ధరణి రద్దు కాదు మార్పులే ?
posted on Jan 25, 2024 @ 11:01AM
మేం అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలిపేస్తాం. భూమాత పేరుతో కొత్త పోర్టల్‌ను తీసుకొస్తాం ఎన్నికల ప్రచారంలో రేవంత్‌రెడ్డి సహా ముఖ్యనేతలంతా చేసిన ప్రచారం ఇది. వాస్తవానికి అలా విసిరేయడం అసాధ్యమని తెలుస్తోంది.కాబట్టే, అవసరమైన మార్పుచేర్పులు చేసి పేరును భూమాత గా మార్చాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ధరణి పునర్నిర్మాణ కమిటీ పేరుతో ఇటీవల ఏర్పాటైన కమిటీ కూడా పోర్టల్‌లో అవసరమైన మార్పు చేర్పులు మాత్రమే సూచిస్తుందని సమాచారం. పోర్టల్‌ను పటిష్టతకు అధ్యయనం చేస్తున్నట్టు సోమవారం కమిటీ సభ్యులు ప్రకటించారు. ప్రభుత్వానికి త్వరలోనే మధ్యంతర నివేదిక సమర్పిస్తామని తెలిపారు.ప్రస్తుత డిజిటల్ యుగంలో అవసరాలకు అనుగుణంగా ధరణి పోర్టల్‌ను నిర్మించారని, దీనిని రద్దు చేసి మళ్లీ పాత పద్ధతికి వెళ్లలేమని నిపుణులు ప్రభుత్వానికి స్పష్టం చేసినట్టు సమాచారం. కొత్త పోర్టల్ కోసం సాఫ్ట్‌వేర్ తయారీ, డాటా అప్‌లోడ్, సర్వర్లు, నిర్వహణ.. ఇలా ఎంతో శ్రమతోపాటు ఖర్చు కూడా తడిసి మోపెడవుతుందని చెప్పినట్టు తెలిసింది. ఒకవేళ కొత్త పోర్టల్ తెచ్చినా కొత్త సీసాలో పాత సారా మా దిరిగా మళ్లీ ధరణి నుంచే డాటాను అనుసంధానం చేయాలని స్పష్టం చేసినట్టు సమాచారం.
ఒకవేళ కొత్త డాటా కావాలంటే రికార్డుల ప్రక్షాళన తరహాలో రాష్ట్రమంతటా ప్రత్యేక కార్యక్ర మం నిర్వహించి, వచ్చిన సమాచారాన్ని మళ్లీ డాటా ఎంట్రీ చేయాల్సి వస్తుంది. అప్పుడే మాత్రమే కొత్త పోర్టల్ తయారవుతుందని పునర్నిర్మాణ కమిటీ అభిప్రాయపడుతోంది. కాబట్టి ఇదంతా అసాధ్యమని, ఉన్న పోర్టల్‌లోనే మార్పులు చేస్తే చాలని కమిటీ సూచిస్తోంది
ఆంధ్రప్రదేశ్ తరహాలో రాష్ట్రం మొత్తం సమగ్ర సర్వే చేసి, పక్కా రికార్డులు రూపొందించడం, లేదా కర్ణాటక మా దిరిగా లావాదేవీలు జరిగిన ప్రతిసారి సర్వేతో డిజిటలైజ్ చేసి రికార్డులను అప్‌డేట్ చేయడం వంటివి చేపట్టాలని అభిప్రాయపడ్డట్టు తెలిసింది. ధరణిలో క్రయవిక్రయాల విధానం అద్భుతంగా ఉన్నదని, క్షణాల్లోనే భూ హక్కుల మార్పిడి జరిగి, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ జరగడం వంటివి ఉన్నట్లు కమిటీ స్పష్టం చేసినట్టు సమాచారం.ప్రస్తుతం ధరణి పోర్టల్‌ను ఓపెన్ చేయగానే అగ్రికల్చర్ పేజీ కనిపిస్తుంది. దానిని క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో ఎడమవైపు ట్రాన్సాక్షన్ మాడ్యూల్స్ ఉంటాయి. ప్రస్తు తం 35 ఉన్నాయి. కుడివైపు 10 ఇన్ఫర్మేషన్ మాడ్యూల్స్ కనిపిస్తాయి. మాడ్యూల్స్‌లో మార్పు లు, చేర్పులు చేసే సమయంలోనే ఈ లేఔట్‌లో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. మొదటి పేజీలోనే మూడు లేదా నాలుగు బటన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
సర్వీసెస్ పేరుతో క్రయవిక్రయాల మా డ్యూల్స్ అన్నీ ఒకే చోటికి చేర్చాలని, గ్రీవెన్స్ పేరుతో దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన మాడ్యూల్స్‌ను కలపాలని, ఇన్ఫర్మేషన్ పేరుతో ఇన్ఫర్మేషన్ మాడ్యూల్స్ అన్నీ ఒకే గొడుగు కిందికి తేవాలని, ఇతర మాడ్యూల్స్, ఆప్షన్లను అదర్స్ లో చేర్చాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఉన్న ఆకుపచ్చ రంగుకు బదులుగా కాంగ్రెస్‌ను గుర్తు చేసేలా రంగులు మార్చాలని, పేరును కూడా భూమాతగా మార్చి కొత్తగా లాంచ్ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది.