దేశ రక్షణ శక్తిని బలపర్చేలా ఎయిర్‌ఫోర్స్ వ్యూహాలు.. అమ్ములపొదిలోకి లైట్ కాంబాట్ ఫైటర్ జెట్స్
posted on Aug 21, 2025 @ 1:36PM
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ తన రక్షణ సామర్థ్యాలను మరింత పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే వీలైనన్ని లైట్ కాంబాట్ ఫైటర్ జెట్స్‌ని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లోకి చేర్చేందుకు కొన్నేళ్లుగా ప్రయత్నాలు జరుపుతోంది. ఆ దిశగా దేశ రక్షణ శక్తిని మరింత బలపరిచేలా.. 62 వేల కోట్లతో.. 97 తేజస్ మార్క్-1ఏ యుద్ధ విమానాల కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ అడ్వాన్స్‌డ్ లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఉత్పత్తి చేయనుంది. తేజస్ మార్క్-1ఏ స్వదేశీ యుద్ధ విమానాలకు దక్కిన రెండో ఆర్డర్ ఇది. 2021లో 48 వేల కోట్లతో 83 యుద్ధ విమానాల సమీకరణకు పచ్చజెండా ఊపింది. కొత్తగా 97 జెట్‌లతో కలిపి వీటి సంఖ్య 180కి చేరనుంది.
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చాలా కాలంగా సేవలందిస్తున్న.. పాత మిగ్-21 యుద్ధ విమానాల స్థానాన్ని తేజస్ మార్క్ 1ఏ భర్తీ చేయనుంది. మిగ్-21 విమానాలు తరచుగా ప్రమాదాలకు గురవుతుండటంతో, వాటి స్థానంలో.. అడ్వాన్స్‌డ్ తేజస్ యుద్ధ విమానాలు రావడం వల్ల.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మరింత శక్తిమంతంగా, సురక్షితంగా మారుతుంది. తేజస్ ఫైటర్ జెట్స్ వల్ల ఐఏఎఫ్ పోరాట సామర్థ్యం మరింత పెరగనుంది. రక్షణ రంగంలో దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడంలోనూ కీలకంగా మారనుంది.
తేజస్ మార్క్ 1ఎ పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో తయారైన 4.5 జనరేషన్ యుద్ధ విమానం. ఈ ఫైటర్ జెట్స్ భారత వైమానిక దళంలోకి చేరడం ద్వారా స్వదేశీ రక్షణ ఉత్పత్తిలో ఇండియా అభివృద్ధి సాధించిందనే మెసేజ్ ప్రపంచ దేశాలకు వెళ్తుంది. అంతేకాదు.. విదేశీ యుద్ధ విమానాలపై ఆధారపడటం తగ్గుతుంది. తేజస్ మార్క్ 1ఎ విమానాల్లో అత్యంత అధునాతన టెక్నాలజీని వాడారు. ఇందులో ఉన్న యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ అరే.. రాడార్ శత్రువుల కదలికల్ని కచ్చితంగా గుర్తించగలదు. ఇందులోని ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ సూట్ శత్రు రాడార్లను జామ్ చేసేందుకు, ఆయుధాలను గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. ఎయిర్ టు ఎయిర్ రీఫిల్లింగ్ ఆప్షన్ కూడా ఉంది. ఇది 9 రకాల రాకెట్లు, మిసైళ్లు, బాంబులను ఫైర్ చేయగలదు. ఇజ్రాయెల్ డెర్బీ మిసైళ్లతో పాటు స్వదేశీ అస్త్ర క్షిపణిని కూడా చాలా ఈజీగా ప్రయోగించగలదు.
ప్రస్తుతం, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఫైటర్ జెట్స్ స్క్వాడ్రన్ల కొరత ఎదుర్కొంటోంది. ఈ తేజస్ విమానాల చేరికతో ఐఏఎఫ్ ఫైటర్ స్క్వాడ్రన్ల సంఖ్యతో పాటు పోరాట సామర్థ్యం కూడా పెరగనుంది. తేజస్ యుద్ధ విమానాల తయారీతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ప్రొడక్షన్ ప్లాంట్‌కు రాబోయే కొన్నేళ్ల పాటు చేతి నిండా పని దొరుకుతుంది. ఇక, దేశవ్యాప్తంగా ఉన్న రక్షణ సంస్థలకు, ఎమ్ఎస్ఎమ్ఈలు, స్టార్ట ప్స్‌కు కూడా పెద్ద ఎత్తున లాభం చేకూరుతుంది. ఈ డీల్‌తో భవిష్యత్తులో తేజస్ మార్క్-2 లాంటి అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లని తయారుచేసే ప్రాజెక్టులకు రూట్ క్లియర్ చేస్తుంది.