18 అసెంబ్లీ, 2 పార్లమెంట్.. జనసేన పోటీ చేసే స్థానాలివే?
తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు ఖరారై చాలా కాలమైంది. కలిసి వచ్చే ఎన్నికలలో పోటీ చేయడమూ ఖాయమైపోయింది. అయితే పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసే సీట్లెన్ని అన్న విషయంలో ఇప్పటి దాకా స్సష్టత రాలేదు. చాలా చాలా విశ్లేషణలు వినిపించాయి. అయితే ఇతమిథ్థండగా పొత్తులో భాగంగా జనసేన ఇన్ని స్థానాలలో పోటీ చేస్తుంది అన్న విషయం మాత్రం ఇప్పటికీ అధికారికంగా తెలుగుదేశం, జనసేనల నుంచి ఎటువంటి స్పష్టతా రాలేదు.
మరో వైపు అధికార పార్టీ వైసీపీ ఇప్పటికే 51 అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసేసింది. దీంతో విపక్ష టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థుల ప్రకటన ఎప్పుడా అన్న ఆసక్తి పరిశీలకులలోనే కాదు, జనబాహుల్యంలో కూడా వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జనసేన పోటీ చేసే స్థానాల విషయంలో ఇరు పార్టీలూ ఒక అంగీకారానికి వచ్చినట్లు ఆ పార్టీల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం. భోగి పండుగకు ముందు రోజు అంటే శనివారం (జనవరి 13) తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో సీట్ల సర్దుబాటు అంశంపై విస్తృతంగా చర్చ జరిగినట్లు తెలుస్తున్నది. ఈ భేటీలో తెలుగుదేశంతో పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసే స్థానాలపై ఒప్పందం కుదిరిందని తెలుస్తోంది. పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసే స్థానాలేంటి, ఎన్ని అన్నది అధికారికంగా ఇరు పార్టీల నుండి ఎలాంటి ప్రకటన రాకపోయినప్పటికీ, జనసేన పోటీ చేసే స్థానాలివే అంటూ ఓ జాబితా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
పొత్తులో భాగంగా జనసేన 18 అసెంబ్లీ స్థానాలలో రంగంలో ఉంటుందని తెలుగుదేశం, జనసేన వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ సీట్ల ఒప్పందంపైనే తాజా భేటీలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ చర్చించి ఒక అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. అయితే, దీనిపై అటు జనసేన గానీ, ఇటు తెలుగుదేశం గానీ ఇంకా స్పందించలేదు.. అలాగని ఖండించనూ లేదు. వైరల్ అవుతున్న జాబితా ప్రకారం చూస్తే జనసేన పిఠాపురం, విజయవాడ వెస్ట్, చీరాల, దర్శి, శ్రీకాకుళం, కాకినాడ సిటీ, రూరల్, తిరుపతి, మాడుగుల, పోలవరం, పెడన, నంద్యాల, అనంతపురం రూరల్, ధర్మవరం, కళ్యాణదుర్గం, పూతలపట్టు, విశాఖ, మచిలీపట్నం స్థానాలలో పోటీ చేస్తుందని అంటున్నారు. విశాఖపట్నానికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీ కృష్ణయాదవ్ తాజాగా జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈయనకు జనసేనలో టికెట్ ఇవ్వాలని నిర్ణయించగా.. వైసీపీ ఎంపీ బాలశౌరి త్వరలోనే జనసేన పార్టీలో చేరనుండగా.. ఆయనకు మచిలీ పట్నం టికెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.
ఇక పార్లమెంటు నియోజకవర్గాల విషయానికి వస్తే రెండు పార్లమెంట్ స్థానాలలో ఒకటి మచిలీపట్నం కాగా.. కసరత్తులు తర్వాత మరో పార్లమెంటు నియోజకవర్గం ఎమిటన్నది ఖరారౌతుందని అంటున్నారు. కాగా, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ నుండి పోటీ చేయనున్నారన్నది రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాలలో ఎంతో ఆసక్తి రేకెత్తించే ప్రశ్న. కాగా, పవన్ భీమవరం, గాజువాకలలో ఏదో ఒక స్థానం నుండి పోటీ చేస్తారని కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. అయితే, ఇప్పుడు కేటాయించిన స్థానాలలో అవి రెండూ లేవు. దీంతో పవన్ కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పిఠాపురంలలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే, ఒక లోక్ సభ స్థానం నుండి మెగా బ్రదర్ నాగబాబు పోటీ చేయనున్నట్లు గతంలోనే పార్టీ వర్గాలు పేర్కొనగా ఇప్పుడు కేటాయింపులలో దక్కిన మచిలీపట్నం స్థానం నుండే నాగబాబు పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఇక మరో పార్లమెంట్ స్థానం ఏదీ అనేది మరో వారం రోజులలో ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తున్నది.
కాగా, తెలుగుదేశం, జనసేన అభ్యర్థులతో కలిపి తొలి జాబితా అభర్ధులను ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. ఇందుకోసం జనసేన కూడా బలమైన అభ్యర్థులతో ఒకటీ రెండు రోజులలోనే తొలి జాబితా సిద్ధం చేయనున్నట్లు తెలుస్తున్నది. ఇక టికెట్ల వివాదాలు రాకుండా, నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుని అడుగులు వేయాలని ఇరు పార్టీల అధినేతలు నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఈ మేరకు తగిన జాగ్రత్తలు కూడా మొదలు పెట్టినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా పొత్తులు దెబ్బతినకుండా చూసుకొనేందుకు. ఇరు పార్టీల క్యాడర్ కలిసి పనిచేసేందుకు ఏం చేయాలన్నదానిపై చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తున్నది. అలాగే కమ్యూనిస్టులను కలుపుకొని వెళ్లేందుకు కూడా అంగీకారం జరిగినట్లు తెలుస్తున్నది.