సెల్ఫ్ గోల్ దిశగా జగన్ నాలుగో అడుగు!?

వైసీపి అధినేత జగన్మోహన్‌ రెడ్డి వచ్చే ఎన్నికలలో  గెలుపు కోసం నేల విడిచి చేస్తున్న సాము ప్రత్యర్థుల నెత్తిన పాలు పోస్తోంది.  తన మీద ఉన్న ప్రజా వ్యతిరేకతను సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఆపాదించి తనకు తోచినట్లుగా వారిని బంతాట ఆడుకుంటున్నారు. జగన్ ఆడుతున్న సిట్టింగుల మార్పు, తొలగింపు ఆటకు ఒక రూల్ అంటూ ఏదీ లేదు. రిఫరీతో పనేం లేదు. తాను ఔట్ అంటే ఔట్, కాదు. మొత్తంగా  జగన్ తన కోసం తన చేత, తానే ఆడుతున్న ఈ ఆట పార్టీ పునాదులను కూల్చేస్తున్నా జగన్ కు వినోదంగానే ఉంది. సీతయ్యలా ఎవరి మాటా వినకుండా, ఎవరినీ పట్టించుకోకుండా జగన్ చేస్తున్న విన్యాసాలు.. పార్టీలో అసమ్మతిని రోజు రోజుకూ పెంచేస్తున్నాయి. అందుకే జగన్ సిట్టింగుల మార్పు కోసం మొదలు పెట్టిన ఆట పార్టీని విజయతీరాలకు చేర్చడం కోసం అని ఆయన అనుకుంటుంటే, పార్టీ శ్రేణులు మాత్రం  జగన్ సెల్ఫ్ గోల్ చేసు కుంటున్నారని, పార్టీ పుట్టి మునగడం ఖాయమని వాపోతున్నారు.  సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలను, చివరికి కొందరు మంత్రులను కూడా పక్కన పెట్టేస్తూ, వారిపై పని రానివారనీ, పనికి రాని వారనీ, వారి వల్ల పార్టీకి నష్టం జరుగుతోందనీ, జరుగుతుందనీ ముద్ర వేసి మరీ తీసిపారేస్తున్నారు. అందుకే ఇక్కడ చెల్లని కానీ ఇంకెక్కడా చెల్లదు అంటూ జనం తమ నియోజకవర్గానికి జగన్ ఎంపిక చేసిన ఇన్ చార్జిని పట్టించుకోవడం లేదు. ఇక పార్టీలో అయితే జగన్ తీసుకొచ్చి తమ నెత్తిన కూర్చో పెడుతున్న అభ్యర్థికి వ్యతిరేకంగా ఏకంగా ఆందోళనలకే దిగుతున్నారు. మీరే అసమర్ధుడని తీసి పారేసిన వ్యక్తిని మాకు అంటగట్టి గెలిపించమంటే ఎలా అని నిలదీస్తున్నారు. ఇక తమపై అసమర్ధుడని ముద్ర వేసి పక్కన పెట్టేసిన సిట్టింగులైతే.. తమ ప్రమేయం ఇసుమంతైనా లేకుండానే నియోజకవర్గాన్ని వాలంటీర్ల చేతిలో పెట్టి, ఇప్పుడు ప్రజా వ్యతిరేకత అంటూ తమను పక్కన పెట్టేయడమేంటని నిలదీస్తున్నారు. కొందరైతే జగన్ కు ఒక దండం, వైసీపీకి ఇంకో దండం అని ముఖం మీదే చెప్పేసి తమ దారి తాము చూసుకుంటున్నారు. మరి కొందరు బాధను, కోపాన్ని మనసులోనే దాచుకుని సమయం కోసం వే చి చూస్తున్నారు. మొత్తం మీద జగన్ సిట్టింగుల మార్పు విన్యాసం, టికెట్ దక్కని నేతలు, దక్కిన నేతలు ఇద్దరిలోనూ సమానంగా అసంతృప్తిని నింపుతోంది.  అయితే జగన్మోహన్‌ రెడ్డి మాత్రం వీటిని వేటినీ పట్టించుకోకుండా,  నాలుగో జాబితాను రెడీ చేసేశారు.  నేడో రేపో ఈ జాబితాను ప్రకటించేందుకు సిద్ధమౌతున్నారు.  ఇప్పటికే తొలి జాబితాలో 11 మందిని, రెండో జాబితాలో 27 మంది, మూడో జాబితాలో  21 మంది చొప్పును మొత్తం  59 మందికి టికెట్స్ ఖరారు చేసారు. ఇక ఇప్పుడు నేడో రేపో ప్రకటించనున్న నాలుగో జాబితాలో   ఎంతమందిని మారుస్తారు,  ఇంకెంత మందికి పార్టీ టికెట్ ఇవ్వకుండా  పక్కనపెట్టేస్తారు అన్న దానిపై పార్టీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పార్టీ వర్గాల సమాచారం మేరకు జగన్ దాదాపు 90 మంది సిట్టింగులను మార్చేయాలని డిసైడ్ అయిపోయారు. దీంతో నాలుగో జాబితాలో తమ జాతకం ఏమిటన్న ఆందోళన సిట్టింగులలో వ్యక్తం అవుతోంది. టికెట్‌ లభించదని భయపడుతున్న వారు,లభించినా నియోజకవర్గం మారుతుందేమోనని ఆందోళన చెందుతున్న వారు తాడేపల్లి ప్యాలస్ వద్ద బెంగగా ఎదురు చేస్తున్నారు. అదే సమయంలో  వైఎస్ షర్మిల కాంగ్రెస్ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన తరువాత అక్కడ తమ బెర్త్ రిజర్వ చేసుకోవడానికి ప్రయత్నాలూ ప్రారంభించేశారు. మొత్తంగా జగన్  విజయం కోసం చేస్తున్న సర్పయాగం లాంటి ఈ సిట్టింగుల మార్పు క్రీడలో ఆయన తనతో పాటు తన పార్టీని కూడా ఆహుతి చేసేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద గెలుపు మంత్రం అంటూ జగన్  సిట్టింగుల మార్పుతో  పార్టీ ఓటమికి రాచబాట పరుస్తున్నట్లుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

అయోధ్యకు ఆహ్వానం అందలేదు: విహెచ్ 

రాముడి పేరు మీద బిజెపి రాజకీయం చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ఆరోపించారు. రాముడిని రాజకీయాల్లోకి లాగి ఓట్లను రాబట్టుకోవాలని బీజేపీ యత్నిస్తోందని ఆయన  విమర్శించారు. అయోధ్య రామ మందిరానికి కాంగ్రెస్ వ్యతిరేకమని బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని... రాముడికి కాంగ్రెస్ వ్యతిరేకం కాదని చెప్పారు. మోదీ పిలిచినప్పుడే అయోధ్యకు వెళ్లాలా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి అయోధ్య రామమందిర ఆహ్వానం అందలేదని విహెచ్ విమర్శించారు. దేవుడిపై అందరికీ భక్తి ఉంటుందని... తాము కూడా వీలైనప్పుడల్లా అయోధ్య రాముడిని దర్శించుకుంటామని తెలిపారు.25 కోట్ల మంది పేదల జీవితాలను కాంగ్రెస్ అతలాకుతలం చేసిందని మోదీ చెప్పడం విడ్డూరంగా ఉందని వీహెచ్ అన్నారు. మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. నోట్ల రద్దు తర్వాత చిరు వ్యాపారులు రోడ్డున పడ్డారని అన్నారు. మద్దతు ధర పెంచాలనే రైతుల డిమాండ్ ను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను వీహెచ్ కలిసి పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు. మరోవైపు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఈరోజు తమ్మినేనిని పరామర్శించారు. 

తెలంగాణ గవర్నర్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ 

ఇప్పటి వరకు రాజకీయ , సినిమా రంగానికి చెందిన ప్రముఖుల ట్విట్టర్ అకౌంట్ లు హాక్ కావడం విన్నాం, చూశాం. కానీ తెలంగాణ గవర్నర్ తమిళ సై ట్విట్టర్ అకౌంట్  హాక్ కావడం చర్చనీయాంశమైంది. గుర్తు తెలియని వ్యక్తులు గవర్నర్ ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేసి పాస్ వర్డ్ మార్చేశారు. కంపెనీ నియమనిబంధనలు ఉల్లంఘించారంటూ ట్విట్టర్ కంపెనీ నుంచి గవర్నర్ కు ఓ మెయిల్ వచ్చింది. దీంతో గవర్నర్ తన ట్విట్టర్ అకౌంట్ ను ఓపెన్ చేసేందుకు ప్రయత్నించగా.. పాస్ వర్డ్ తప్పంటూ జవాబు వచ్చింది.తన ట్విట్టర్ హ్యాండిల్ పోస్టులను పరిశీలించిన గవర్నర్.. అందులో తనకు సంబంధంలేని పోస్టులు పెట్టినట్లు గుర్తించారు. ఈ విషయంపై రాజ్ భవన్ సిబ్బందిని గవర్నర్ ఆరా తీసి, అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో రాజ్ భవన్ అసిస్టెంట్ కంప్ట్రోలర్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. గవర్నర్ ట్విట్టర్ అకౌంట్ ను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేశారంటూ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాఫ్తు చేపట్టినట్లు సమాచారం. ఇటీవలి కాలంలో  తెలంగాణ మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్ బుక్ ఖాతా కూడా హ్యాక్ కు గురైన విషయం తెలిసిందే. మంత్రి ఖాతాను తమ కంట్రోల్ లోకి తీసుకున్న సైబర్ నేరస్థులు అందులో ఇతర పార్టీలకు సంబంధించిన ప్రచార వీడియోలు పోస్టు చేశారు. గతంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌, మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌ అకౌంట్లు కూడా హ్యాకింగ్ కు గురైన సంగతి తెలిసిందే. 

కమలం గూటికి నటి మీనా.. నిజమేనా?

సినీ, రాజకీయ రంగాల మధ్య ఉన్న అనుబంధం గురించి కొత్తగా చెప్పుకోవలసిన అవసరం లేదు. ఎంజీఆర్, కరుణానిథి, ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కల్యాణ్ ఇలా సినీ రంగం నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన వారి సంఖ్య చాలా పెద్దదే. అయితే రాజకీయరంగంలోకి అడుగుపెట్టిన సినీనటులు విజయం సాధించి ఉన్నత శిఖరాలను అందుకున్న వారి సంఖ్య మాత్రం తక్కువే. అంటే సినీ రంగంలో ప్రజాభిమానం సంపాదించుకున్న వారంతా రాజకీయరంగ ప్రవేశం చేసి అక్కడా ప్రజాదరణ పొంది సక్సెస్ అవుతారని చెప్పలేం. సినీ రంగం నుంచి రాజకీయ అరంగేట్రం చేసి ఇలా వెళ్లా అలా వచ్చేసిన వారి సంఖ్య అసంఖ్యాకంగానే ఉంటుంది. అయినా సినీ రంగంలో లభించిన ప్రేక్షకాదరణ రాజకీయ రంగంలో ప్రజాదరణగా మారుతుందని ఆశించి వచ్చే వారి సంఖ్య కూడా రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. తాజాగా ప్రముఖ నటి మీనా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్త ఇప్పుడు ప్రచారంలో ఉంది. ఆమె కమలం గూటికి చేరబోతున్నారని చెబుతున్నారు. ఆ వార్తలను మీనా కూడా ఖండించలేదు. అసలు మీనా పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన వార్త వైరల్ కావడానికి కారణం ఆమె ఢిల్లీలో బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి మురుగన్ ఆధ్వర్యంలో జరిగిన పొంగల్ వేడుకలలో తళుక్కుమనడమే కారణం. కేంద్ర మంత్రి మురుగన్ ఆహ్వానం మేరకు మీనా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. అదే కార్యక్రమంలో ప్రధాని మోడీ, పలువురు కేంద్ర మంత్రులు, కీలక బీజేపీ నేతలూ పాల్గొన్నారు. అటువంటి కార్యక్రమంలో మీనాకు దక్కిన ప్రాధాన్యతే ఆమె రాజకీయ ప్రవేశంపై చర్చకు తెరలేపింది. ఎంతైనా నిప్పు లేనిదే పొగరాదుగా, మీనా కూడా రాజకీయ ప్రవేశం పట్ల ఆసక్తిగానే ఉన్నట్లు చెబుతున్నారు. తాను బీజేపీ గూటికి చేరనున్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతున్నా.. దానిని మీనా ఖండించకపోవడమే ఇందుకు తార్కానంగా చెబుతున్నారు.  మీనా పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన ఏదీ రాకపోయినా.. మొత్తం మీద మరో సినీ సెలబ్రిటి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న వార్త మాత్రం లోకం చుట్టేస్తోంది. 

కాంగ్రెస్ సంక్రాంతి కానుక.. జగన్ మైండ్ బ్లాక్

పోకిరి అనే సినిమాలో  ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు అన్న ఓ పాపులర్ డైలాగ్ ఉంది. ఇప్పుడు షర్మిల ఏపీ పొలిటికల్ ఎంట్రీ జగన్ కు అలా దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే దెబ్బగానే మారింది. ఔను షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం అన్నది జగన్ కు అలాంటి ఇలాంటి దెబ్బ కాదు. వైసీపీ రాజకీయ భవిష్యత్, జగన్ రాజకీయ కెరియర్ ప్రశ్నార్థకంగా మారిపోయేంత చావుదెబ్బగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.  ఔను తెలుగువారికి పెద్ద పండుగ అయిన సంక్రాంతి రోజునే జగన్  పొలిటికల్ కెరియర్ కు ఫుల్ స్టాప్ పెట్టేందుకు కాంగ్రెస్ హై కమాండ్ తొలి అడుగు వేసింది. కనుమరోజున షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించి మలి అడుగు కూడా వేసేసింది. ఇక ఏపీలో  షర్మిల వేసే ప్రతి అడుగూ జగన్ ను, జగన్ పార్టీనీ కొలుకోలేని విధంగా దెబ్బతీసేలాగే ఉంటాయని చెబుతున్నారు.  రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. దీంతో అప్పట్లో  కాంగ్రెస్‌లో చాలా మంది నేతలు,  కార్యకర్తలు జగన్ నేతృత్వంలోని వైసీపిలో గంపగుత్తగా చేరిపోయారు. అదే విధంగా ఏపీలో  కాంగ్రెస్‌ ఓటు బ్యాంక్ కూడా వైసీపికి దఖలు పడిపోయింది. ఇప్పుడు అంటే దాదాపు పదేళ్ల తరువాత వైఎస్ షర్మిల రూపంలో రాష్ట్ర కాంగ్రెస్ కు మళ్లీ జవసత్వాలు కూడగట్టుకునే అవకాశం లభించింది. వైఎస్ షర్మిల  వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె మాత్రమే కాదు.. ఏపీ సీఎం జగన్ కు తోడబుట్టిన చెల్లి కూడా. దీంతో వైసీపిలో నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు భారీగా ఉండటం తథ్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఈ నాలుగున్నరేళ్లలో తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. స్వోత్కర్ష, పరనింద వినా పాలనా పరంగా ఏ రకంగా చూసినా అన్నిందాల విఫలమైన జగన్  పాలనలో ఏ వర్గమూ కూడా హ్యాపీగా లేని పరిస్థితి నెలకొంది. ప్రజా వ్యతిరేకతకు తోడు పార్టీలో కూడా  జగన్ పట్ల అసంతృప్తి కొండలా పేరుకుపోయింది. ముఖ్యంగా నియోజకవర్గంలో పార్టీ ఫేస్ గా ఉండాల్సిన ఎమ్మెల్యేలను డమ్మీలను చేసి వాలంటీర్ల వ్యవస్థను తీసుకురావడం ద్వారా జగన్ క్షేత్ర స్థాయిలో పార్టీ నిర్మాణాన్నే కుప్ప కూల్చేసుకున్నారు.  నియోజకవర్గంలో పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యేలా చేసుకున్నారు. ఇప్పుడు అదే వ్యతిరేకతను సాకుగా చూపి ఇష్టారాజ్యంగా అభ్యర్థులను మార్చేస్తున్నారు. దీంతో సిట్టింగులలో తీవ్ర వ్యతిరేతక వ్యక్తం అవుతోంది. ఇంకెంత మాత్రం జగన్ నాయకత్వంలో పని చేసే ప్రశ్నే లేదని బాహాటంగానే చెబుతున్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీలలో అవకాశం లేని వారికి ఇప్పుడు కాంగ్రెస్ డెస్టినేషన్ గా మారింది. ఇప్పటికే  మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిల వెంటే తన రాజకీయ అడుగులు అని ప్రకటించేశారు. అదే దారిలో  జగన్‌ టికెట్లు ఇవ్వకుండా పక్కన పెట్టేసినవారు, వైసీపిలో ఇమడలేక ఇబ్బంది పడుతున్న సీనియర్ నేతలు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇంతకాలం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదన్న పట్టుదలతో తెలుగుదేశం, జనసేన కూటమి అడుగులు వేస్తోంది. ఆ దారిలో దాదాపు సక్సెస్ అయ్యింది. ఇప్పుడు వైసీపీ అనుకూల ఓటు షర్మిల ఎంట్రీతో గంపగుత్తగా కాంగ్రెస్ కు దఖలు పడనుంది.   దీంతో ఏపీలో వైసీపీకి ఓటు అనేదే లేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.   మొత్తంగా కాంగ్రెస్ ఏపీ పార్టీ  పగ్గాలను షర్మిలకు అప్పగించడం ద్వారా జగన్ ను ఎన్నికల యుద్ధంలో ఆస్త్రాలే లేకుండా చేసేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇప్పటి వరకూ ప్రత్యర్థి పార్టీల నాయకుల వ్యక్తిగత అంశాలను ప్రస్తావిస్తూ, తిట్లూ దూషణలతో విరుచుకుపడిన జగన్ పార్టీకి ఇప్పుడు  షర్మిల రంగంలోకి దిగడంతో నోరెత్తే అవకాశం ఉండదంటున్నారు. ఎందుకంటే జగన్ సొంత చెల్లే అన్నకు వ్యతిరేకంగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. రాజకీయ విమర్శ అంటే ఏమిటో తెలియని వైసీపీ మూకలకు తమ అధినేత సోదరిపై నోరు పారేసుకునే ధైర్యం ఉండదు. ఒక వేళ తెగించి కువిర్శలు చేసినా.. అందుకు దీటుగా బదులివ్వడానికి షర్మిల ఇసుమంతైనా వెనుకాడరు. ఈ పరిస్థితుల్లో జగన్ , ఆయన పార్టీ నేతలు తెలుగుదేశం, జనసేనలపై అనుచిత విమర్శలు చేయాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. అన్నిటికీ మించి తన పాలనా వైఫల్యాలను సొంత సోదరి ఎత్తి చూపుతుంటే.. సమాధానం చెప్పుకుని, వివరణ ఇచ్చుకోవలసిన పరిస్థితిలో జగన్ ఇప్పుడు ఉన్నారు. సో షర్మిల ఎంట్రీతో జగన్ అండ్ కో పూర్తిగా డిఫెన్స్ లో పడిపోవడం ఖాయం. ఇప్పటి వరకూ గుడ్డ కాల్చి ముఖం మీద వేసి తుడుచుకోండి అన్న చందంగా ఇష్టారీతిగా విమర్శలతో , దూషణలతో చెలరేగిపోయిన జగన్ పార్టీకి ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ చార్జ్ గా షర్మిల సంధించే విమర్శలు, ప్రశ్నలకు సమాధానం ఇచ్చుకోవడం వినా, ప్రతి విమర్శ చేయడానికి కానీ అవకాశం ఉండదు. ఇంతకాలం తెలుగుదేశం, జనసేనలు విమర్శలను జగన్మోహన్‌ రెడ్డి, వైసీపి నేతలు చాలా తేలికగా కొట్టిపడేస్తున్నారు. కానీ ఇప్పుడు జగన్మోహన్‌ రెడ్డి సొంత చెల్లెలు వైఎస్ షర్మిల చేయబోయే విమర్శలు, ఆరోపణలను అలా కొట్టిపారేయడానికి అవకాశం ఉండదు. వాటికి సమాధానాలు చెప్పుకోవాలి?  ఇంతకాలం ఎన్టీఆర్‌ కుటుంబంలో చిచ్చు పెట్టి ఆనందించిన జగన్మోహన్‌ రెడ్డికి ఇప్పుడు సొంత చెల్లెలే తిరగబడి నిలదీసే పరిస్థితి రావడం చూస్తుంటే చేసుకున్నవాడికి చేసుకున్నంత మహదేవా అన్న సామెత గుర్తుకు వస్తున్నది. అహంకారం, అధికార మదంతో నాలుగేళ్ల పాటు ఇష్టారీతిగా చెలరేగిపోయిన జగన్ కు ఇప్పుడు అడుగు వేయాలన్నా, అడుగు కదపాలన్నా నేలకింద భూమి కదిలిపోతున్న ఫీలింగ్ వచ్చే పరిస్థితి ఉత్పన్నమైంది. ప్రజలలోకి వెళ్లాలంటే రోడ్లకు ఇరువైపులా పరదాలు కట్టుకుని వెళ్లే పరిస్థితి నుంచి షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంతో మాట్లాడాలంటేనే భయపడే పరిస్థితికి వచ్చారని అంటున్నారు. 

మాజీ మంత్రి తలసానిపై   గొర్రెల స్కాం ఉచ్చు 

మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై అవినీతి ఉచ్చు బిగుస్తోంది. గొర్రెల పంపిణీ స్కీంలో గోల్ మాల్ జరిగినట్టు ఎసిబి అధికారులు గుర్తించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోగానే పశు సంవర్ధక శాఖలో పైళ్లు మాయమవడంపై ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఫైళ్ల మాయం పై ఇప్పటికే నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.  గొర్రెల పంపిణీ స్కీంలో రెండు కోట్ల పది లక్షల అవినీతి జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లపై పోలీసులు  ఎఫ్ ఐ ఆర్  నమోదు చేశారు.  ప్రకాశం జిల్లాకు చెందిన 18 మంది నుంచి  గొర్రెలను కొనుగోలు చేసిన పశు సంవర్ధక శాఖ వారికి డబ్బులు ఇవ్వలేకపోయింది. దీంతో ప్రకాశం జిల్లాకు చెందిన ఏడు కొండలు  గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పశు సంవర్ధక శాఖ డబ్బులు విడుదల చేసినప్పటికీ తప్పుడు ఖాతాలోకి డబ్బులు  వెళ్లినట్లు అధికారులు గుర్తించారు.  గొర్రెల పంపిణీ పథకం గత బిఆర్ ఎస్ ప్రభుత్వ  హాయంలో ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రంలోని యాదవ, కురుమ వర్గాలకు చెందిన వారికి తెలంగాణ ప్రభుత్వం నుండి సబ్సిడీతో గొర్రెలను పంపిణీ చేసే పథకం. 2017, జూన్ 20న సిద్ధిపేట జిల్లాగజ్వేల్ సమీపంలోని కొండపాకలో అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ పథకాన్ని ప్రారంభించారు. గొల్ల, కురమ వర్గాల వారు తమ సాంప్రదాయ వృత్తులలో సాధికారత సాధించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతమవుతుందన్న ఉద్దేశ్యంతో ఈ పథకం ప్రారంభించబడింది. సాధారణంగా పశు సంవర్ధక శాఖలో అవినీతి అక్రమాలు జరిగే అవకాశం తక్కువ. కానీ గొర్రెల స్కీం స్కాంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అతని కుమారుడి పాత్ర ఉందని అధికారులు గుర్తించారు.  ఈ లోకసభ ఎన్నికలకు ముందే తలసానిని అరెస్ట్ చేయవచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. 

షర్మిలకే విజయమ్మ మద్దతు!.. వైఎస్ రాజకీయ వారసురాలిగా అదే గుర్తింపు!

నిన్న మొన్నటి దాకా ఔనా కాదా?.. అవుతుందా అవ్వడా? అంటూ ఎన్నో అనుమానాలు. ఔను షర్మిలకు కాంగ్రెస్ పార్టీ ఏపీ బాధ్యతలు అప్పగిస్తుందా?  పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించి అన్నపై యుద్ధానికి రెడీ కమ్మంటుందా అన్న అనుమానాలు పలువురిలో వ్యక్తం అయ్యాయి. అయితే వాటన్నిటికీ కాంగ్రెస్ హై కమాండ్ ఫుల్ స్టాప్ పెట్టేసింది. సంక్రాంతి పండుగ రోజు పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. ఆ వెంటనే అంటే కనుమ పండుగ రోజున షర్మిలను ఏపీసీసీ చీఫ్ గా కాంగ్రెస్ హై కమాండ్ అప్పాయింట్ చేసేసింది. దీంతో షర్మిల ఇక ఏపీలో కాంగ్రెస్ ప్రచార సారథ్యం చేపట్టినట్లే. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ టార్గెట్ గానే ఆమె విమర్శల బాణాలు సంధించనుంది. గతంలో జగనన్న వదిలిన బాణాన్ని అంటూ అప్పటి తెలుగుదేశం సర్కార్ పై విరుచుకుపడిన షర్మిల ఇప్పుడు జగన్ అంటే తాను ఎవరు వదిలిన బాణంగా రాజకీయాలలోకి ప్రవేశించిందో ఆ అన్నకు వ్యతిరేకంగా విమర్శనాస్త్రాలు సంధించనున్నారు.  జగన్ పాలనా వైఫల్యాలు, అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలపై ఇప్పటికే రాష్ట్రంలో విపక్ష తెలుగుదేశం, ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేన విమర్శలు గుప్పిస్తున్నాయి. జగన్ ఆర్థిక అరాచకత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఆధారాలతో సహితంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. మరి షర్మిల కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా కొత్తగా చేసే విమర్శలు ఏమై ఉంటాయి? జగన్ ప్రత్యర్థులను మించి ఆమె జగన్ పై ఏ విధంగా యుద్ధం చేస్తారు? అంటే పరిశీలకులు  షర్మిల తన ప్రచారంలో  సొంత అన్న తనకు చేసిన అన్యాయాన్ని ప్రజలకు సోదాహరణంగా వివరించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు.  అన్న జైల్లో ఉన్నప్పుడు తాను చేసిన పాదయాత్ర, గత ఎన్నికల ప్రచారంలో అన్న కోసం చేసిన ప్రచారం గుర్తు చేస్తూ, తీరా వైసీపీ అధికారంలోకి  వచ్చిన తరువాత తనను బయటకు పంపేసిన తీరు వంటి విషయాలనన్నిటినీ ప్రస్తావిస్తూ ముందుకు సాగే అవకాశాలే మెండుగా ఉన్నాయని చెబుతున్నారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నారు. ఆ తరువాత మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ పగ్గాలు వైఎస్ కుటుంబం చేతికి వచ్చాయి.  అంటే కాంగ్రెస్ వైఎస్ వారసురాలిగా షర్మిలను ప్రకటించినట్లేనని అంటున్నారు. తండ్రి ఆశయాల సాధన కోసం  షర్మిల ఏపీలో అనుసరించే వ్యూహం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.  అన్న జగన్ ను ఎదుర్కొనేందుకు షర్మిల ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? అన్నను షర్మిల విమర్శించేందుకు ఏయే అంశాలను ఎంచుకుంటారు? కేవలం జగన్ పాలనపైనే అస్త్రాలు సాధిస్తారా? లేక కుటుంబ వ్యవహారాలపై కూడా ప్రశ్నిస్తారా అన్న చర్చ ఇప్పుడు విస్తృతంగా జరుగుతోంది.  అన్న పాలనా వైఫల్యాలతో పాటు, షర్మిల కుటుంబ వ్యవహారాలను కూడా ప్రచారంలో ప్రస్తావిస్తే తమ పరిస్థితి ఏమిటి? అన్న ఆందోళన వైసీపీలో వ్యక్తం అవుతోంది.     ఏపీలో  అత్యంత ప్రజాకర్షణ శక్తి ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తెగా, రాజకీయవారసురాలిగా   షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం రాజకీయంగా ఆమెకు, కాంగ్రెస్ పార్టీకీ కూడా ప్లస్ అవుతుందని చెబుతున్నారు.  ప్రస్తుత సీఎం కూడా వైఎస్ కుటుంబీకుడే అయినప్పటికీ, వైఎస్ అభిమానులు సైతం ప్రస్తుతం జగన్ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు.  వైఎస్ ఆత్మగా గుర్తింపు పొందిన కేవీపీ సైతం జగన్ కు మొదటి నుంచీ దూరంగానే  ఉన్నారు. నాడు వైఎస్ కు సన్నిహితంగా ఉన్న ఎవరూ కూడా ఇప్పుడు జగన్ తో లేరు. ఈ నేపథ్యంలో  కాంగ్రెస్ హై కమాండ్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించడంతో వైఎస్ అభిమానులు, సన్నిహితులు కూడా పార్టీకి దగ్గర అవ్వడమే కాకుండా ఆమెను వైఎస్ రాజకీయవారసురాలిగా అంగీకరించి మద్దతు పలుకుతున్నారు.  ఇప్పటికే జగన్ పాలనలో  పూర్తిగా విఫలమై తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. దానికి తోడు ఆయన వ్యక్తిగత నైజం కూడా ఆయన పార్టీలోని పలువురికి అక్కడ ఇమడలేని పరిస్థితిని తీసుకు వచ్చింది.  అలా అటూ ఇటూ చూస్తున్న వారందరినీ షర్మిలకు ఏపీ పగ్గాలు అప్పగించడం ద్వారా ఆకర్షించవచ్చన్నది కాంగ్రెస్ హై కమాండ్ ఆలోచనగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  వీటితో పాటు వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి షర్మిల వెంట కాంగ్రెస్ గూటికి చేరుతారా? అలా చేరి వచ్చే ఎన్నికలలో కుమారుడు జగన్ కు వ్యతిరేకంగా గళం విప్పుతారా అన్న ఆసక్తి కూడా సర్వత్రా ఉంది.  విజయమ్మ షర్మిల, జగన్ లలో ఎవరికీ మద్దతు తెలపకుండా తటస్థంగా ఉన్నా కూడా అది జగన్ కు నష్టమే. అలా కాకుండా షర్మిల తరఫున ఆమె నిలబడితే ఇక జగన్ కు రాజకీయంగా నూకలు చెల్లినట్లే అవుతుంది. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తుంటే విజయమ్మ షర్మిల వెంటే ఉంటారన్నది పరిశీలకుల విశ్లేషణ. షర్మిల కాంగ్రెస్ గూటికి చేరిన తరువాత కూడా విజయమ్మ ఆమె తోనే ఉండటంతో ఆమె మద్దతు షర్మిలకే అని నిర్ధారణ అవుతోందంటున్నారు. అన్నిటికీ మించి జగన్ పార్టీకి విజయమ్మ గౌరవాధ్యక్షురాలిగా ఉన్న సమయంలో షర్మిలకు రాజ్యసభ సభ్యత్వం కోసం జగన్ పై గట్టిగా ఒత్తిడి చేశారని చెబుతారు. జగన్ ససేమిరా అనడంతోనే ఆమె నొచ్చుకుని పార్టీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేసి కుమారుడికి దూరంగా వచ్చేశారని అంటారు. అలా వచ్చేసిన తరువాత ఆమె ఇప్పటి వరకూ (షర్మిల కుమారుడి వివాహానికి జగన్ ను ఆహ్వానించిన సందర్భంలో కూతురుతో పాటు వెళ్లిన సందర్భం మినహాయిస్తే) తాడేపల్లి ప్యాలెస్ గడప తొక్కకపోవడాన్ని ఉదాహరణగా చూపుతున్నారు. వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉండే వారు కూడా విజయమ్మ తపన, తాపత్రయం అంతా కుమార్తె షర్మిల రాజకీయ భవిష్యత్ కోసమేనని, అందుకే ఆమె షర్మిల వెంటే నడుస్తారని చెబుతున్నారు.   వైఎస్ హయంలో పనిచేసిన సీనియర్ నేతలకు విజయమ్మపై గౌరవాభిమానాలు ఉన్నాయి. అవి ఇప్పుడు షర్మిలకు అండగా మారాలంటే  విజయమ్మ కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది.   గతంలో విజయమ్మ జగన్ కోసం, జగన్ ను సీఎంగా చూడడం కోసం రాజకీయ ప్రవేశం చేసిన విజయమ్మ ఇప్పుడు కుమార్తె  షర్మిల  రాజకీయంగా ఉన్నత స్థాయికి వెళ్లడం కోసం కృషి చేస్తారని అంటున్నారు.  అన్నిటికీ మించి   వివేకా హత్య కడప పార్లమెంటు స్థానం కోసమే జరిగిందని షర్మిల బహిరంగంగా చెప్పిన సందర్భంలో విజయమ్మ ఖండించకపోవడం అంటే ఆమె షర్మిల వ్యాఖ్యలను  సమర్ధిస్తున్నట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సో షర్మిల కాంగ్రెస్ తరఫున తాను చేయబోయే ప్రచారంలో వివేకా హత్య కేసులో నిందితులకు  జగన్ అండ వంటి అంశాలను కూడా ప్రస్తావించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.  షర్మిల ఇప్పటికే పలుమార్లు ఈ హత్యపై వివేకా కుమార్తె సునీతకు మద్దతుగా మాట్లాడారు. అ లాగే సొంత వాళ్ళే తన చిన్నాన్నను హత్య చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందు ముందు కూడా ఇటువంటి విమర్శలతో షర్మిల జగన్ ను ఇరుకున పెట్టడం ఖాయమని అంటున్నారు. ఆ విమర్శలకు విజయమ్మ నుంచి ఖండనలు రాకపోతే.. ఇక జగన్ జనాలకు ముఖం చూపలేక చాటేయాల్సిన పరిస్థితి ఎదురౌతుందని చెబుతున్నారు. మొత్తంగా ఏపీ కాంగ్రెస్ పగ్గాలు షర్మిల అందుకున్న క్షణం నుంచీ జగన్  శిబిరంలో ఆందోళన మొదలైందని చెబుతున్నారు.  ఇక విజయమ్మ కూడా షర్మిల వైపే నిలబడడం నైతికంగా జగన్ కు కోలుకోలేని దెబ్బే అవుతుందని విశ్లేషిస్తున్నారు. 

కృష్ణ కృష్ణా.. వైసీపీ ఖాళీయేనా?

ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీకి గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. మూడు రాజధానుల అంశానికి తోడు, జగన్ సిట్టింగుల మార్పు ప్రయోగం కూడా ఆ పార్టీకి జిల్లాలో చోటే ఉండని పరిస్థితిని తీసుకువచ్చింది. సరిగ్గా ఎన్నికల వేళ ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ నేతలు ఒక్కరొక్కరుగా పార్టీని వీడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే  ఆ వలసల ఉదృతి మొదలైనట్లు పరిశీలకులు చెబుతున్నారు.  మరీ ముఖ్యంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలుగుదేశం గూటిని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకున్న తరువాత వైసీపీలో అసంతృప్తి పతాక స్థాయికి చేరుకుందని అంటున్నారు. కేశినేని నాని పార్టీలో చేరకుండానే ఆయనను ఇన్ చార్జిగా జగన్ ప్రకటించడం పార్టీలో తొలి నుంచీ ఉంటున్న వారిలో అసంతృప్తికి, ఆగ్రహానికీ కారణమైందని చెబుతున్నారు. ఇక ఇప్పుడు వైసీపీని వీడే వారి జాబితా కొండవీటి చాంతాడును మించిపోవడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే జిల్లా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథి బయటకు వచ్చేశారు.  అలాగే బాలశౌరి కూడా తాను పార్టీ వీడుతున్నట్లు ప్రకటించేశారు. ఇంకా వసంత కృష్ణ ప్రసాద్, మల్లాది విష్ణు, గత ఎన్నికలలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బొప్పన భవన్ కుమార్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఇలా చెప్పుకుంటూ పోతే సీనియర్ నాయకులు చాలా చాలా మందే ఉంటారని చెబుతున్నారు.   ఇలా వైసీపీకి గుడ బై చెప్పి బయటకు వచ్చే వారంతా వచ్చే ఎన్నికలలో పార్టీకి వ్యతిరేకంగా పని చేయడం ఖాయంగా కనిపిస్తోంది. షర్మిల కాంగ్రెస్ గూటికి చేరి ఆ పార్టీ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన తరువాత వైసీపీలోని పాత కాంగ్రెస్ వాదులందరికీ ఒక ధైర్యం వచ్చిందని అంటున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డిపై అభిమానం, గౌరవంతో వైసీపీ గూటికి చేరిన వీరందరూ ఇప్పటి వరకూ పార్టీలో ఎన్ని అవమానాలు ఎదురైనా మౌనంగా ఉన్నారు. అయితే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పగ్గాలను వైఎస్ తనయ షర్మిల చేపట్టారో వారందరికీ ఇప్పుడు కాంగ్రెస్ బెస్ట్ ఆప్షన్ గా మారిపోయింది. వీరు కాక.. ఇప్పటికే తెలుగుదేశం, లేదా జనసేనలో సీటు రిజర్వ్ చేసుకున్న వారు కూడా జగన్ కు జెల్ల కొట్టేసి పార్టీ మారేందుకు రెడీ అయిపోయారు.   మొత్తం మీద ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ దాదాపు ఖాళీ అయిపోయినా ఆశ్చర్య పోవలసిన పని లేదని అంటున్నారు. ఎదుటి పార్టీలను చీల్చి లబ్ధి పొందుదామనుకున్న జగన్ కు తన పార్టీ నుంచే నేతలు కుప్పతెప్పలుగా బయటకు పోవడం మింగుడు పడటం లేదనీ, వీరి వలసలను ఎలా ఆపాలో తెలియక తాడేపల్లి ప్యాలెస్ గోడలకు తలబాదుకుంటున్నారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 

రిటైర్డ్ ఉద్యోగుల సేవలు ఇక చాలు.. రేవంత్ సర్కార్ నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో పదవీ విరమణ తరువాత కూడా ప్రభుత్వ సర్వీసులలో ఎక్స్ టెన్సన్ పై కొనసాగుతున్న అధికారుల సేవలను ఉపయోగించుకోరాదని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది.  గత ప్రభుత్వ హయాంలో రిటైరయినప్పటికీ తమ పదవుల్లో  కొనసాగుతున్న వారిని ఇక సాగనంపాలని నిర్ణయించింది.  పదవీ విరమణ తరువాత కూడా సర్వీసుల్లో కొనసాగుతున్న వారి జాబితా పంపాలని అన్ని ప్రభుత్వ శాఖలకూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి ఈమేరకు అన్ని ప్రభుత్వ శాఖలకు సర్క్యులర్ జారీ చేశారు. ఆ జాబితాను బుధవారం సాయంత్రం 5 గంటలలోగా అందజేయాలని ఆ ఉత్తర్వులలో ఆదేశించారు.  కేసీఆర్ హయాంలో  రిటైర్ అయిన ఆఫీసర్లను ఇష్టారాజ్యంగా కొనసాగించారనీ, తమకు అనుకూలంగా  పనులు చేయించుకున్నారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో  రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు.   ఇలా పదవీ విరమణ తరువాత కూడా అధికారులను కొనసాగించడం వల్ల అర్హులకు ప్రమోషన్లు  ఆగిపోయాయి. వారంతా  తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇలా పదవీ విరమణ తరువాత కూడా సర్వీసుల్లో కొనసాగుతున్న వారు వందల సంఖ్యలో ఉంటారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రిటైర్మెంట్ అనంతరం కూడా పదవుల్లో కొనసాగుతున్న వారు ఎంత మంది  అన్నదానిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందుకే అటువంటి వారి జాబితాను అందజేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆ జాబితా అందిన తరువాత వారికి ఉద్వాసన పలికే అవకాశాలు ఉన్నాయి.   పదవీ విరమణ పొందిన తరువాత కూడా పలువురు అధికారులు గత ప్రభుత్వ ఆశీస్సులతో  వివిధ స్థాయులలో  విధులలో కొనసాగుతున్నారు.  వివిధ ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, బోర్డులలో పని చేస్తోన్న వారి వివరాలను  బుధవారం సాయంత్రం ఐదు గంటలలోపు నిర్ణీత నమూనాలో  ఇవ్వాలని ముఖ్య కార్యదర్శులు, శాఖాధిపతులను శాంత కుమారి ఆదేశించారు.

విషమంగా తమ్మినేని ఆరోగ్యం.. హెల్త్ బులెటిన్ విడుదల

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని  ఆరోగ్యం విషమంగా ఉంది. వైద్యులు ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ఖమ్మంలోని తన నివాసంలో ఉండగా తమ్మినేని వీరభద్రం మంగళవారం (జనవరి 16) గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం ఆయనను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.  అక్కడ వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. తమ్మినేని గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారని వైద్యులు పేర్కొన్నారు.  తమ్మినేని ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందనీ,  నిపుణులైన వైద్యులపర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు.  

కల్వకోలులోని కాకతీయ శాసనాలు కాపాడుకోవాలి..పురావస్తు పరిశోధకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి

కొల్లాపూర్ పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలోని పెద్ద కొత్తపల్లి మండలం, కల్వకోలు కాకతీయ గణపతి దేవుని కాలపు శాసనాన్ని కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. గ్రామం బయట మట్టికోట గోడ లోపల ఉన్న నంది కోటేశ్వర స్వామి ఆలయం పక్కనున్న క్రీ. శ. 13వ శతాబ్ధనాటి శాసనం మట్టిలో కూరుకు పోయిందని, కాకతీయుల వంశ వృక్షాన్ని, ప్రోల రాజు విజయాలను, గణపతి దేవుని సామంతుడైన చెఱకు బోల్లయ రెడ్డి జమ్మలూరుపురం కలువకొలను గాను, పిలవబడిన కల్వకోలు పట్టడానికి ఏరువ సీమకు అధిపతి అన్న వివరాలు ఉన్నాయన్నారు. చారిత్రక ప్రాధాన్యత గల ఈ శాసనం, క్రీ.శ. 1321 నాటి ప్రతాపరుద్రుని శాసనం, మట్టి కోటను కాపాడుకోవాలని కల్వకోలు గ్రామస్తులకు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే  

రాష్ట్ర శాసన మండలిలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల సంఘం షెడ్యూల్ ను ప్రకటించింది. జనవరి 18వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. వీటి భర్తీకి ఈసీ వేర్వురు నోటిఫికేషన్లు విడుదల చేయటంతో…ఈ రెండు స్థానాలు కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉంది. అయితే ఇందుకోసం పార్టీలని పలువురు కీలక నేతలు పోటీ పడుతున్నారు. నామినేషన్ల స్వీకరణకు గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో… ఏ క్షణమైనా కాంగ్రెస్ పార్టీ జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. పలువురిని పేర్లను పరిశీలించిన హైకమాండ్… ఇద్దరిని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఇద్దరు అభ్యర్థులను ఖరారు చేసింది. పార్టీ సీనియర్ నాయకులు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ పేర్లను ఫైనల్ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దలు వారికి ఫోన్ చేసి సమాచారం అందించారు. నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు.అద్దంకి దయాకర్ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి టిక్కెట్ ఆశించారు. కానీ టిక్కెట్ దక్కలేదు. బల్మూరి వెంకట్ 2021 హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.  ఉన్నది రెండు ఎమ్మెల్సీ పదవులే అయినా.. పోటీలో మాత్రం ఎక్కువ మందే ఉన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన షబ్బీర్ అలీ, అజారుద్దీన్, సంపత్, మధు యాష్కీ గౌడ్ వంటి నేతలు కూడా ఎమ్మెల్సీ పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ నుంచి ఒక్క ముస్లిం మైనారిటీ నాయకుడు కూడా ఎమ్మెల్యేగా లేరు. అదే మాదిరిగా ఎమ్మెల్సీలు కూడా లేరు. మంత్రి వర్గంలోకి ఒక ముస్లిం మైనారిటీ నేతను తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ ఎంపీ స్థానాలపై కన్నేసిన కాంగ్రెస్ కు ముస్లిం మైనారిటీ ఓట్లు కీలకం కానున్నాయి. ఇక గవర్నర్ కోటాలో కూడా రెండు ఎమ్మెల్సీ పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఒకటి ప్రొఫెసర్ కోదండరామ్ కు ఇచ్చే అవకాశం ఉండగా… ఒకటి మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తికి ఇస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే వీటిపై కూడా క్లారిటీ రానుంది.

చంద్రబాబు క్వాష్ లో కొత్త మలుపు.. జడ్జీలకే అర్ధం కాని కేసా ఇది?!

స్కిల్ కేసులో తనను అక్రమంగా అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం ద్విసభ్య ధర్మాసనం ఏటూ తెల్చకుండానే సీజేఐకి రిఫర్ చేసింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వం బనాయించిన  స్కిల్ స్కాం కేసు  నెలల తరబడి కోర్టుల్లో  సాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది ఈ కేసులో చంద్రబాబుపై నమోదు చేసిన కేసుకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందా లేదా అన్న దానిపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. దీంతో ఈ రోజు ఈ కీలక తీర్పు వెలువడనుందని గత రెండు రోజులుగా  ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అయితే, నేటి తీర్పులో ద్విసభ్య ధర్మాసనంలో ఇద్దరు జడ్జీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. స్పష్టంగా చెప్పాలంటే ఇద్దరు జడ్జిలు పరస్పర విరుద్ధమైన తీర్పులు వెల్లడించారు. ఈ కేసును విచారించిన ద్విసభ్య ధర్మాసనంలోని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదీ ధర్మాసనం చంద్రబాబుకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందా లేదా అన్న దానిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోయారు. ఒకరు సెక్షన్ 17ఏ వర్తిస్తుందంటే మరొకరు వర్తించదని అభిప్రాయపడ్డారు. దీనికి ఎవరికి వారు వారి వారి కారణాలు, సెక్షన్స్ లో షరతులు, లొసుగులు ఎన్నో చెప్పుకొచ్చారు. ఫైనల్ గా ఈ కేసును ద్విసభ్య ధర్మాసనం తేల్చలేక సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి అప్పగించారు. దీంతో ఈ కేసు అక్కడ ఎప్పటికి తేలుతుందన్నది చెప్పేలేని పరిస్థితి. సీజేఐ ఈ కేసును ఎలా తేల్చనున్నారన్న దానిపై రకరకాల విశ్లేషణలు ఇప్పటికే మొదలయ్యాయి.  తీర్పు రావాలంటే మాత్రం మరికొన్ని నెలలు పట్టే అవకాశం ఉందన్నది న్యాయనిపుణుల అభిప్రాయం. న్యాయమూర్తులతో కూడిన ఓ కమిటీని నియమించడం, మరింత క్షుణ్ణంగా ఈ కేసులో లోతుకు వెళ్లి విచారణ చేయడం వంటి అంశాల నేపథ్యంలో ఈ కేసు ఇప్పటిలో తేలే పరిస్థితి లేదన్నది అర్ధమవుతుంది. ఇది చంద్రబాబుకు నష్టం తెచ్చే అంశమని  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇది అక్రమంగా బనాయించిన కేసని ఇప్పటికే ఎందరో న్యాయ నిపుణులు, మేధావులు, రిటైర్డ్ న్యాయమూర్తులు తేల్చి చెప్పారు. హై ప్రొఫైల్ ఉన్న ఒక నేతను ముందస్తు సమాచారం లేకుండా, గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేయడం ముమ్మాటికీ సీఐడీ తప్పిదమే. అయితే, ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసింది. చేస్తున్నది. 17ఏ ప్రకారం గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చెల్లదు. అలాగే చంద్రబాబుపై బనాయించిన కేసులు కూడా చెల్లవు. అయితే  17ఏ 2018 తర్వాత కేసులకు మాత్రమే వర్తిస్తుంది. అంతకు ముందు కేసులలో ఈ సెక్షన్ వర్తించదు. సరిగ్గా ఏపీ ప్రభుత్వం అదే అంశాన్ని అడ్డం పెట్టుకొని వింత వాదన తెరపైకి తెచ్చింది. స్కిల్ స్కాం కేసు 2018కి ముందే విచారణ మొదలైందని సీఐడీ తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. 2018కి ముందు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో సర్వీస్ అందించిన సంస్థలకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. నిజానికి ఈ నోటీసులు ఇచ్చింది జీఎస్టీ గురించి. ఆ నోటీసులకు ఇప్పటి సీఐడీ విచారణకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఆ నోటీసులు ఇచ్చినప్పటి నుండే ఈ కేసు విచారణ మొదలైనట్లు సీఐడీ లాయర్లు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ద్విసభ్య ధర్మాసనంలో ఒకరైన జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ఈ కేసుకు 17ఏ వర్తించదని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఈ కేసుకు 2018 నోటీసులకు సంబంధం లేదు కనుక 2018 తర్వాత కేసుగా 17ఏ వర్తిస్తుందని మరో న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. దీంతో ఈ కేసు ఇప్పుడు మరింత మెలిక పడింది.  అయితే ఇది న్యాయమూర్తులకే అర్ధం కాని కేసా అంటూ రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చ సాగుతున్నది. ద్విసభ్య ధర్మాసనంలో ఇద్దరు న్యాయమూర్తులలో ఒకరు చంద్రబాబుకు ప్రతికూలంగా మరొకరు అనుకూలంగా అభిప్రాయపడ్డారు. ఈ కేసులో జస్టిస్ ఆలస్యమైతే నష్టపోయేది చంద్రబాబే. ఆయన విషయంలో ప్రభుత్వం, సీఐడీ తప్పు చేసిందా లేదా అన్నది తేలాల్సి ఉంది. ప్రభుత్వం కక్షసాధింపులో భాగంగా ఈ అక్రమ అరెస్టులు చేయించిందని స్పష్టంగా తెలుస్తుంది. కానీ, అది నిరూపించాలంటే మాత్రం న్యాయవ్యవస్థలో లొసుగులు అడ్డుపడుతున్నాయి. ఇది 2018కి ముందే విచారణ మొదలైన కేసా.. తర్వాత విచారణ ప్రారంభమైందా అన్నది కూడా స్పష్టమే. కానీ, సీఐడీ తరపున వాదించేందుకు వీలుగా సీబీఐ నోటీసులు అడ్డు పడుతున్నాయి. అదే ఇప్పుడు ఈ కేసు సీజేఐ వరకూ చేర్చింది. మరి ఈ కేసులో తీర్పు ఏపీలో ఎన్నికలకు ముందే వస్తుందా అన్నది తేలాల్సి ఉంది. ఎన్నికల తర్వాత తీర్పు వస్తే ఈ కేసులో ఎవరికీ ఎలాంటి లాభం ఉండదు. అందుకే ఈ కేసులో తీర్పు ఎంత ఆలస్యమైతే అంతగా నష్టపోయేది ఒక్క చంద్రబాబు మాత్రమే. కనుక అందుకే ప్రభుత్వం కూడా ఈ కేసులో సాగదీసేందుకు అన్ని మార్గాలను వాడుకుంటున్నట్లుంది.

 సీపిఎం నేత  తమ్మినేని వీరభధ్రంకు గుండెపోటు 

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు గుండెపోటు వచ్చింది. ఖమ్మంలో తన నివాసంలో ఉన్న సమయంలో ఆయనకు ఛాతిలో నొప్పి వచ్చింది. దీంతో సమీపంలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు తమ్మినేనికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారి సూచనల మేరకు మెరుగైన చికిత్స కోసం తమ్మినేనిని హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  ఇటీవలె జరిగిన తెలంగాణ  అసెంబ్లీ ఎన్నికలలో సిపిఎం  కాంగ్రెస్ పార్టీతో సీట్ల సర్దుబాట్ల చర్చలు సఫలం కాకపోవడంతో ఒంటరిగా పోటీ చేసి అన్ని స్థానాల్లో పరాజయం చెందింది. రానున్న లోకసభ ఎన్నికల నేపథ్యంలో తమ్మినేని రెండు రోజులుగా ఖమ్మం జిల్లాలో వరుసగా పర్యటనలలో పాల్గొంటున్నారు. తనకు నలతగా ఉందని నిన్న సాయంత్రం నుంచి కుటుంబ సభ్యులకు చెబుతున్నారు. అయితే మంగళవారం ఉదయం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు సమీపంలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు.

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నియామకం.. తక్షణమే అమల్లోకి

లాంఛనం పూర్తై పోయింది. వైఎస్ షర్మిల ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.  వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపడతారని గత కొద్ది రోజులుగా గట్టిగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సంక్రాంతి తరువాత ఏ క్షణంలోనైనా ఆమె ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపడతారని తెలుగువన్ ముందుగానే చెప్పింది. అలాగే సంక్రాంతి రోజు అప్పటి వరకూ ఏపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న గిడుగు రుద్రరాజు తన పదవికి రాజీనామా చేయడంతో షర్మిలకు లైన్ క్లియర్ అయిపోయింది. షర్మిల తన వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీలో క్రియాశీలంగా వ్యవహరించే దిశగా చర్చలు జరుగుతున్న సందర్భంగానే  ఆమె ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమైతే తాను రాజీనామా చేస్తానని గిడుగు రుద్రరాజు ప్రకటించిన సంగతి తెలిసిందే. గిడుగు రుద్రరాజు సోమవారం అంటే సరిగ్గా సంక్రాంతి నాడు రాజీనామా చేశారు. తెలుగువన్ ముందుగానే చెప్పినట్లు సంక్రాంతి మరునాడే షర్మిల ఏపీసీసీ చీఫ్ గా నియమితులయ్యారు.  గిడుగు రుద్రరాజు ఇలా రాజీనామా చేయడంతోనే షర్మిలను అలా ఏపీసీసీ చీఫ్ గా నియమించేసేశారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో  కాంగ్రెస్ బలోపేతం కోసం వేగంగా చర్యలు తీసుకోవాలని హైకమాండ్ భావిస్తున్నది. అందుకు తగ్గట్టుగానే ఏపీలో పార్టీని బలోపేతం చేసేందుకు షర్మిల ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించేశారు. ఏపీసీసీ చీఫ్ గా ఈ రోజు అధికారికంగా నియామకం జరిగినా, అంతకు ముందు నుంచే ఆమె రాష్ట్రంలో కాంగ్రెస్ పటిష్ఠతకు తన వంతు కృషి ప్రారంభించేశారు.   ఇప్పటికే ఉత్తరాంధ్రకు చెందిన కాంగ్రెస్ మాజీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. అలాగే గతంలో కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉన్న వైసీపీ నేతలను తిరిగి తమ పార్టీలోకి చేర్చుకోవడమే టార్గెట్ గా షర్మిల అడుగులు వేస్తున్నారు. షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం వల్ల భారీ నష్టం వాటిల్లేది ఎవరికంటే పరిశీలకులు జగన్ పేరే చెబుతున్నారు. ఏపీ ఇక అన్నాచెళ్లెల్ల పొలిటికల్ బ్యాటిల్ గ్రౌండ్ గా మారబోతోందని విశ్లేషిస్తున్నారు.   షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంతో  ఇప్పటికే పతనమైన జగన్ గ్రాఫ్ పాతాళానికి చేరడం ఖాయమని వైసీపీ వర్గాలే అంటున్నాయి. ఇప్పటి వరకూ అధికార వైసీపీ, విపక్ష తెలుగుదేశం, జనసేన కూటమి మధ్య ముఖాముఖీగా ఉన్న ఎన్నికల పోరు.. షర్మిల రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంతో త్రిముఖ పోరుగా మారుతుందని, అదే సమయంలో కాంగ్రెస్ పగ్గాలు షర్మిల చేపట్టడం వల్ల ఆ పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందని కానీ, అద్భుతాలు జరుగుతాయని కానీ ఎవరూ భావించడం లేదు. కానీ షర్మిల కారణంగా జగన్ పార్టీకి మాత్రం కోలుకోలేని నష్టం వాటిల్లడం ఖాయమనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఔను నిజమే ఏపీలో కాంగ్రెస్ ఏ మాత్రం బలపడినా ఆ మేరకు నష్టపోయేది జగన్ రెడ్డే. ఎందుకంటే వైసీపీలో సీనియర్లంతా కాంగ్రెస్ నేతలే.  క్యాడర్ కూడా ఒకప్పటి కాంగ్రెస్ క్యాడరే.  ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్ర విభజనతో ఏపీలో కాంగ్రెస్ చచ్చి వైసీపీకి ఊపిరి పోసింది. మరి ఇప్పుడు  పదేళ్ల తరువాత కాంగ్రెస్ బతికి ఊపిరి పోసుకుంటే.. నిస్సందేహంగా వైసీపీకి ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి ఏర్పడటం ఖాయమంటున్నారు.  రానున్న ఎన్నికల పోరు   తెలుగుదేశం జనసేన కూటమి, వైసీపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరుగా ఉంటుందో, షర్మిల చేరికతో వైసీపీ ఇక అధికారం కోసం కాకుండా కనీసం తెలుగుదేశం, జనసేన కూటమి తరువాత రెండో స్థానంలో నిలవడానికి కాంగ్రెస్ తో పోటీ పడుతుందో చూడాల్సిందేనని పరిశీలకులు అంటున్నారు. 

సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనానికి చంద్రబాబు క్వాష్ పిటిషన్

చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను  జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం సీజేఐ బెంచ్ కు రిఫర్ చేసింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారించిన సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనంలోని ఇరువురు న్యాయమూర్తులూ భిన్న తీర్పులు ఇచ్చిన నేపథ్యంలో ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్ చేశారు.   దీంతో స్కిల్ కేసులో 17-ఏ సెక్షన్ వర్తింపు వ్యవహారం ప్రధాన న్యాయమూర్తి సారధ్యంలోని త్రిసభ్య ధర్మాసనం ముందుకు చేరింది. 17-ఏ వర్తింపు విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండడంతో తగిన నివేదిక కోసం చీఫ్ జస్టిస్‌కి నివేదిస్తున్నామని జస్టిస్ బేలా త్రివేది అన్నారు. స్కిల్ కేసులో  జగన్ సర్కార్ చంద్రబాబునాయుడిని అక్రమంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 52 రోజుల పాటు రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ లో ఉన్న  చంద్రబాబు.. తాను ఎటువంటి తప్పూ చేయలేదనీ, తనపై కేసు రాజకీయ ప్రేరేపితమనీ, రాజకీయ కక్ష సాధింపులో భాగమని పేర్కొంటూ క్వాష్ చేయాలంటూ కోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టు ఆయన క్వాష్ పిటిషన్ ను కొట్టివేశాయి. దీంతో ఆయన సుప్రీం ను ఆశ్రయించారు. సుప్రీంలో సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పు రిజర్వ చేసిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు మంగళవారం (జనవరి 16)న వెలువడింది. దేశ వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొన్న ఈ కేసు తీర్పు విషయంలో న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వెలువరించడంతో సీజేఐ బెంచ్ కు రిఫర్ చేశారు.  అక్కడ చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ప్రభుత్వ న్యాయవాదులు, చంద్రబాబు న్యాయవాదులు తమతమ వాదనలు వినిపించారు.  ఏపీ  సర్కార్ తరఫున వాదించిన ముకుల్ రోహత్గీ  వాదనలు ఉన్నాయంటున్నారు. అవినీతి జరిగింది. దానిలో  చంద్రబాబు  పాత్ర ఉందా లేదా అన్నది ఆయనను విచారించి  తెలుసుకుంటాం అన్నట్లుగా ముకుల్ రోహత్గీ వాదించారు.  చంద్రబాబు అరెస్టు అక్రమమనీ, ఆయనను విచారించాలన్నా, అరెస్టు చేయాలన్నా గవర్నర్ అనుమతి తీసుకోవడం తప్పని  సరి  అనీ  చంద్రబాబు  తరఫు న్యాయవాది హరీష్ సాల్వే  కోర్టుకు తెలిపారు. 17ఏ సెక్షన్ చంద్రబాబుకు వర్తిస్తుందని చెబుతూ అందుకు ఉదాహరణగా పలు కేసులలో సర్వోన్నత న్యాయస్థానం తీర్పులను ఉటంకించారు. పలు సందర్భాలలో హరీష్ సాల్వే వాదనలతో న్యాయమూర్తులు ఏకీభవించారు. ఒక సందర్భంలో అయితే ఈ కేసులో చంద్రబాబుకు 17ఏ వర్తిస్తుందని అనిపిస్తోందని కూడా న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. దీంతో అంతా చంద్రబాబుకు క్వాష్ వర్తిస్తుందంటూ తీర్పు వెలువడుతుందని భావించారు. అయితే   ద్విసభ్య ధర్మాసనంలోని న్యాయమూర్తులు  జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ బేలా త్రివేదీ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో చంద్రబాబుకు 17ఏ వర్తిస్తుందా? లేదా అన్న విషయంపై తీర్పు వెలువరించకుండా చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనానికి నివేదించారు.  ఇలా ఉండగా  ద్విసభ్య ధర్మాసనంలో ని ఇరువురు న్యాయమూర్తులలో ముందుగా జస్టిస్ అనిరుధ్ బోస్ తన తీర్పు వెలువరిస్తూ స్కిల్ కేసులో చంద్రబాబుకు 17 ఏ వర్తిస్తుందని విస్పష్టంగా తేల్చారు. 17ఏ అమలులోకి రాకముందు జరిగిన దర్యాప్తును ఈ కేసులో చంద్రబాబు అరెస్టుకు వర్తింప చేయడం కూడదని పేర్కొన్నారు. అయితే చంద్రబాబుకు విధించిన రిమాండ్ రిపోర్టును కొట్టివేయలేమని పేర్కొన్నారు.  ఇక మరో న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేది మాత్రం ఈ కేసులో చంద్రబాబుకు 17ఏ వర్తించదని తన తీర్పులో పేర్కొన్నారు. 2018లో వచ్చిన సవరణ ఆధారంగా చేసుకుని కేసును క్వాష్‌ చేయలేమని తన తీర్పులో పేర్కొన్నారు.   ఇరువురు న్యాయమూర్తులూ భిన్న తీర్పులు వెలువరించడంతో  చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. 

బాబూ ఓ రాంబాబు!

తెలుగుదేశం పార్టీని   విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ స్థాపించారు.  జనసేన పార్టీని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించారు.  ఆ రెండు పార్టీలలో  కళా వల్లభులు పెద్దగా కనిపించరు. అయతే జగన్ పార్టీ అయిన వైసీపీలో మాత్రం  మహానటుల స్థాయికి ఏ మాత్రం తగ్గనిక ళాకారులంతా  వై గుట్టలుగుట్టలుగా ఉన్నారనే ఓ చర్చ అయితే సత్తెనపల్లి నియోజకవర్గంలో వైరల్ అవుతోంది.   తాజాగా సంక్రాంతి పండగ వేళ.. భోగి పండగను పురస్కరించుకొని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు   సంబరాల రాంబాబులా మారి  వేసిన స్టెప్స్ కెవ్వు కేక పుట్టించాయని సత్తెనపల్లి నియోజకవర్గంలో ఓ ప్రచారం వీర లెవల్ లో నడుస్తోంది. అలాగే నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన ప్రజలంతా ఈ కార్యక్రమానికి హాజరై.. సంబరాల రాంబాబు డ్యాన్స్ కార్యక్రమాన్ని  కనులారా వీక్షించి ఆనందించేశారంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.   గతంలో రాజకీయ పార్టీ అధినేతలపై మాత్రమే పాటలు ఉండేవని.. కానీ అంబటి రాంబాబు..తనపై పాట రాయించుకొని మరీ ఇలా డ్యాన్స్ చేయడం పట్ల ప్రజలలోనే కాదు, పరిశీలకులు, రాజకీయ వర్గాలలో సైతంఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. మరోవైపు మంత్రి అంబటి రాంబాబు..  తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబుతోపాటు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై ప్రెస్‌మీట్లు పెట్టి మరీ వ్యంగ్య బాణాలు సంధిస్తారని.. అయితే అదే అంబటి రాంబాబు... ఇలా స్టెప్స్ వేయడమే కాకుండా.. నేను సంబరాల రాంబాబును కూడా అంటూ భోగి మంటల సాక్షిగా ఇచ్చిన క్లారిటీ మాత్రం అదిరిపోయిందని వారు చెబుతున్నారు.     బాధ్యత కలిగిన ఓ ప్రజాప్రతినిధిగా, మంత్రిగా ఆంధ్రుల జీవనాడి పోలవరం ఎప్పటికి పూర్తవుతుందంటే.. పవన్ కల్యాణ్ మళ్లీ పెళ్లి చేసుకొనే సమయానికి అంటూ తన వ్యంగ్య వైభవన్నా చాటిన   అంబటి రాంబాబుకు.. జలవనరుల శాఖను కేటాయించే కంటే.. మరో శాఖ ఏదైనా కేటాయిస్తే బాగుండేదని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే కార్యక్రమంలో.. ఓ హీరోయిన్‌ని కూడా తీసుకు వచ్చి.. ఆమెతో కూడా కాలు కదిపి ఈ అంబటి రాంబాబు కనుక స్టెప్లు వేస్తే.. ఇంకా ఈ సీన్ సూపరో సూపర్‌గా ఉండేదని సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలు పేర్కొంటున్నారు. రాబోయే ఎన్నికల్లో ఓ వేళ అంబటి రాంబాబు ఓటమి పాలైనా కొరియాగ్రాఫర్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి భవిష్యత్తు ఉంటుందనే నమ్మకం కలిగిందని సత్తెనపల్లి  నియోజకవర్గ ప్రజలు అంబటి రాంబాబు భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తున్నారు.    అయినా.. అంబటి రాంబాబులో చాలా టాలెంట్ ఉందని.. ఆయనలో.. ఆ టాలెంట్‌ను వైసీపీ అధినేత జగన్ గుర్తించారని.. అందుకే   ఆయన్ని వదులు కోలేదని..  కానీ అంబటి రాంబాబు మంత్రి కావడం వల్ల.. ఆయనలో సహజ నటనంతా..మళ్లీ ఇలా సంక్రాంతి పండగ వేళ బయటకు తన్నుకొచ్చిందని.. ఇప్పటికే టాలీవుడ్‌లో పలు చిత్రాల్లో ఆయన నటించారని.. అయితే ఆయన నటనను ప్రజలంతా దాదాపుగా మరిచిపోయారని.. కానీ ఆయనలోని ప్రతిభ పాటవాలు చూసి.. రాబోయే కాలానికి కాబోయే ఓ సహజ నటుడు టాలీవుడ్‌కి.. అది ఇలా సంక్రాంతి పండగ వేళ దొరికాడని.. దీంతో తెలుగు సినీ కళామతల్లి  సైతం సిగ్గు మెగ్గలతో మెలికలు తిరుగుతూ తెగ మురిసిపోతుందని వారు వివరిస్తున్నారు.    జగన్ పార్టీలో కళాకారులకు కొదవే లేదని.. అంబటి రాంబాబుతోపాటు కొడాలి నాని, పేర్ని నాని, జోగి రమేష్, ఆర్కే రోజా, వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఆదిమూలపు సురేష్, బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అవంతి శ్రీనివాసరావు, గుడివాడ అమర్నాథ్.. ఇలా ఇలాంటి  డైమండ్ పీస్‌ల సంఖ్య పెద్దదే అయినా  వారిలో అంబటి రాంబాబు అగ్రస్థానంలో నిలుస్తారనడంలో సందేహం లేదంటున్నారు.   గత సంక్రాంతి పండగ వేళ.. ఇదే అంబటి రాంబాబు, ఇదే సత్తినపల్లిలో గ్రూప్ డ్యాన్స్ చేసి చెలరేగిపోయారని.. దీంతో ఫ్యాన్ పార్టీ నాయకుడిగా.. ఎమ్మెల్యేగా... మంత్రిగా ఆయనకు రాని పబ్లిసిటీ.. ఒకే ఒక్క గ్రూప్ డ్యాన్స్‌తో పీక్స్‌కు చేరిందని.. మరోవైపు అంబటి రాంబాబు డ్యాన్స్‌‌పై ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు గుప్పిస్తే.. తాను చేసింది ఆనంద తాండవం అంటూ పక్కా క్లారిటీతో వివరించారని ప్రజలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఏదీ ఏమైనా.. అంబటి రాంబాబులో టాలెంట్ ఉందని.. అది కూడా కెవ్వు కేకంతగా ఉందని.. అందుకే  .. బాబూ ఓ రాంబాబు.. అంటూ ఆయనపై సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలు సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. 

వైసీపీ ఎమ్మెల్యే ఛీప్  పబ్లిసిటీ... పండగ నాడు మద్యం, మాంసం పంపిణీ 

పురాణాల దగ్గర నుంచి దానాలు చేయడం అనేది ఒక ఆచారంగా వస్తుంది. దానం చేయడం వల్ల పుణ్యఫలం దక్కుతుంది. మనకున్న వాటిని అవసరంలో ఉన్న ఇతరులకి దానం చేసి సహాయం చేయడం వల్ల పుణ్యం దక్కుతుందని నమ్ముతారు. అందుకే కుడి చేత్తో చేసిన దానం గురించి ఎడమ చేతికి కూడా తెలియకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ ఎపిలో వైసీపీ ఎమ్మెల్యే ఒకరు సంక్రాంతి కానుకగా ఇచ్చిన ఫుల్ బాటిల్స్, కోడి మాంసం సోషల్ మీడయా వేదికగా తెగ వైరల్ చేసుకున్నారు.  తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి తరువాత రోజు జరుపుకునే కనుమ  పండుగను ఎంతో ఘనంగా చేసుకుంటారు. పండుగ నాడు కోడి కూర, కిక్కిచ్చే చుక్క ఉంటే కొందరికి పండుగే. దసరా పండుగ నాడు యజమానులు తమ వద్ద పనిచేసే వాళ్లకు బోనస్ లు ఇస్తుంటారు. ఇక రాజకీయ నేతలైతే తమ మద్దతుదారులకు మందు, ముక్క తప్పనిసరిగా ఇస్తారు. ఇలాంటి ఘటననే విశాఖలో చోటుచేసుకుంది. నిరుడు  దసరా పండుగ నాడు విశాఖ దక్షిణ మండల వైసీపీ అధ్యక్షుడు దొడ్డి బాపు ఆనంద్‌ తమ మద్దతుదారులు, మరికొంత మందికి కోడి, లిక్కర్ బాటిల్ పంపిణీ చేశారు. ఈ వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. విశాఖ డాబా గార్డెన్స్‌లోని వైసీపీ ఆఫీసు వద్ద అప్పట్లో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా వైసీపీ నేత కోడి, మద్యం పంపిణీ చేశారు. గతంలో కేజీ మటన్‌ ఇచ్చామని, ఈ ఏడాది కోడి, క్వార్టర్‌ మందు ఇస్తున్నట్లు ఆయన బహిరంగంగానే చెప్పుకున్నారు. గత ఏడాది వైసీపీ విశాఖ దక్షిణ మండల అధ్యక్షుడు చేసిన ప్రచారాన్ని వైసీపీ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఓర్వ లేకపోయారు. సరిగ్గా సంవత్సరం కాపు కాశారు. సోమవారం నాడు కనుమ పండగను పురస్కరించుకుని ఒక రోజు ముందు అంటే సంక్రాంతినాడే వైసీపీ కార్యకర్తలు, నాయకులకు మద్యం పంపిణీ చేశారు. ఇది చీప్ లిక్కర్ కావడం గమనార్హం. జగన్ పాలనకు దర్పం పట్టే విధంగా వైసీపీ ఎమ్మెల్యే తన కాలేజి క్లాస్ రూమ్లలోనే చీప్ లిక్కర్ పంపిణీ చేయడం హాట్ టాపిక్ అయ్యింది. తరగతి గదిలో విద్యార్థులు కూర్చొనే బెంచీలపై వైసీపీ నేతలను కూర్చోబెట్టి పంపిణీ చేయడం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. కాలేజి ప్రాంగణంలోకి వైసీపీ శ్రేణులు భారీగా తరలి రావడం ఫుల్ బాటిల్స్, కోడి మాంసం తీసుకొని ఇంటికి వెళ్లిపోవడం చకచకా జరిగిపోయాయి.  మద్యపాన నిషేధం అంటూ ప్రచారం చేసుకున్న వైసీపీ నేతలు ఇప్పుడు మద్యం బాటిల్స్ పంపిణీ చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.