హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అరెస్ట్
posted on Jan 25, 2024 @ 12:34PM
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు హెచ్ఎండీయే మాజీ రైరెక్టర్ శివబాలకృష్ణకు గురువారం (జనవరి 25)అరెస్టు చేశారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరు పరిచారు. కాగా బుధవారం (జనవరి 24) ఏసీబీ అధికారులు హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇళ్లు, కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు చేసిన సంగతి తెలిసిందే.
ఏసీబీ అధికారులు ఏకకాలంలో 17 చోట్ల జరిపిన దాడుల్లో సంచలన ఏకంగా రూ.100 కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించారు. అయితే అవే కాకుండా మరో వంద కోట్లకు పైగా ఆస్తులు శివబాలకృష్ణ అక్రమంగా కూడబెట్టి ఉంటారని అనుమానిస్తున్న ఏసీబీ అధికారులు గురువారం కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. హైదరబాద్‌లో విల్లాలు, ప్లాట్లతో పాటు.. హైదరాబాద్ శివారులో భారీగా భూములను కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు.
హైదరాబాద్ చుట్టుపక్కల 100 ఎకరాల భూపత్రాలను అధికారులు సీజ్ చేశారు. ఇవి కాకుండా ఖరీదైన వాచీలు, ఐ ఫోన్లు, ఇంకా కల్వకుర్తిలో 26 ఎకరాలు, జనగామలో 24 ఎకరాలు, యాదాద్రిలో 23, కొడకండ్లలో 17 ఎకరాల పత్రాలను అధికారులు సీజ్ చేశారు.