తెలుగుదేశం జనసేన పొత్తులో పదనిసలు
posted on Jan 26, 2024 @ 11:20AM
తెలుగుదేశం, జనసేన కలిసి పని చేస్తున్నాయి. పార్టీలుగా వేరువేరుగానే ఉన్నా లక్ష్యం ఒకటే కావడంతో పొత్తు పెట్టుకుని ఎన్నికలలో కలిసి ముందుకు సాగాలని నిర్ణయానికి వచ్చాయి. ఆ మేరకు జనసేనాని పవన్ కల్యాణ్ స్వయంగా ప్రకటన చేశారు. అలా పొత్త ప్రకటన సమయాన్ని కూడా ఆయన ఇరు పార్టీలూ ఉద్వేగంతో పూనకాలకు లోనయ్యేలా చేశారు. స్కిల్ కేసులో చంద్రబాబును జగన్ సర్కార్ అన్యాయంగా అరెస్టు చేసి రాజమహేంద్రవరం జైలుకు పంపిన సమయంలో ఆయనను ములాఖత్ ద్వారా కలుసుకుని బయటకు వచ్చి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణల సమక్షంలో ప్రకటించారు. ఆ ప్రకటనతో అప్పటి దాకా పొత్తు విషయంలో ఉన్న అనుమానాలు పటాపంచలైపోవడమే కాదు.. ఇరు పార్టీల క్యాడర్ లో కూడా ఉత్సాహం ఉరకలెత్తింది. ఆ క్షణం నుంచీ తెలుగుదేశం, జనసేనలు క్షేత్రస్థాయిలో కలిసే పని చేశాయి. పవన్ సభలలో తెలుగుదేశం జెండాలు రెపరెపలాడాయి. చంద్రబాబు కార్యక్రమాలలో జనసేన నాయకులు హల్ చల్ చేశారు. గ్రామీణ స్థాయిలో సమస్యలపై తెలుగుదేశం, జనసేన శ్రేణులు ఉమ్మడిగా కదం తొక్కాయి. పొత్తు పోవడకుండా ఉండేందుకు జగనరెడ్డి, ఆయన పార్టీ నేతలు చేసిన కుట్రలూ, కుతంత్రాలు ఫలించలేదు.
ఇప్పుడు ఇరు పార్టీలూ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుని పొత్తులో భాగంగా ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి బహిరంగ సభల విషయంలో ఒక అంగీకారానికి వచ్చి, సీట్ల సర్దుబాటు కొలిక్కి వస్తున్న తరుణంలో చిన్న కలకలం రేగింది. స్వతహాగా ఆవేశపరుడైన జనసేనాని పవన్ కల్యాణ్ తెలుగుదేశం అధినేత రాష్ట్రంలో రెండు స్థానాలలో తెలుగుదేశం అభ్యర్థులను ప్రకటించడాన్ని తప్పుపట్టారు. ఆయన అలా ప్రకటించడం సరికాదని వ్యాఖ్యానిస్తూ, వారు రెండు స్థానాలను ప్రకటించారు కనుక తాను రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తున్నానంటూ రాజోలు, రాజానగరంలలో జనసేన అభ్యర్థులు రంగంలో ఉంటారని చెప్పారు.
టీడీపీ-జనసేన పొత్తుపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మండపేట, అరకు అభ్యర్థులను టీడీపీ ప్రకటించిన క్రమంలో పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీకి కౌంటర్ గా పవన్ కళ్యాణ్.. రాజోలు, రాజానగరం టికెట్లను ప్రకటించారు. ఈ రెండు స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.
ఈ చిన్న విషయాన్ని పోత్తు అడుగులు తడబడుతున్నాయని చాటడానికి ఒక వర్గం మీడియా నానా తంటాలూ పడుతోంది. జనసేనాని నియోజకవర్గాలను ప్రకటించడాన్ని హైలైట్ చేస్తున్న మీడియా ఆ సందర్భంగా పొత్తుకు కట్టుబడి ఉన్నాననీ, అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టిపరిస్థితుల్లోనూ చీలనివ్వన్న మాటకు కట్టుబడి ఉన్నాననీ చెప్పిన మాటలను ఉద్దేశ పూర్వకంగా విస్మరిస్తోంది.
రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. పొత్తులో భాగంగా కొన్ని స్థానాలలో జనసేన పోటీ చేస్తుంది. అందులో సందేహం లేదు. ఇప్పటి వరకూ జరిగిన చర్చలలో పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసే స్థానాలు ఎన్ని, ఏవి అన్న విషయంలో ఒక క్లారిటీ వచ్చేసిందని చెబుతున్నారు. బీజేపీ ఈ కూటమితో కలుస్తుందా? లేదా అన్నది తేలడం కోసం వేచి చూడాలని ఇరు పార్టీలూ భావించడం వల్లే ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఖరారైన సీట్లలో ఓ రెండింటిని చంద్రబాబు కానీ, పవన్ కల్యాణ్ కానీ ప్రకటించడంలో తప్పు పట్టడానికి ఏమీ లేదు. ఇక ఏకపక్షంగా రెండు సీట్ల ప్రకటన అంటూ పవన్ కల్యాణ్ అనడాన్ని కూడా క్యాడర్ అనవసరంగా గందరగోళపడి ఉన్న సయోధ్య వాతావరణం చెడకుండా ఉండటానికే అని భావించాల్సి ఉంటుంది. అందుకే ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఈ రెండు సీట్లను ప్రకటించాల్సి వచ్చిందని పవన్ కల్యాణ్ విస్పష్టంగా చెప్పారు.