జగన్, కేటీఆర్ కటీఫేనా?
posted on Aug 21, 2025 @ 3:47PM
తెలుగుదేశం పార్టీపై గుడ్డి వ్యతిరేకత, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై ఉన్న అక్కసు బిఆర్ఎస్, వైసీపీ లను దగ్గర చేసాయి, జగన్, కేసీఆర్ లను ఒకే తాటి మీదకు తెచ్చాయి. బాబు కి రిటర్న్ గిఫ్ట్ అంటూ మొదలైన జగన్ కేసీఆర్ రాజకీయ బంధం 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం, 2024 ఎన్నికలలో వైసీపీ పతనంతో బట్టబయలైంది ఆ ఓటముల తరువాత వైసీపీ అధినేత ప్యాలెస్ రాజకీయాలకు, బీఆర్ఎస్ ఫామ్ హౌస్ రాజకీయాలకు పరిమితం అయ్యారు. అక్కడ నుంచీ ఇరుపార్టీల బంధం తెగిపోకుండా కొనసాగించే బాద్యతను బీఆర్ఎస్ అధినేత కుమారుడు, ఆయన రాజకీయవారసుడు, అలాగే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు భుజాన వేసుకున్నారు. సొంత చెల్లెలితో విభేదాల విషయంలోనూ జగన్, కేటీఆర్ మధ్య సారూప్యాలు ఉన్నాయి. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ ను షర్మిల, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ను కల్వకుంట్ల కవిత తీవ్రంగా విభేదిస్తున్నారు. ఏ రకంగా చూసినా జగన్, కేటీఆర్ బాట ఒకటే అన్నట్లుగా ఇంత కాలం సాగింది.
ఇక ఇప్పుడు ఓట్ చోరీ అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీపై ఆరంభించిన రాజకీయ యుద్ధం అనుంగు మిత్రులు జగన్, కేటీఆర్ దారులు వేరు చేసింది. రాహుల్ గాంధీ ఓట్ల చోరీ అంటే చేపట్టిన ఆందోళనకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు మద్దతు ప్రకటించారు. రాహుల్ చేస్తున్న విమర్శలను సమర్ధిస్తూ.. తాను మరికొన్ని విమర్శలకు ఎన్నికల సంఘంపై సంధించారు. పనిలో పనిగా కేంద్ర ప్రభుత్వంపైనా, ప్రధాని మోడీపైనా కూడా విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యంలో ఈసీ కీలక పాత్ర పోషిస్తుందని, అటువంటి భారత ఎన్నికల సంఘాన్ని ప్రక్షాళన చేయాల్సిన తరుణం ఆసన్నమైందంటూ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు. భారత ఎన్నికల సంఘం బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడంలో ఘోర వైఫల్యం చెందిందని దుయ్యపెట్టారు. రాహుల్ ఓట్ల చోరీ ఆరోపణలను మీడియా సమావేశం పెట్టి మరీ ఖండించిన ఈసీ అధికారుల మాటలు విన్న తరవాత సందేహాలు మరింతగా ఎక్కువయ్యాయనీ కేటీఆర్ తన పోస్టులో పేర్కొన్నారు.
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిత్యం నిప్పులు కక్కే కేటీఆర్ ఒక్క సారిగా రాహుల్ గాంధీకి వంత పాడుతూ.. బీజేపీ కి వ్యతిరేకంగా గళం విప్పారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్ మాత్రం రాహుల్ ఓటు చోరీ ఆరోపణలను సమర్ధించలేదు, సరి కదా తమ పార్టీకి పులివెందులలో జరిగిన అన్యాయంపై రాహుల్ పన్నెత్తు మాట మాట్లాడకపోవడాన్ని తప్పుపట్టారు. అంతే కాకుండా టీడీపీ, బీజేపీ కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. దీంతో జగన్, కేటీర్ మధ్య ఇంత కాలం ఉన్న స్నేహబంధం తెగిపోయిందా? ఇరువురూ కటీఫ్ చెప్పేసుకున్నట్లేనా అంటూ పోలిటికల్ సర్కిల్స్ లో ఓ చర్చ ఆరంభమైంది.