షర్మిల చెబితే సరిపోదా.. విజయమ్మతో కూడా కుటుంబాన్ని జగన్ చీల్చారని చెప్పిస్తారా సజ్జలా?
posted on Jan 26, 2024 9:20AM
మా కుటుంబం చీలిపోవడానికి జగనన్నే కారణమని వైఎస్ షర్మిల కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నా.. వైసీపీకి చెవికెక్కడం లేదు. పిడుక్కీబియ్యానికీ ఓకే మంత్రం అన్నట్లు తమ పార్టీ అధినేత తప్పులకు, అక్రమాలకు, అన్యాయాలకు అన్నిటికీ చంద్రబాబే కారణమన్న ప్రచారం తప్ప వారికి చెప్పుకోవడానికి ఏమీ లేకుండా పోయింది. సొంత తప్పిదాలతో తమ గొయ్యి తామే తీసుకుంటూ కూడా చంద్రబాబు గొయ్యి తీసి తమను పాతేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు.
షర్మిల ఇప్పుడు కాదు ఎప్పుడో జగన్ తో విభేదించారు. తెలంగాణకు వెళ్లి సొంత పార్టీ పెట్టుకున్నారు. ఇప్పుడు ఆమె తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేసి ఆ పార్టీ ఏపీ బాధ్యతలు చేపట్టారు. అందులో వైసీపీ నాయకులకు చంద్రబాబు ప్రమేయం ఏం కనిపించిందో వారికి తప్ప మరొకరికి అర్ధం కాదు. వైఎస్సార్టీపీ అధినేత్రిగా ఉన్న సమయంలో కూడా షర్మిల నేరుగా జగన్ పై ఆరోపణలు చేశారు. వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో ఆమె హస్తిన వెళ్లి మరీ వాంగ్మూలం ఇచ్చిన సందర్భంగా అక్కడ మీడియా ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలలో జగన్ పై కూడా విసుర్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు జగన్ చెబుతున్నట్లు ఆమె కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తరువాత కుటుంబం విడిపోలేదు. ఏపీ సీఎంగా జగన్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ఆయన తీరు కారణంగానే చెల్లి, ఆ తరువాత తల్లి ఆయనతో విభేదించి బయటకు వచ్చేశారు. అప్పటి నుంచీ తల్లి, చెల్లితో జగన్ కు సత్సంబంధాలు లేవన్న విషయం రహస్యమేమీ కాదు.
అప్పుడు వారిని ఉద్దేశపూర్వకంగా దూరం చేసి, ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రం నుంచి తరిమేసింది జగనే కానీ కాంగ్రెస్ కాదు. సరే విభేదాలతో విడిపోయిన తరువాత ఆమె రాజకీయం ఆమెను చేసుకోనియకుండా తెలంగాణలో అడుగడుగునా ఆంక్షలు పెట్టారు. ఆమెకు ఎటువంటి సహాయ సహకారాలూ అందకుండా చేశారు. ఇవన్నీ ఎవరో జగన్ అంటే కిట్టని వారు చేసిన విమర్శలు కాదు.. స్వయంగా ఆ కుటుంబానికి సన్నిహితులే వెల్లడించిన విషయాలు. ఇలా తన విజయం కోసం శక్తికి మించి కృషి చేసిన సొంత చెల్లి షర్మిలను ఆ తరువాత కూరలో కరివేపాకులా విసిరి పారేశారు. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ సారథిగా బాధ్యతలు చేపట్టగానే వ్యక్తిగత అంశాలను.. కుటుంబ అంశాలను మొదట ప్రస్తావించినది జగనే. జగన్ వ్యాఖ్యలకు, విమర్శలకు షర్మిల దీటుగా బదులివ్వడంతో తాడేపల్లి అంత:పుర రహస్యాలు బయటకు వచ్చే పరిస్థతి వచ్చింది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ అసలు వైఎస్ కుటుంబంలో ఏం జరుగుతోందన్న చర్చే హాట్ టాపిక్ గా మారిపోయింది.
షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు తన కుటుంబం చీలిందని గుండెలు బాదుకోని జగన్ రెడ్డి.. ఆమె కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ ఏపీ సారథ్య బాధ్యతలు చేపట్టగానే కుటుంబం చీలపోయిందనీ, దీని వెనుక చంద్రబాబు ఉన్నారనీ గోలగోల చేస్తున్నారు. అయితే కుటుంబాన్ని జగన్ రెడ్డే చీల్చేశారని స్వయంగా షర్మిల కుండబద్దలు కొట్టేశారు. ఇందుకు తల్లే విజయమ్మే సాక్ష్యామని బాంబు పేల్చారు. అసలు ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా షర్మిల వ్యక్తిత్వ హననానికి పాల్పడింది. ఇష్టారీతిగా ఆమె వ్యక్తిగత జీవితంపై పుంఖాను పుంఖాలుగా కథనాలు వండి వారుస్తోంది. చివరికి ఆమెను షర్మిలా శాస్త్రి అనడానికి కూడా వైసీపీ సోషల్ మీడియా వింగ్ వెనుకాడలేదు. ఆ వింగ్ కు సకల శాఖల మంత్రి సజ్జల కుమారుడు అధిపతి అన్న సంగతి తెలిసిందే.
ఇప్పడు వైఎస్ కుటుంబాన్ని చీల్చింది జగనన్నే అంటే వైఎస్ షర్మిల అనగానే.. స్వయంగా సజ్జల రంగంలోకి దిగారు. షర్మిల చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతోందంటూ గగ్గోలు పెట్టేశారు. అసలు షర్మిలకు జరిగిన అన్యాయమేమిటో చెప్పాలంటూ రివర్స్ అటాక్ మొదలెట్టేశారు. అంతే కాకుండా షర్మిల మాట్లాడిన ప్రతి మాటకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని.. ఆమె పొంతన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. అసలు షర్మిలకు జరిగిన అన్యాయం ఏమిటో తలియడం లేదంటూ మాయకత్వం ప్రదర్శించారు. ఏపీ పాలిటిక్స్ పై షర్మిలకు అవగాహన లేదనీ, అందుకే చంద్రబాబు స్క్రిప్ట్ బట్టీపట్టి చదువుతోందని విమర్శించారు. కాళ్లరిగేలా తిరగడమే కాకుండా జగన్ కోసం గత ఎన్నికలలో విస్తృత ప్రచారం చేసిన షర్మిలకు ఏపీ పాలిటిక్స్ పై అవగాహన లేదనడం ద్వారా మరింత సజ్జల ఆమెను మరింత రెచ్చగొట్టారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో ఇక ముందు షర్మిలతో పాటు తల్లి విజయమ్మ కూడా కుటుంబ వ్యవహారాలపై మాట్లాడక తప్పని పరిస్థితిని సజ్జల స్వయంగా తీసుకు వచ్చారని అంటున్నారు. వైసీపీ గౌరవాధ్యక్ష పదవికి విజయమ్మ రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆమె స్వయంగా బయటకు వచ్చి చెబితే.. ఆమె కూడా చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతున్నారని ఆరోపించగలరా? అని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా షర్మిలపై అనుచిత వ్యాఖ్యలు, విమర్శల ద్వారా వైసీపీ పరిస్థితి పతనం నుంచి పతనానికి జారిపోతోందని అంటున్నారు.