చంద్రబాబుతో పని చేయడం అంత వీజీ కాదు.. ఈ మాటన్నదెవరో తెలుసా?
posted on Aug 21, 2025 @ 10:26AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికత గురించి, ప్రగతి కాముకత గురించి ఇప్పుడు ఎవరూ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సైబరాబాద్ సిటీ, అమరావతి నిర్మాణాలే అందుకు ప్రత్యక్ష తార్కానం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన దార్మనికత, కృషి, శ్రమ, పట్టుదల కారణంగానే హైదరాబాద్ బెంగళూరు, చెన్నైలను అధిగమించి మరీ ఐటీ హబ్ గా రూపుదిద్దుకుంది. ఐఎస్ బీహెచ్ వంటి సంస్థలు హైదరాబాద్ లో ఏర్పాటయ్యాయి. బిల్ క్లింటన్ ముందే ఐటీ ప్రోగ్రస్, అభివృద్ధి ఎలా సాధించాలి అన్న విషయాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వగల సత్తా, ధైర్యం చంద్రబాబు సొంతం. ఇది ఎవరూ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. గత నాలుగు దశాబ్దాలలో పదే పదే రుజువైన వాస్తవం.
అయితే తన తండ్రితో కలిసి పని చేయడం చాలా చాలా కష్టం అంటున్నారు నారా లోకేష్. తండ్రి స్థాయిని చేరుకునే సత్తా ఉన్న నాయకుడిగా నారా లోకేష్ ఇప్పటికే దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. కొండొకచో తండ్రిని మించిన తనయుడని కూడా పార్టీ శ్రేణులూ, నాయకులు, పరిశీలకులూ కూడా సోదాహరణంగా వివరిస్తున్నారు. అటువంటి లోకేష్ ఇటీవల ఒక సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబుతో పని చేయడం చాలా కష్టం అని కుండబద్దలు కొట్టేశారు. అయితే ఆయన వద్ద పని చేయడం, ఆయన నుంచి నేర్చుకోవడం మాత్రం గొప్ప అదృష్టమన్నారు. ఇక చంద్రబాబుతో కలిసి పని చేయడం ఎందుకు కష్టమో కూడా లోకేష్ వివరించారు. ఆయనలా పంక్చువల్ గా (సమయపాలన) ఉండటం ఎవరికైనా సరే కష్ట సాధ్యమేనన్నారు.
ఇక ఆయన ఉదయం పది గంటలకు ఒక పని అప్ప చెబుతారనీ, పావుగంటలోనే వచ్చి ఆ పని ఎంతవరకూ వచ్చిందంటూ పీకలమీద కుర్చుంటారని లోకేష్ చమత్కరించారు. ఆయనతో కలిసి పని చేయాలంటే ఆయన వేగం అందుకోవాల్సిందేనన్నారు.
చంద్రబాబు రెండు ఐకానిక్ నగరాలను అభివృద్ధి చేసే గొప్ప అవకాశం పొందిన నాయకుడన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రికీ కూడా ఇటువంటి అవకాశం లభించిందని తాను అనుకోవడం లేదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ కు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి దక్కేలా సైబరాబాద్ నగరాన్ని నిర్మించి చూపారనీ, సైబరాబాద్ తో తెలంగాణ ముఖచిత్రమే మారిపోయిందని లోకేష్ అన్నారు. ఇక ఇప్పుడు ప్రపంచస్థాయి రాజధానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందిస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ తోనే అమరావతికి ప్రపంచ స్థాయి పెట్టుబడులు తరలి వస్తున్నాయని లోకేష్ పేర్కొన్నారు.