తెలుగు రాష్ట్రాలు.. ఒక ఉపరాష్ట్రపతి ఎన్నిక కథ
posted on Aug 21, 2025 @ 4:24PM
నిజానికి వెంకయ్య తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి మరో ఉపరాష్ట్రపతి పదవికి ఛాన్సున్నది బి. సుదర్శన్ రెడ్డి విషయంలోనే. అయితే ఇండియా కూటమి అభ్యర్ధి అయిన సుదర్శన్ రెడ్డి గెలిచే అవకాశమెంత? అన్నది అటుంచితే.. ఎన్డీఏ అభ్యర్ధి రాధాకృష్ణన్ తమిళ వ్యక్తి కాగా.. త్వరలో తమిళనాడు ఎన్నిక జరుగుతుండటంతో.. కాంగ్రెస్ సైతం ఒక తమిళ వ్యక్తినే ఎంపిక చేయాలనుకుంది. తిరుచ్చి శివ అనే డీఎంకే నేత పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. సరిగ్గా అదే సమయంలో ఒక ఇస్రో సైంటిస్టు పేరు కూడా ప్రముఖంగానే వినిపించింది. కానీ చివరి నిమిషంలో రాజకీయాలకు సంబంధం లేని బి. సుదర్శన్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి కి చంద్రబాబుకు పరిచయముంది. అందుకే జస్టిస్ తాను రాజకీయ పార్టీలకు కొత్తగానీ, రాజకీయాలకు కాదన్నారు. అలాంటి పరిచయం ప్రస్తుతం ఉన్న ఒకానొక సిట్యువేషన్ లో సుదర్శనరెడ్డికి ఉపయోగ పడుతుందా? అని చూస్తే అదేమంత తేలిగ్గా సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఇప్పటికే తెలుగుదేశం, జనసేన రాధాకృష్ణన్ కు తమ బేషరతు మద్దతు ప్రకటించేశాయి. ఇక సాటి రెడ్డి కులస్తుడైన సుదర్శన్ రెడ్డి అంటే జగన్ రెడ్డి ఎలాంటి అభిమానముందో తెలీదు. ఒక వేళ అభిమానమున్నా జగన్ మరో ఆలోచన లేకుండా బీజేపీ ప్రతిపాదించిన రాధాకృష్ణన్ కే మద్దతు పలుకుతారన్న విశ్లేషకుల అభిప్రాయాలను అనుగుణంగానే వైసీపీ సభ్యులు ఎన్డీయే అభ్యర్థికే మద్దతు పలుకుతున్నట్లు అధికారికంగా ప్రకటించేసింది.
ఎందుకంటే.. ఇప్పటికే జగన్ పీకలోతు కేసుల గొడవల్లో ఉన్నారు. అందుకే తనకున్న లోక్ సభ, రాజ్య సభ సభ్యులు 11 మంది కాగా.. ఈ మొత్తం అటు వైపునకు మళ్లించేశారు. అలా మళ్లించకుంటే జైలుకు వెళ్లక తప్పదన్న భయం ఆయనది. దీంతో ఎంత రెడ్డాభిమానం ఉన్నా గానీ జగన్ రెడ్డి సుదర్శన్ రెడ్డికి మద్దతుగా నిలవడం లేదు సరికదా.. వైసీపీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి రాధాకృష్ణన్ కు బహిరంగ మద్దతు ప్రకటించారు..
కట్ చేస్తే బీఆర్ఎస్ సీనేంటో చూస్తే.. బీజేపీ|బీఆర్ఎస్ రెండూ ఒకటే అన్న మాటకు ఆస్కారమిచ్చేలా కేటీఆర్ ఒక కామెంట్ చేశారు. అదేంటో చూస్తే ఎవరైతే 2 లక్షల టన్నుల ఎరువులను తెలంగాణకు ఇస్తారో వారికే తమ మద్ధతు అన్నారు. నిజానికి ఎరువులను ఇచ్చే అధికారం ఉన్నది కేంద్రంలోని బీజేపీకి. దీన్నిబట్టీ చూస్తే వారి మద్ధతు బీజేపీకే అని చెప్పాల్సి ఉంటుంది.
మొన్నటికి మొన్న సీఎం రమేష్ మాటలను అనుసరించి చెబితే ఇప్పటికే తమపై కేసుల్లేకుండా చేయడంలో భాగంగా.. బీజేపీలో కలిసి పోవడానికైనా సిద్ధమైన బీఆర్ఎస్ ప్రత్యేకించి తెలంగాణ ప్రాంత వాసి అయిన సుదర్శన్ రెడ్డికి ఓటు వేసే అవకాశమెంతో ఈ ఎరువుల మెలికను బట్టిఇట్టే తెలిసిపోతోంది. కాబట్టి.. తెలుగు సెంటిమెంటు కన్నా.. ఇక్కడ ఎవరి అవసరాలు, వారి వారి కేసుల వ్యవహారాలపైనే ఎక్కువగా ఈ ఎన్నిక ఆధారపడి ఉన్నట్టు తెలుస్తోంది. ఇదండీ మన తెలుగు వారి ఉప రాష్ట్రపతి ఎన్నిక కథ, కమామిషు!