పోటా పోటీ ప్రచారాలతో వేడెక్కిన ఎపి పాలిటిక్స్
posted on Jan 27, 2024 @ 10:46AM
ఏపీలో ప్రధాన పార్టీల నేతల వరుస సభలు, కార్యక్రమాలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. టీడీపీ అధినేత చంద్రబాబు 'రా.. కదలిరా' పేరుతో బహింరంగ సభలను నిర్వహిస్తున్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జిల్లాల పర్యటనలు నిర్వహిస్తున్నారు. సీఎం జగన్ కూడా ఈరోజు భీమిలిలో సభకు హాజరయ్యారు. దీంతో, రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల హడావుడి కనిపిస్తోంది.
టీడీపీ అధినేత చంద్రబాబు నేడు చిత్తూరు జిల్లా పీలేరు, అనంతపురం జిల్లా ఉరవకొండలో పర్యటించారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరిన ఆయన తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో పీలేరుకు చేరుకుని బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు ఉరవకొండకు చేరుకుని అక్కడి సభలో ప్రసంగిస్తారు. అనంతరం తిరుగుపయనమవుతారు.
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈరోజు మూడు జిల్లాల్లో పర్యటించారు. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశంలో పాల్గొని ఆమె ప్రసంగించారు. కేత్ర స్థాయిలో ఆమె పార్టీ శ్రేణులను యాక్టివ్ చేసే పనిలో ఉన్నారు. వైఎస్ షర్మిల చేపట్టిన జిల్లాల పర్యటన ఈ నెల 23 నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ప్రారంభమై..ఈ నెల 31న కడప జిల్లాలో ముగుస్తుంది. తొలిరోజున శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో షర్మిల పర్యటించారు. శనివారం కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పర్యటించారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రణాళికలు రచిస్తూ ముందుకు వెళ్తున్నారు. . త్వరలో చివరి విడత జాబితా విడుదలపై కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 27 న ఉత్తరాంధ్ర లోని భీమిలిలో మొదటి బహిరంగ సభలో జగన్ పాల్గొన్నారు. మొత్తం 26 జిల్లాలకు కలిపి అయిదు చోట్ల బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు.ఫిబ్రవరి 10 వ తేదీ లోగా అన్ని సభలను పూర్తి చేసేలా షెడ్యూల్ రూపొందించారు.