జగన్ మిథున్ రెడ్డిని ఎప్పుడు పరామర్శిస్తారంటే..?
posted on Aug 22, 2025 @ 10:40AM
మద్యం స్కాం నిందితులను పరామర్శించే విషయంలో జగన్ ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం నిందితులను మినహాయిస్తే.. జగన్ ఇతర కేసుల్లో అరెస్టైన తమ పార్టీ నేతలు, కార్యకర్తలను జైలుకెళ్లి పరామర్శించారు. ఆ పరామర్శ యాత్ర సందర్భంగా తెలుగుదేశం కూటమి సర్కార్ పై విమర్శలు గుప్పించి మరీ వచ్చారు. జగన్ జైలుకెళ్లి పరామర్శించిన వారిలో రౌడీ షీటర్లు ఉన్నారు. గంజాయిబ్యాచ్ వాళ్లూ ఉన్నారు.
కానీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన వారిలో తనకు అత్యంత సన్నిహితులు, పార్టీలో అత్యంత కీలకంగా వ్యవహరించిన వారూ ఉన్నా ఎందుకో మరి వారిని పరామర్శించే విషయంలో మాత్రం ఆయన ఇసుమంతైనా ఆసక్తి చూపడంలేదు. ఈ కేసులో అరెస్టైన వారిలో జగన్ మాజీ పీఏ, మాజీ ఓఎస్డీ ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్, అలాగే ఈ కుంభకోణంలో కీలక పాత్ర ఉందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కేశిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి వంటి వారు ఉన్నారు. వీరంతా జగన్ కు అత్యంత సన్నిహితులుగా గుర్తింపు పొందిన వారే. అయినా సరే ఇప్పటి వరకూ వారిని జగన్ పరామర్శించలేదు.
కానీ ఎట్టకేలకు ఇక తప్పదన్నట్లుగా ఈ కేసులో అరెస్టై రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డి పరామర్శకు మాత్రం రెడీ అయినట్లు ప్రకటించారు. ఈ నెల 25న రాజమహేంద్రవరం వచ్చి, జైలుకు వెళ్లి మిథున్ రెడ్డిని జగన్ పరామర్శిస్తారని పార్టీ కూడా అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటన కూడా పరామర్శ తేదీకి పది రోజుల ముందే వెలువడింది. ఇక పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కూడా జగన్ మిథున్ రెడ్డిని ఈ నెల 25న పరామర్శించనున్నారని మూడు నాలుగు రోజుల ముందు ధృవీకరించారు. అంతలో ఏమైందో ఏమో కానీ ఆ పరామర్శయాత్రను జగన్ వాయిదా వేసుకున్నారు. ఆగస్టు 25న కాదు మరో తేదీన వస్తారని పార్టీ వర్గాలు ప్రకటించాయి. జగన్ పరామర్శ వినాయకచవిత తరువాత ఎప్పుడో ఉంటుందని అదే బొత్స ప్రకటించారు. జగన్ రాజమండ్రి జైలు యాత్ర మళ్లీ వాయిదాపడిందన్న వార్తలపై నెటిజనులు ఓ రేంజ్ లో సెటైర్లు వేస్తున్నారు.
ఇదే మద్యం కుంభకోణం కేసులో నేడు కాకపోతే రేపు.. రేపు కాకపోతే మరో రోజు ఇదే రాజమహేంద్రవరం జైలుకు తాను కూడా రావాల్సి ఉంటుందన్న ఉద్దేశంతోనే ఇంతోటి దానికి పరామర్శ యాత్ర ఎందుకు? అనే జగన్ మిథున్ రెడ్డి పరామర్శను వాయిదా వేసుకున్నట్లుందంటూ కామెంట్లు పెడుతున్నారు. తన హయాంలో తెలుగుదేశం అధినేత, అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును అక్రమంగా నిర్బంధించిన జైలుకు ఇప్పుడు తన సన్నిహితుడు, తన వల్లే జైలు పాలైన మిథున్ రెడ్డిని పరామర్శించాల్సిన పరిస్థితి రావడం జగన్ కు మింగుడుపడటం లేదనీ, అందుకే తన పర్యటన వాయిదే వేసుకున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.