందని అంటున్నారు. వైఎస్ కుటుంబం మొత్తం జగన్ ను దూరం పెట్టేసిందనడానికి షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ నిశ్చితార్థ వేడుక ప్రత్యక్ష సాక్ష్యంగా చెబుతున్నారు.  ఏపీసీసీ చీఫ్ షర్మిల కుమారుడి నిశ్చితార్థం గురువారం (జనవరి 18) హైదరాబాద్ లోని గోల్కొండ రిసార్ట్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ సతీసమేతంగా హాజరయ్యారు. అయితే ఆ కార్యక్రమంలో జగన్ తో ఎవరూ కలివిడిగా మాట్లాడలేదు. సొంత మేనల్లుడి వివాహ నిశ్చితార్థ వేడుకలో జగన్ ఓ పరాయి వాడిలా, ఆహ్వానం లేని అతిథిలా మెలగాల్సి వచ్చింది. ఈ విషయం ఎవరో జగన్ అంటే గిట్టని వాళ్లు, ఆయన రాజకీయ ప్రత్యర్థులో చెబుతున్న మాట కాదు. స్వయంగా ఏపీ సీఎంవో విడుదల చేసిన వీడియో ప్రత్యక్షంగా చూపింది. ఆ కార్యక్రమానికి వెళ్లిన జగన్  కు అక్కడ సాదర స్వాగతం లభించలేదు. అసలు ఎవరూ పలకరించిన పాపాన కూడా పోలేదు. ఆ విషయం స్వయంగా ఏపీ సీఎంవో విడుదల చేసిన వీడియో చూసిన అందరికీ స్పష్టంగా అర్థమౌతుంది. మొహమాటపు నవ్వులు, నామమాత్రపు పలకరింపులే జగన్ కు అక్కడ ఎదురయ్యాయి.   సొంత అన్న జగన్ ను మొక్కుబడిగా పలకరించి దూరం జరిగిన షర్మిల, ఈ కార్యక్రమానికి హాజరైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సాదరంగా ఆనందంగా ఆహ్వానించారు. ఆయనతో కలిసి ఫొటో దిగారు. అదే జగన్ విషయానికి వస్తే ఆయనను రిసీవ్ చేసుకుంటున్న సమయంలో ఫొటో దిగేందుకు కూడా షర్మిల ఇష్టపడలేదు. చివరిగా కుటుంబం గ్రూప్ ఫొటో సమయంలో కూడా జగన్ కు దూరంగా ఎక్కడో నిలుచున్నారు. స్వయంగా జగన్ రెండు మూడు సార్లు పిలిచినా రాలేదు. చివరికి తల్లి విజయమ్మ నచ్చ చెప్పడంతో అయిష్టంగానే జగన్ పక్కకు వచ్చి నిలుచున్నారు. మొత్తంగా జగన్ కుటుంబంలో ఏకాకిగా మిగిలిపోయారనడానికి నిలువెత్తు సాక్ష్యంగా షర్మిల కుమారుడి నిశ్చితార్థ వేడుక నిలిచింది. ఇంతా చేసి సొంత మేనల్లుడి వివాహ నిశ్చితార్థ వేడుకకు తాడేపల్లి నుంచి సతీసమేతంగా వెళ్లిన జగన్ అక్కడి తిరస్కారాన్ని చూసి కొద్ది సేపు మాత్రమే ఆ కార్యక్రమంలో ఉన్నారు. ప్రధాన నిశ్చితార్ధ వేడుక వేదిక మీద ఆయన ప్రజెన్స్ రెండంటే రెండు నిముషాలు మాత్రమే ఉందంటే కుటుంబ సభ్యులు ఆయనను ఎంత దూరంగా పెడుతున్నారో అవగతమౌతుంది. ఆ కార్యక్రమంలో ఉన్నంత సేపూ పలకరించే వారు లేక  కృత్రిమంగా తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో  జగన్ ఇబ్బందిగా గడపడం స్పష్టంగా కనిపించింది. 

అద్దంకి దయాకర్ కు అడ్డుపడుతున్నదెవరు?

ఓ మంత్రి అద్దంకి దయాకర్ కు అడ్డు పడ్డారనే ప్రచారం గాంధీభ‌వ‌న్‌లో జరుగుతోంది. 2018 ఎన్నికల్లో తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసిన దయాకర్ ను సొంత పార్టీ నేతలు ఓడించారంటూ దయాకర్ పలుమార్లు చెప్పారు.  అయితే అప్పట్లో ఆయన సభా వేదిక ముందు ఓ నాయకుడిని దూషించారు. దీనిని మనసులో పెట్టుకున్న ఆ నాయకుడు గత ఎన్నికల్లో దయాకర్ కు టికెట్ రాకుండా చేశారని ప్రచారం జరుగుతున్నది. అయితే ఈసారి పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ దక్కుతుందని అందరూ భావించారు. రేవంత్ రెడ్డి కి అనుకూలమైన వ్యక్తిగా దయాకర్ ముద్రపడ్డారు. దయాకర్ కు ఎమ్మెల్సీ స్థానాన్ని దూరం చేయడం పట్ల ఆ కీలక నాయకుడి హస్తం ఉందని గాంధీభ‌వ‌న్ లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు తనకు ఎమ్మెల్సీ దూరమైనంత మాత్రాన తాను బాధ‌ప‌డ‌టం లేద‌ని అద్దంకి దయాకర్ తెలుగుఒన్‌తో చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, కౌశిక్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. దీంతో వారు తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు వేరువేరుగా ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో.. అసెంబ్లీలో తగిన మెజారిటీ కలిగి ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలపై తీవ్రమైన కసరత్తు చేసింది. అయితే అప్పటిదాకా కేవలం అద్దంకి దయాకర్ పేరు మాత్రమే వినిపించింది. ఇక మిగతా ఎమ్మెల్సీకి ఎవరిని ఎంపిక చేస్తారు అనేది బయటకు పొక్కకుండా కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ లో వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు వెళ్లే ముందు ఢిల్లీ లో కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిశారు. అప్పుడు బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలని ప్రతిపాదించారు. దీనికి అధిష్టానం కూడా పచ్చ జెండా ఊపింది. అయితే ఆ తర్వాత అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ వర్గీయుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. వారి వారి సామాజిక వర్గాల చెందినవారు దయాకర్, బల్మూరి వెంకట్  కు అభినందనలు తెలిపారు. అయితే ముఖ్యమంత్రి దావోస్ వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారిగా ఢిల్లీలో సీన్ మారిపోయింది. చివరి నిమిషంలో అద్దంకి దయాకర్ పేరు గల్లంతయింది. ఆయనకు బదులు మహేష్ కుమార్ గౌడ్ పేరు వచ్చి చేరింది. అయితే ఈ వివరాలను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా అద్దంకి దయాకర్ కు.. ఆయనకు మద్దతు ఇచ్చిన ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు దెబ్బకు సైలెంట్ అయిపోయాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన అద్దంకి దయాకర్ ను ఢిల్లీ పెద్ద‌లు ఝ‌ల‌క్ ఇచ్చారు.  గ‌తంలోకి తొంగి చూస్తే అప్ప‌ట్లో వై ఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి కూడా కేవీపి రాంచంద్ర‌రావుకు రాజ్య‌స‌భ‌కు పంపాల‌నుకున్న‌ప్పుడు కూడా ఇలాగా ఢిల్లీ పెద్ద‌లు అడ్డుకున్నారంటూ గాంధీభ‌వ‌న్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

జగన్ దృష్టిలో హోంమంత్రి కూడా చెల్లని కాణీయే!

వైసీపి అధినేత జగన్మోహన్‌ రెడ్డి వరుసపెట్టి పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్‌చార్జిలను మార్చేస్తూనే ఉన్నారు. ఆ మార్పుల నాలుగో జాబితాను గురువారం(జనవరి 18) రాత్రి విడుదల చేశారు. ఆ జాబితాలో ముఖ్యంగా చెప్పుకోవలసిన అంశం ఏదైనా ఉంటే అది జగన్ కేబినెట్ లో హోంమంత్రిగా ఉన్న తానేటి వనితను నియోజకవర్గం మార్చేయడం. కోవూరులో మీరు విజయం సాధించడం అసాధ్యం, మీపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉంది అని చెబుతూ ఆమెను పశ్చిమ గోదావరి జిల్లా కోవూరు నుంచి గోపాలపురం నియోజకవర్గానికి మార్చేశారు.  అలాగే గోపాలాపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావును కోవూరుకు మార్చారు. దీంతో వీరిరువురూ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తలారి వెంకట్రావు గోపాలపురంలో తెలుగుదేశం పార్టీని దీటుగా ఎదుర్కోలేకపోతున్నారని భావించి మార్చేసినట్లు చెబుతున్నారు. తానేటి వనితను కోవూరు నియోజకవర్గంలో ప్రజా వ్యతిరేకత అంటూ మార్చేశారు. అంటే వీరిరువురి పెర్ఫార్మెన్స్ బాగాలేదనీ, ప్రజలలో ఆదరణ లేదనీ వారికి విస్పష్టంగా చెప్పేశారు. మరి తమతమ నియోజకవర్గాలలో ప్రజల వ్యతిరేకతను ఎదుర్కొంటున్న వీరు పక్క నియోజకవర్గంలో ప్రజలను ఎలా ఆకట్టుకోలరన్న ప్రశ్నకు   మాత్రం జగన్ నుంచి సమాధానం రావడం లేదు.  ఇక నాలుగో జాబితాలో శాసనసభ నియోజకవర్గాలకు జగన్ ఖరారు చేసిన ఇన్ చార్జిలు  గోపాలాపురం- తానేటి వనిత (హోం మంత్రి), కొవ్వూరు  (ఎస్సీ) - తలారి వెంకట్రావు, శింగనమల (ఎస్సీ- ఎం. వీరాంజనేయులు, మడకశిర (ఎస్సీ) -ఈర లక్కప్ప, కనిగిరి (ఎస్సీ) - దద్దాల్ నారాయణ మాదవ్, నందికొట్కూరు (ఎస్సీ) -సుధీర్ దార తిరువూరు (ఎస్సీ) -నల్లగట్ల స్వామిదాసు, జీడి నెల్లూరు (ఎస్సీ) -ఎన్‌. రెడెప్ప చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం (ఎస్సీ) -కే. నారాయణ స్వామి. ఇక ఈ జాబితా విడుదల తరువాత వైసీపీలో మరెన్ని వికెట్లు పడతాయో చూడాల్సిందేనని పరిశీలకులు అంటున్నారు.   

అనుకున్నదొకటి.. అయినది మరొకటి!.. జగన్ కాపు ఆశలు ఆవిరి?

తెలుగుదేశం, జనసేనల పొత్తు విచ్ఛిన్నం చేయడానికీ, కాపు నేతలు జనసేనానికి దూరంగా ఉంచేందుకు జగన్ పార్టీ శతథా ప్రయత్నించింది. అయితే ఆ ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో కనీసం   కాపు ఓటర్లను తెలుగుదేశం, జనసేన కూటమికి దూరం చేయాలని, అది కుదరకపోయినా, వారి ఓట్లలో చీలిక తీసుకురావాలని జగన్ వేసిన ఎత్తులూ ఫలించలేదు సరికదా, అందు కోసం ఆయన పన్నిన వ్యూహాలు, వేసిన ఎత్తులూ రివర్స్ అయ్యి కాపు నేతలను, కాపు ఓట్లను ఏపీకి దూరం చేశాయి. దీంతో జగన్ స్వయంగా బంగారు పల్లెంలో పెట్టి కాపుల మద్దతును తెలుగుదేశం, జనసేన కూటమికి అప్పగించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  కాపు సామాజిక వర్గ ఓటర్లను ఆకర్షించేందుకు కాపు ఉద్యమ నేతనేత ముద్రగడ పద్మనాభానికి పెద్దాపురం టికెట్‌ ఆఫర్ చేసి వైసీపిలోకి ఆహ్వానించారు. అందుకు తొలుత సుముఖంగా స్పందించిన ముద్రగడ,  టికెట్‌ విషయంలో జగన్‌ మాటతప్పుతారని అనుమానించారు. సిట్టింగుల మార్పు పేరుతో జగన్ ఆడుతున్న క్రీడ అంతిమంగా తనకు మొండి చేయి చూపుతుందని నిర్ధారణకు వచ్చిన ముద్రగడ, జగన్ తో కలవడానికి ససేమిరా అన్నారు. అనడమే కాదు.. తాను జనసేనాని పవన్ కల్యాణ్ తో కలిసి నడుస్తాననీ, ఆ పార్టీ గూటికి చేరుతానని ప్రకటించేశారు.   అలాగే అదే కాపు సామాజిక వర్గానికి చెందిన క్రికెటర్ అంబటి రాయుడుకి గుంటూరు లోక్‌సభ టికెట్‌ ఆశజూపి వైసీపిలో చేర్చుకుని, ఆ తరువాత టికెట్ విషయంలో హ్యాండ్ ఇవ్వడానికి రెడీ అయిపోవడంతో అంబటి కూడా వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనకు దగ్గరయ్యారు.  ఇక వంగవీటి రాధా విషయంలో కూడా జగన్  అనుచితంగా వ్యవహరించారు. గత ఎన్నికలలో వంగవీటి రాధాకు పార్టీ టికెట్ ఇవ్వకపోవడమే కాకుండా,  అవమానకరంగా వ్యవహరించడంతో ఆయన తెలుగుదేశం గూటికి చేరారు.   ఈ నాలుగున్నరేళ్లే వంగవీటి రాధాను పట్టించుకోని జగన్ ఇప్పుడు ఇప్పుడు కాపు ఓటు బ్యాంక్ కోసం మళ్ళీ ఆయనకు టికెట్ హామీ ఇస్తూ రాయబారాలు పంపుతూ రాయబేరాలు ఆడుతున్నారు.  కొడాలి నాని, వల్లభనేని వంశీలతో ఎన్ని సార్లు ఈ విషయంలో సంప్రదింపులకు ప్రయత్నించినా  వంగవీటి రాధ  వైసీపీకి దగ్గరయ్యేందుకు ఇష్టపడలేదు. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గం ఇన్‌చార్జిల మార్పులు చేర్పుల కారణంగా వైసీపిలో కాపు నేతలు జ్యోతుల చంటిబాబు, పెండెం దొరబాబు తదితరులు కూడా జనసేన వైపు చూస్తున్నారు. నాలుగో జాబితా ప్రకటన వచ్చిన నేపథ్యంలో మరింత మంది కాపు సామాజిక వర్గ నేతలు తెలుగుదేశం, జనసేన కూటమికి చేరువయ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు.   రాష్ట్రంలో కాపు సామాజిక వర్గాన్ని, నేతలను విడగొట్టి లాభపడాలనుకున్న జగన్మోహన్‌ రెడ్డి తానే స్వయంగా వారందరినీ ఐక్యం చేసి మరీ తెలుగుదేశం, జనసేన కూటమికి దగ్గర చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగువన్ ముందే చెప్పినట్లు జగన్ ఒకదాని తరువాత ఒకటిగా వేస్తున్న అడుగులన్నీ పరాజయం దిశగానే పడుతున్నాయి. జనసేనాని పవన్ కల్యాణ్ పై తన వంధిమాగధుల్లా వ్యవహరిస్తున్న పేర్ని నాని వంటి కాపు నేతలతో విమర్శలు చేయిస్తే కాపు సామాజికవర్గ ఓట్లు చీలి తనకు ప్రయోజనం చేకూరుతుందని జగన్ భావించారు.  అలాగే కాపు సామాజిక వర్గ నేతలు తాను పిలిస్తే పార్టీలోకి రాకుండా ఎలా ఉంటారని అనుకున్నారు. అయితే ఆయన అనుకున్నది ఒకటి, అయినది ఒకటి అయ్యింది. బయట నుంచి కాపు నేతలు వచ్చి చేరడం అలా ఉంచి, పార్టీలో ఉన్న కాపు నేతలే ఆయనకూ దూరం జరుగుతున్నారు.  

వెలిసిపోతున్న గులాబీరంగు.. ఒడిశా బీఆర్ఎస్ బ్రాంచ్ ఖాళీ!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత బీఆర్ఎస్  జాతీయ రాజకీయాలంటూ ఇతర రాష్ట్రాలలో ఏర్పాటు చేసిన పార్టీ బ్రాంచీలు కూడా మూతపడిపోతున్నాయి. సాటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఆర్భాటంగా పార్టీ శాఖను ఏర్పాటు చేసి, కమిటీలను నియమించిన బీఆర్ఎస్ ఆ తరువాత ఏపీ వైపు చూసింది లేదు. నామ్ కే వాస్తేగా ఓ కార్యాలయాన్ని ఏపీలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ.. ఆ రాష్ట్రంలో ఒక్క కార్యక్రమం నిర్వహించిన దాఖలాలు లేవు. అప్పట్లో పార్టీలో చేరే వారిని ఇక్కడ నుంచి వాహనాలు పంపి మరీ  హైదరాబాద్ కు తీసుకువచ్చి, ఓ కండువా కప్పేసీ ఆ తరువాత వారి సంగతి, ఏపీ బీఆర్ఎస్ శాఖ గురించీ మరిచిపోయింది. అలాగే ఒడిశాలో కూడా కొందరు పేరున్న నేతలను చేర్చుకుని ఓ హడావుడి చేసేసింది. ఒడిశా నుంచి బీఆర్ఎస్ లో చేరిన వారి సామాన్యులేం కాదు.. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్, ఆయన కుమారుడు శిశిర్ గమాంగ్ లు. వీరిలో గిరిధర్ గమాంగ్  పేరు విన్నట్లు ఉంది కదా? ఆయన ఒడిశాకు మాజీ ముఖ్యమంత్రి . ఏకంగా తొమ్మిది సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు.  అయితే ఆయన అప్పట్లో లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేయకుండానే ఒడిశా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.  సరిగ్గా ఆ సమయంలోనే అంటే 1999లో అప్పటి వాజ్ పేయి ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన  ఒకే ఒక్క ఓటు వేసిన వ్యక్తి. ఒడిశా ముఖ్యమంత్రిగా ఉండి కూడా తన పార్లమెంటు సభ్వత్వాన్ని వదులు కోకుండా 1999 ఏప్రిల్ 17 న అవిశ్వాస పరీక్షలో 13 నెలల నాటి ప్రధాని వాజ్‌పేయి ప్రభుత్వాన్ని తన ఓటుతో కూల్చిన కాంగ్రెస్ నేత గిరిధర్ గమాంగ్.  అటువంటి గమాంగ్ ఆ తరువాత    2015లో బిజెపిలో చేరారు.  అటువంటి గిరిధర్ గమాంగ్ తన కుమారుడితో కలిసి బీజేపీని వీడి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అప్పట్లో ఒడిశాకు చెందిన ఓ పెద్ద నాయకుడు బీజీపీని వీడి కేసీఆర్ పంచన చేరారంటూ తెలంగాణలో అప్పటికి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఆకాశమే హద్దన్నంత ఘనంగా  ప్రచారం చేసుకుంది.  అయితే గమాంగ్ చేరిక వల్ల ఒడిశాలో బీఆర్ఎస్ కు ఒరిగేదేం లేదనీ, ఆయన రాజకీయంగా పెద్దగా క్రియాశీలంగా లేరనీ అప్పట్లోనే రాజకీయవర్గాలు పెదవి విరిచాయి. అటువంటి నేత కూడా తన కుమారుడితో కలిసి ఇప్పుడు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ గూటికి చేరిపోయారు.  ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో   బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలు కావడంతో సొంత రాష్ట్రంలోనే బలం లేని పార్టీలో ఉండటం నిష్ప్రయోజనం అని భావించి గిరిధర్ గమాంగ్ తన కుటుంబంతో సహా కాంగ్రెస్ పంచన చేరిపోయారు.  

నిరాహారదీక్షకు దిగిన కోడి కత్తి శీను తల్లి, సోదరుడు 

గత ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్ పోర్టులో సీఎం జగన్ పై కోడికత్తితో దాడి చేసిన ఘటనలో శ్రీను జైలు జీవితం గడుపుతున్న సంగతి తెలిసిందే. గత ఐదేళ్లుగా ఆయన విశాఖ జైల్లోనే మగ్గిపోతున్నాడు. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ శ్రీను తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజు నిరాహారదీక్షకు దిగారు. దీక్షకు పోలీసుల అనుమతులు లేకపోవడంతో విజయవాడలోని ఇంట్లోనే నిరశన దీక్ష చేపట్టారు.  ఈ సందర్భంగా శ్రీను తల్లి సావిత్రి మాట్లాడుతూ... తమకు న్యాయం జరిగేంత వరకు దీక్ష చేపడతామని చెప్పారు. ఈ కేసులో కోర్టుకు వచ్చి జగన్ సాక్ష్యం చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఎన్వోసీ ఇచ్చి కేసును ఉపసంహరించుకోవాలని అన్నారు. తమకు ప్రజా సంఘాలు మద్దతును ఇవ్వాలని కోరారు. మరోవైపు విశాఖ సెంట్రల్ జైల్లో శ్రీను నిరాహార దీక్షకు కూర్చోనున్నాడని సమాచారం.  కోడికత్తి కేసు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి పక్షంలో  ఉన్నప్పుడు అంటే 2018లో జరిగింది. తన పాదయాత్ర ముగించుకుని హైదరాబాద్ బయలు దేరే ముందు విశాఖపట్టణం ఎయిర్ పోర్ట్ లో ఈ దాడి జరిగింది. ఇది జగన్ పై జరిగిన దాడి కాదు అప్పటి వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎత్తుగడ అని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.  జగన్ హైదరాబాద్ చేరుకున్న తరవాత సిటీ న్యూరో ఆస్పత్రిలో చేరి మూడు వారాల వరకూ అక్కడే ఉన్నారు. దీంతో అదే పెద్ద సంచలనం అయింది. ఈ కేసు విచారణలో జాప్యాన్ని నిరసిస్తూ శ్రీను జైల్లోనే నిరాహారదీక్ష చేస్తానని నిరుడు హెచ్చరించాడు.  కానీ ఇప్పటికీ నిజానిజాలు తేలలేదు. నిందితుడు శ్రీనివాస్ ఇప్పటికీ జైలులోనే ఉన్నారు.. అయినా సరే ఎన్‌ఐఏ లాంటి సంస్థ ఈ కేసును తేల్చకపోవడం చర్చనీయాంశమైంది.మధ్యలో ఒకసారి బెయిల్ వచ్చినా ఎన్‌ఐఏ విజ్ఞప్తి మేరకు బెయిల్ రద్దు అయి తిరిగి శ్రీనివాస్‌ జైలులోనే రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇలా తన కుమారుడు  రిమాండ్ ఖైదీగానే ఉండిపోవడంపై శ్రీనివాస్ తల్లి సావిత్ర  గత ఐదేళ్లుగా ఆవేదన చెందుతున్నారు.  తన కుమారుడిని బెయిల్‌పై విడుదల చేయాలని కోరారు. సీఎం జగన్ స్పందించాల‌ని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ తన కుమారుడిని విడుదల చేయకపోతే ఈ వయసులో తమకు ఆత్మహత్య తప్ప మరోదారి లేదని ఆమె హెచ్చరించారు. ఎన్‌ఐఏ సంస్థ దర్యాప్తు చేపట్టినప్పటికీ ఈ కేసు ఎటూ తేలకపోవడం మిస్టరీగా ఉంది.

షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు.. వైఎస్ ఆత్మ కేవీపీ సెన్సేషనల్ కామెంట్స్!

తెలుగు రాష్ట్రాలలో ఎప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు ప్రస్తావనకు వచ్చినా అనివార్యంగా వినిపించే పేరు మరొకటి ఉంటుంది. ఆ పేరు కేవీపీ రామచంద్రరావు. వైఎస్ బతికున్నంత కాలం వారిరువూ జంటకవుల్లా ఉండేవారు. వైఎస్ రాజకీయ ప్రస్థానంలో కేవీపీ ఆయన వెంటే ఉన్నారు. కేవీపీ తనను తాను వైఎస్ ఆత్మగా  చెప్పుకునే వారు. వారిరువురి స్నేహబంధం తెలిసిన వారంతా (తెలియని వారెవరూ ఉండరనుకోండి అది వేరు సంగతి) కూడా కేవీపీని వైఎస్ ఆత్మగానే భావించే వారు. వైఎస్ కు ఇచ్చిన గౌరవం కేవీపీకి కూడా ఇచ్చే వారు. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుకా కేవీపీ సలహాలూ, సూచనలూ ఉండేవని ప్రతీతి. అటువంటి కేవీపీ వైఎస్ మరణం తరువాత ఆయన కుమారుడు జగన్ కు రాజకీయంగా మార్గదర్శకుడిగానూ, అండదండగానూ ఉంటారని అంతా భావించారు. కానీ జగన్ మాత్రం కేవీపీని దూరం పెట్టారు. జగనే దూరం పెట్టారా? జగన్ స్వభావం తెలిసి కేవీపీయే దూరం జరిగారా అన్న చర్చను కాసేపు పక్కన పెడితే..  జగన్ సొంత పార్టీ పెట్టుకుని కాంగ్రెస్ తో విభేదించినప్పుడు జగన్ పక్కన లేరు. ఆయన కాంగ్రెస్ లోనే కొనసాగారు.  ఇక ప్రస్తుతానికి వస్తే.. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు వైఎస్ కుమార్తె షర్మిల చేపట్టగానే కేవీపీ హర్షం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ లో సీనియర్లంతా షర్మిలకు పార్టీ హైకమాండ్ ఏపీ పగ్గాలను అప్పగించ డాన్నిస్వాగతిస్తున్నారని చెప్పారు. వాస్తవానికి షర్మిల కాంగ్రెస్ గూటికి చేరడం వెనుక, కాంగ్రెస్ కు మద్దతుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో అప్పటి తన పార్టీ వైఎస్సార్టీపీని పోటీకి దూరంగా ఉంచడం వెనుక ఉన్న వ్యూహమంతా కేవీపీదేనని రాజకీయ వర్గాలలో ఓ టాక్ ఉంది. అయితే కేవీపీ మాత్రం ఆ విషయంలో ఇప్పటి వరకూ నోరు విప్పలేదు. ఇప్పుడు కూడా షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించడాన్ని స్వాగతించారు. షర్మిల రాకతో ఏపీలో కాంగ్రెస్ కు పూర్వవైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  అయితే కేవీపీ జగన్ తీరు పట్ల, వైఖరి పట్ల, పాలన పట్ల అసంతృప్తిగా ఉన్నారని, జగన్ ఏపీ పగ్గాలు చేపట్టిన మూడున్నరేళ్ల తరువాత ఒక్కసారి ఒకే ఒక్కసారి ఓపెన్ అయ్యారు.  పోలవరం, విభజన హామీలు, ప్రత్యేక హోదా ఇలా ఏ విషయంలోనూ జగన్ సర్కార్ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం లేదనీ, నిలదీయకపోవడం సరే కనీసం విజ్ణప్తి కూడా చేయడం లేదని అసంతృప్తి, అసహనం వ్యక్తం చేశారు.  విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు కేంద్రం సిద్ధపడుతున్న సమయంలో దానిని ఆపేందుకు సీఎం జగన్ ఒక్క ప్రయత్నం కూడా చేయడం లేదని కేవీపీ  విమర్శించారు. అంతే అంతకు ముందు కానీ, ఆ తరువాత కానీ కేవీపీ తన ఆత్మబంధువైన వైఎస్ జగన్ కుమారుడి పాలనపై ఎటువంటి వ్యాఖ్యలూ చేయలేదు.   కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ తన ప్రాణస్నేహితుడి కుమారుడైన ఏపీ సీఎం జగన్ కు సాయం చేస్తున్నారని తనపై విమర్శలు వెల్లువెత్తినా కేవీపీ కనీసం స్పందించలేదు.  జగన్ అధికారం చేపట్టిన తరువాత ఒక్కరొక్కరుగా వైఎస్ సన్నిహితులు, స్నేహితులు, చివరికి కుటుంబ సభ్యులు ఇలా అందరూ దూరం  అయిపోయినా, కేవీపీ మాత్రం ఇంత వరకూ జగన్ కు తెరవెనుక సహాయం అందిస్తున్నారన్న ప్రచారం ఉంది. ఆ ప్రచారం, ఆరోపణలు, విమర్శలు అన్నిటినీ ఇప్పటి దాకా మౌనంగా భరించిన కేవీపీ   ఏపీలో మరికొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ   వైఎస్ షర్మిలకు మద్దతుగా బహిరంగంగా ప్రకటన ఇవ్వడం ప్రాథాన్యత సంతరించుకుంది.  వైఎస్ షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పూర్వ వైభవం సాధిస్తుందనే నమ్మకం తనకుందని చెప్పడం ద్వారా తాను జగన్ కు దూరమేనన్న విషయాన్ని సందేహాలకు అతీతంగా విస్పష్టంగా చెప్పేశారు. సో వైఎస్ ఆత్మ ఇక జగన్ పాలనకు వ్యతిరేకంగా షర్మిల నేతృత్వంలో చురుకుగా పని చేస్తారని తేటతెల్లమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో ఉద్రిక్తత!

తెలుగుదేశం వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్భంగా కృష్ణా జిల్లాలో గుడివాడలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.  దివంగత ఎన్టీఆర్ కు నివాళి అర్పించేందుకు ఆయన విగ్రహం వద్దకు వెళ్తున్న టీడీపీ, జనసేన శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. విగ్రహం వద్దకు వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. విగ్రహం వద్దకు వెళ్లకుండా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు - టీడీపీ, జనసేన శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. ఎన్టీఆర్ వర్దంతి సందర్బంగా టిడిపి ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహణకు పోలీసుల అనుమతి కోరారు. పోలీసులు సమయం ఇచ్చినప్పటికీ అదే సమయంలో వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో నివాళులు అర్పించేందుకు ఆ పార్టీ నేతలు బయలు దేరారు. దీంతో వైకాపా కార్యకర్తలు, టిడిపి జనసేన శ్రేణుల మధ్య ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా పోలీసులపై గుడివాడ టీడీపీ ఇన్ఛార్జీ వెనిగండ్ల రాము ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహం వద్దకు వెళ్లేందుకు కొడాలి నానిని అనుమతించి... తమను మాత్రం ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన తర్వాతే ఇక్కడి నుంచి వెళ్తామని చెప్పారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

అన్నా .. అందుకో వందనం!

నందమూరి తారక రామా రావు... ఎన్టీఆర్... ఈ పేరుకు ఇక వేరే పరిచయ వాక్యాలు అక్కరలేదు. నందమూరి అనగానే, అన్న ఎన్టీఆర్  అపురూప  సుందర రూపం కళ్ళ ముందు కదులుతుంది. ఒక సినిమా హీరోగా ఆయన జీవించిన పౌరాణిక పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసిన మహా నటుడు ఎన్టీఆర్. రాముడు. కృష్ణుడు, వెంకన్న దేవుడు ఇలా ప్రతి పౌరాణిక పాత్రకు  సజీవ రూపంగా నిలిచిన మహానటుడు ఎన్టీఆర్.  దైవానికి ప్రతి రూపంగా ప్రజల గుండెల్లో నిలిచి పోయిన మహోన్నత మూర్తి ఎన్టీఅర్. రాముడు ఎలా ఉంటాడంటే, ఆ నాటి  నుంచి ఈ నాటి వరకు ఏ తరం వారిని  అడిగినా  ఎన్టీఆర్ లా ఉంటాడు అంటారు. కృష్ణుడు, వేంకటేశ్వరుడు ఎలా ఉంటారంటే  అది మళ్ళీ వేరే చెప్పాలా.. ఎన్టీఆర్ లాగే ఉంటారు అంటారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమే కాదు, భారతీయ సినిమాకు సైతం ఆయనే  చిరునామా...  అలాగే రాజకీయాలలోనూ చిరస్మరణీయంగా జీవించారు. మచ్చలేని మహారాజులా నిష్క్రమించారు. అందుకే ఆయన కన్నుమూసి 28 ఏళ్ళు అయినా ఈ నాటికీ ఆయన్ని తెలుగు గుండె గుర్తుచేసుకుంటోంది.  అవును ఈరోజు ... జనవరి 18, ఎన్టీఆర్   వర్ధంతి. ఎన్టీఆర్ సినిమా రంగానికే కాదు, సమాజానికీ సేవలందించారు. ఆరు పదులకు పైగా వెండి తెరను ఏలిన ఎన్టీఆర్, తనను అంత వాడిని చేసిన తెలుగు ప్రజలకు సేవచేసే  పవిత్ర సంకల్పంతో   రాజకీయ అరంగేట్రం చేశారు.  చరిత్రను సృష్టించారు.  అటు సినిమా రంగంలో ఇంకెవరికీ అందనంత  ఎత్తుకు ఎదుగిన ఎన్టీఅర్, రాజకీయ రంగంలో ఇంకెవరికీ చిక్కని, సాధ్యం కాని విధంగా చరిత్రను సృష్టించారు.  ఆంధ్రుల ఆత్మగౌరవం నినాదంతో 1982 మార్చి 29 వ తేదీన తెలుగు దేశం జెండాను ఎగరేశారు. “నేను తెలుగు వాడిని, నాది తెలుగు దేశం పార్టీ,  నా పార్టీ తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం” అని ప్రకటించారు. ఆంధ్రుల  అన్నగా అవతారం ఎత్తారు. తొమ్మిది నెలలు తిరక్కుండానే, ఎంతో ఘన చరిత్ర ఉన్న, అంత వరకు రాష్ట్రంలో ఓటమి అన్నదే ఎరగని కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చారు. ముఖ్యమంత్రిగా 1993 జనవరి 9, అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ 10వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నిజానికి ఎన్టీఆర్ రాజకీయ జీవితం చాలా చిన్నది. నిండా పుష్కర కాలం కూడా లేదు. ఆ స్వల్ప కాలంలోనూ ఆయన అనేక ఆటు పోట్లను ఎదుర్కున్నారు. అయినా రాష్ట్ర రాజకీయాలనే కాదు దేశ రాజకీయాలనూ ప్రభావితం చేశారు. జాతీయ స్థాయిలో తెలుగు వారి ఆత్మ గౌరవ బావుటాను ఎగరేసిన ఎన్టీఆర్, కాంగ్రెస్ నియంతృత్వ పోకడలకు చెక్  పెట్టి చరిత్ర సృష్టించారు. కాంగ్రెస్  వ్యతిరేక శక్తులను ఏకం చేసి కాంగ్రెస్ తిరోగమానానికి ఆనాడే ఆయన శ్రీకారం చుట్టారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన తొలి కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా కూల్చిన ప్రధాని ఇందిరాగాంధీ (కాంగ్రెస్) ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్టీఅర్ ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం సాగించారు. సిద్ధాంత పరంగా ఉత్తర దక్షిణ దృవాల వంటి బీజేపీ, కమ్యూనిస్టులను ప్రజాస్వామ్య స్పూర్తి ధారలో  ఏకం చేశారు.  అందుకే ఎన్టీఆర్ సారథ్యంలో విజయం సాధించిన  ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం భారత ప్రజాస్వామ్య చరిత్రలో చిర స్థాయిగా, ఒక మైలు రాయిలా నిలిచి పోయింది. ఎన్టీఆర్ అనే మూడక్షరాలను మకుటం లేని మహారాజుగా చరిత్ర పుటల్లో నిలబెట్టింది.  అందుకే ఈనాటికీ  జాతీయ స్థాయి నేతలంతా ఎన్టీఆర్ ను గుర్తు చేసుకుంటున్నారు. గౌరవంగా స్మరించుకుంటున్నారు.     గత ఏడాది ఇదే రోజున ముగిసిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ  తన ప్రసంగంలో ఎన్టీఆర్‌ పేరును ప్రస్తావించారు. ప్రజా క్షేత్రంలో ఎన్టీఆర్ కింది స్థాయిలో పోరాడి అధికారంలోకి వచ్చారని కొనియాడారు. నిత్యం ప్రజలతో మమేకమై ఎన్టీఆర్‌ ముందడుగు వేశారని గుర్తు చేశారు. రాజకీయ పార్టీని స్థాపించి ఎన్టీఆర్‌ పోరాడిన తీరు స్ఫూర్తిదాయకమన్నారు. నిజానికి ఒక మోడీ అని కాదు, రాజకీయాలకు అతీతంగా జాతీయ నేతలందరూ ఎన్టీఆర్ కు ఘన నివాళులు అర్పిస్తున్నారు.  అలాగే ఎన్టీర్ శ్రీకారం చుట్టిన సంక్షేమ పథకాలు అడుగుజాడల్లోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయి. పథకాల పేర్లు మారవచ్చును కానీ, స్పూర్తి మాత్రం  అదే.  ఎన్టీఅర్ ప్రవేశ పెట్టిన రెండు రూపాయల కిలో బియ్యం, పేదలకు పక్కా ఇళ్లు, వృద్ధాప్య, వితంతు పెన్షన్లు ఇలా ఎన్నో ఎన్నెన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన మహా నేత ఎన్టీఆర్. అలాగే, పారదర్శక పాలన, ప్రజల వద్ధకే  పాలన వంటి పరిపాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు ఎన్టీఆర్. అంతే కాదు, తెలుగుంటి ఆడపడుచులకు పెద్దన్నగా మహిళలకు సమాన ఆస్తి హక్కు వంటి చట్టాలు తెచ్చారు.  నిజానికి  ఆధ్రప్రదేశ్ రాజకీయ ప్రస్థానంలో ఎన్టీఆర్  ఒక మేలి మలుపుగా నిలుస్తారు. ఎన్టీఅర్ కు ముందు ఒకటి  రెండు కులాలకే పరిమితం అయిన రాజకీయ అధికారాన్ని,అందరికీ చేరువ చేసిన సామాజిక చైతన్య స్పూర్తి ఎన్టీఆర్. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అస్థిత్వాన్ని కల్పించిన, బడుగుల అత్మబందువు ఎన్టీఆర్.  అందుకే నిబద్ధత, నిజాయితీ, నిస్వార్ధం, నిర్భీతి ప్రధాన ఆయుధాలుగా సాగిన  ఎన్టీఆర్ అనే మూడక్షరాల రాజకీయ ప్రస్థానం తెలుగుజాతి ఉన్నంతవరకు చిరస్థాయిగా నిలిచి పోతుంది. ఒక మహా నటుడిగా, ఒక మహోన్నత వ్యక్తిగా, ప్రస్వామ్య స్పూర్తి ప్రదాతగా, ఒక పరిపాలన దక్షునిగా, సంస్కరణలకు శ్రీకారం చుట్టిన చరిత్ర పురుషునిగా, పేద ప్రజల ఆరాధ్య దైవంగా...ఇలవేల్పుగా తెలుగు వారి గుండెల్లో కొలువైన విధాతగా ఎన్టీఆర్ శాశ్వతంగా ఉండి పోతారు ఎన్టీఆర్..  అన్నా ..అందుకో వందనం..

జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం వైపే!

జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లో లేనప్పటికీ తెలుగు రాజకీయాల్లో ఆయన పేరు తరచూ వినిపిస్తూ ఉంటుంది. పైగా జూనియర్ కి పాలిటిక్స్ పై మంచి నాలెడ్జ్ ఉందని, ప్రస్తుత రాజకీయాలను ఆయనెంతో శ్రద్ధగా గమనిస్తుంటాడని సన్నిహిత వర్గాలు చెబుతుంటాయి. అంతే కాదు గత కొంత కాలంగా ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేది జూనియర్ ఎన్టీఆర్ సరిగ్గా అంచనా వేస్తున్నారని ఆయన సన్నిహితుల నుంచి వినిపిస్తున్న మాట. తమిళనాడులో డీఎంకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని జూనియర్ ఎన్టీఆర్ ముందుగానే చెప్పారట. ఆయన చెప్పినట్టుగానే డీఎంకే అధికారంలోకి వచ్చింది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని చాలా రోజుల కిందటే జూనియర్ అన్నారట. ఆయన అంచనా వేసినట్టుగానే తెలంగాణలో హస్తం పార్టీ జెండా ఎగురవేసింది. ఎన్టీఆర్ పార్టీల జయాపజయాలపై కరెక్ట్ గా అంచనా వేయడం చూసి తారక్ సన్నిహితులు షాక్ అయ్యారట. అంతే కాదు ఇప్పుడు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట.  ఎందుకంటే ఈసారి ఏపీలో  తెలుగుదేశం పార్టీదే అధికారమని ఇప్పటికే తన వాళ్ళతో ఎన్టీఆర్ ఎంతో నమ్మకంగా చెప్పారట. దీంతో తమిళనాడు, తెలంగాణ తరహాలోనే ఏపీలో కూడా జూనియర్ చెప్పిన ఫలితమే వస్తుందని సన్నిహితులు గట్టి నమ్మకంతో ఉన్నారు. కాగా తారక్ అంచనా వేసినట్టుగా తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిన తరువాత, ఆ ఆనందంలో ఆయన సన్నిహితులు ఈ విషయాన్ని వారి స్నేహితులతో పంచుకున్నారు. అలా అలా  ఇది సోషల్ మీడియా అందరికీ తెలిసిపోవడమే కాకుండా, ఏపీలో వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీదే విజయం అన్న జూనియర్ ఎన్టీఆర్ జోస్యం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నిజానికి జూనియర్ కొంతకాలంగా తెలుగుదేశానికి దూరంగా ఉంటున్నాడు. తెలుగుదేశం శ్రేణులు సైతం కొన్ని విషయాల్లో తారక్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అలాంటిది ఏపీలో తెలుగుదేశం పార్టీదే అధికారమని ఎన్టీఆర్ తన సన్నిహితులతో చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయన మళ్ళీ తెలుగుదేశానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారా అన్న చర్చ ఇప్పుడు తెలుగు ప్రజలలో విస్తృతంగా జరుగుతోంది.  జూనియర్  ఎన్టీఆర్ ఉద్దేశం ఏదైనప్పటికీ ఏపీ విషయంలో ఆయన చెప్పిన జోస్యం నిజమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనడంలో సందేహం లేదు. ఎందుకంటే   జగన్ సర్కార్ పై ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుదామా అని జనం ఎదురు చూస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు సైతం ఈసారి తెలుగుదేశమే గెలుస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత రాజకీయాలను ఎప్పటికప్పుడు దగ్గరగా గమనించే ఎన్టీఆర్ వంటి వ్యక్తి ఈమాత్రం అంచనా వేయడం పెద్ద విషయమేమీ కాదు.

వోటర్ల  జాబితాలో అక్రమాలకు పాల్పడ్డ ఐఏఎస్  గిరిషాపై వేటు!

ఏపీలో ఎన్నికల సంఘం ఆదేశాలకు విరుద్ధంగా ఏకపక్షంగా వ్యవహరించిన అధికారులపై ఈసీ చర్యలకు ఉపక్రమించింది. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల నకిలీ ఓట్ల వ్యవహారంపై ఎన్నికల కమిషన్ ఆలస్యంగా చర్యలు చేపట్టింది. అప్పట్లో తిరుపతి ఆర్వోగా పనిచేసిన ప్రస్తుత అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీశా ఐఏఎస్ పై సస్పెన్షన్ వేటు వేసింది.30 వేలకు పైగా నకిలీ ఓటర్ కార్డులు  గిరీషా సృష్టించినట్లు  ఎన్నికల కమిషన్ గుర్తించింది. తిరుపతి ఉప ఎన్నికల సమయంలో నగరపాలక సంస్థ కమిషనర్ గా ఉన్న గిరీషా తన లాగిన్ ఐడి, పాస్‌వర్డ్‌లను సిబ్బందికి ఇచ్చేయడంతో ఈ అక్రమాలు జరిగాయని ఈసీ గుర్తించింది.ఓటర్ల జాబితాలో అవకతవకలు జరగొద్దు అనే ఉద్దేశ్యంతో ఎన్నికల కమిషన్  తగు మార్గదర్శకాలను రూపొందించింది.  ఓ పక్షానికి కొమ్ముగాయకుండా నిష్పాక్షపతంగా వ్యవహరించాలన్న ఈసీ ఆదేశాలను ఉల్లంఘించిన ఈ ఐఏఎస్‌పై వేటు పడింది. తొలి వేటు  అన్న మయ్య జిల్లా కలెక్టర్ గిరీషా‌పై వేటు పడింది. తిరుపతి మున్సిపల్ కమిషషనర్‌గా ఉన్న సమయంలో తన లాగిన్, పాస్‌ వర్డ్‌లను వైసీపీకి చెందిన వ్యక్తులకు అప్పగించారనే ఆరోపణలు ఉన్నాయి.తిరుపతి ఉప ఎన్నికలో గిరిషా రిటర్నింగ్ అధికారి (ఆర్వో)గా ఉన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన లాగిన్‌ ద్వారా 30 వేల ఎపిక్‌ ఓటర్ ఐడీ కార్డులు డౌన్లోడ్ చేసి, వాటి ద్వారా దొంగ ఓటర్ కార్డులను సృష్టిం చారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదులు రావడంతో ఈసీ ఆయనపై నిఘా పెట్టింది. ఆయన లాగిన్ నుంచి ఎన్ని వేల కార్డులు డౌన్లోడ్ చేశారు.. ఏయే పేర్లు మార్చారు. ఎన్నిసార్లు లాగిన్ అయ్యారో డేటా మొత్తం సేకరించింది.జనవరి 9, 10వ తేదీల్లో జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావే శంలో ఈ విషయాన్ని సీఈసీ బయటపెట్టారు. గిరిషా లాగిన్‌ నుంచి వేల ఐడీలు ఎందుకు డౌన్‌లోడ్‌ అయ్యాయని అందరి ముందు ప్రశ్నించారు. దీనిపై తనకు తెలియదని సమాధానం ఇచ్చినా ఈసీ సంతృప్తి చెందలేదు. ఈసీ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పలేకపోయారు. ఈసీ లాగిన్ మీ వద్దనే ఉందా లేదా.. ఎన్నికల సంఘం నిలదీశారు. లాగిన్ నుంచి 30 వేల మందికి సంబంధించిన కార్డులు డౌన్లోడ్ చేసిన విషయం మీకు తెలుసా అని ప్రశ్నించడంతో ఆయన మౌనం వహించారు. ఆ కార్డుల ఆధారంగా అనేక దొంగ ఓటర్ కార్డు లను సృష్టించారని ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏదైనా పార్టీ పక్షపాతం ఉంటే వెంటనే విధుల్లో నుంచి తప్పుకోవాలని హెచ్చరించింది.ఏదైనా ఉంటే ఎన్నికల తర్వాత చూసుకోవాలని, ఇప్పుడు మాత్రం తమ నిబంధనలకు లోబడి విధులు నిర్వహించాలని స్పష్టం చేసింది. సమావేశం తర్వాత గిరీషాపై ఈసీ వేటు వస్తుందని అందరూ భావించారు. అనుకున్నట్లుగానే ఈసీ ఆయన్ను సస్పెండ్ చేసింది. ఈ సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కి ముఖేష్‌ కుమార్‌ మీనాకు పంపారు.ప్రస్తుతం గిరీషా మూడు రోజుల నుంచి సెలవులో ఉన్నారు. గురువారం ఉదయం విధుల్లో చేరాల్సి ఉండగా ఈసీ సస్సెండ్ చేసింది. ప్రభుత్వం ఆయన స్థానంలో కొత్త కలెక్టర్ను నియమించాల్సి ఉంటుంది. మరికొందరి ఐఏఎస్‌, ఐపీఎస్‌లపై కూడా ఈసీ చర్యలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా రాయలసీమ జిల్లాలకు చెందిన నలుగురైదుగురు అధికారుల వివరణల ఆధారంగా ఈసీ వేటు పడుతుందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాతో పాటు చిత్తూరు, తిరుపతి జిల్లాలకు సంబంధించిన అధికారులపై ఈసీ చర్యలు ఉంటాయని భావిస్తున్నారు.