ఎన్ ఆర్ ఐ యశ్ కు హైకోర్టులో బిగ్ రిలీఫ్ 

ఎన్ఆర్‌ఐ, టీడీపీ నేత యాష్ బొద్దులూరుపై వైసీపీ ప్రభుత్వం  జారీ చేసిన లుక్ ఔట్ నోటీసులను  హైకోర్టు రద్దు చేసింది.  దీనిపై ఈరోజు  హైకోర్టులో విచారణ జరిగింది. యాష్ తరపున న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. ఇప్పటికే సీఐడీ అధికారులు యాష్‌కు 41A క్రింద నోటీసులు జారీ చేశారని కోర్ట్ దృష్టికి తీసుకొచ్చారు.తల్లికి అస్వస్థత ఉండటంతో యశ్ గత నెలలో ఇండియా వచ్చారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఎపి పోలీసులు మాటు వేసి అరెస్ట్ చేశారు. నాలుగున్నర సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న టిడిపి నేత యశ్ ను వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఆయనపై జారీ చేసిన లుకౌట్ నోటీసులను హైకోర్టు రద్దు చేసింది. ఫిభ్రవరి నాలుగో తేదీన యశ్ అమెరికా వెళ్లడానికి షరతులతో కూడిన అనుమతిని హైకోర్టు ఇచ్చింది. 

తృటిలో తప్పిన ప్రమాదం...నారా భువనేశ్వరి సేఫ్ 

మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరికి తృటిలో ప్రమాదం తప్పింది.  మంగళవారం ఆమె హైదరాబాద్ నుండి గన్నవరానికి ఇండిగో విమానంలో బయలుదేరారు. గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకున్న ఈ విమానంలో ల్యాండింగ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. సరిగ్గా విమానం ల్యాండింగ్ సమయంలో వీల్ తెరుచుకోలేదు. విషయాన్ని తెలుసుకున్న పైలట్ విమానాన్ని మళ్లీ టేకాఫ్‌ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. కాసేపు గాల్లో ఎగిరిన తరువాత తిరిగి వీల్ బయటకు రావడంతో సేఫ్‌ ల్యాండింగ్ చేశారు పైలట్. ఈ విమానంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో పాటు అధికారులు, ప్యాసింజర్లు ప్రయాణించారు. పైలట్ అప్రమత్తమై ప్రమాదం నుంచి తప్పించడంతో అందులో ప్రయాణిస్తున్న వారు ఊపిరిపీల్చుకున్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం వెళ్తున్న విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

రేవంత్ సర్కార్ కు బిగ్ షాక్.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమితులైన ఇరువురి ప్రమాణ స్వీకారానికీ హైకోర్టు బ్రేక్ వేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ప్రమాణ స్వీకారం చేయవద్దని ఆదేశించింది. గవర్నర కోటాలో ఎమ్మెల్సీలుగా  ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ లను రేవంత్ రెడ్డి ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.  వీరిరువురి నియామకానికీ గవర్నర్ తమిళిసై గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  అయితే వీరి నియామకాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ కుమార్, సత్యనారాయణలు హైకోర్టును ఆశ్రయించారు.   దీంతో వీరిరువురూ తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.  

ముద్రగడకు గవర్నర్ గిరి.. రాజ్యసభకు చిరు.. జగన్ తో బీజేపీ క్విడ్ ప్రోకో గేమ్!

ఇటు నుంచి కాకపోతే అటు నుంచి నరుక్కు రావాలన్నది నానుడి. ఏపీలో బీజేపీ అదే పని చేస్తోందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. వాస్తవానికి ఏపీలో బీజేపీకి బలం శూన్యం. కనీసం ఒక్కశాతం ఓటు స్టేక్ కూడా లేదు. ఆ విషయాన్ని హుందాగా అంగీకరించడానికి ఆ పార్టీకి అహం అడ్డువస్తోంది. పరాన్న జీవిలా పక్క వాళ్ల ను బలహీనపరిచి తాను బలపడాలన్న కుయుక్తులకు తెర తీస్తోంది. ఏపీలో అత్యంత బలంగా ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం మాత్రమే.  ప్రస్తుతం అధికారంలో ఉన్నా.. గత ఎన్నికలలో 151 స్థానాలలో విజయం సాధించినా జగన్ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో ఎదురీదుతోంది. అన్ని వర్గాల నుంచీ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోంది. సొంత పార్టీలోనే అసంతృప్తి ఆ పార్టీని దావాలనంలా దహించేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ  ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల పగ్గాలు చేపట్టిన తరువాత వైసీపీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది.  వైనాట్ 175 అన్న ధీమా నుంచి ఓడిపోయినా బాధపడను అని జగన్ స్వయంగా అంటున్నారంటేనే ఆ పార్టీ పరిస్థితి ఏమిటో అవగతమౌతుంది. ఇక ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం గత ఎన్నికలలో ఎదురైన పరాజయం నుంచి కోలుకుని అత్యంత శక్తిమంతంగా వచ్చే ఎన్నికలకు రెడీ అయ్యింది. ఆ పార్టీకి జనసేనతో పొత్తు అదనపు బలంగా మారింది.  దీంతో ఏపీలో   బీజేపీకి అసలు స్పేస్  లేని పరిస్థితి.  అయితే  కేంద్రంలో అధికారంలో ఉండటం.. తన ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ.. కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తుందన్న భయం, ఎన్నికల వేళ మోడీ సర్కార్ అండ ఉంటే మేలన్న భావం వెరసి తెలుగుదేశం, జనసేన కూటమి బీజేపీ కూడా కలిసి వస్తే బాగుంటుందని భావిస్తున్నాయి.  కానీ బీజేపీ మాత్రం ఏపీలో విష రాజకీయాలకు తెరలేపింది. తెలుగుదేశం, జనసేన మధ్య కుదిరిన పొత్తును విచ్ఛిన్నం చేయడం,  లేక ఆ కూటమికి బలమైన వర్గాన్ని దూరం చేసి అధికారంలో ఉన్న జగన్ పార్టీకి మేలు చేసి అందుకు ప్రతిఫలంగా రాజకీయ లబ్ధి పొందడం అనే  వ్యూహంతో  పావులు కదుపుతోంది.  ఒక వైపు జనసేనతో మిత్రత్వం నెరపుతూనే మరో వైపు తెరవెనుక ఆ పార్టీకి బలమైన సామాజిక వర్గాన్ని దూరం చేసి తన రహస్య మిత్రుడికి మేలు   చేసే ప్రయత్నాలను కొనసాగిస్తోంది.  తెలుగుదేశం, జనసేన పొత్తును విచ్ఛిన్నం చేయడానికి ఏపీ సీఎం జగన్, ఆయన పార్టీ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైన తరుణంలో జగన్ కు ప్రయోజనం చేకూరేలా ఆ కూటమికి బలమైన సామాజిక వర్గాన్ని దూరం చేసే కుట్రకు బీజేపీ తెరలేపినట్లు కనిపిస్తోంది. జనసేన అధినేత సోదరుడు చిరంజీవికి యూపీ నుంచి రాజ్యసభ సభ్యత్వం ఆఫర్ చేయడం, అలాగే కాపు ఉద్యమ నేత ముద్రగడకు గవర్నర్ పదవిని ఆఫర్ చేయడం ఈ వ్యూహంలో భాగమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  వాస్తవానికి బీజేపీ, తెలుగు దేశం పార్టీ   ఎప్పటి నుంచో  మిత్ర పక్షాలు. ఎన్ని సార్లు విడిపోయాయో అన్ని సార్లూ   కలిశాయి. ఆ రెండు పార్టీల మధ్య శతృ మిత్ర  సంబంధాలు, తారు మారైన సందర్భాలు రాజకీయ చరిత్ర పుటల్లో చాలానే ఉన్నాయి. అంతే కాదు,అప్పట్లో, ఉభయ పార్టీ  నేతలు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో వ్యవహరించిన సందర్భాలూ ఉన్నాయి. ఆ సమయంలోనే  అటల్జీ, అద్వానీ  వంటి బీజేపీ అగ్రనేతలు అనేక సందర్భాలలో  తెలుగుదేశం పార్టీని  విశ్వసనీయ మిత్ర పక్షంగా, చంద్రబాబును విశ్వనీయ మిత్రుడిగా పేర్కొన్నారు.  గౌరవించారు.  తెలుగుదేశం పార్టీ  కూడా బీజేపీకి అటువంటి మర్యాద గౌరవాన్నే ఇచ్చింది.  అలాగే, రెండు పార్టీలు కలిసి పోటీ చేసిన ప్రతి సందర్భంలోనూ ఉభయతారకంగా రెండు పార్టీలు ప్రయోజనం పొందాయి.  రాష్ట్ర విభజన తర్వాత, ఉభయ పార్టీలు కలిసి పోటీ  చేయడమే కాదు కేంద్ర, రాష్టం మంత్రి వర్గాలలో భాగస్వాములయ్యాయి.  అయితే, ఇదంతా గతం.  అటల్జీ, అద్వానీల నాటి  బీజేపీ వలే మిత్రధర్మం పాటించాలన్న ఉద్దేశం ఇప్పుడు మోడీ హయాంలోని బీజేపీకి ఇసుమంతైనా లేదు. అందుకే   ఒక్క తెలుగు దేశం పార్టీ మాత్రమే కాదు, ఇతర మిత్ర పక్షాలకు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలకు గౌరవం ఇవ్వకపోవడమే కాదు,  అవకాశం చిక్కితే వాటి అడ్రస్  గల్లంతు చేసేందుకు వెనకాడేది లేదని చేతల్లో చూపిస్తున్నది. అందుకే, సిద్దాంత సారూప్యం ఉన్న శివ సేన, అకాలీ దళ్, ఒకప్పుడు బీజేపీ అగ్రనేతలే  విశ్వనీయ మిత్ర పక్షంగా మెచ్చుకున్న తెలుగుదేశం సహా అనేక భాగస్వామ్య పక్షాలు బీజేపీకి దూరమయ్యాయి. ఇప్పటికీ కేంద్రంలో ఉన్నది పేరుకు ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వమే అయినా, మోదీ మంత్రివర్గంలో  మిత్ర పక్షాలకు పెద్దగా వాయిస్  లేదు. మిత్ర పక్షాల నుంచి కాబినెట్ లో స్థానం దక్కిన మిత్ర పక్షాల మంత్రులకు అంతకంటే  ప్రాధాన్యత లేదు. నిజానికి మోడీ,  షాలను మినహాయిస్తే బీజేపీ మంత్రులలో కూడా ఎవరికీ పెద్దగా ప్రాధాన్యత ఉన్న దాఖలాలు కనిపించవు. సరే ఆ విషయాన్ని పక్కన పెట్టి ఏపీ విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి నిండా ఒక్క శాతం ఓటు కూడా లేదు. ప్రత్యేక హోదా విషయంలో ఇచ్చిన మాట తప్పిన బీజేపీతో టీడీపీ తెగతెంపులు చేసుకున్న నేపధ్యంలో జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ  నోటా తో పోటీ పడింది. పోటీ చేసిన స్థానాలలో ఒక్కటంటే ఒక్క చోట కూడా ఆ పార్టీ డిపాజిట్ దక్కించుకోలేదు.  అయితే   కేంద్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని, రాష్ట్రంలో చక్రం తిప్పుతోంది.   ఇప్పుడు 2024 సార్వత్రిక ఎన్నికల ముందు మరోమారు తన మిత్రుడు జగన్ కు మేలు చేసి ఆ తరువాత రాజకీయ లబ్ధి పొందే  కుట్రలకు తెరలేపింది. అందులో భాగమే  ముద్రగడకు గవర్నర్ పదవి, చిరంజీవికి రాజ్యసభ ఆఫర్లు అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఢిల్లీకి పిలిపించుకుని మంతనాలు జరిపేందుకు రెడీ అయ్యింది. పవన్ ఢిల్లీ పర్యటన తరువాత బీజేపీ వ్యూహాలు ఏ మేరకు ఫలించాయి. అన్నది తేలుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తంగా ఏపీలో జగన్ సర్కార్ కు.. కేంద్రంలోని మోడీ సర్కార్ కు మధ్య క్విడ్ ప్రొకో సంబంధం ఉందని అంటున్నారు.  

జనసేనలోకి  బాలశౌరి కన్ఫర్మ్

వైసీపీ నుంచి పక్కచూపులు చూసే వారి సంఖ్య ఇటీవలికాలంలో ఎక్కువైంది. కాపు సామాజిక వర్గానికి చెందిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఇప్పటికే జనసేనాని పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే అధికారికంగా జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్లు ఖరారైంది. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అన్ని పార్టీలలో వలసల పర్వం ఎక్కువైంది. ముఖ్యంగా ఈసారి టీడీపీ – జనసేన కూటమిలోకి పెద్ద ఎత్తున నేతలు చేరుతున్నారు. వైసీపీ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలంతా బయటకు వచ్చి టీడీపీ లేదా జనసేన లో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు చేరగా..తాజాగామచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఫిబ్రవరి 4న జనసేనలో చేరుతున్నారు.మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇక ఆయన వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేసేది తెలియాల్సి ఉంది. ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా లేదంటే ఎంపీగానే బరిలోకి దిగుతారా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. కాగా బాలశౌరి ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.బాలశౌరి సీఎం వైఎస్ జగన్ రెడ్డికి ఈయన అత్యంత ఆప్తుడు అనే విషయం తెలిసిందే. మచిలీపట్నం నుంచి ఎంపీగా ఓ మాజీ మంత్రిని బరిలోకి దింపడానికి హైకమాండ్ ప్రయత్నిస్తున్నట్లు ముందుగానే తెలుసుకున్న బాలశౌరి.. వైసీపీకి రాజీనామా చేసేశారు. మరోవైపు.. బాలశౌరి ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలని భావిస్తున్నారని అందుకే రాజీనామా చేశారని కూడా ప్రచారం జరిగింది.  

పాపం బాలినేని! పొగపెట్టినా పోలేక ఉక్కిరిబిక్కిరి!

బాలినేని శ్రీనివాసరెడ్డి.. మాజీ మంత్రి.. సీఎంకు సమీప బంధువు..ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో  గట్టి పట్టున్న నేత. అయితే పాపం బాలినేనికి అవేమీ ఇప్పుడు అక్కరకు రావడం లేదు. పార్టీలో నిత్యం అవమానాలు తప్పడం లేదు. మంకుపట్టుపట్టి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీకి జగన్ చేత ఓకే అనిపించుకున్నా.. నియోజకవర్గంలో కానీ, జిల్లాలో కానీ ఆయన మాటకు పార్టీలో పూచిక పుల్ల విలువ లేని పరిస్థితిని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ క్రియేట్ చేశారు. దీంతో మింగాలేను, కక్కాలేను అన్నట్లుగా  తయారైంది బాలినేని పరిస్థితి. పార్టీ నుంచి రాజీనామా చేయడం చిటికెలో పని అంటూ గంభీరంగా ప్రకటనలు గుప్పించినా.. అలా రాజీనామా చేసి బయటకు వెళ్లే ధైర్యం మాత్రం బాలినేని చేయడం లేదు. వాస్తవానికి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లాలో సొంత వర్గం ఉన్న నాయకుడు. అన్ని పార్టీల నేతలతో సత్సంబంధాలు ఉన్న నేత. అధికారదర్పం, అహంకారం పెద్దగా  ప్రదర్శించే వ్యక్తి కూడా కాదు. అటువంటి బాలినేనిని జగన్ అడుగడుగునా అవమానిస్తున్నారు.   అసలు జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ సందర్బంగా బాలినేనికి మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలికి అదే జిల్లాకు చెందిన మరో మంత్రిని కొనసాగించిన నాడే జగన్ బాలినేనిని పక్కన పెట్టేశారని, జిల్లాలో ఆయనకు ప్రత్యామ్నాయ నేతను రెడీ చేస్తున్నారనీ పరిశీలకులు విశ్లేషించారు. బాలినేనిని జగన్ పక్కన పెట్టేయాలనుకోవడానికి కారణాలేమిటి? అన్న విషయంలో పెద్దగా తలలు బద్దలు కొట్టుకోవలసిన అవసరం లేదు. జగన్ కు తన పార్టీ వారంతా సొంత ఆలోచన, మెదడు, అలాగే సొంత వర్గం, సొంత బలం వదులుకుని తన మాటే శాసనం అని అంగీకరించి మసులు కోవాలని కోరుకుంటారు. అందుకు భిన్నంగా సొంత వ్యక్తిత్వం ఉంటే భరించ లేరు. వారిని దూరం పెట్టడానికి ఇసుమంతైనా ఆలస్యం చేయరు. సరే సొంత జిల్లాలో తనకంటూ ఒక వర్గం ఉండి, అందరినీ కలుపుకుని పోయే నేతగా బాలినేనికి గుర్తింపు ఉంది.  జగన్ కినుకకు ఇతర కారణాలేమున్నా ముఖ్యకారణం మాత్రం బాలినేనికి వ్యక్తిత్వం ఉన్న నేతగా జిల్లాలో ఉన్న గుర్తింపే అని పార్టీ శ్రేణులే అంటున్నాయి.  కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన సందర్భంలోనే బాలినేని తన అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేశారు. అప్పట్లోనే ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. బాలినేనిని బుజ్జగించడానికి అప్పట్లో సజ్జల రామకృష్ణారెడ్డి విశ్వ ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో జగనే బాలినేనిని బుజ్జగించేందుకు రంగంలోకి దిగారు. ఏం జరిగిందో ఏమో అప్పటికి బాలినేని సర్దుకు పోయారు. అయితే బాలినేని అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం చేయడం, జగన్ బుజ్జగించి బతిమలాడే వరకూ పరిస్థితిని తీసుకురావడంతో అప్పటి నుంచే బాలినేనిని దూరం పెట్టడానికి, అదే సమయంలో ఆయన  పార్టీ నుంచి బయటకు వెళ్లినా సొంత బలం, బలగం అండగా నిలిచే పరిస్థితి లేకుండా చేయడానికీ ప్రణాళికాబద్ధంగా పార్టీ అగ్రనాయకత్వం పావులు కదిపిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   జిల్లాలో జగన్ కార్యక్రమానికి బాలినేనికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడం.. ఆయన ఆగ్రహించి వెనక్కు వెళ్లిపోయిన తరువాత తీరిగ్గా జగన్ ఫోన్ చేసి పిలిపించుకోవడం, బాలినేని కూడా సద్దుకుని నవ్వుతూ పొటోలకు పోజులివ్వడం తెలిసిందే.  అదే కాదు.. వరుసగా బాలినేనికి పార్టీలో పరాభవాలు జరుగుతూనే ఉన్నాయి, ఆయన ఆగ్రహం వ్యక్తంచేస్తూనే ఉన్నారు. ఇలా పదే పదే జరగడం వల్ల బాలినేని జగన్ పట్ల వ్యతిరేకతతో బాహాటంగా ప్రకటనలు చేసినా చుట్టాలు, చుట్టాలు సర్దుకు పోతారు. బాలినేని తరఫున నిలబడి మనమెందుకు దూరం కావడం అన్నట్లుగా బాలినేనిని పార్టీలో ఎవరూ పట్టించుకోవడం లేదు. జగన్ అండ్ కోకు కావలసింది కూడా ఇదే. అందుకే  బాలినేనిని ఒంగోలులో ఒంటరిని చేసే వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేశారు.  తాజాగా మరోసారి జగన్  బాలినేనిని ఘోరంగా అవమానించారు. తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించుకుని ఆయన వచ్చిన తరువాత కలిసేది లేదని కబురంపించారు. దీంతో బాలినేని తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చి కూడా కనీసం కారు దిగకుండా వెనుదిరగాల్సి వచ్చింది. అదే సమయంలో సీఎంవో పిలుపు మేరకు వచ్చిన పలువురు ఎమ్మెల్యేలకు మాత్రం నేరుగా తాడేపల్లి ప్యాలెస్ లోకి ఎంట్రీ దొరికింది. దీంతో బాలినేనిని ఉద్దేశపూర్వకంగానే పిలిచి అవమానించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇలాంటి అవమానాలు, పరాభవాలు ఇటీవలి కాలంలో బాలినేనికి అలవాటుగా మారిపోయాయి.  నిన్నమొన్నటి వరకూ  బాలినేనికి ఒంగోలు టికెట్ వస్తుందో రాదో కూడా  అర్ధం కాని పరిస్థితి. అయితే ఎలాగో  ఒంగోలు నుంచి పోటీకి టికెట్ సాధించుకున్నా  జిల్లాలో వైసీపీ కీలక నేత అయిన బాలినేనిని నియోజకవర్గాల ఇంచార్జుల నియామక విషయంలో కనీసం సంప్రదింపులకు కూడా దగ్గరకు రానీయలేదు.  బాలినేని ఎంతగా పట్టుపట్టినప్పటికీ  ఒంగోలు ఎంపీ టికెట్  ను మాగుంటకు కేటాయించడానికి జగన్ ససేమిరా అన్నారు.  ఈ నేపథ్యంలోనే బాలినేనికి తాడేపల్లి ప్యాలెస్ వద్ద ఎదురైన తాజా పరాభవం ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు. నేరుగా చెప్పకుండా బాలినేనిని వదిలించుకునే ఉద్దేశమే జగన్ లో కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ విషయం స్పష్టంగా తెలిసినా, మరో పార్టీలో చేరి ఒంగోలు అసెంబ్లీ టికెట్ హామీ పొందే అవకాశం లేకపోవడంతోనే బాలినేని వైసీపీని వదలడం లేదని అంటున్నారు. 

ఉద్యోగం ముసుగులో పార్టీ సేవ.. వాలంటీర్లంతా వైసీపీ కార్యకర్తలేనన్న జగన్

జగన్ ఎంతో ఘనంగా లక్షల ఉద్యోగాలు ఇచ్చేశామని చెప్పుకుంటున్నారు. ఆయన ఈ నాలుగున్నరేళ్ల పైచిలుకు కాలంలో ఇచ్చినవి వాలంటీర్ల ఉద్యోగాలు మాత్రమే. ఆ వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలనీ, వారికి ప్రభుత్వోద్యోగమన్న ముసుగు వేసి పార్టీ కోసం వాడుకుంటున్నారన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. వాలంటీర్లు ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ వైసీపీ ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం ఎప్పటి నుంచో ఆరోపిస్తూనే ఉంది. వాలంటీర్ల పని ప్రజలను ప్రభుత్వ పథకాల పేరుతో బ్లాక్ మెయిల్ చేసి అధికార పార్టీకి అనుకూలంగా మార్చడమేనన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. పలు సందర్భాలలో అంబటి వంటి వారు వాలంటీర్లు మనవాళ్లే అని బాహాటంగానే చెప్పేశారు. చివరాఖరికి టీచర్లను కాదని ఎన్నికల విధుల్లో కూడా వారినే నియోగించాలన్న జగన్ యత్నాలు విఫలమయ్యాయి.   అసలు వాలంటీర్ల నియామకంలోనే తేడా ఉంది. ఎలాంటి నిబంధనలూ లేకుండా వైసీపీ అనుకూలత ఉంటే చాలు అన్నట్లుగా ఆ నియామకాలు చేపట్టారు జగన్. ఈ విషయాన్ని బయటి వారెవరో కాదు.. స్వయంగా జగన్ సహా ఆయన కేబినెట్ సహచరులే వేరు వేరు సందర్భాలలో బాహాటంగానే చెప్పేశారు.   ఇక ఎన్నికల విధులలో వాలంటీర్ల సేవలకు అవకాశం లేదని తేలిపోయిన తరువాత జగన్ ఇంత కాలం వాలంటీర్లకు వేసిన ఉద్యోగులు అన్న ముసుగు తీసేశారు. అలా తీసేయడానికి ఆయన ఎన్నుకున్న వేదిక కూడా ఎన్నికల ప్రచార సభే కావడం ఎంత మాత్రం కాకతాళీయం కాదు. కావడానికి వీల్లేదు. ఇటీవల విశాఖపట్నం జిల్లా సంగివలసలో జగన్ ఎన్నికల ప్రచారానికి శంఖారావం మోగించారు. సిద్ధం పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. ఆ సభ వేదికగా ఆయన వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలేననీ, వాళ్లు మనవాళ్లేననీ సగర్వంగా ప్రకటించారు. వాళ్లు ఇంత కాలం చేసిన సేవ, ఇక ముందు చేయబోయే సేవా వైసీపీకేనని కుండబద్దలు కొట్టేశారు. ప్రజాధనాన్ని వాలంటీర్లకు జీతాల రూపంలో ఇచ్చి తమ సొంత పార్టీ సేవకు వారిని వినియోగించుకుంటున్న సంగతిని ఎలాంటి దాపరికం లేకుండా బాహాటంగా చెప్పేశారు.    సొంత పార్టీకి లబ్ధి చేకూర్చడానికి, ఎన్నికల్లో విజయానికి పనిచేయడానికి వలంటీర్ల నియామకం జరిగిందని ఇంత కాలం విపక్షాలు చేస్తున్న వాస్తవాలు అక్షర సత్యాలని స్వయంగా జగనే అంగీకరించారు.  రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నల లక్షల మంది వాలంటీర్లను జగన్ సర్కార్  నియమించుకుంది. పార్టీ సేవలో తరించాలని వారికి ఉద్బోధ చేసింది. తర్ఫీదు కూడా ఇచ్చింది. వాలంటీర్లకు జగన్ సర్కార్ ఎన్నికల విధులను అప్పగించిందని విపక్షాలు చేసిన ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలంటూ కలెక్టర్లకు ఆదేశాలిచ్చి చేతులు దులిపేసుకుంది.  ఫ్యాక్షన్ లీడర్లు సొంత అంటే ప్రైవేటు సైన్యాన్ని మెయిన్ టెయిన్ చేస్తున్నట్లుగా జగన్ సర్కార్ వాలంటీర్లను మెయిన్ టైన్ చేస్తోంది. ఫ్యాక్షన్ లీడర్లు సొంత సొమ్ముతో ప్రైవేటు సైన్యాన్ని పోషిస్తారు. కానీ జగన్ మాత్రం ప్రజల సొమ్ముతో తన పార్టీ ప్రైవేటు సైన్యాన్ని పోషిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిథులకు లేని స్వేచ్ఛ, అధికారం, హక్కులను కూడా జగన్ వాలంటీర్లకు దఖలు పరిచారు.  నియోజకవర్గంలో ఎమ్మెల్యేలను ఉత్సవ విగ్రహాలను చేసి వారికి ప్రజలతో సంబంధం లేకుండా చేశారు. వాలంటీర్లే అన్నీ తామై పనులు చక్కబెడుతున్నారు. పార్టీ కోసం పని చేయడానికి ఒక్కో వాలంటీర్ కు ప్రభుత్వ ఖజానా నుంచి సొమ్ములు చెల్లిస్తున్నారు.  

జనసేనాని ఎక్కడ?

ఎన్నికల నగారా రేపో మాపో మోగనుంది. కానీ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయం మాత్రం కాక రేగి పోతోంది. ఇప్పటికే టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వివిధ కార్యక్రమాల పేరుతో ప్రజల్లోకి వెళ్లి సుడిగాలి పర్యటనలు చేస్తూ.. జగన్ పాలనను, ఆయన వైఖరిని ఎండగడుతున్నారు. ఆయన వైఫల్యాలను ప్రజల కళ్లకు కడుతున్నారు. అలాగే  వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి   జగన్ కూడా ఎన్నికల శంఖారావాన్ని పూరించి.. వరుస పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఇక నిన్న కాక మొన్న కాంగ్రెస్ గూటికి చేరి పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైయస్ షర్మిల సైతం బాణం లాగా ప్రజల్లోకి నేరుగా దూసుకు పోతున్నారు. దీంతో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. అలాంటి వేళ.. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎక్కడ.. ఎక్కడ అని ఆ పార్టీ శ్రేణులు వెతుకులాడుకుంటున్నారు.  ఎన్నికల వేళ పవన్ కల్యాణ్ కనిపించకపోవడమేంటన్న చర్చ సైతం రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇప్పటికే రానున్న ఎన్నికల్లో  తెలుగుదేశంతో కలిసి సాగుతామని పవన్ కల్యాణ్ సందేహాలకు తావులేని విధంగా ప్రకటించేశారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు.. ఆయనతో ములాఖాత్ అయి... ఆ తర్వాత అదే జైలు బయట.. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్,  హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమక్షంలో ప్రకటించారు. నిన్న మొన్నటి వరకు నారా లోకేశ్.. యువగళం పేరుతో పాదయాత్ర నిర్వహించారు. ఆ ముగింపు సభకు పవన్ కల్యాణ్ హాజరయ్యారు.  ఆ తర్వాత.. చంద్రబాబు నివాసానికి వెళ్లిన  పవన్ కల్యాణ్  ఆయనతో భేటీ అయ్యారు. అలాగే పవన్‌ ఇంటికి వెళ్లి చంద్రబాబు సైతం సమావేశమయ్యారు.  కానీ పవన్ కల్యాణ్ మాత్రం ఎక్కడా ప్రచారాల్లో పాల్గనడం లేదు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే విరామమే లేకుండా..  ప్రజల మధ్యకు వెళ్లి.. మరీ జగన్ పాలన పై విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారని.. కానీ పవన్ కల్యాణ్ జాడ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. అయితే నారా చంద్రబాబు నాయుడు.. ఇటీవల రెండు అసెంబ్లీ స్థానాలు మండపేట, అరుకులో తమ పార్టీ అభ్యర్థులు బరిలో నిలుస్తారంటూ ప్రకటించారు. ఆ వెంటనే జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సైతం రాజానగరం, రాజోలులో తమ పార్టీ అభ్యర్థులను నిలుపుతామంటూ ప్రకటించారని.. మరి ఇందులో ఉన్న చొరవ.. ఎన్నికల ప్రచారంలో మాత్రం  పవన్ కల్యాణ్‌లో ఎందుకు కొరవడిందని విశ్లేషకులు అంటున్నారు. అయినా.. ఎన్నికల్లో గెలుపంటే.. ఒకరితోనో ఇద్దరితోనో సాధ్యం కాదని.. సమష్టి కృషి ఉండాలని.. అలా అయితేనే.. విజయం వరిస్తుందని.. అలా కాకుండా.. ఒకరు కష్టపడితే చాలు.. మరొకరు అందలం ఎక్కచ్చు అనుకుంటే.. అది కుదరని పని అనే విషయాన్ని తెలుసుకొని మసులు కొంటే మంచిదని అంటున్నారు. 

ఫిబ్రవరి 2 నుంచి కోడికత్తి శ్రీను తల్లి పాదయాత్ర

ఐదేళ్లుగా బెయిలుకు కూడా నోచుకోకుండా జైల్లో మగ్గుతున్న కోడి కత్తి శీను విడుదల కోసం అతడి తల్లి పాదయాత్రకు సిద్ధమయ్యారు. వృద్ధాప్యంలో కూడా కుమారుడి కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నకోడికత్తి శీను తల్లి తన కుమారుడు జగన్ కోసం జైలుకు వెళ్లాడని, అయితే ముఖ్యమంత్రి జగన్ మాత్రం తన కుమారుడు బయటకు రాకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని గడపగడపకూ వివరిస్తామంటూ కోడికత్తి శీను తల్లి సావిత్రమ్మ వచ్చే నెల 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రకు సంకల్పించారు. కోనసీమ జిల్లా ఠానే లంక నుంచి ఆమె తన పాదయాత్ర ప్రారంభించనున్నారు.  కోడికత్తి కేసులో బాధితుడినని చెప్పుకుంటున్నజగన్ కోర్టుకు హాజరై కేసులో సాక్ష్యం చెప్పాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.  గత ఎన్నికలకు ముందు విశాఖపట్నంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం జగన్ పై కోడికత్తితో దాడి చేసిన ఘటనలో అరెస్టైన శ్రీను అప్పటి నుంచీ జైల్లోనే మగ్గిపోతున్న సంగతి తెలిసిందే.   ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ శ్రీను తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజు  ఇటీవల నిరాహారదీక్షకు దిగారు.  అయితే దీక్షకు పోలీసుల అనుమతులు  లేవంటూ అడ్డకోవడంతో  విజయవాడలోని ఇంట్లోనే నిరశన దీక్ష చేపట్టారు.  ఆ సందర్భంగా శ్రీను తల్లి సావిత్రి మాట్లాడుతూ... తమకు న్యాయం జరిగేంత వరకు దీక్ష విరమించేది లేదని అన్నారు.  ఈ కేసులో బాధితుడిగా జగన్ కోర్టుకు వచ్చి  సాక్ష్యం చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఎన్వోసీ ఇచ్చి కేసును ఉపసంహరించుకోవాలని సావిత్రమ్మ కోరారు. అదే సమయంలో  విశాఖ సెంట్రల్ జైల్లో శ్రీను నిరాహార దీక్షకు దిగారు.  కోడికత్తి కేసు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి పక్షంలో  ఉన్నప్పుడు అంటే 2018లో జరిగింది. తన పాదయాత్ర ముగించుకుని హైదరాబాద్ బయలు దేరే ముందు విశాఖపట్టణం ఎయిర్ పోర్ట్ లో ఈ దాడి జరిగింది. ఇది జగన్ పై జరిగిన దాడి కాదు అప్పటి వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎత్తుగడ అని రాజకీయ పరిశీలకులు అప్పట్లోనే విశ్లేషించారు. ఆ దాడిని సానుభూతిగా మలచుకుని అప్పటి ఎన్నికలలో జగన్  విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే తనకు అంత సానుభూతి రావడానికి కారణమైన కోడికత్తి శీను జైల్లో మగ్గడమే తనకు ప్రయోజనం అని భావిస్తున్న జగన్  కోడికత్తి శీనుకు బెయిలు రాకుండా చేస్తున్నారు. ఈ కేసులో బాధితుడిగా జగన్ కోర్టకు వచ్చి వాంగ్మూలం ఇస్తే తప్ప కోడికత్తి శీనుకు బెయిలు వచ్చే అవకాశం లేదని  న్యాయనిపుణులు అంటున్నారు. ఈ కేసు దర్యాప్తు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కోడికత్తి కేసులో ఎటువంటి కుట్రా లేదని నిర్ధారించినా, మరింత లోతైన దర్యాప్తు కావాలంటూ జగన్ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే జైల్లో శ్రీను, బయట అతడి తల్లి సావిత్రమ్మ నిరాహారదీక్షకు దిగితే పోలీసులు భగ్నం చేశారు. దీంతో తన కుమారుడికి, తమ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని గడపగడపకు వివరించేందుకు  కోడికత్తి శీను తల్లి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రకు సిద్ధమయ్యారు.   

షర్మిల దూకుడు.. వైసీపీ కకావికలు!

ఏపీ కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచీ వైఎస్ షర్మిల స్పీడ్ పెంచారు. ఆమె ప్రశ్నలు, విమర్శలు, సొంత అన్న, ఏపీ సీఎం జగన్ ను సూటిగా నిలదీస్తున్న తీరు అధికార వైసీపీని కంగారు పెడుతున్నాయి. షర్మిల స్పీడుతో వైసీపీ కకావికలు అయిపోతున్నది. అంతే కాదు రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం విషయంలో ఇప్పటి వరకూ ఉన్న అనుమానాలు కూడా పటాపంచలైపోతున్నాయి. ఏపీలో కాంగ్రెస్ బలోపేతం కావడం అంటే వైసీపీ ఖాళీ అయిపోవడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వారి విశ్లేషణలు వాస్తవమే అనిపించేలా ఏపీలో పరిణామాలు ఉన్నాయి.  రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు తీసుకువచ్చేందుకు ఉన్న ఏ అవకాశాన్నీ పిసిసి చీఫ్  వైఎస్‌ షర్మిల  వదలడం లేదు.  తన తండ్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి  గుడ్ విల్ ను పూర్తిగా సొంతం చేసుకున్న షర్మిల ఆయన హయాంలో రాజకీయాలలో చురుకుగా ఉండి ఆ తరువాత యాక్టివ్ గా లేని  పార్టీ సీనియర్‌ నేతలను కలుస్తూ, వారి మద్దతు పొందడమే కాకుంగా, వారిని పార్టీలోకి తీసుకుని రావడానికి ప్రయత్నిస్తున్నారు.   మాజీ మంత్రి డిఎల్‌ రవీంద్రా రెడ్డితో భేటీని పరిశీలకులు ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డితో కలిసి నడిచిన డీఎల్ రాష్ట్ర విభజన తరువాత రాజకీయాలలో పెద్దగా క్రియాశీలంగా లేరు. ఇప్పుడు షర్మిల కలిసినంత మాత్రాన ఆయన యాక్టివ్ అవుతారని చెప్పలేము.  కానీ ఆయనను పార్టీలోకి తీసుకువచ్చేదిశగా షర్మిల ఒక అడుగు ముందుకు వేశారు. అలాగే వైఎస్ మిత్రుడు దుట్టా రామచంద్రరావుతోనూ షర్మిల భేటీ అయ్యారు. ఆయన కాంగ్రెస్ లో చేరుతారని షర్మిల ప్రకటించారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్న దుట్టా రామచంద్రరావుకు ఆ పార్టీలో పెద్దగా గుర్తింపు లేదు. జగన్ తీరు పట్ల, వైఖరి పట్ల దుట్టాలో తీవ్ర అసంతృప్తి ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. వైఎస్ కుమారుడన్న అపేక్షతో వైసీపీలో చేరిన ఆయన వైఎస్ ఆశయాలకు అనుగుణంగా పార్టీ తీరు, వ్యవహారం లేదని సన్నిహితుల వద్ద పలు సందర్భాలలో తన అసంతృప్తి వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాలుగా తన నడక వైఎస్ తోనేననీ, అయితే జగన్ తో కలిసి ముందుకు సాగేందుకు తనకు కష్టంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు ఆయన సహచరులు చెబుతున్నారు. ఈ సమయంలో షర్మిల ఆయనతో భేటీ కావడం, ఆయన కాంగ్రెస్ గూటికి చేరతారని ఆమె స్వయంగా ప్రకటించడం చూస్తుంటే ఇహనో ఇప్పుడో దుట్టా వైసీపీకి దూరం కావడం, చేయి అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.  ప్రస్తుతం షర్మిలకు రాష్ట్ర కాంగ్రెస్ లో కొండంత అండ అన్నట్లుగా ఆమె తండ్రి వైఎస్ ఆత్మ కేవీపీ రామచంద్రరావు ఉన్నారు. అలాగే తులసిరెడ్డి, రఘువీరారెడ్డి వంటి సీనియర్లు కూడా షర్మిలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. వీరు కూడా ఇంత కాలం పెద్ద క్రియాశీలంగా లేరు. అయితే షర్మిల ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత క్రియాశీలం అయ్యారు. మున్ముందు మరింత యాక్టివ్ గా పనిచసే అవకాశాలు కనిపిస్తున్నాయి.  రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ లో మసకబారిపోయిన వైఎస్ బ్రాండ్ ను షర్మిల తన చురుకుదనంతో, చొరవతో మళ్లీ ప్రకాశింపచేయగలుగుతున్నారని చెప్పడానికి ఇసుమంతైనా సందేహించాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ లో వైఎస్ బ్రాండ్ ఇమేజ్ పెరగడం అంటే వైసీపీకి ఆ  బ్రాండ్ ఇమేజ్ దూరమైనట్లే అవుతుంది. అదే జరిగితే ఇక జగన్ నాయకత్వంలోని వైసీపీకి వైఎస్ బ్రాండ్ తో పాటు ప్రజాదరణ దూరం అవ్వడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

గ్రేటర్ లో బీఆర్ఎస్ ఖాళీ యేనా? సీఎంగా కేసీఆర్ వ్యూహాలు ఇప్పుడు రివర్స్ అవుతున్నాయా?

నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్న చందంగా తయారైంది కేసీఆర్ పరిస్థితి. తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలను గంపగుత్తగా తన పార్టీలో చేర్చుకుని విపక్షాలను నిర్వీర్యం చేయడానికి ఆయన అప్పుడు అమలు చేసిన ఆపరేషన్ ఆకర్ష్ వ్యూహం, ఇప్పుడు రివర్స్ లో ఆయనకు ఆపరేషన్ వికర్ష్ గా మారి ఏకంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీయే నిర్వీర్యం అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని ఎదుర్కొన్న బీఆర్ఎస్ కు, ఆ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోవడమే పెద్ద టాస్క్ గా మారిపోయింది. మర్యాదపూర్వకం అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీకి క్యూకడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నది. ఇదే బీఆర్ఎస్ ను కంగారు పెడుతోంది. అందుకే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రేవంత్ సర్కార్ త్వరలోనే పతనమౌతుందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి దుందుడుకు విమర్శలతోనే ఆయన పువ్వల్లో పెట్టి అధికారాన్ని కాంగ్రెస్ కు అప్పగించారంటూ ఇప్పటికే ఆయనపై సొంత పార్టీలోనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పడు రేవంత్ ప్రభుత్వ పతనం అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కింది స్థాయి క్యాడర్ కు కూడా రుచించడం లేదని అంటున్నారు. అది పక్కన పెట్టి ప్రస్తుతానికి వస్తే.. ముందుగా బీఆర్ఎస్ కు కొద్దో కొప్పో పరువు నిలిచింది అనుకునేలా అసెంబ్లీ ఎన్నికలలో స్థానాలు రావడానికి కారణమైన గ్రేటర్ పరిధిలోనే ఆ పరువు పోయేలా ఎమ్మెల్యేల జంపింగులు ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లా బరితెగింపుగా బెదరింపులకు పాల్పడక పోయినప్పటికీ గ్రేటర్ పరిధిలోని భూ కుంభకోణాలపై సీఎం రేవంత్ సీరియస్ గా దృష్టి సారించారు. దీంతో సహజంగానే బీఆర్ఎస్ గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ నేతలలో ఒకింత ఆందోళన మొదలైంది. గతంలో తెలుగుదేశం తరఫున గెలిచిన మాధవరం వంటి వారు బీఆర్ఎస్ గూటికి చేరుతూ మీడియా సమావేశంలో చెప్పిన విషయాలను ఒక్క సారి గుర్తు చేసుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా అటువంటి ఆందోళనలోనే ఉన్నారని అనిపించక మానదు.  నాడు హైదరాబాద్ లో ఉన్న తమ ఆస్తుల రక్షణ కోసం పార్టీ మారక తప్పడం లేదని బీఆర్ఎస్ గూటికి చేరే సమయంలో మాధవరం వంటి వారు మీడియా ముఖంగానే చెప్పారు. ఇప్పుడు గ్రేటర్ పరిధిలో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి మారేందుకు అవే మాటలను చెప్పినా ఆశ్చర్యం లేదు. నాడు బెదరించి, ప్రలోభ పెట్టి ప్రత్యర్థి పార్టీలను బీఆర్ఎస్ ఎలా అయితేఎలాగైతే నిర్వీర్యం చేసిందో ఇప్పుడు అదే విధంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ను నిర్వీర్యం చేస్తే ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. అసలు కాంగ్రెస్ కు ఆ ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేకుండానే బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి క్యూకట్టినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. అందుకు గతంలో కేసీఆర్ అనుసరించిన వ్యూహాలే కారణమని చెబుతున్నారు. కాంగ్రెస్ దృష్టి తమ మీద పడేకంటే ముందే ఆ గూటికి చేరితే ఇబ్బందులు ఉండవన్న అభిప్రాయంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీ అధినేతకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా సీఎంతో భేటీకి క్యూకడుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన గంటల వ్యవధిలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఎన్న   ఫలితాలు వెలువడిన గంటల వ్యవధిలోనే  ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ తరఫున ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే  తెల్లం వెంకట్రావు రేవంత్ తో భేటీ అయ్యారు.  అప్పట్లోనే మరో అరడజను మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లోకి వచ్చారని కాంగ్రెస్ నేతలు బాహాటంగానే ప్రకటించారు.  అంటే ఓడలు బళ్లు..బళ్లు ఓడలు అయినట్లు గతంలో తాము అధకారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్   ప్రత్యర్థి పార్టీని నిర్వీర్యం చేయడానికి ఉపయోగించిన వ్యూహాలు ఎత్తుగడలు ఇప్పుడు రివర్స్ లో కాంగ్రెస్ ప్రయోగిస్తుందన్న లాజిక్ ను చూపుతూ ఇప్పటి అధికార పార్టీ నుంచి అసలా ప్రక్రియ మొదలు కాకముందే  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కారు దిగేందుకు తహతహలాడుతున్నారు. ఇక అధికార కాంగ్రెస్ విషయానికి వస్తే.. తాజా అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయిన గ్రేటర్ పైనే దృష్టి పెడుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అసలా దిశగా ఇప్పటికే సైలెంట్ ఆపరేషన్ మొదలు పెట్టేసిందని కూడా అంటున్నారు.  గ్రేటర్ పరిధిలో  బలం ఉందని భావించిన బీఆర్ఎస్ లీడర్లపై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించేందుకు పక్కా ప్లాన్ సిద్ధం చేసిందని చెబుతున్నారు. అందులో భాగమే రేవంత్ రెడ్డి తో  మర్యాదపూర్వక భేటీలకు గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యులు క్యూకడుతున్నారని చెబుతున్నారు.  మాజీ మంత్రి మల్లారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇలా కాంగ్రెస్ వైపు చూస్తున్న నేతల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది.  బీఆర్ఎస్ పార్టీ  2014 ఎన్నికలలో గ్రేటర్ పరిధిలో సరైన అభ్యర్థులు కూడా దొరకని స్థితి నుంచి 2018 ఎన్నికల నాటికి ఎలా బలపడిందో.. సరిగ్గా అదే విధంగా 2018లో గ్రేటర్ లో బలహీనంగా ఉన్న కాంగ్రెస్ బలోపేతం కావడానికి పెద్ద సమయం పట్టదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   

మోగిన ఎన్నికల నగారా.. రాజ్యసభ ఎలక్షన్ షెడ్యూల్ విడుదల

రాజ్య సభ ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ ను సోమవారం (జనవరి 29) విడుదల చేసింది.  దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో త్వరలో ఖాళీ కానున్న 56 రాజ్యసభ స్థానాలకు   కేంద్ర ఎన్నికల సంఘం  విడుదల చేసిన  షెడ్యూల్ ప్రకారం..  ఫిబ్రవరి 8న రాజ్య సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల  అవుతుంది.   అదే నెల 27 పోలింగ్ జరగనుంది. తెలుగు రాష్ట్రాలలో ఆరు రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరుగుతుంది.  తెలంగాణలో  బీఆర్ఎస్ రాజ్య సభ ఎంపీలు జోగినపల్లి సంతోష్, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్రల పదవవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీతో ముగియనుంది. దీంతో ఈ మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ లో  సీఎం రమేష్, కనకమేడల రవీంద్ర కుమార్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల పదవి కాలం ఏప్రిల్ 2వ తేదీతో ముగియనుండగా.. ఈ మూడు స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి.   రాజ్య సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 8న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే రోజు నుంచి అదే నెల 15 వరకూ నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంటుంది. నామినేషన్ల దాఖలుకు తుది గడువు ఫిబ్రవరి 15 కాగా, ఫిబ్రవరి 16న నామినేషన్ల పరిశీలన, ఇక నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 20 వరకూ గడువు ఉంటుంది. ఫిబ్రవరి 27న ఉదయం  తొమ్మిది గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు. ఓట్ల లెక్కింపు పూర్తి కాగానే ఫలితాలను ప్రకటిస్తారు.  

జగన్ ఇలాకాలో 17 ఆస్పత్రుల లైసెన్సులు రద్దు.. ఎందుకో తెలుసా?

ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయి. పేదల ఇబ్బందులు జగన్ సర్కార్ కు పట్టడం లేదు.  ఇంతకీ ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు ఎందుకు నిలిచిపోయాయి అంటే సమాధానం కోసం ఎవరూ పెద్దగా తడుముకోనవసరం లేదు. ఆర్భాటంగా పథకాల ప్రకటనే తప్ప ఆ పథకాల అమలుకు కావలసిన సొమ్ముల  విడుదలలో మొండి చేయి చూపడమే కారణమన్నది దాదాపుగా అందరికీ తెలిసిన విషయమే. వందల కోట్లు అప్పు చేసి జగన్ సర్కార్ చేస్తున్నదేమిటయ్యా అంటే విడతల వారీగా ప్రభుత్వోద్యోగుల వేతనాలు చెల్లించడం. ఇప్పటికే అమలు చేస్తున్న బటన్ నొక్కుడు కార్యక్రమాలకు అరకొరగా నిధులు పందేరం చేయడం మాత్రమే.  ఆర్భాటంగా పథకాలు ప్రకటించేయడమే తప్ప అవి అమలు అవుతున్నాయా? లబ్ధిదారులకు ప్రయోజనం అందుతోందా అన్న విషయాన్ని పట్టించుకోవడం జగన్ సర్కార్ డిక్షనరీలోనే లేదని ఈ నాలుగున్నరేళ్ల పాలనలో అందరికీ అర్ధమైపోయింది. ఇప్పుడు తాజాగా ఆరోగ్య శ్రీ పరిమితి పెంపు కూడా ఆ కోవలోకే వస్తుందని తేలిపోయింది.  జగన్ విధానాల డొల్ల తనానికి  బకాయిలు పేరుకు పోయి ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోవడాన్ని తాజా ఉదాహరణగా చెప్పవచ్చు.   తాజాగా సీఎం జగన్ సొంత జిల్లా కడపలో  కూడా ప్రభుత్వానికి ఆస్పత్రుల యాజమాన్యాలు షాక్ ఇచ్చి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేశాయి. ఔను కడప జిల్లాలో ఏకంగా 17 ఆస్పత్రులు ఆరోగ్య శ్రీ సేవలు అందించలేమని చేతులెత్తేశాయి. జిల్లాలో ఆరోగ్య శ్రీ సేవలు అందించే  18 ఆస్పత్రులలో 17 ఆస్పత్రులు ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటిస్తూ తమ ఆస్పత్రుల వద్ద ఆ మేరకు బోర్డులు కూడా ఏర్పాటు చేశాయి. ఎన్నికల ముంగిట ఈ పరిణామం జగన్ కు పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పాల్సి ఉంటుంది.  ఆరోగ్య శ్రీ పరిమితిని ఐదు లక్షల రూపాయల నుంచి పాతిక లక్షలకు పెంచుతూ ఇటీవలే జగన్ సర్కార్ ఉత్తర్వ్యులు జారీ చేసింది. జగన్ ఆర్భాటంగా ఈ పథకానికి నిధుల పెంపు కార్యక్రమాన్ని ప్రకటించడమే కాకుండా, అందుకు సంబంధించి నూతన ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ కూడా షురూ చేశారు. ఇంతకీ ఈ హడావుడి పెంపు, కొత్త కార్డుల పంపిణీ ఎందుకయ్యా అంటే.. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే కొత్త ఆరోగ్య శ్రీ కార్డులపై జగన్  ఫొటో ఉంటుంది కనుక.   ఎన్నికల ముందు జగన్ మోహన్ రెడ్డి తనను  పేదల పాలిట పెన్నిధిగా, అప్బాధబాంధవుడి అభివర్ణించుకునేందుకు మాత్రమే ఆరోగ్య శ్రీ కింద వైద్య సేవల పరిమితిని పాతిక లక్షలకు పెంచింది. అమలు కాని పథకాన్ని ఎంత పెంచితే మాత్రం నష్టం ఏమిటన్న రీతిలో జగన్ సర్కార్ ఈ పెంపు కార్యక్రమాన్ని ప్రకటించేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే ప్రకటనోనే ఊరుకోకుండా ఇందు కోసం భారీ ఎత్తున ఒక సభ,  కార్డుల తయారీకి, కార్డుల పంపిణీ  ఇలా ఇందుకోసం జగన్ సర్కార్ భారీగానే ఖర్చు చేసింది.  అయితే జగన్ ఈ పథకాన్ని ప్రకటించే సమయానికి  రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ ఎన్ని ఆసుపత్రులలో అందుబాటులో ఉంది? ఏ జిల్లాలో ఏ ఆసుపత్రులకు ఈ వైద్య సేవ అమలు చేస్తున్నారు? ఆరోగ్యశ్రీ కింద ఎన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నారు? వైద్య పరీక్షలు, వైద్యం, అనంతరం తగిన మందులు కూడా ఆరోగ్యశ్రీలో భాగంగానే అందిస్తారా? మారిన ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి విధి విధానాలు, ఆరోగ్యశ్రీ అమల్లో ఉన్న ఆసుపత్రులకు అందించారా?  అన్న విషయంలో మాత్రం ఎటువంటి స్పష్టతా ఇవ్వలేదు. అలాగే అసలు ఆసుపత్రులకు ఆరోగ్య శ్రీ బిల్లుల బకాయిల బకాయిలు ఎంత, అసలీ రమారమి ఐదేళ్ల పాలనలో ఆరోగ్య శ్రీ   పథకానికి ఎకేటాయించిన నిథులెన్నితదితర అంశాలపై ప్రజల సంగతి అలా ఉంచి కనీసం ప్రభుత్వానికైనా క్లారిటీ ఉందా అంటే జవాబు కోసం వెతుక్కోనవసరం లేదు. కానీ ఆ ప్రశ్నలకు బదులిచ్చేందుకు ప్రభుత్వం వద్దనైనా సమాచారం ఉందా అంటే పరిశీలకులు లేదనే విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే.. నాలుగున్నరేళ్ల జగన్ ప్రభుత్వ హయంలో ఆసుపత్రులకు చెల్లించాల్సిన ఆరోగ్యశ్రీ బకాయిలు కొండలా పేరుకుపోయాయి. ఒక్కో ఆసుపత్రికి కోటాను కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉందంటే అతిశయోక్తి కాదు.  గతంలో అంటే విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు హయాంలో  కొంచం ఆలస్యంగానైనా, అంటే  ఏ ఏడాదికి ఆ ఏడాది ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించే వారు.   వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ సర్కార్ ఆరోగ్య శ్రీ బిల్లుల చెల్లింపును మూలన పడేశారు. ఈ విషయంపై  ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో ప్రభుత్వ పెద్దలు బెదిరింపులకు దిగారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే రావాల్సిన బకాయిల సంగతెలా ఉన్నా.. ఇకపై తమకు ఆరోగ్యశ్రీనే వద్దంటూ కొన్ని ఆసుపత్రులను ఈ సేవ నుండి బయటకొచ్చేశాయి. గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ సేవ తమ ఆసుపత్రికి కావాలంటూ దరఖాస్తుల వెల్లువ రాగా.. ఈ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీలో ఉన్న ఆసుపత్రులే బయటకి వచ్చేశాయి. ఇక మరికొన్ని ఆసుపత్రులలో అయితే కేవలం వైద్యం మాత్రమే ఆరోగ్య శ్రీలో అందిస్తుండగా.. మిగతా వైద్య పరీక్షలు, మందులు వంటివి రోగుల వద్ద డబ్బులు కట్టించుకుంటున్నారు. కొన్ని ఆసుపత్రులలో అయితే ఆసుపత్రులలో అన్ని పరీక్షలు చేసే సదుపాయం ఉన్నా.. బకాయిలు రాక ఆరోగ్యశ్రీ పేషేంట్లను బయట ల్యాబులకు పంపి పరీక్షలు చేయిస్తున్నారు. కేవలం డాక్టర్ల ఫీజులు, ఆసుపత్రి రూమ్ అద్దెలు వంటివి మాత్రమే ఆరోగ్యశ్రీలో అందిస్తున్నారు. వాటికి ఆసుపత్రుల యాజమాన్యాలు పెట్టుబడులు పెట్టే అవసరం లేకపోవడంతో.. ప్రభుత్వం నుండి బకాయిలు ఎప్పుడొచ్చినా తమకి నష్టం ఉండదన్న ఆలోచనతో ఇలా ఆరోగ్యశ్రీలో కొనసాగుతున్నాయి. ఎక్కువ శాతం ఆసుపత్రులైతే ప్రభుత్వం మారకపోతుందా.. కొత్త ప్రభుత్వంలో అయినా బిల్లులు రాకపోతాయా అని కొనసాగుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితిలో ఆరోగ్య శ్రీని రూ.25 లక్షలకు పెంచినా ప్రయోజనం ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గతంలో జిల్లాకు పదుల సంఖ్యలో ఉన్న ఆరోగ్యశ్రీ.. ఇప్పుడు జిల్లాకు పది కూడా లేకపోగా.. ఉన్న వాటిలో కూడా వైద్యం అంతంత మాత్రమే. మరి ఈ పరిస్థితుల్లో ఆరోగ్య శ్రీ పరిమితిని 5 లక్షల నుంచి ఏకంగా పాతిక లక్షలకు పెంచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా అంటే ఉంది. ఆ ప్రయోజనం పేద రోగులకు కాదు.. మరో సారి అధికారంలోకి రావాలని భావిస్తున్న జగన్ కు. ఔను జగన్ కు ఈ నిర్ణయం రాజకీయంగా లబ్ధి చేకూరుతుందని ఆయన అనుయాయులు, వంధిమాగధులు గట్టిగా నమ్ముతున్నారు.  ఈ నేపథ్యంలోనే బకాయిలు పేరుకుపోవడం వల్ల ఆరోగ్య శ్రీ సేవలు అందించలేమంటూ బోర్డులు తగిలించిన కడప జిల్లాలోని 17 ఆస్పత్రుల లైసె్సులు రద్దు చేస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.  మొత్తంగా ఉత్తుత్తి పథకాలతో జగన్ పేదలను మభ్య పెట్టి ఎన్నికల పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

బాబు బెయిలు రద్దుకు సుప్రీం నో.. ఐఆర్ఆర్ కేసులో సుప్రీంలో జగన్ సర్కార్ కు షాక్..

ఇన్న‌ర్ రింగ్ రోడ్డు కేసులో సుప్రీం కోర్టులో జగన్ సర్కార్ కు భారీ షాక్ తగిలింది.  తెలుగు దేశం పార్టీ అధినేత‌ చంద్ర‌బాబు నాయుడికి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏపీ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిలును రద్దు చేయాలంటూ ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ ను  సుప్రీం కోర్టు కొట్టి వేసింది.  హైకోర్టు అన్ని అంశాల‌ను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకునే ఉత్త‌ర్వులు ఇచ్చింద‌ని, కేసు ద‌ర్యాప్తుపై ముంద‌స్తు బెయిల్ ప్ర‌భావం ఎంత మాత్రం ఉండదని సుప్రీం కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.  ఈ కేసులో చంద్ర‌బాబుకు నోటీసులు ఇచ్చేందుకు నిరాక‌రించడమే కాకుండా ఈ దశలో కేసులో జోక్యం చేసుబోమని స్పష్టం చేసింది.  ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో విపక్ష నేత చంద్రబాబును ప్రజలకు దూరం చేయడమే లక్ష్యంగా జగన్ సర్కార్ వరుసగా కేసులు నమోదు చేసిన సంగతి విదితమే. స్కిల్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన సమయంలో వచ్చిన ప్రజా స్పందన కారణంగా జగన్  లక్ష్యం నెరవేరడం అటుంచి ఆయనను ప్రజలకు మరింత చేరువ చేసింది.  ఆయన రాజమహేంద్రవరం జైలులో ఉన్నన్ని రోజులూ చంద్రబాబు విజన్, చంద్రబాబు హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆ తరువాత  విభజిత ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అభివృద్ధి, ఉపాధి, ఉద్యోగ కల్పనలో ఆయన అవలంబించిన విధానాలు, ఐటీ రంగంలో చేసిన అభివృద్ధి ఇవే రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చర్చకు వచ్చాయి. దేశ విదేశాల్లో ఆయన అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి.  సరే స్కిల్ కేసులో ఆయన బెయిలు కంటే క్వాష్ కే ప్రాధాన్యత ఇవ్వడంతో హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకూ జరిగిన సుదీర్ఘ విచారణల కారణంగా ఆయన నెలల తరబడి రాజమహేంద్రవరం జైలులోనే ఉండాల్సి వచ్చినప్పటికీ... అదే కారణంగా ఆయన ప్రజల హృదయాలలో మరింత సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకోగలిగారు. సరే స్కిల్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేయడంతో ఆయన బయటకు వచ్చారు.  ఆయన రాజమహేందరవరం జైలు నుంచి బయటకు వచ్చిన సమయంలో ఆయన కోసం జనం స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి మరీ మద్దతు తెలిపారు. అర్థరాత్రి దాటినా, తెల్లవారు జాము అయినా జనం ఆయన కోసం రోడ్లపై వేచి ఉన్నారు. రాజమహేంద్ర వరం నుంచి విజయవాడ కరకట్టపై ఉన్న ఆయన నివాసానికి చంద్రబాబు కాన్వాయ్ చేరుకోవడానికి పది గంటలకు పైగా సమయం పట్టిందంటేనే అర్ధం చేసుకోవచ్చు జగన్ సర్కార్ ఆయనను అక్రమంగా అరెస్టు చేయడాన్ని జనం ఎంతగా వ్యతిరేకించారో.  సరే ఇక మిగిలిన కేసులలో కూడా ఆయనకు కోర్టులు ముందస్తు బెయిలు మంజూరు చేశాయి. అయితే వాటిలో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ జగన్ సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అక్కడా జగన్ సర్కార్ కు షాక్ తగిలింది.  జగన్ సర్కార్ పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. 

న్యాయపోరాటంతో పాటు రాజకీయ పోరాటం.. షర్మిలతో చేతులు కలిపిన డాక్టర్ సునీత

డాక్టర్ వైఎస్ సునీత.. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు ముందు వరకూ ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు.  అయితే తన తండ్రి హంతకులను చట్టం ముందు దోషులుగా నిలబెట్టాలన్న సంకల్పంతో ఆమె చేసిన అనితర సాధ్యమైన న్యాయపోరాటంతో తెలుగు ప్రజలందరికీ సుపరిచితురాలిగా మారిపోయారు. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి స్వయానా తమ్ముడైన వైఎస్ వివేకా హత్య జరిగే సమయానికి ప్రస్తుత సీఎం జగన్ విపక్ష నేతగా ఉన్నారు. తన చిన్నాన్నను దారుణంగా హత్య చేశారంటూ అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నారాసుర రక్త చరిత్ర అంటూ కథనాలు వండి వార్చారు. తన బాబాయ్ హత్య కేసు సీబీఐకి అప్పగించాలంటూ డిమాండ్ చేశారు. ఆ సమయంలో వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత అన్న వెంటే ఉన్నారు. పెదనాన్న కుమారుడు, తన సోదరుడు అయిన జగన్ వివేకా హత్య కేసు నిందితులకు శిక్ష పడేలా చేసి తన తండ్రి ఆత్మకు శాంతి చేకూరుస్తారని భావించారు.  అయితే తన తండ్రి హత్యను తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్న జగన్  ఎన్నికలలో విజయం సాధిం చిన తరువాత పట్టించుకోవడం మానేశారు. అంతే కాదు.. తాను విపక్ష నేతగా ఉన్నప్పుడు సీబీఐ విచారణను డిమాండ్ చేసిన జగన్, సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే  మాట మార్చారు. మడమ తిప్పారు. తన బాబాయ్ హత్య కేసు విచారణ సీబీఐకి అప్పగించవద్దని అన్నారు. ఆ మేరకు కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. అప్పటికి కానీ డాక్టర్ సునీతకు వాస్తవం బోధపడలేదు. పెదనాన్న కుమారుడు జగనన్న తన తండ్రి హంతకులకు వత్తాసుగా వ్యవహరిస్తున్నారని గ్రహించిన ఆమె న్యాయపోరాటానికి నడుంబిగించారు. అన్న వద్దని అన్న సీబీఐ విచారణకు పట్టుబట్టి సాధించారు. అంతే కాదు ఏపీలో అయితే  విచారణ సజావుగా సాగదంటూ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ పోరుగురాష్ట్రానికి మార్పించుకున్నారు.  ఇక గత ఐదేళ్లుగా వివేకా హత్య కేసు మలుపుల మీద మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే.   హత్య జరిగిన వెంటనే ఆరోపణలు గుప్పించిన వాళ్లే  కేసు దర్యాప్తోల  నిందితులుగా, అనుమానితులుగా బోనులో నిలబడాల్సి వచ్చింది. అప్పట్లో ఆరోపణలు ఎదుర్కొన్నవారికి ఆ కేసుతో  ఏం సంబంధం లేదని  విస్పష్టంగా తేలిపోయింది. అప్పట్లో నారాసుర రక్త చరిత్ర అంటూ ఆరోపణలు గుప్పించిన వారే ఇప్పుడు వివేకా హత్య కేసులో అభియోగాలను ఎదుర్కొంటున్నారు. నిందితులుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అరెస్టయ్యారు. బెయిలుపై తిరుగుతున్నారు. ముందస్తు బెయిలుతో అరెస్టులను తప్పించుకున్నారు.  అసలు వివేకా హత్య కేసు దర్యాప్తు నాలుగున్నరేళ్లుగా ఎందుకు సాగుతూ వస్తోంది. ఆ కేసు ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కు చందంగా సాగడానికి కారకులెవరు అన్న విషయంలో కూడా ఇప్పుడు ఎవరికీ ఎలాంటి సందేహాలూ లేవు. హత్యకు కారకులెవరు? హత్య లో పాత్రధారులు, సూత్రధారులు ఎవరు అన్న విషయాన్ని కోర్టులు ఇంకా ధృవీకరించలేదు. కానీ ప్రజలకు మాత్రం ఈ విషయంలో క్లారిటీ వచ్చేసింది.  రాష్ట్రంలో అందరికీ వివేకా హత్య మోటో ఏమిటి? చేసిందెవరు? చేయించిందెవరు? అన్నవిషయంలో అనుమానాలు కానీ సందేహాలు కానీ లేవు. అసలీ కేసు ఇంత వరకూ వచ్చి.. ఒక లాజికల్ ఎండ్ దిశగా సాగుతున్నదంటే అందుకు మాత్రం వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీతే కారణం.  తన తండ్రి  వైఎస్ వివేకానందరెడ్డి హంతకులు తన తండ్రి  హంతకులు, వారి వెనుకనున్న ముసుగువీరుల సంగతి తేల్చాలంటూ డాక్టర్ సునీత చేసిన, చేస్తున్న న్యాయ పోరాటం చారిత్రాత్మకం. బహుశా చరిత్రలో ఏ హత్య కేసులోనూ ఇన్ని మలుపులు తిరిగి ఉండవు. అలాగే కోర్టు తీర్పులతో సంబంధం లేకుండా జనమే హంతకులు ఎవరు, వారి వెనుకనున్నది ఎవరు అన్న విషయంలో నిర్ధారణకు వచ్చేసిన సందర్భం కూడా గతంలో ఎన్నడూ లేదని చెప్పవచ్చు. ఇదంతా కేవలం డాక్టర్ సునీత పోరాట ఫలితమే. ఇప్పుడు వివేకా హత్య కేసులో తీర్పు ఒక లాంఛనమే. హత్య ఎవరు చేశారు? ఎవరు చేయించారు అన్న విషయంలో ప్రజలలో ఎలాంటి అనుమానాలూ, సందేహాలూ లేవు.   ఒక మహిళగా, ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా, న్యాయం కోసం సునీత చేసిన, చేస్తున్న  పోరాటం సాధించిన విజయంగానే దీనిని అభివర్ణించాల్సి ఉంటుంది.   వ్యవస్థలను మేనేజ్ చేయడంలోనూ, నిర్వీర్యం చేయడంలోనూ  అధికార వైసీపీ ఈ నాలుగున్నరేళ్లలో మాస్టర్ అయిపోయింది. ఆ కారణంగా  కేసు దర్యాప్తు వేగాన్ని మందగించేలా చేసింది. చేస్తోంది.  ఈ కేసులో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత వత్తాసుగా నిలిచింది. ప్రభుత్వంలో ఉండి కూడా కేసు నీరుగారే విధంగా మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు వ్యవహరించారు.  ఇన్ని రకాలుగా ప్రయత్నించినా జనం ముందు అవినాష్ దోషిగా నిలబడ్డారంటే అందుకు ఒకే ఒక్క కారణం డాక్టర్ సునీత న్యాయపోరాటం. ప్రభుత్వ మద్దతు పూర్తిగా ఉండి కూడా అరెస్టును తప్పించుకోవడానికి అవినాష్ ఎంతలా పరుగులు పెట్టారో ప్రజలు గమనించారు. సరే చివరికి కేసులో తీర్పు ఇంకా రాలేదు. అది వేరే విషయం. అయితే సునీత పోరాటం మాత్రం ఫలితం సాధించింది. ఆమె ప్రజల మనస్సులను గెలుచుకుంది. అయితే తండ్రి హత్య కేసులో పాత్రధారులు, సూత్ర ధారులపై ఇప్పుడు ఆమె రాజకీయ పోరాటానికి సైతం సిద్ధమయ్యారు.  వివేకా హత్య కేసులో న్యాయం కోసం తాను చేస్తున్న న్యాయపోరాటానికి మద్దతుగా నిలిచిన వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరి న్యాయపోరాటంతో పాటు రాజకీయ పోరాటం కూడా చేయాలని డిసైడైపోయారు. కడప లోక్ సభ స్థానం నుంచి డాక్టర్ సునీత కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగడం దాదాపు ఖాయమైపోయినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఒంగోలు ఆఫర్ రిజెక్ట్.. జగన్ పై రోజా రివోల్ట్?

రోజా విషయంలో జగన్ భయపడినదే జరుగుతోందా? ఇప్పటి వరకూ జగన్ కోసం తన గొంతు అరువిచ్చిన రోజా ఇప్పడు జగన్ లక్ష్యంగా విమర్శలు సంధించనున్నారా? అంటే పార్టీ వర్గాలే కాదు పరిశీలకులూ విశ్లేషిస్తున్నారు. రాజకీయ వర్గాలు సౌతం ఔననే అంటున్నారు. నగరి నియోజకవర్గంలో రోజాకు తీవ్ర వ్యతిరేకత ఉందంటూ గత కొంత కాలంగా సొంత పార్టీలోనే ప్రచారం ఓ రేంజ్ లో జరుగుతోంది.  అంతెందుకు గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్షల సందర్భంగా అంటే దాదాపు ఎనిమిది నెలల కిందటే.. సీఎం జగన్ రోజాకు గట్టి వార్నింగ్ ఇచ్చారని కూడా పార్టీలో ప్రచారం జరిగింది. ఇక నియోజకవర్గాల మార్పు అంటూ జగన్ కసరత్తు ప్రారంభించిన క్షణం నుంచీ రోజాకు ఈ సారి పోటీకి అవకాశం లేదు.. కేవలం పార్టీ బాధ్యతలకే పరిమితం చేస్తారంటూ వైసీపీ శ్రేణులు చెబుతూ వస్తున్నాయి. అయినా ఐదు జాబితాలు ప్రకటించినా జగన్ రోజాకు స్థానం లేదని మాత్రం చెప్పడానికి ధైర్యం చేయలేకపోయారు. ఆమె నోటి దురుసుతనం తెలిసిన జగన్ రోజా సిట్టింగు స్థానం మార్పు విషయంలో ఒక నిర్ణయం తీసేసుకున్నా దానిని బాహాటంగా వెల్లడించేందుకు మాత్రం జంకారు. ఇక ఇప్పుడు ఆమెకు నగరి అసెంబ్లీ స్థానం నుంచి కాకుండా ఒంగోలు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాల్సిందిగా సమాచారం అందించారని చెబుతున్నారు. ఆమె స్పందన చూసిన తరువాత ప్రకటన చేయాలని భావిస్తున్నారని అంటున్నారు.  నగరి స్థానం నుంచి మార్చే విషయం ఇప్పటి వరకూ ఆమెకు నేరుగా చెప్పకున్నా.. లీకుల ద్వారా, నియోజకవర్గ పరిధిలోని పార్టీ స్థానిక ప్రజా ప్రతినిథుల ద్వారా చేయించిన ఆరోపణలు, పార్టీ వర్గాల చర్చలు, నియోజకవర్గంలో ఆమెకు వ్యతిరేక గ్రూపులకు అందించిన ప్రోత్సాహం వంటి విషయాలతో ఆమెను ఇప్పటికే మానసికంగా సిద్ధం చేసేశామన్న భావనకు వచ్చిన తరువాతే రోజాకు ఆమెకు గుంటూరు లోక్ సభ స్థానం కేటాయించినట్లు సమాచారం అందించారని అంటున్నారు. అయితే  ఇంత కాలం తన నియోజకవర్గ మార్పు విషయంలో జరుగుతున్న ప్రచారాన్నంతా మౌనంగా గమనిస్తూ వచ్చిన రోజా.. ఇప్పుడు ఆ ప్రచారాన్నికన్ ఫర్మ్ చేస్తూ తనకు జగన్ సమాచారం పంపించడంతో ఇక మౌనం వహించే ప్రశ్నే లేదంటూ గట్టిగా గళమెత్తారని అంటున్నారు. ఎవరి ద్వారా అయితే జగన్ తనకు ఒంగోలు కేటాయిస్తున్నట్లు సమాచారం పంపారో వారి ద్వారానే తాను అందుకు సిద్ధంగా లేనన్న బదులు కూడా పంపించారని అంటున్నారు. తాను పోటీలో ఉంటాననీ అయితే అది ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాత్రం కాదనీ ఆమె కుండబద్దలు కొట్టేశారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. తాను నగరి నుంచే బరిలోకి దిగుతాననీ, వైసీపీ కాకపోతే ఇంకో పార్టీ అదీ కాకపోతే ఇండిపెండెంట్ అని తెగేసి చెప్పారని చెబుతున్నారు. రోజా నుంచి ఈ స్థాయిలో ధిక్కారం వస్తుందని ఊహించని జగన్ కంగుతిన్నారని అంటున్నారు.  అసలు నగరి నుంచి రోజాను వెళ్లగొట్టడమే లక్ష్యంగా పెద్దిరెడ్డి రాజకీయాలు చేస్తున్నారు. జగన్ కు కూడా ఆమెకు మరోసారి టికెట్ ఇవ్వడం ఇష్టం లేకపోవడంతో నగరి నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రోజాకు వ్యతిరేకంగా చేస్తున్న రాజకీయాలను ప్రోత్సహించారు. నియోజకవర్గంలో ఎవరితోనూ సఖ్యత లేదంటూ పలుమార్లు రోజాను మందలించిన జగన్ అందరినీ కలుపు పోవాలని సూచించినట్లు చేశారు.  ఇవన్నీ ఎందుకంటే రోజా విమర్శల ఘాటు ఎంత తీవ్రంగా ఉంటుందో జగన్ కు తెలియడమే. ఆ కారణంగానే రోజా చేసే రచ్చకు భయపడే ఇంత కాలం నగరి నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించకుండా జాప్యం చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఒంగోలు ఎంపీ అభ్యర్థి అంటూ చేసిన ప్రతిపాదనను రోజా నిర్ద్వంద్వంగా తిరస్కరించడంతో  ఇప్పుడు కూడా రోజా అభ్యర్థితద్వ ప్రకటన జాప్యం చేసే అవకాశాలే మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద రోజాకు అయితే మాత్రం నగరి నుంచి పోటీ చేసేందుకు జగన్ అవకాశం ఇచ్చే అవకాశం లేదని అంటున్నారు. ఇక జగన్ ఆఫర్ చేసిన ఒంగోలు లోక్ సభ సీటును ఆమె నిరాకరిస్తే.. ఆమెకు ఇక పార్టీలో చోటు ఉండటం అనుమానమేనని అంటున్నారు. అదే జరిగితే ఆమె భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోందన్న దానిపై ఏపీ పాలిటిక్స్ లో ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. 

జగన్ మాట తప్పాడు.. మడమ తిప్పాడు.. కన్ ఫర్మ్ చేసేసిన సోదరి షర్మిల

ఏపీ సీఎం జగన్ ఇచ్చిన మాట మీద నిలబడరనీ, ఇచ్చిన హామీలు నెరవేర్చరనీ గత నాలుగున్నరేళ్లుగా విపక్షాలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. ఆయన తప్పిన మాటలు, విస్మరించిన హామీలను ఉదాహరణలుగా చూపుతూనే ఉన్నాయి. అయితే అధికార పార్టీ నేతలు మాత్రం చెప్పినవన్నీ చేసేశామనీ, ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలన్నీ నెరవేర్చేశామనీ ఢంకా బజాయించి చెబుతున్నారు.  అధికారంలో ఉన్నాం మేం చెప్పిందే జనం వినాలి. అలా కాదని విపక్షాలకు వంత పాడితే సంక్షేమం కట్ చేసేస్తామని బెదరింపులకు దిగుతున్నారు. జగన్ పాలనా వైఫల్యాలను ఎండగడుతున్న విపక్షాలపై దాడులకు తెగబడుతున్నారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారు. జైళ్లకు పంపుతున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రంలో ఇదే తంతు జరుగుతోంది. అక్రమ అరెస్టులపై కోర్టులు మొట్టికాయలు వేసినా.. తాను ఇంత చేశాను.. అంత చేశానంటూ ప్రతి బటన్ నొక్కే కార్యక్రమంలోనూ జగన్ ఊదరగొడుతుంటూ వినలేక జనాలు సభా ప్రాంగణం వదిలి పారిపోతున్నా.. అధికార పార్టీ పట్టించుకోలేదు. అధికారంలో ఉన్నాం, ఏం మాట్లాడినా, ఏం చేసినా చెల్లిపోతుందున్న భావనలో ఉండిపోయారు. ఇప్పుడు ఎన్నికల వేళ చెప్పినవన్నీ చేసేశా.. మళ్లీ నాకే అధికారం అంటూ జగన్ ఎన్నికల  ప్రచారాన్ని ప్రారంభించేశారు. సరిగ్గా అలాంటి వేళ.. విపక్షాల విమర్శలకు తన గొంతు కలిపారు జగన్ సోదరి వైఎస్ షర్మిల. ఎవరేమనుకుంటే నాకేం.. నాష్టం వచ్చినట్లు మాట్లాడతాను, నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను అంటూ ముందుకు వెడుతున్న జగన్ కాళ్లకు షర్మిల బ్రేక్ వేశారు.  సొంత చెల్లి తనపై చేస్తున్న విమర్శలకు సమాధానం ఇవ్వకుండా జగన్ అడుగు ముందుకు వేసే పరిస్థితి లేదు. ఒక వేళ జగన్మొండి తనాన్ని ప్రదర్శిస్తూ అడుగు ముందుకు వేద్దామన్నా జనం నిలదీసే అవకాశం ఉంది. ఎందుకంటే రక్తం పంచుకుపుట్టిన చెల్లే తన అన్న మాటమీద నిలబడే రకం కాదనీ, మడమతప్పే రకమని బాహాటంగా చెబుతుంటే.. సొదరి చెబుతున్న మాటలు సత్యం కాదని రుజువు చేసుకోవలసిన బాధ్యత జగన్ పై పడింది. లేకపోతే ఇంత కాలం ఊకదంపుడు మాటలు, ప్రసంగాలూ వినివినీ విసిగిపోయిన నేతలు ఇప్పుడు షర్మిల మాటలను అక్షర సత్యాలుగా భావించే అవకాశాలు ఉన్నాయి.   ఆదివారం తిరుపతి, అనంతపురంలలో ఆయా ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్‌ శ్రేణులతో  సమావేశమైన షర్మిల  వైసీపీ ఆవిర్భావం నాటి పరిస్థితులను జనం కళ్లకు కట్టారు. అప్పట్లో   వైసీపీని తన భుజాలపై మోశానని, తన సోదరుడు జగన్  రాజకీయ భవిష్యత్‌ కోసం 3,200 కి.మీ. పాదయాత్ర చేశానని.. వైసీపీని గెలిపించానని.. ఆయన కోసం అనేక ఇబ్బందులకు ఓర్చాననీ చెప్పిన షర్మిల.. జగన్ కు కృతజ్ణత లేదనీ, అధికారం చేపట్టగానే  మారిపోయారనీ విమర్శించారు. ఇప్పుడు తన మీద  తన వ్యక్తిత్వం మీదా, వ్యక్తిగత జీవితం మీదా దాడి చేస్తున్నారు, చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాను బెదిరే రకం కాదనీ, వైఎస్ బిడ్డగా, ఆయన ఆశయ సాధన కోసం ఎన్ని కష్టాలు ఓర్వడానికైనా రెడీ అని స్పష్టం చేశారు.    రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేసిన తరువాతే ఓట్లడుగుతానని గత ఎన్నికల ముందు  చెప్పిన జగన్ ఇప్పుడు మద్యాంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని మార్చేసి ఏ ముఖం పెట్టుకుని ఓట్లడగడానికి రెడీ అయ్యారో చెప్పాలని నిలదీశారు.  మేనిఫెస్టో అంటే తనకు బైబిల్‌, ఖురాన్‌, భగవద్గీత వంటిదని చెప్పిన జగన్ గత ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన ఏ హామీని అమలు చేశారో చెప్పాలని ప్రశ్నించారు.   అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తెస్తామని జగన్‌ అన్నాడు. పోలవరం పూర్తి చేస్తామన్నారు. రాజధాని కడతామన్నాడు. అవేమీ సాధించలేదు. ఆయన హయాంలో ఒక్క పరిశ్రమ రాష్ట్రానికి రాలేదు సరికదా, గత ప్రభుత్వ హయాంలో వచ్చిన పరిశ్రమలు  తరలిపోయాయి. జాబ్ క్యాలెండర్ అన్నారు. విడుదల చేశారా, ఏపీలో నిరుద్యోగ యువత పొట్ట చేతపట్టుకుని వలసలు పోతున్నారన్నారు.   తన ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాలనీ, తన సవాళ్లు స్వీకరించాలనీ డిమాండ్ చేస్తున్న షర్మిలను విస్మరించి జగన్ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించే పరిస్థితి లేదని పరిశీలకులు అంటున్నారు. చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతున్నారనీ, కాంగ్రెస్ తన కుటుంబాన్ని చీల్చిందనీ బేల మాటలతో తప్పిచుకునే అవకాశం లేదని అంటున్నారు. 

లోకేష్ పాదయాత్ర తొలి అడుగుకు ఏడాది! 

కనీ వినీ ఎరుగని నిర్బంధం నడుమ సరిగ్గా ఏడాది కిందట అంటే జనవరి 27, 2023) నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించారు. అంటే నారా లోకేష్ యువగళం పాదయాత్ర తొలి అడుగు వేసి ఏడాది పూర్తయ్యింది.. "జనం బాధలు, ఆకాంక్షలను అర్థం చేసుకోవడానికి, ప్రభుత్వ పీడితులకు నేనున్నానంటూ భరోసా ఇవ్వడానికి, చెలరేగిపోతున్న అరాచకశక్తులను హెచ్చరించడానికి... నారా లోకేశ్ యువగళం ప్రారంభించారు. 2023 జనవరి 27న కుప్పంలోని వరదరాజులు స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తొలి అడుగు వేశారు. నిజానికి రాజకీయ నాయకులు ప్రజలతో ఎంతగా మమేకమైతే అంతగా వారికి దగ్గరౌతారు.  అలాగే  నాయకులకు పార్టీ కార్యకర్తలతో వ్యక్తిగత సంబంధాలు ఎంత బలంగా ఉంటే క్యాడర్ అంత గట్టిగా పార్టీ కోసం, నాయకుడి కోసం పనిచేస్తుంది.     ఆంధ్రప్రదేశ్ లో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్నదని కొత్తగా ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి తన  రాష్ట్రంలో చీకటి పాలనే సాగుతోంది.  ప్రజాస్వామ్యం ఆనవాలు కూడా లేకుండా పోయింది. తాను చెప్పిందే జరగాలి, తన మాటే శాసనం అన్న తరహాలు నిరంకుశ పాలన కొనసాగుతోంది. ప్రశ్నించినా, ప్రతిఘటించినా, వ్యతిరేకించినా వేధింపులు. కేసులు, దాడులు జైళ్లు. అన్నట్లుగా రాష్ట్రంలో పరిస్థితి మారిపోయింది. అటువంటి పరిస్థితుల్లో లోకేష్ ప్రజల ఆకాంక్షలు తెలుసుకుని, వారి కష్టాలకు, కడగండ్లకు చరమగీతం పాడుతానన్న భరోసా కల్పిస్తూ, అధికార పార్టీ అరాచకత్వాలు, వైఫల్యాలపై గళమెత్తుతూ అత్యంత సాహసోపేతంగా పాదయాత్ర ప్రారంభించారు. ఆయన పాదయాత్ర జగన్ ప్రభుత్వం సృష్టించిన అడ్డంకులను అన్నిటినీ దాటుకుని విజయవంతంగా సాగడానికి కారణం తెలుగుదేశం క్యాడర్. ఆ క్యాడర్ లో లోకేష్ పట్ల ఉన్న నమ్మకం. ఔను పైన చెప్పుకున్నట్లు ఒక నాయకుడికి పార్టీ కార్యకర్తలతో వ్యక్తిగత సంబంధాలు ఎంత బలంగా ఉంటే క్యాడర్ అంత గట్టిగా పార్టీ కోసం, నాయకుడి కోసం పనిచేస్తుంది.    లోకేష్ విషయంలో సరిగ్గా అదే జరిగింది.  ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో వైసీపే ప్రభుత్వ సాగిస్తున్న ప్రజా వ్యతిరేక పాలన దుష్పరిణామాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ఆయన చేసిన పాదయాత్ర ఇంత దిగ్విజయం అయ్యిందంటే అందుకు ఆయన పట్ల పార్టీ కేడర్ కు ఉన్న నమ్మకం, విశ్వాసమే కారణం. తమ కోసం నిలబడిన నేత కోసం నిలబడాలన్న కార్యకర్తల సంకల్పం.   పార్టీ కోసం పని చేస్తున్న యువ నాయకులు, కార్యకర్తల గురించి లోకేష్ తీసుకునే శ్రద్ధ గురించి కొత్తగా ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం  పార్టీ కార్యకర్తల మంచి చెడులు చూసుకోవడమే కాకుండా, వారి సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఇస్తున్నారు. కార్యకర్తలకు ఇన్సూరెన్స్ అన్నది లోకేష్ బ్రెయిన్ చైల్డ్ అనడంలో సందేహం లేదు. ఆయన ఆ విధానాన్ని ప్రారంభించిన తరువాతనే  రాజకీయ పార్టీలు తమ పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించడం మొదలెట్టారు.  కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకోవడానికి లోకేష్ ప్రత్యేక  వ్యవస్థను ఏర్పాటు చేశారు. సాంకేతికత సాయంతో  కార్యకర్తలందరికీ చేరువ అయ్యారు. ప్రతి కార్యకర్తతోనూ లోకేష్ కు పేరు పెట్టి పిలిచేంత దగ్గర తనం ఉందని పార్టీ క్యాడర్ సగర్వంగా చెప్పుకుటుంటారు. లోకేష్ కారణంగానే పార్టీలో  ప్రతి కార్యర్తా మరింత చురుకుగా పని చేయడానికి ఉత్సాహం చూపుతున్న వాతావరణం ఏర్పడింది. ఆ వ్యక్తిగత పరిచయం, దగ్గరతనం వల్లే లోకేష్ కు అండగా కార్యకర్తలు ఒక ప్రభంజనంలా కదిలారనీ, లోకేష్ పాదయాత్ర విజయవంతానికి ఇదో ప్రధాన కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.