టిఎస్పిఎస్ సి చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి
posted on Jan 25, 2024 @ 1:57PM
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. మహేందర్ రెడ్డి నియామకానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోద ముద్ర వేశారు. కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకానికి ఏర్పాటైన సెర్చ్ కమిటీ సూచన మేరకు ఆయన పేరును రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖరారు చేసింది. త్వరలో సభ్యుల నియామకాన్ని పూర్తి చేయనున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి చైర్మన్‌గా ఘంటా చక్రపాణి పని చేశారు. ఆ తర్వాత ఐఏఎస్ అధికారి జనార్ధన్ రెడ్డి పని చేశారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వంటి అంశాల కారణంగా చైర్మన్ జనార్ధన్ రెడ్డి, పాత సభ్యులు రాజీనామా చేశారు. వీటిని భర్తీ చేసేందుకు అర్హతగల వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. చైర్మన్‌తో సహా వివిధ పోస్టులకు దాదాపు 600 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ప్రొఫెసర్లు ఉన్నారు. తాజాగా చైర్మన్ పదవికి మహేందర్ రెడ్డి పేరును ఖరారు చేశారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ( సిఎస్) శాంతి కుమారి, న్యాయ శాఖ కార్యదర్శి తిరుపతి,సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి నిర్మలతో కూడిన స్క్రీనింగ్ కమిటీ సమావేశమై దరఖాస్తులను పరిశీలించారు.
ఛైర్మన్ పదవి కోసం మహేందర్ రెడ్డితో పాటు ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి,రెండు నెలలలో పదవి విరమణ చేయనున్న మరో ఐఏఎస్ అధికారి పేర్లను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
ముగ్గురిలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఒక్కరే తెలంగాణ ప్రాంతానికి చెందినవారు కావడంతో ఆయన ఎంపికకు ఎక్కువ అవకాశం ఏర్పడింది.
బిఆర్ఎస్ హయాంలో టిఎస్‌పిఎస్సిపై అనేక ఆరోపణలు వచ్చాయి. ప్రశ్నపత్రాల లీకేజీ, సభ్యుల నిర్లక్ష్యం,ప్రశ్నా పత్రాలలో తప్పులు కారణంగా టిఎస్పీఎస్సీ పై అనేక విమర్శలు వచ్చాయి.
అసెంబ్లీ ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే యూపీఎస్సీ తరహాలో టిఎస్పీఎస్సీ ప్రక్షాళన చేస్తామని విద్యార్దులకు, నిరుద్యోగులకు హామీనిచ్చారు.దీంతో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే టిఎస్పీఎస్సీ పై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. టిఎస్పీఎస్సీ లో ప్రతీ పరీక్ష పారదర్శకంగా నిర్వహించాలని సీఎం రేవంత్ నిర్ణయించారు.టిఎస్పీఎస్సీ ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అయింది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి యూపీఎస్సీ చైర్మన్ ను కలిసి దీనిపై ప్రధానంగా చర్చించారు. సిఎం ఆదేశాలతో అధికారులు కేరళ లాంటి రాష్ట్రాలకు వెళ్లి అక్కడ వ్యవస్థను పరిశీలించి వచ్చారు.