80 ఏళ్ల వృద్ధుడికి హనీ ట్రాప్.. 8 లక్షలు హాంఫట్
posted on Aug 22, 2025 9:25AM
ఆయన వయస్సు ఎనిమిది పదులు. అలాంటి వృద్ధుడిని మాయమాటలు, శృంగార చేష్టలతో ట్రాప్ చేసి దారుణంగా మోసం చేశారు. 80 ఏళ్ల వృద్ధుడితో మహిళ గొంతుతో మాట్లాడి మరీ హనీట్రాప్ లో చిక్కుకునేలా చేశారు. ఎనిమిది లక్షలు కొట్టేశారు. తరువాత తాను హనీట్రాప్ కు గురయ్యానని తెలుసుకున్న వృద్ధుడు పోలీసులను ఆశ్రయించాడు. తనను మోసం చేసిన ముఠాపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది.
అమీర్ పేటకు చెందిన వృద్ధుడికి మాయా రాజ్పుత్ అనే మహిళ నుంచి వీడియో కాల్ వచ్చింది. ఆ వాట్సాప్ వీడియో కాల్ ,మెసేజ్ లకు స్పందించిన వృద్ధుడు ఆమెతో తో మాట్లాడడం మొదలుపెట్టాడు. అలా ఓ నాలుగు రోజుల పాటు వృద్ధుడితో మాట్లాడుతూ. పరిచయం పెంచు కున్నారు. వృద్ధుడు పూర్తిగా హనీ ట్రాప్ మాయాజాలంలో చిక్కుకునేట్లు చేశారు.అనంతరం వృద్ధుడు తమ మాయలో పడ్డాడని నిర్ధారించుకున్న స్కామర్స్ ఏవేవో కారణాలు చెప్పి డబ్బులు గుంజడం మొదలుపెట్టారు. తమ వాళ్ళు ఆసుపత్రిలో ఉన్నారని ఖర్చుల కోసం డబ్బులు కావాలని, అలాగే వైద్య ఖర్చుల కోసం తాకట్టుపెట్టిన బంగారాన్ని విడిపించుకుంటామనీ, ఇలా రకరకాల కారణాలతో ఆ వృద్ధుడి నుంచి దఫదఫాలుగా ఎనిమిది లక్షలు నొక్కేశారు.
అయితే వృద్ధుడు ఖాతా నుంచి డబ్బులు మాయం అవుతుండడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. దీంతో వృద్ధుడిని నిలదీసి అడగడంతో అసలు విషయం వెలుగు లోకి వచ్చింది. సైబర్ మోసగాళ్లు వలలో పడ్డాడని గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.