నీటి కోసం పాట్లు.. జగన్ పాలనలో జనం ఇక్కట్లు!
posted on Jan 27, 2024 9:13AM
అంతన్నాడు.. ఇంతన్నాడు.. చివరికి గంగలో ముంచేశాడు అంటూ జగన్ పై జనం మండి పడుతున్నారు. గత ఎన్నికల ముందు నవరత్నాలన్నారు.. అరచేతిలో వైకుంఠం చూపారు.. ఇప్పుడు మళ్లీ ఎన్నికల వేళ చేప్పినవన్నీ చేసేశామంటూ మరో చాన్స్ కోసం ఓట్లడిగేందుకు జనం ముందుకు రావడానికి రెడీ అయిపోతున్నారు. కానీ జనం మాత్రం చుక్క నీటి కోసం కన్నీటి వరదలు పారిస్తున్నారు. అరచేతిలో స్వర్గం చూపి అధికారంలోకి వచ్చిన జగన్.. ఇప్పుడు ప్రత్యక్ష నరకం చూపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీవనది కృష్ణా తీరాన ఉన్న బెజవాడలో శీతాకాలంలో జనం తాగునీటి కోసం అలమటించే పరిస్థితి వచ్చింది. ఒక్క పూట కూడా సక్రమంగా నీటి సరఫరా ఉండటం లేదు. ఆ సరఫరా చేసే అరకొర నీరు కూడా కలుషితమై ఆరోగ్యాలను గుల్ల చేస్తోంది.
ఔను.. జగన్ హయాంలో ప్రజలకు కనీసం తాగునీటికి కూడా కటకట తప్పడం లేదు. వేసవిలో తాగునీటి ఎద్దడి అంటే అర్ధం చేసుకోవచ్చు. కానీ శీతాకాలంలో అదీ జీవనది కృష్ణానదిని ఆనుకుని ఉన్న విజయవాడ మహానగరంలో తాగునీటికి కటకట ఏర్పడిందంటే అది ప్రభుత్వ నిర్లక్ష్యం, చాతకాని తనం, అస్తవ్యస్థ నీటియాజమాన్య పద్ధతులే కారణమని ప్రత్యేకంగా ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. గత రెండు వారాలుగా విజయవాడ మహానగరంలో ప్రజలు నీటి కోసం అవస్థలు పడుతుంటే ప్రభుత్వం నుంచి కానీ, అధికారుల నుంచి కానీ కనీస స్పందన లేదు. రిపబ్లిక్ దోనోత్సవం రోజున కూడా నగరంలో మద్యం ఏరులై ప్రవహించింది. కానీ నీటి చుక్క కోసం జనాలు నానా ఇబ్బందులూ పడాల్సిన పరిస్థితి తలెత్తిందంటే రాష్ట్రంలో పాలన ఎంత సుందరముదనష్టంగా సాగుతోందో అర్ధం చేసుకోవచ్చు.
గత రెండు వారాలుగా విజయవాడలో తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది. సరఫరా సమయాన్ని పూర్తిగా కుదించేసి జనం తాగునీటికి అలమటించే పరిస్థితి ఏర్పడినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదు. ప్రజలు ఖాళీ బిందెలతో ఆందోళనలకు, నిరసనలకు దిగుతుంటే ప్రభుత్వం మాత్రం నిస్సిగ్గుగా వారి ఆందోళనలను నిరసనలను అణచివేయడానికి పోలీసులను ప్రయోగిస్తోంది. విజయవాడ నగరంలో కనీసం ఒక పూట కూడా నీటిసరఫరా సక్రమంగా లేని పరిస్థితి నెలకొనడంపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. నగర వ్యాప్తంగా పలు కాలనీలు, బస్తీలలో శుక్రవారం జనం ఖాళీ బిందెలతో రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. ఒక వైపు దేశం అంతా ఘనంగా గణతంత్ర దినోత్సవాలు జరుపుకుంటుంటే.. తాము మాత్రం తాగునీటి కోసం ఆందోళనలకు దిగాల్సిన దుస్థితి వచ్చిందని వాపోయారు.
అరకొరా సరఫరా చేసే నీరు కూడా కలుషితంగా ఉంటోందనీ, హెడ్ వాటర్ వర్క్స్ లో నీటి శుద్ధి అన్న విషయాన్నే మరచిపోయారన్నట్లుగా పరిస్థితి తయారైందని ప్రజలు విమర్శిస్తున్నారు. కృష్ణానది నీటిలో సాంద్రత, కాలుష్యం పెరిగిందని చెబుతున్న అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడంలో మాత్రం చేతులెత్తేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులంతా ప్రభుత్వ సేవలో తరిస్తూ ప్రజల కష్టాలను విస్మరిస్తున్నారనీ, ఇక ప్రజా ప్రతినిథులైతే ప్రజల కష్టాలను పట్టించుకోవడం మానేసి నాలుగున్నరేళ్లయ్యిందని విమర్శిస్తున్నారు. జగన్ పార్టీలో ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిథులకు దోచుకోవడం, దాచుకోవడం మీద ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యల పరిష్కారంపై లేదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాటర్ చార్జీలు, ఆస్తి పన్నుల పెంపు, చెత్తపై టాక్స్ విధించి వాటిని కట్టడంలో ఆలస్యమైన వారిపై భారీగా పెనాల్టీలు వసూలు చేస్తున్న జగన్ సర్కార్ ప్రజల కష్టాల విషయంలో మాత్రం కనీసం స్పందించడలేదని జనం మండిపడుతున్నారు.
నీటి మీటర్ల ఏర్పాటులో చూపుతున్న అత్యుత్సాహం నీటి సరఫరా విషయంలో ఎందుకు లేదని నిలదీస్తున్నారు. ఎన్నికలు, టికెట్ల కేటాయింపు, అంతర్గత కుమ్ములాటలలో మునిగి తేలుతున్న వైసీపీ నేతలకు ప్రజల కష్టాలు పట్టడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు, నగరపాలక సంస్థ అధికార యంత్రాంగం సక్రమంగా తాగునీటి సరఫరాపై దృష్టి పెట్టకుంటే ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.