యుద్ధానికి ముందే వైసీపీ అస్త్రసన్యాసం!
posted on Jan 26, 2024 @ 10:18AM
ఎక్కడైనా ఎన్నికల ముందు అధికార పార్టీలో ధీమా కనిపిస్తుంది. అభ్యర్థుల ప్రకటన, ప్రచార వ్యూహాల విషయంలో ఎటువంటి ఇబ్బందులూ లేకుండా సాఫీగా చేసుకోవడానికి సావకాశం ఉంటుంది. ఇక ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు పార్టీకి లబ్ధి జరిగేందుకు వీలుగా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను ప్రకటించేందుకు, గతంలో ఇచ్చి, ఇంకా నెరవేర్చని హామీలను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. అభివృద్ధి పనులను వేగం చేస్తుంది. అసంతృప్తి ఉన్న వర్గాలను బుజ్జగించేందుకు అవసరమైన చర్యలు చేపడుతుంది. కోడ్ కూయకముందే అన్నీ చక్కబెట్టుకుని ఎన్నికలకు సిద్ధమైపోతుంది. కానీ విచిత్రంగా ఏపీలో అధికారంలో ఉన్న జగన్ పార్టీ మాత్రం సరిగ్గా ఎన్నికలకు ముందు సమస్యలు సృష్టించుకుని, వాటిని పరిష్కరించడం ఎలాగో తెలియక దిక్కు తోచని స్థితిలో పడింది.
ఎన్నికలకు ముందే ఓటమిని ఖరారు చేసుకుని, ఆ విషయాన్ని బాహాటంగా ప్రకటించేస్తోంది. ఓడిపోయినా హ్యాపీగానే ఉంటాను అంటూ స్వయంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలను బట్టే ఆ పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా మారిపోయిందో అర్ధమౌతుంది. సిట్టింగులను మార్చేస్తున్నామంటూ జగన్ చేపట్టిన ప్రయోగం.. వైసీపీ విజయావకాశలను దాదాపు మృగ్యం చేసేసింది. సీటు మారిన ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. టికెట్ దక్కిన నేతలు పోటీకి విముఖత చూపుతున్నారు. అసలు వైసీపీ అధినేత జగన్ ప్రజల నమ్మకాన్నే కాదు, పార్టీ నాయకులు, కార్యకర్తల నమ్మకాన్ని కూడా కోల్పోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
నాలుగు జాబితాలు విడుదల చేసి ఐదో జాబితాకు జగన్ సమాయత్తమౌతున్న సమయంలో పార్టీలో అత్యథికులకు పోటీపైనే ఆసక్తి పోయింది. వచ్చే ఎన్నికలలో పోటీకి అవకాశం వస్తే మంచిదే.. రాకపోతే మరీ మంచిది అన్న భావన మెజారిటీ ఎమ్మెల్యేలలో వ్యక్తం అవుతున్నాది. నియోజకవర్గం మారుతుందా? పోటీకి అవకాశం ఉంటుందా అన్న టెన్షన్ దాదాపు ఎవరిలోనూ కనిపించడం లేదు. అంతర్గత సంభాషణల్లో పోటీ చేసినా ఎటూ గెలవలేని పరిస్థితి ఉన్నప్పుడు టికెట్ వస్తే ఎంత రాకపోతే ఎంత అంటున్నారు.
ఇక ఇప్పటికీ జగన్ భజన చేస్తున్న వారెవరైనా ఉన్నారంటే... ఈ నాలుగున్నరేళ్ల కాలంలో జగన్ ప్రాపకం కోసం విపక్ష నేతలపై ఇష్టారీతిగా బూతులు, అనుచిత వ్యాఖ్యలతో విరుచుకుపడిన వారు మాత్రమే. ఇంతగా నోరు పారేసుకున్న తమకు మరే పార్టీలోకి ప్రవేశానికి అవకాశం ఉండదని డిసైడైపోవడం వల్లే వారు ఇప్పటి వరకూ జగన్ తో అంటకాగుతున్నారు. ఇక ముందు ఆ పరిస్థితి కూడా ఉండదని పరిశీలకులు అంటున్నారు. షర్మిల ఎంట్రీతో గెలుపుఓటములతో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీలో చేరిపోతే గౌరవమైనా దక్కుతుందని జగన్ కు వీరభక్త హనుమాన్ లుగా గుర్తింపు పొందిన వారు కూడా యోచిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆర్కేను ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. మల్లాదితో మొదలు పెడితే గోరంట్ల మాధవ్ వరకూ పలువురు నేతల చూపు ఇప్పుడు కాంగ్రెస్ వైపు ఉందంటున్నారు. మంత్ర గుమ్మనూరు ఇప్పటికే కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లారు. ఆయనకు కర్నూలు ఎంపీగా పోటీ చేయమని జగన్ ఆదేశించినా నో చెప్పేసి.. పార్టీకి అందుబాటులో లేకుండా పోయారు. నేడో రేపో హస్తం గూటికి చేరడం ఖాయమని అంటున్నారు.
అలాగే సొంత బంధువు అయిన బాలినేని కూడా వైసీపీకి రాజీనామా చేయడం చిటికెలో పని అని బెదరింపులకు దిగుతున్నారంటే.. పార్టీగా వైసీపీ, వైసీపీ అధినేతగా జగన్ ఎంత బలహీనం అయిపోయారో అవగతమౌతుంది. వైనాట్ 175 అన్న నోటితోనే జగన్ వచ్చే ఎన్నికలలో పరాజయం పాలై పదవి కోల్పోయినా తానేం బాధపడను అన్నారంటేనే పార్టీ విజయావకాశాలు మృగ్యమైపోయాయని ఆయనకు అర్ధమైందని స్పష్టమౌతోంది. అధినేతే చేతులెత్తేస్తే ఇక ఆ నాయకుడిని నమ్మి పార్టీ శ్రేణులు వచ్చే ఎన్నికలలో పని చేసే అవకాశాలు ఉండవని విశ్లేషిస్తున్నారు. సో యుద్ధం మొదలు కాకుండానే వైసీసీ అస్త్రసన్యాసం చేసేసిందని అంటున్నారు.