అజారుద్దీన్ రిటైర్డ్ హర్ట్.. కాంగ్రెస్ ను వీడనున్న మాజీ క్రికెటర్.. బీఆర్ఎస్ గూటికేనా?
posted on Jan 27, 2024 @ 10:24AM
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేయనున్నారా? తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో చివరి నిముషంలో కాంగ్రెస్ పార్టీ ఆయనకు జూబ్లీ హిల్స్ టికెట్ కేటాయించింది. ఆఖరి ఆప్షన్ గా అజారుద్దీన్ కు పార్టీ టికెట్ కేటాయించినా, ఆయన గట్టిగా నిలబడ్డారు. స్వల్ప తేడాతో పారజయం పాలయ్యారు. అయితే గెలుపు అవకాశాలు ఇసుమంతైనా లేని స్థానాన్ని తనకు కేటాయించారని అప్పట్లోనే అజారుద్దీన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ నుంచి పెద్దగా అండ లేకపోయినా, తన వ్యక్తిగత ఇమేజ్ తోనే ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చారు.
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటికీ.. రాష్ట్ర పార్టీలో ఆయనకు తగినంత గుర్తింపు లభించలేదన్న అసంతృప్తితో ఉన్న అజారుద్దీన్ పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా దేశానికి చిరస్మరణీయమైన విజయాలను అందించడమే కాకుండా అరంగేట్రం సిరీస్ లోనే వరుసగా మూడు సెంచరీలతో వరల్డ్ రికార్డ్ సృష్టించి క్రికెట్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు.
అటువంటి అజారుద్దీన్ పుట్టి పెరిగింది తెలంగాణలోనే అయినా ఆయన కాంగ్రెస్ గూటికి చేరిన తరువాత పార్టీ ఏం ఆదేశిస్తే అదే చేశారు. ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ మారు మాట్లాడకుండా పోటీ చేశారు. ఆ క్రమంలో జయాపజయాలను ఎదుర్కొన్నారు. దశాబ్దాలుగా పార్టీలో ఆయనకు తగిన గుర్తింపు లభించినా, లభించకున్నా కాంగ్రెస్ ను మాత్రం వీడలేదు. 2009 సార్వత్రిక ఎన్నికలలో యూపీలోని మొరదాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆ తరువాత పార్టీ ఆయనను రాజస్థాన్ లోని టోంక్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయమని ఆదేశిస్తే మారు మాట్లాడకుండా అక్కడకు వెళ్లి పోటీ చేశారు. ఆ ఎన్నికలలో అజారుద్దీన్ పరాజయం పాలయ్యారు. ఆ తరువాత స్వరాష్ట్రానికి వచ్చి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పోటీ చేసి విజయం సాధించారు. తాజాగా తెలంగాణలోని జూబ్లీహెల్స్ అసెంబ్లీ నియోజవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అయితే ఇంత కాలంగా పార్టీ ఆదేశాలను తూ.చ. తప్పకుండా పాటిస్తూ పార్టీకి విధేయుడిగా ఉన్నా తనకు తగినంత గుర్తింపు రాలేదన్న అసంతృప్తితో ఆయన ఉన్నారని చెబుతున్నారు. ఏదో ఒక కోటాలో ఎమ్మెల్సీ పదవి కోసం ఆశపడిన ఆయనకు కాంగ్రెస్ మొండి చేయి చూపడంతో ఇక చేయి వదిలేయడమే బెటర్ అని అజారుద్దీన్ భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికీ, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ కూడా రాజీనామా చేయాలని అజారుద్దీన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
రాజీనామా తరువాత భవిష్యత్ కార్యాచరణపై ఆయన అలోచిస్తారని చెబుతున్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు ఉండటంతో ఆయన చేరాలనుకుంటే స్వాగతించని పార్టీ ఉండదన్న విశ్వాసాన్ని ఆయన సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు. అయితే అజారుద్దీన్ మాత్రం ఇక తన కార్యక్షేత్రం తెలంగాణ అని నిర్ణయించుకోవడం వల్లనే ఆయనకు కాంగ్రెస్ లో ప్రియారిటీ తగ్గిందని అంటున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉండగా వచ్చిన ఆరోపణల కారణంగా అప్పట్లో ఆయన ఇమేజ్ కొంత మసకబారింది. ఆ కారణంగానే రాష్ట్రంలో ఆయనకు పెద్దగా మైలేజ్ ఉండదన్న అభిప్రాయం కాంగ్రెస్ హై కమాండ్ లో వ్యక్తం అవుతోందనీ, ఆ కారణంగానే తెలంగాణ పాలటిక్స్ లో అజారుద్దీన్ ను ప్రమోట్ చేయడం వల్ల ప్రయోజనం ఉందని కాంగ్రెస్ హై కమాండ్ భావిస్తోందన్నది పరిశీలకుల విశ్లేషణ.
అయితే అజారుద్దీన్ మాత్రం తెలంగాణ రాజకీయాలలోనే ఇక తన ప్రస్థానం అని తేల్చి చెప్పడంతో ఆయన విధేయతను దృష్టిలో ఉంచుకుని చివరి నిముషంలో జూబ్లీ హెల్స్ నుంచి పోటీకి అవకాశం కల్పించారని అంటున్నారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం పెద్దగా సుముఖంగా లేకపోయినప్పటికీ హై కమాండ్ నిర్ణయం కారణంగానే ఆయనకు ఇటీవలి జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేసే అవకాశం దక్కిందని పరిశీలకులు చెబుతున్నారు. ఆ ఎన్నికలలో పరాజయం మూటగట్టుకోవడంతో ఇక అజారుద్దీన్ కు ఏదో ఓ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చే విషయంలో కానీ, వచ్చే సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రం నుంచి లోక్ సభకు పోటీ కి అవకాశం ఇవ్వడంలో కానీ హై కమాండ్ పూర్తిగా రాష్ట్ర నాయకత్వానికి వదిలేసింది. దాంతో సహజంగానే అజారుద్దీన్ ను కాంగ్రెస్ నాయకత్వం అసలు పరిగణనలోనికే తీసుకోలేదని అంటున్నారు.
ఇప్పుడు అజారుద్దీన్ కు తెలంగాణలోనే తన రాజకీయ ప్రస్థానం కొనసాగించాలంటే బీఆర్ఎస్ గూటికి చేరి అదృష్టాన్ని పరిశీలించుకోవడం అనే ఆప్షన్ మాత్రమే ఉందని పరిశీలకులు అంటున్నారు.