ఢిల్లీ సీఎం రేఖాగుప్తాపై దాడి.. ఇంతకీ ఆ నిందితుడు ఎవరంటే?
posted on Aug 21, 2025 @ 3:03PM
ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై జరిగిన దాడి దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దేశ రాజధాని సివిల్ లైన్స్‌లోని అధికారిక నివాసంలో జన్ సున్‌వాయ్ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ముఖ్యమంత్రికి అర్జీ ఇచ్చేందుకు వచ్చిన ఓ వ్యక్తి కొన్ని పేపర్లను ఆమెకు అందించారు. అంతలోనే గట్టిగా అరుస్తూ సీఎంపై దాడి చేశాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని రాజ్‌కోట్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఊహించని పరిణామంతో.. సీఎం రేఖా గుప్తా షాక్‌కి గురయ్యారు.
ముఖ్యమంత్రిపై దాడి చేసిన నిందితుడు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన రాజేశ్ భాయ్ ఖిమ్జీ భాయ్ సకారియాగా గుర్తించారు. గుజరాత్‌లోనూ అతడిపై దర్యాప్తు ముమ్మరం చేసిన అధికారులు, దాడికి గల కారణాలు తెలుసుకొనే పనిలో ఉన్నారు. అయితే, సీఎంపై రాజేశ్ ఎందుకు దాడి చేశాడనే విషయంపై అనేక కథనాలు వినిపిస్తున్నాయి. నిందితుడి బంధువు జైల్లో ఉన్నాడని, అతనిడి రిలీజ్ చేసేందుకు.. సీఎంకు విజ్ఞప్తి చేసేందుకు ముఖ్యమంత్రి అధికార నివాసానికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ వ్యవహారం, ప్రస్తుతం కోర్టులో పెండింగ్‌లో ఉన్నట్లు కథనాలు వచ్చాయి. మరోవైపు గుజరాత్‌లో నిందితుడి తల్లిని ప్రశ్నించిన అధికారులు ఆమె నుంచి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. తన కుమారుడు, ఢిల్లీ సీఎంని కలిసేందుకు వెళ్లిన విషయం తనకు తెలియదని ఆమె చెప్పినట్లు సమాచారం. అతడు జంతు ప్రేమికుడని, ఇటీవల వీధి శునకాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో అసంతృప్తిగా ఉన్నాడని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, అతడి మానసిక పరిస్థితి బాగా లేదనీ, గతంలోనూ ఓ సారి ఢిల్లీకి వెళ్లి వచ్చాడని పోలీసులకు వివరించినట్లు సమాచారం.
నిందితుడు రాజేశ్‌పై.. గుజరాత్‌లో తొమ్మిది కేసులున్నట్లు తెలుస్తోంది. బెదిరింపులు, స్థానికులపై దాడి, మద్యం మత్తులో దుష్ప్రవర్తనకు సంబంధించి.. ఈ కేసులు నమోదైనట్లు తెలిసింది. జైల్లో ఉన్న బంధువు విడుదల కోసమే.. సీఎంని కలిసేందుకు వెళ్లాడనే వార్తలు వచ్చినప్పటికీ.. అలాంటిదేమీ లేదని గుజరాత్ పోలీసులు గుర్తించినట్లు తేలింది. సీఎం రేఖా గుప్తాకు కొన్ని పేపర్లు అందించిన తర్వాత.. గట్టిగా అరుస్తూ దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనని.. బీజేపీ సహా విపక్ష పార్టీలు ఖండించాయి. దాడి చేసిన వ్యక్తిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అతను దేనికోసం సీఎంపై దాడికి పాల్పడ్డాడు అనేది తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు.